birds love
-
పక్షో రక్షతి రక్షితః
చెట్లు బాగుంటేనే.. పక్షులు బాగుంటాయి. పక్షులు ఎంత బాగుంటే.. చెట్లు అంత బాగుంటాయి. పక్షుల్ని ఆధారంగా చేసుకుని చెట్లు తమ సంతానాన్ని వృద్ధి, విస్తరణ చేసుకుంటుంటే (పండ్లు, కాయల్ని పక్షులు తిని వాటిలోని విత్తనాలను వేరేచోట విసర్జించటం ద్వారా).. చెట్లనే ఆవాసాలుగా మార్చుకుని పక్షులు తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. అందుకే.. వృక్ష ప్రేమికులు ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటుంటే.. పక్షి ప్రేమికులు ‘పక్షో రక్షతి రక్షితః’ అంటున్నారు. సాక్షి, అమరావతి: దేశంలో గత 25 సంవత్సరాల్లో 126 పక్షి జాతుల ఉనికి స్థిరంగా ఉండటంతోపాటు కొంతమేర వృద్ధి రేటు కూడా నమోదైంది. మన జాతీయ పక్షి నెమలి మనుగడ సురక్షితంగా ఉండటమే కాకుండా.. 100 శాతం వృద్ధి కనిపిస్తోంది. మన ఆత్మీయ పక్షి పిచ్చుక పరిస్థితి కూడా ఆశాజనకంగానే ఉంది. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ నివేదికలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. మన దేశంలో గుర్తించిన 1,300 పక్షి జాతుల్లో 867 పక్షి జాతుల ప్రస్తుత స్థితి, దీర్ఘకాలంలో వచ్చే మార్పుల గురించి ఈ నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో 52 శాతం పక్షి జాతుల ఉనికి ప్రమాదంలో పడింది. వేటాడి జీవించే పక్షులు, వలస పక్షులు, పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపించే పక్షులు బాగా తగ్గిపోతున్నట్టు తేలింది. ఈ నివేదికను దేశంలో 15 వేలకుపైగా ఉన్న పక్షుల వీక్షకులు (బర్డ్ వాచర్స్) ఇచ్చిన కోటి పరిశీలనల ఆధారంగా రూపొందించడం గమనార్హం. దీన్నిబట్టి పక్షుల పట్ల ఆసక్తి పెరిగి బర్డ్ వాచింగ్ (వీక్షణ)కు ఆదరణ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. పక్షుల్ని రక్షించాలనే సంకల్పంతో.. పక్షుల్ని సంరక్షించాలనే సంకల్పంతో బెంగళూరుకు చెందిన ‘ఎర్లీ బర్డ్’ అనే సంస్థ బహుముఖ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ‘బర్డ్ వాచింగ్’ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళుతోంది. బర్డ్ వాచింగ్‌ను కొత్తగా మొదలుపెట్టే వారికి పక్షుల పేర్లు, వాటి వివరాలు తెలిపే వనరులు పెద్దగా లేకపోవడం ఇబ్బంది కలిగించే అంశం. ఈ కొరత తీర్చడానికి బెంగళూరుకు చెందిన ‘ఎర్లీ బర్డ్’ అనే సంస్థ పిల్లలు, పెద్దలను ప్రకృతికి, పక్షులకు దగ్గర చేసే లక్ష్యంతో వివిధ రకాల వనరులను పలు భాషల్లో తయారు చేసి అందుబాటులోకి తెచ్చింది. పక్షుల పేర్లు, వాటి అలవాట్లు, వాటి జీవన విధానాల గురించి వివరించే రకరకాల ఆటలు, పాకెట్ గైడ్, పోస్టర్లు తెలుగుతో సహా వివిధ ప్రాంతీయ భాషల్లో తయారు చేశారు. మన పరిసరాల్లో కనిపించే పక్షులు, చిత్తడి నేలల్లో నివసించే పక్షులు, అడవుల్లో ఉండే పక్షులు, పచ్చిక బయళ్లు, గడ్డి మైదానాలు, పంట పొలాల్లో కనిపించే వాటి గురించి పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వారి పాకెట్ గైడ్ చిన్న పిల్లలకే కాకుండా పెద్దవాళ్లకి కూడా పక్షుల పేర్లు, వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ‘ఎర్లీ బర్డ్’ తమ పోస్టర్లు, పక్షులకు సంబంధించిన వనరులను ప్రభుత్వ పాఠశాలు, స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు 3 లక్షల మంది పిల్లల్ని చేరుకోగలిగారు. దీని వివరాలను www.early&bird.in/telugu/ వెబ్సైట్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బర్డ్ వాచర్స్ సహాయంతోనే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బర్డ్ వాచర్స్ అందించిన వివరాలతో పక్షుల వలస సమయాలు, వాటి సంఖ్యలో హెచ్చుతగ్గులు, అవి ఎదుర్కొంటున్న ముప్పు వంటి విషయాలను శాస్త్రవేత్తలు విశ్లేషించగలుగుతున్నారు. బర్ద్ వాచింగ్ ద్వారా సామాన్యులు కూడా శాస్త్రవేత్తలకు సహాయపడే అవకాశం లభించింది. ఈ అభిరుచితో బర్డ్ వాచర్స్ పరోక్షంగా పక్షుల పరిరక్షణకు తద్వారా ప్రకృతి పరిరక్షణకు సహాయపడగలుగుతున్నారు. బర్డ్ వాచింగ్తో మొబైల్, టీవీలకు దూరంగా పిల్లలు, పెద్దలు ప్రకృతిలో సమయం గడపడం వల్ల మానసిక, శారీరక ప్రయోజనాలు పొందుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. – చంద్రశేఖర్ బండి, బర్డ్ వాచర్ -
వావ్.. అద్భుతం.. చూసి నేర్చుకుందాం భయ్యా!
సాక్షి, హైదరాబాద్: మనిషి గమనించాలేగానీ అనంతమైన అద్భుతాలు, విశేషాలకు నిలయం ప్రకృతి. నేర్చుకోవాలేగానీ, ప్రతీ జీవన సూత్రం, ధర్మం ప్రకృతిలో ఇమిడి ఉంది. సాధారణంగా నిస్సహాయులకు, జవసత్త్వాలుడిగిన పెద్దలకు, తల్లీదండ్రులకు ..వారి వారసులు, పిల్లలు సేవలు చేయడం సహజం. అది మానవధర్మం కూడా. నేటి ఆధునిక సమాజంలో ఎంతమంది ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ ఆహారాన్ని సేకరించుకోలేకపోతున్న ముసలి పక్షికి, బుజ్జి పక్షులు ఆహారాన్ని తెచ్చి పెట్టడం చూశారా. ఆకలితో ఉన్న పెద్ద పక్షులకు చక్కగా ఆహారాన్ని నోటికి అందిస్తున్న వీడియో విశేషంగా నిలుస్తోంది. అద్భుతం అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను హరి చందన (ఐఏఎస్) ట్విటర్లో షేర్ చేశారు. ప్రకృతి ధర్మాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్న యంగ్ బర్డ్స్ ని మీరు కూడా చూసేయండి! Young #birds feeding older 🐦 who are unable to search for #food. #lessons from #nature. pic.twitter.com/cmbzSKTen5 — Hari Chandana IAS (@harichandanaias) May 19, 2022 -
National Bird Day 2022: బుల్లి గువ్వా.. ఎక్కడమ్మా నీ సవ్వడి
సాక్షి, హైదరాబాద్: పొద్దున్నే లేవగానే ఉదయిస్తున్న సూర్యుడినీ, అప్పుడే విచ్చుకుంటున్న పువ్వుల్ని, పసి పాపల నవ్వుల్ని చూస్తే మనసుకు భలే హాయిగా ఉంటుంది కదా. అలాగే బాల్కనీలో కూర్చుని వేడి వేడి కాఫీ తాగుతూ చిరప్ చిరప్ అంటూ ఎగిరే బుజ్జి బుజ్జి పిట్టల్ని, పావురాల్ని, పిచ్చుకల్ని చూస్తోంటే వచ్చే ఆనందాన్ని మీరు ఎపుడైనా ఆస్వాదించారా? ఆ ఇపుడు అవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటారా? ఆ ఆవేదన నుంచి వచ్చిందే జాతీయ పక్షుల దినోత్సవం. అంతరించిపోతున్న పక్షుల్ని, కాపాడుకునేందుకు, పక్షుల అవసరం, ఉనికిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతీ ఏడాది జనవరి 5న నేషనల్ బర్డ్ డే ని పాటిస్తాం. పెంపుడు జంతువులైన