Early Bird
-
ఆన్‌లైన్‌కే సై
సాక్షి, హైదరాబాద్: సదుపాయాలు కల్పిస్తే ప్రజలు వినియోగించుకుంటారు. తమకు అత్యంత సదుపాయంగా ఉంటే.. ఎవరూ వెళ్లి ఒత్తిడిచేయకున్నా చెల్లింపులు చేస్తారనేందుకు నిదర్శనం జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు. ఆర్థిక సంవత్సరం మొదటినెలలో ఆస్తిపన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్ పథకం కింద 5 శాతం రాయితీ ఉంటుంది. ఈ రాయితీని వినియోగించుకోవడం ద్వారా చాలామంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. జీహెచ్ఎంసీ ఆర్థిక సంవత్సర లక్ష్యమే దాదాపు రూ. 2వేల కోట్లయితే.. ‘ఎర్లీబర్డ్’ను వినియోగించుకోవడం ద్వారా ఒక్క నెలలోనే మూడో వంతుకుపైగా ఆదాయం సమకూరింది. ఎక్కువ మంది ఆన్లైన్ ద్వారా ఎర్లీబర్డ్‌ను వినియోగించుకున్న ఇళ్ల యజమానులు 7.35 లక్షల మంంది కాగా, వారిలో 4.95 లక్షల మంది ఆన్లైన్ ద్వారానే ఆస్తిపన్ను చెల్లించారు. అంటే దాదాపు 67 శాతం మంది ఆన్‌లైన్‌ను వినియోగించుకున్నారు. వీరి చెల్లింపుల ద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు రూ.786.75 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయం పెరుగుతున్నా.. జీహెచ్ఎంసీ ఖజానాకు ఆస్తిపన్ను వసూళ్ల ద్వారా ఏటికేడాది ఆదాయం పెరుగుతున్నప్పటికీ, అంతకుమించి పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు తప్పడం లేదు. వేల కోట్లు ఖర్చయ్యే భారీ ప్రాజెక్టులకు సైతం జీహెచ్ఎంసీ నుంచే ఖర్చు చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణం కాగా, అధికారులు, పాలకమండలి మితిమీరిన ఖర్చులు కూడా ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆనందించేలోగా.. అదనపు భారం ఎర్లీబర్డ్ ద్వారా టార్గెట్‌ను మించి ఆదాయం రావడంతో సంతోషపడిన అధికారుల ఆనందం అంతలోనే ఆవిరైంది. పారిశుద్ధ్య కార్మి కుల వేతనాలను అదనంగా రూ.1000 పెంచుతూ జీఓ జారీ చేసిన ప్రభుత్వం.. ఈమేరకు అదనపు వ్యయాన్ని జీహెచ్ఎంసీ ఖజానా నుంచే చెల్లించాలని పేర్కొనడమే ఇందుకు కారణం. దీంతో జీహెచ్ఎంసీ ఖజనాకు సంవత్సరానికి దాదాపు రూ.30 కోట్ల అదనపు భారం పడనుంది. -
పక్షో రక్షతి రక్షితః
చెట్లు బాగుంటేనే.. పక్షులు బాగుంటాయి. పక్షులు ఎంత బాగుంటే.. చెట్లు అంత బాగుంటాయి. పక్షుల్ని ఆధారంగా చేసుకుని చెట్లు తమ సంతానాన్ని వృద్ధి, విస్తరణ చేసుకుంటుంటే (పండ్లు, కాయల్ని పక్షులు తిని వాటిలోని విత్తనాలను వేరేచోట విసర్జించటం ద్వారా).. చెట్లనే ఆవాసాలుగా మార్చుకుని పక్షులు తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. అందుకే.. వృక్ష ప్రేమికులు ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటుంటే.. పక్షి ప్రేమికులు ‘పక్షో రక్షతి రక్షితః’ అంటున్నారు. సాక్షి, అమరావతి: దేశంలో గత 25 సంవత్సరాల్లో 126 పక్షి జాతుల ఉనికి స్థిరంగా ఉండటంతోపాటు కొంతమేర వృద్ధి రేటు కూడా నమోదైంది. మన జాతీయ పక్షి నెమలి మనుగడ సురక్షితంగా ఉండటమే కాకుండా.. 100 శాతం వృద్ధి కనిపిస్తోంది. మన ఆత్మీయ పక్షి పిచ్చుక పరిస్థితి కూడా ఆశాజనకంగానే ఉంది. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ నివేదికలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. మన దేశంలో గుర్తించిన 1,300 పక్షి జాతుల్లో 867 పక్షి జాతుల ప్రస్తుత స్థితి, దీర్ఘకాలంలో వచ్చే మార్పుల గురించి ఈ నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో 52 శాతం పక్షి జాతుల ఉనికి ప్రమాదంలో పడింది. వేటాడి జీవించే పక్షులు, వలస పక్షులు, పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపించే పక్షులు బాగా తగ్గిపోతున్నట్టు తేలింది. ఈ నివేదికను దేశంలో 15 వేలకుపైగా ఉన్న పక్షుల వీక్షకులు (బర్డ్ వాచర్స్) ఇచ్చిన కోటి పరిశీలనల ఆధారంగా రూపొందించడం గమనార్హం. దీన్నిబట్టి పక్షుల పట్ల ఆసక్తి పెరిగి బర్డ్ వాచింగ్ (వీక్షణ)కు ఆదరణ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. పక్షుల్ని రక్షించాలనే సంకల్పంతో.. పక్షుల్ని సంరక్షించాలనే సంకల్పంతో బెంగళూరుకు చెందిన ‘ఎర్లీ బర్డ్’ అనే సంస్థ బహుముఖ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ‘బర్డ్ వాచింగ్’ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళుతోంది. బర్డ్ వాచింగ్‌ను కొత్తగా మొదలుపెట్టే వారికి పక్షుల పేర్లు, వాటి వివరాలు తెలిపే వనరులు పెద్దగా లేకపోవడం ఇబ్బంది కలిగించే అంశం. ఈ కొరత తీర్చడానికి బెంగళూరుకు చెందిన ‘ఎర్లీ బర్డ్’ అనే సంస్థ పిల్లలు, పెద్దలను ప్రకృతికి, పక్షులకు దగ్గర చేసే లక్ష్యంతో వివిధ రకాల వనరులను పలు భాషల్లో తయారు చేసి అందుబాటులోకి తెచ్చింది. పక్షుల పేర్లు, వాటి అలవాట్లు, వాటి జీవన విధానాల గురించి వివరించే రకరకాల ఆటలు, పాకెట్ గైడ్, పోస్టర్లు తెలుగుతో సహా వివిధ ప్రాంతీయ భాషల్లో తయారు చేశారు. మన పరిసరాల్లో కనిపించే పక్షులు, చిత్తడి నేలల్లో నివసించే పక్షులు, అడవుల్లో ఉండే పక్షులు, పచ్చిక బయళ్లు, గడ్డి మైదానాలు, పంట పొలాల్లో కనిపించే వాటి గురించి పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వారి పాకెట్ గైడ్ చిన్న పిల్లలకే కాకుండా పెద్దవాళ్లకి కూడా పక్షుల పేర్లు, వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ‘ఎర్లీ బర్డ్’ తమ పోస్టర్లు, పక్షులకు సంబంధించిన వనరులను ప్రభుత్వ పాఠశాలు, స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు 3 లక్షల మంది పిల్లల్ని చేరుకోగలిగారు. దీని వివరాలను www.early&bird.in/telugu/ వెబ్సైట్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బర్డ్ వాచర్స్ సహాయంతోనే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బర్డ్ వాచర్స్ అందించిన వివరాలతో పక్షుల వలస సమయాలు, వాటి సంఖ్యలో హెచ్చుతగ్గులు, అవి ఎదుర్కొంటున్న ముప్పు వంటి విషయాలను శాస్త్రవేత్తలు విశ్లేషించగలుగుతున్నారు. బర్ద్ వాచింగ్ ద్వారా సామాన్యులు కూడా శాస్త్రవేత్తలకు సహాయపడే అవకాశం లభించింది. ఈ అభిరుచితో బర్డ్ వాచర్స్ పరోక్షంగా పక్షుల పరిరక్షణకు తద్వారా ప్రకృతి పరిరక్షణకు సహాయపడగలుగుతున్నారు. బర్డ్ వాచింగ్తో మొబైల్, టీవీలకు దూరంగా పిల్లలు, పెద్దలు ప్రకృతిలో సమయం గడపడం వల్ల మానసిక, శారీరక ప్రయోజనాలు పొందుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. – చంద్రశేఖర్ బండి, బర్డ్ వాచర్ -
ఈసారి ‘ఎర్లీబర్డ్’ వసూళ్లు డల్
సాక్షి, సిటీబ్యూరో: మూడు నాలుగేళ్లుగా జీహెచ్ఎంసీకి ఆర్థిక సంవత్సరం ఆరంభమయ్యే ఏప్రిల్‌లోనే ఆస్తిపన్ను రూపేణా ఎంతో డబ్బు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరేది. దాంతో ఆ తర్వాత మూడు నాలుగు నెలల వరకు సిబ్బంది జీతభత్యాలకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెలలో ఆస్తిపన్ను చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్’ పథకం కింద 5 శాతం రాయితీ ఉండటమే ఇందుకు కారణం. రాయితీ ఉండటంతో చాలామంది ఏప్రిల్‌లోనే ఆస్తిపన్ను చెల్లించేవారు. ఇలా గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎర్లీబర్డ్ ద్వారా దాదాపు రూ. 535 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం ఏప్రిల్ నెలాఖరు.. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు రూ. 