చెట్లు బాగుంటేనే.. పక్షులు బాగుంటాయి. పక్షులు ఎంత బాగుంటే.. చెట్లు అంత బాగుంటాయి. పక్షుల్ని ఆధారంగా చేసుకుని చెట్లు తమ సంతానాన్ని వృద్ధి, విస్తరణ చేసుకుంటుంటే (పండ్లు, కాయల్ని పక్షులు తిని వాటిలోని విత్తనాలను వేరేచోట విసర్జించటం ద్వారా).. చెట్లనే ఆవాసాలుగా మార్చుకుని పక్షులు తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. అందుకే.. వృక్ష ప్రేమికులు ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటుంటే.. పక్షి ప్రేమికులు ‘పక్షో రక్షతి రక్షితః’ అంటున్నారు.
సాక్షి, అమరావతి: దేశంలో గత 25 సంవత్సరాల్లో 126 పక్షి జాతుల ఉనికి స్థిరంగా ఉండటంతోపాటు కొంతమేర వృద్ధి రేటు కూడా నమోదైంది. మన జాతీయ పక్షి నెమలి మనుగడ సురక్షితంగా ఉండటమే కాకుండా.. 100 శాతం వృద్ధి కనిపిస్తోంది. మన ఆత్మీయ పక్షి పిచ్చుక పరిస్థితి కూడా ఆశాజనకంగానే ఉంది. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ నివేదికలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. మన దేశంలో గుర్తించిన 1,300 పక్షి జాతుల్లో 867 పక్షి జాతుల ప్రస్తుత స్థితి, దీర్ఘకాలంలో వచ్చే మార్పుల గురించి ఈ నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో 52 శాతం పక్షి జాతుల ఉనికి ప్రమాదంలో పడింది. వేటాడి జీవించే పక్షులు, వలస పక్షులు, పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపించే పక్షులు బాగా తగ్గిపోతున్నట్టు తేలింది. ఈ నివేదికను దేశంలో 15 వేలకుపైగా ఉన్న పక్షుల వీక్షకులు (బర్డ్ వాచర్స్) ఇచ్చిన కోటి పరిశీలనల ఆధారంగా రూపొందించడం గమనార్హం. దీన్నిబట్టి పక్షుల పట్ల ఆసక్తి పెరిగి బర్డ్ వాచింగ్ (వీక్షణ)కు ఆదరణ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
పక్షుల్ని రక్షించాలనే సంకల్పంతో..
పక్షుల్ని సంరక్షించాలనే సంకల్పంతో బెంగళూరుకు చెందిన ‘ఎర్లీ బర్డ్’ అనే సంస్థ బహుముఖ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ‘బర్డ్ వాచింగ్’ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళుతోంది. బర్డ్ వాచింగ్‌ను కొత్తగా మొదలుపెట్టే వారికి పక్షుల పేర్లు, వాటి వివరాలు తెలిపే వనరులు పెద్దగా లేకపోవడం ఇబ్బంది కలిగించే అంశం. ఈ కొరత తీర్చడానికి బెంగళూరుకు చెందిన ‘ఎర్లీ బర్డ్’ అనే సంస్థ పిల్లలు, పెద్దలను ప్రకృతికి, పక్షులకు దగ్గర చేసే లక్ష్యంతో వివిధ రకాల వనరులను పలు భాషల్లో తయారు చేసి అందుబాటులోకి తెచ్చింది.
పక్షుల పేర్లు, వాటి అలవాట్లు, వాటి జీవన విధానాల గురించి వివరించే రకరకాల ఆటలు, పాకెట్ గైడ్, పోస్టర్లు తెలుగుతో సహా వివిధ ప్రాంతీయ భాషల్లో తయారు చేశారు. మన పరిసరాల్లో కనిపించే పక్షులు, చిత్తడి నేలల్లో నివసించే పక్షులు, అడవుల్లో ఉండే పక్షులు, పచ్చిక బయళ్లు, గడ్డి మైదానాలు, పంట పొలాల్లో కనిపించే వాటి గురించి పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వారి పాకెట్ గైడ్ చిన్న పిల్లలకే కాకుండా పెద్దవాళ్లకి కూడా పక్షుల పేర్లు, వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ‘ఎర్లీ బర్డ్’ తమ పోస్టర్లు, పక్షులకు సంబంధించిన వనరులను ప్రభుత్వ పాఠశాలు, స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు 3 లక్షల మంది పిల్లల్ని చేరుకోగలిగారు. దీని వివరాలను www.early&bird.in/telugu/ వెబ్‌సైట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బర్డ్ వాచర్స్ సహాయంతోనే..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బర్డ్ వాచర్స్ అందించిన వివరాలతో పక్షుల వలస సమయాలు, వాటి సంఖ్యలో హెచ్చుతగ్గులు, అవి ఎదుర్కొంటున్న ముప్పు వంటి విషయాలను శాస్త్రవేత్తలు విశ్లేషించగలుగుతున్నారు. బర్ద్ వాచింగ్ ద్వారా సామాన్యులు కూడా శాస్త్రవేత్తలకు సహాయపడే అవకాశం లభించింది. ఈ అభిరుచితో బర్డ్ వాచర్స్ పరోక్షంగా పక్షుల పరిరక్షణకు తద్వారా ప్రకృతి పరిరక్షణకు సహాయపడగలుగుతున్నారు. బర్డ్ వాచింగ్‌తో మొబైల్, టీవీలకు దూరంగా పిల్లలు, పెద్దలు ప్రకృతిలో సమయం గడపడం వల్ల మానసిక, శారీరక ప్రయోజనాలు పొందుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
– చంద్రశేఖర్ బండి, బర్డ్ వాచర్
Comments
Please login to add a commentAdd a comment