కోళ్లు, బాతులతో పాటు పావురాలు, నెమళ్లు, చిలుకలు, పిచ్చుకలు, కోకిల. కాకులు, వడ్రంగిపిట్టలు, గద్దలు, డేగలు తదితర పక్షులు జీవన పరిణామ క్రమంలో, మానవ జీవితాల్లో, మనుషుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. కానీ. పర్యావరణ వ్యవస్థలలో కాలానుగుణ మార్పులతో దురదృష్టవశాత్తూ చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా నశించిపోతున్న అడవులు, సెల్ టవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పిచ్చుకలు పూర్తిగా కనుమరుగవుతున్న సందర్భంలో మనం ఉన్నాం. దీనికి తోడు చట్టవిరుద్ధమైన పెంపుడు జంతువుల వ్యాపారం కారంణంగా మరింత ప్రమాదం కలుగుతోంది. నిజానికి చాలా పక్షులు, పిట్టల పేర్లు నేటి తరానికి తెలియవు. కేవలం పుస్తకాల్లోనో, కంప్యూటర్ గ్రాఫిక్స్‌లోనో చూసి తెలుసుకోవాల్సిన దుస్థితి. భారత్‌లో తగ్గిపోతున్న పక్షుల జాబితాలో గద్దలు, రాబందులు, పిచ్చుకలు, ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఉగాది సందేశాన్ని అందించే కోకిలమ్మను వెతుక్కోవాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక వాగులు, చెరువుల్లోకి వలస వచ్చే పక్షులు కూడా భారీ తగ్గుదల కనిపిస్తోందని పలు అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య జీవావరణ శాస్త్రవేత్తలను కలవర పెడుతోంది. అమెరికా, కెనడాల్లో 300 కోట్ల పక్షుల మాయమైపోయాయట. అలాగే ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆగ్నేయ భాగంలో ఎక్కువగా కనిపించే రీజెంట్ హనీఈటర్ అనే పక్షి అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలోకి చేరిపోయింది. అంతేకాదు ఆడపక్షుల్ని తమ పాటతో ఆకట్టుకునే మేల్ హనీఈటర్ పక్షులు తమ సహజసిద్ధమైన పాటను కూడా మర్చిపోతున్నాయంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రోజుకురోజుకు ఈ ముప్పు మరింత ముంచుకొస్తోంది. ఒకప్పుడు పావురాలు ప్రేమ సందేశాల్ని పంపేందుకు మాత్రమే కాదు కీలక సమాచారాన్ని చేరవేసే వార్తాహరులుగా పనిచేశాయి. సప్తవర్ణ రంజితమై పురి విప్పి ఆడే నెమలి నాట్యం, చిలుకలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాగే గూడు కట్టుకోవడంలో చాలా పక్షుల నైపుణ్యానికి మన ఆధునిక ఇంజనీర్లు కూడా అబ్బురపడాల్సిందే. ఇక గిజిగాడు గూడు.. అదేనండి పిచ్చుక గూళ్లతో ప్రతీ పల్లె కళకళలాడుతూ ఉండేది. అంతేనా ఆకు ఈనెలతో తోకను చక్కగా అలంకరించుకునే చిలుకలు, చక్కటి గూడు అల్లుకునే బుజ్జిపిట్టలు.. అచ్చం చిన్నపిల్లల ఏడుపులా అరిచే పిట్టలు..అంతెందుకు పక్షిని చూసే కదా మన రైట్ బ్రదర్స్ విమానాల్ని సిద్ధం చేసింది. ఇలా మనం గమనించాలే గానీ ప్రకృతి అంతా టెక్నాలజీ మయం. ఇకనైనా కనుమరుగవుతున్న వందల జాతుల పక్షుల మనుగడ కోసం పక్షి ప్రేమికుల్లాగా కృషి చేద్దాం. అన్నట్టు బర్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్. తెలంగాణ అటవీ శాఖ బర్డ్ వాక్ సెకండ్ యానివర్సరిలో భాగంగా జనవరి 8-9 తేదీల్లో 250 కంటే ఎక్కువ రకాల పక్షులను చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. లెట్స్ గో అండ్ ఎంజాయ్.. -
విదేశీ అతిథులు రా..రమ్మంటున్నాయి..
