ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీ
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరానికి (2014-15) సంబంధించి ఏప్రిల్ 30 లోగా మొత్తం ఆస్తిపన్ను చెల్లించేవారికి 5 శాతం రిబేటు ఇవ్వనున్నారు. ‘ఎర్లీ బర్డ్’ పేరిట ఈ ఏడాది నుంచే ఈ కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల చేసిన చట్ట సవరణకు అనుగుణంగా దీన్ని అమలు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అదనపు కమిషనర్ (రెవెన్యూ) సూర్యదేవర హరికృష్ణతో కలిసి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
డిమాండ్ నోటీసు రాలేదని ఎదురు చూడకుండా ప్రజలు తమ ఆస్తి పన్నును ఈసేవా కేంద్రాలు, సీఎస్సీల ద్వారా చెల్లించవచ్చునన్నారు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను మొత్తాన్ని ఒకే పర్యాయం చెల్లించేవారికి.. పాత బకాయిలు లేనివారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. అలాగే జూలై లోగా చెల్లించని వారికి ఆగస్టు నుంచి ప్రతి నెలా రెండు శాతం చొప్పున వడ్డీ విధిస్తామన్నారు.
ఈ పథకం అమలు ద్వారా ఏప్రిల్‌లో రూ. 250 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలు కాగలదని అంచనా. గత ఆర్థిక సంవత్సరం (2013-14) ఆస్తిపన్ను రూపేణా జీహెచ్‌ఎంసీ ఖజానాకు రూ.1022 కోట్లు వచ్చాయని కమిషనర్ తెలిపారు.