పక్షులకూ ప్రేమ, విరహ వేదన!
మనుషులే కాదు పక్షులూ ప్రేమలో పడతాయంటున్నారు శాస్త్రవేత్తలు. తమ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు జర్మనీలోని ఆర్నిథాలజీ ఇనిస్టిట్యూట్కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. పక్షి ప్రేమపై పలు పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు... మనుషుల్లాగే పక్షులు కూడా ప్రేమలో పడతాయని తేల్చిచెప్పారు. మొత్తం 160 పక్షులపై ఈ ప్రేమ సర్వే నిర్వహించారు. 20 ఆడపక్షులు ఉన్నఓ గదిలోకి మరో 20 మగ పక్షులను వదలి ప్రత్యేకంగా పరిశోధకులు ఓ డేటింగ్ సెషన్ ఏర్పాటు చేశారట.
ఇలా వదిలిన చాలా తక్కువ సమయంలోనే అవి జంటలుగా మారాయని, ఆ తర్వాత అవి అక్కడ ఉండకుండా సంతోషంగా ఎగిరిపోయేందుకు ప్రయత్నించాయని వారు తెలిపారు. ఒకసారి జంటగా ఏర్పడిన పక్షులను విడదీసి మరో పక్షితో జత చేసేందుకు ప్రయత్నించి కూడా చూశారట. అయితే అప్పుడు వాటి భావాల్లో ఎంతో బాధను గమనించారట. అవి ఉత్సాహంగా లేకుండా విరహ వేదన అనుభవిస్తున్నట్లు కనిపించాయట. అంతేకాక బలవంతంగా జంటలుగా చేసిన పక్షులు పెట్టిన గుడ్లు ఆరోగ్యంగా లేకపోవడం, ఎక్కువ శాతం పిల్లలు కాకుండానే చనిపోవడం కూడా జరిగిందట. ఇలా పక్షుల ప్రేమపై పలు ప్రయోగాలను చేసిన పరిశోధకులు చివరికి పక్షుల్లో కూడా ప్రేమ పుడుతుందని, విరహ వేదన ఉంటుందని తేల్చారట.