
ఆస్తులున్న చోట్ల స్వాదీన నోటీసులు అంటించిన ఈడీ అధికారులు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో గతంలో అటాచ్ చేసిన స్థిరాస్తులను స్వా«దీనం చేసుకునేందుకు నోటీసులు జారీచేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే తాము జప్తుచేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులున్న చోట్ల ఈడీ అధికారులు ‘స్వా«దీన నోటీసులు’అంటించారు.
ఇందులో భాగంగా ఢిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని సర్వే నంబర్ 341లో ఉన్న బాంద్రా(ఇ) రెండో ప్లాట్, లక్నోలోని విశ్వేశ్వర్‌నాథ్ రోడ్డులో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ భవంతికి ఈడీ అధికారులు నోటీసులు అంటించారు. వెంటనే ఖాళీచేయాలని ఈ స్థిరాస్తుల్లో నడుస్తున్న కార్యాలయాలు, ఆఫీస్‌లు, దుకాణాలను ఆదేశిస్తూ నోటీసులిచ్చారు.
ముంబైలోని హెరాల్డ్ హౌస్‌లో 7, 8, 9వ అంతస్తుల్లో నడుస్తున్న జిందాల్ సౌత్‌వెస్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఆఫీస్ వెంటనే ఖాళీచేయాలని, స్థిరాస్తిని తమకు అప్పగించాలని, లేదంటే నెలవారీ అద్దెను ఇకపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌కు బదిలీచేయాలని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు తమకు మనీలాండరింగ్ చట్టం(పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్(8), రూల్5(1)ద్వారా దఖలుపడ్డాయని ఆ నోటీస్‌లో ఈడీ పేర్కొంది.
2023 నవంబర్‌లో రూ.661 కోట్ల స్థిరాస్తులతోపాటు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన రూ.90.20 కోట్ల విలువైన షేర్లనూ ఈడీ అటాచ్ చేయడం తెల్సిందే. ఈ కేసులో రూ.998 కోట్ల నేరం జరిగిందని ఈడీ గతంలో ఆరోపించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, మోతాలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడా, యంగ్ ఇండియా ప్రైవేట్ సంస్థలు అక్రమంగా రూ.2,000 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ స్థిరాస్తులను కాజేసేందుకు కుట్ర పన్నారని ఈడీ గతంలో పేర్కొనడం తెల్సిందే.