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): కార్తీకంలో వన విహారం చేయాలనుకునే ప్రకృతి ప్రేమికులకు మంచి విడిది టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామం. అంతర్జాతీయ స్థాయిలో విశిష్టత కలిగిన పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ జాతులకు చెందిన విదేశీ పక్షుల విడిది కేంద్రం ఇది. వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడకు వచ్చే పక్షులను చూడడానికి సందర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. తప్పక చూడండి: ► పక్షుల విన్యాసాలను వీక్షించాలంటే వాచ్‌టవర్‌ను ఎక్కాల్సిందే. ► విదేశీ పక్షుల విశేషాల్ని సోదాహరణంగా వివరిస్తూ ఓ మ్యూజియం ఉంది. ► రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ► భావనపాడు సముద్రతీరం అందాలు చూసి తీరాల్సినవి. ఎలా వెళ్లాలి.. ► శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి టెక్కలి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► టెక్కలి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో తేలినీలాపురం ఉంది. ► టెక్కలి నుంచి రావివలస 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► భావనపాడు సముద్ర తీరం టెక్కలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► పూర్తి స్థాయి రవాణా సదుపాయాలున్నాయి. చదవండి: Seshachalam Hills: ట్రెక్కింగ్‌కు పెరుగుతున్న ఆదరణ -
జాగ్రత్త.. పావురాలతో సెల్ఫీలొద్దు!
సాక్షి, హైదరాబాద్: నగరం లక్షల పావురాలకు ఆవాసం. రోజూ కొన్ని వేల మంది వీటికి తిండి గింజలు వేస్తుంటారు. 500 ప్రాంతాల్లో ప్రత్యేకంగా తిండి గింజలు వేసే కేంద్రాలున్నాయి. చాలా మందికి ఇలా తిండి గింజలు వేసి.. వాటితో సెల్ఫీ దిగడం అలవాటు. కొద్ది రోజుల వరకు ఈ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో పక్షి ప్రేమికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వారు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించనప్పటికీ ఆ వ్యాధి ఉన్న ప్రాంతం నుంచి వచ్చే పక్షుల వల్ల వైరస్ ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉన్నందున మరో రెండు నెలల పాటు జనం జాగ్రత్తతో ఉండాలని చెబుతున్నారు. పావురాల గుంపులోకి వెళ్లొద్దు.. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వృద్ధి చెందుతున్న పావురాలతో సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. హైదరాబాద్ సహా సమీప ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో పావురాలున్నాయి. వలస పక్షుల ద్వారా ఈ పావురాలకు బర్డ్‌ఫ్లూ సోకి.. వేగంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెపుతున్నారు. పావురాలకు నిత్యం తిండి గింజలు వేయడం చాలా మందికి అలవాటు. ఇది మంచిదే అయినా.. కొందరు పావురాల గుంపుల్లోకి వెళ్లి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఆ సమయంలో పావురాలు ఒక్కసారిగా ఎగిరితే వాటి రెక్కల నుంచి పెద్దమొత్తంలో దుమ్ము కణాలు గాలిలో కలుస్తుంటాయి. ఒకవేళ బర్డ్‌ఫ్లూ సోకిన పావురాలు వాటిల్లో ఉంటే ఆ దుమ్ము ద్వారా వైరస్ మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిత్యం ఫిర్యాదులు.. ప్రస్తుతం ఎక్కడైనా పక్షి చనిపోతే ప్రజలు బర్డ్ ఫ్లూ అనుమానంతో భయపడుతున్నారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పశుసంవర్థక శాఖ అధికారులకు, జీహెచ్ఎంసీకి, పక్షుల స్వచ్ఛంద సంస్థలకు ఫిర్యాదులు వస్తున్నాయి. తమ ఇంటి సమీపంలో చెట్టుపై నుంచి పక్షి పడి చనిపోయిందని, దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటూ మాకు నిత్యం పది వరకు ఫోన్లు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కడా బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదు. - సంజీవ్ వర్మ, యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ అప్రమత్తత అవసరం.. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదు. హైదరాబాద్‌లో పావురాలు పది లక్షలకు చేరువవుతున్నాయి. ఈ విషయంలోనే జనంలో అప్రమత్తత అవసరం. పావురాల గుంపులకు చేరువగా వెళ్లొద్దు. పక్షులు ఎక్కువగా వాలే చెట్ల కింద అధిక సమయం ఉండకపోవడం మంచిది. వాటి రెట్టలు కూడా వైరస్‌ను ప్రబలేలా చేస్తాయి. - వాసుదేవరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, పక్షి విభాగం అధిపతి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం -
పక్షులకూ ప్రేమ, విరహ వేదన!
మనుషులే కాదు పక్షులూ ప్రేమలో పడతాయంటున్నారు శాస్త్రవేత్తలు. తమ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు జర్మనీలోని ఆర్నిథాలజీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. పక్షి ప్రేమపై పలు పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు... మనుషుల్లాగే పక్షులు కూడా ప్రేమలో పడతాయని తేల్చిచెప్పారు. మొత్తం 160 పక్షులపై ఈ ప్రేమ సర్వే నిర్వహించారు. 20 ఆడపక్షులు ఉన్నఓ గదిలోకి మరో 20 మగ పక్షులను వదలి ప్రత్యేకంగా పరిశోధకులు ఓ డేటింగ్ సెషన్ ఏర్పాటు చేశారట. ఇలా వదిలిన చాలా తక్కువ సమయంలోనే అవి జంటలుగా మారాయని, ఆ తర్వాత అవి అక్కడ ఉండకుండా సంతోషంగా ఎగిరిపోయేందుకు ప్రయత్నించాయని వారు తెలిపారు. ఒకసారి జంటగా ఏర్పడిన పక్షులను విడదీసి మరో పక్షితో జత చేసేందుకు ప్రయత్నించి కూడా చూశారట. అయితే అప్పుడు వాటి భావాల్లో ఎంతో బాధను గమనించారట. అవి ఉత్సాహంగా లేకుండా విరహ వేదన అనుభవిస్తున్నట్లు కనిపించాయట. అంతేకాక బలవంతంగా జంటలుగా చేసిన పక్షులు పెట్టిన గుడ్లు ఆరోగ్యంగా లేకపోవడం, ఎక్కువ శాతం పిల్లలు కాకుండానే చనిపోవడం కూడా జరిగిందట. ఇలా పక్షుల ప్రేమపై పలు ప్రయోగాలను చేసిన పరిశోధకులు చివరికి పక్షుల్లో కూడా ప్రేమ పుడుతుందని, విరహ వేదన ఉంటుందని తేల్చారట.