128 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇందుకు పలు కారణాలున్నట్లు సంబంధిత అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం కారణంగా ఆదాయం లేక, జీతాలు లేక చాలామందికి రోజులు గడవడమే కష్టంగా ఉంది. దీంతో చాలామంది ఆస్తిపన్ను చెల్లించలేదు. అంతేకాకుండా గత సంవత్సరం వరకు ఎలాంటి వ్యత్యాసాలు లేకుండాజీహెచ్‌ఎంసీ పరిధిలోని నివాస, వాణిజ్య, మిక్స్డ్ భవనాలన్నింటికీ ఎర్లీబర్డ్ కింద 5 శాతం రాయితీ ఉండేది. దాంతో ఎక్కువ ఆస్తిపన్ను చెల్లించాల్సిన నివాస భవనాల వారితో పాటు వాణిజ్య భవనాల వారు చెల్లించేవారు. ఈసారి కేవలం నివాస భవనాల వారికి మాత్రమే, అది కూడా రూ. 30వేల లోపు ఆస్తిపన్ను వరకు మాత్రమే రాయితీ సదుపాయం వర్తింపచేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈసారి వాణిజ్య భవనాలకు రాయితీ లేకపోవడం, నివాస భవనాలకు పరిమితులుండటం కూడా ఆస్తిపన్ను వసూళ్లపై ప్రభావానికి మరో కారణంగా భావిస్తున్నారు. వీటితోపాటు ఈసారి ఎర్లీబర్డ్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించేందుకు మే నెలాఖరు వరకు అవకాశం ఉంది. గతంతో ఏప్రిల్ నెలాఖరు వరకే గడువుండేది. ఇలా వివిధ కారణాలు, కరోనా లాక్‌డౌన్‌తోనూ ఈసారి ఏప్రిల్ నెలాఖరు వరకు గతంతో పోలిస్తే తక్కువ ఆదాయం మాత్రమే వచ్చింది. గతంలో వివిధ మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేసేవారు. బిల్‌కలెక్లర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేవారు. ఇవేవీ లేకపోవడం కూడా ఇందుకు కారణాలుగా అధికారులు విశ్లేషిస్తున్నారు. డిమాండ్ రూ. 450 కోట్లు.. నివాస, రూ.30వేల లోపు ఆస్తిపన్ను డిమాండ్ సైతం దాదాపు రూ. 450 కోట్లు ఉంది. రూ. 30 వేలలోపు ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు జీహెచ్ఎంసీలో దాదాపు 13.70 లక్షల మంది ఉండగా, ఇప్పటి వరకు 2.05 లక్షల మంది మాత్రమే ఎర్లీ బర్డ్ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. -
డబ్బే డబ్బు
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎర్లీ బర్డ్’ పథకంతో జీహెచ్ఎంసీ ఖజానా నిండింది. మంగళవారం రాత్రి 10:30 గంటల వరకు అందిన సమాచారం మేరకు ఈసారి రికార్డు స్థాయిలో రూ.535 కోట్లు ఆస్తి పన్ను వసూలైంది. ఇందులోనూ ఎక్కువ మంది ఆన్లైన్లోనే చెల్లించడం విశేషం. దేశంలోని ఏ ఇతర నగరంలోనూఆన్‌లైన్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించిన దాఖలాలు లేవు. జీహెచ్ఎంసీకి‘ఎర్లీ బర్డ్’ ద్వారా గతేడాది రూ.437.75 కోట్లు రాగా... ఈసారి దాన్ని అధిగమించి అధిక మొత్తంలో వసూలైంది. చివరి రోజైన మంగళవారమే దాదాపు రూ.102 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఎర్లీ బర్డ్ ద్వారా ఈసారి రూ.500 కోట్లు సేకరించాలని జీహెచ్ఎంసీ లక్ష్యం నిర్దేశించుకున్న విషయం విదితమే. ఎర్లీ బర్డ్ పథకంలో భాగంగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5శాతం రాయితీ ఉన్న విషయం తెలిసిందే. దీనిపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు కమిషనర్ దానకిశోర్ డిప్యూటీ, జోనల్ కమిషనర్లతో నిత్యం టెలీకాన్ఫరెన్స్‌లు, నిరంతర సమీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే అధిక వసూళ్లయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ పేర్కొన్నారు. -
‘ఎర్లీబర్డ్’ ఆఫర్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని భవన యజమానులకుశుభవార్త.. ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) ఆస్తిపన్ను ఈనెల 6వ తేదీ నుంచి 30వ తేదీలోగా చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్’ పథకం కింద 5 శాతం రాయితీ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు.ఇళ్ల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పనిదినాల్లో మీ–సేవ, ఈ–సేవ కేంద్రాల్లో, జీహెచ్ఎంసీ సిటిజన్‌సర్వీస్ సెంటర్లలో, ఎంపిక చేసిన బ్యాంకుల్లో ఆస్తిపన్ను చెల్లించవచ్చన్నారు. ఆన్లైన్ ద్వారా చెల్లించేవారు ఎప్పుడైనా చెల్లించవచ్చునని వివరించారు. ఇటీవల ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2018–19)లో ఎర్లీబర్డ్ ద్వారా రూ.437.75 కోట్లు వసూలు కాగా, ఈసారి అంతకంటే అధికమొత్తంలో సేకరించాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. తాజా ఆర్థిక సంవత్సరానికి(2019–20) మాత్రమే ఎర్లీబర్డ్ వర్తిస్తుందని, పాత బకాయిలున్న వారు దీనికి అర్హులు కారని ఆయన స్పష్టం చేశారు. ఎర్లీబర్డ్ పథకాన్ని 2012–13 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ఏడాదికేడాదికీ ఈ పథకం ద్వారా చెల్లిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. దాంతో ఈ పథకం ద్వారా వస్తున్న మొత్తం కూడా అధికంగానే ఉంటోంది. సంవత్సరాల వారీగా ఎర్లీబర్డ్‌వసూళ్లు(రూ.కోట్లలో) ఇలా.. ఆర్థిక సంవత్సరం వసూలు 2018–19 437.75 2017–18 368.30 2016–17 212.00 2015–16 161.38 2014–15 119.94 2013–14 109.00 2012–13 30.00 -
రూ. 499కే స్పైస్‌జెట్ విమానయానం
- ఒక్క రోజులోనే లక్ష టికెట్లు బుక్ - రేపు ముగియనున్న ఆఫర్ ముంబై: స్పైస్‌జెట్ అందిస్తున్న రూ.499కే విమానయాన ఆఫర్‌కు మొదటి రోజే అనూహ్యమైన స్పందన లభించింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకే లక్ష టికెట్లు బుక్ అయ్యాయి. ఒక్క రోజులోనే ఇన్ని టికెట్లు బుక్ కావడం రికార్డని సమాచారం. ఈ సంస్థ రెండు రోజులకొక ఆఫర్‌ను అందిస్తోంది. తాజాగా ఎర్లీ బర్డ్ పేరుతో రూ.499కే ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రూ.499(ఇంధన సర్‌చార్జీతో కలిపి, వర్తించే పన్నులు, ఫీజులు అదనం) ఆఫర్‌కు బుకింగ్స్ సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని స్పైస్‌జెట్ సోమవారం తెలిపింది. బుకింగ్స్ బుధవారం ముగుస్తాయని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ ఆవిలి పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి అక్టోబర్ 24 మధ్య ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని వివరించారు. తమ దేశీయ నెట్‌వర్క్‌లోని డెరైక్ట్, కనెక్టింగ్, వయా విమానాలకు ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. స్పైస్‌జెట్ విమానయాన సంస్థ 41 భారతీయ, 8 విదేశీ నగరాలకు 340 డైలీ విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. -
ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీ
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరానికి (2014-15) సంబంధించి ఏప్రిల్ 30 లోగా మొత్తం ఆస్తిపన్ను చెల్లించేవారికి 5 శాతం రిబేటు ఇవ్వనున్నారు. ‘ఎర్లీ బర్డ్’ పేరిట ఈ ఏడాది నుంచే ఈ కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల చేసిన చట్ట సవరణకు అనుగుణంగా దీన్ని అమలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అదనపు కమిషనర్ (రెవెన్యూ) సూర్యదేవర హరికృష్ణతో కలిసి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. డిమాండ్ నోటీసు రాలేదని ఎదురు చూడకుండా ప్రజలు తమ ఆస్తి పన్నును ఈసేవా కేంద్రాలు, సీఎస్సీల ద్వారా చెల్లించవచ్చునన్నారు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను మొత్తాన్ని ఒకే పర్యాయం చెల్లించేవారికి.. పాత బకాయిలు లేనివారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. అలాగే జూలై లోగా చెల్లించని వారికి ఆగస్టు నుంచి ప్రతి నెలా రెండు శాతం చొప్పున వడ్డీ విధిస్తామన్నారు. ఈ పథకం అమలు ద్వారా ఏప్రిల్‌లో రూ. 250 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలు కాగలదని అంచనా. గత ఆర్థిక సంవత్సరం (2013-14) ఆస్తిపన్ను రూపేణా జీహెచ్ఎంసీ ఖజానాకు రూ.1022 కోట్లు వచ్చాయని కమిషనర్ తెలిపారు.