రె‘ఢీ’
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం జరగనున్న పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, సామగ్రి, సిబ్బంది సమస్తం అందుబాటులో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన పోలింగ్ ఏర్పాట్లపై మాట్లాడారు. గత ఎన్నికల్లో జిల్లాలో 53 శాతం మాత్రమే జరిగిన పోలింగ్‌ను ఈసారి కనీసం 70 శాతానికి పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.
గతంలో ఎన్నికల తేదీ, సమయం, పోలింగ్ కేంద్రం వంటి కనీస సమాచారం కూడా చాలామందికి తెలియకపోవడంతో పోలింగ్ తక్కువగా జరిగిందన్న అంశాన్ని తమ సర్వే ద్వారా గుర్తించామని చెప్పారు. అదే పరిస్థితి ప్రస్తుతం పునరావృతం కాకుండా ఉండేందుకు ఓటర్లకు పోలింగ్‌కేంద్రం తదితరమైన వివరాలు తెలిసేలా ఓటరుస్లిప్‌లు ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు 67 శాతం మందికి ఈ స్లిప్పుల పంపిణీ జరిగిందన్నారు.
మొత్తంగా 80-85 శాతం మందికి ఈ స్లిప్పులు అందగలవని అంచనా వేశామని చెప్పారు. ఓటరు స్లిప్పులు అందకపోయినప్పటికీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఓటరు జాబితాలో పేరుంటే చాలు.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చునన్నారు. ఓటర్లు స్లిప్పులు లేనివారు సంబంధిత బీఎల్‌ఓల దగ్గర వాటిని తీసుకోవచ్చన్నారు. అదీ కుదరని వారు 91779 99876 నెంబరుకు ఎస్‌ఎంఎస్ చేస్తే నిమిషంలోగా వారి పోలింగ్ కేంద్రం, వరుస సంఖ్యలతో సహా వివరాలు అందుతాయన్నారు.
ఇందుకు కేవైపీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎపిక్‌కార్డు నెంబరు (ఉదా: కేవైపీ టీజడ్‌టీ1277533) ఎస్‌ఎంఎస్ చేయాలన్నారు. హైదరాబాద్ జిల్లాలోని వారు మాత్రమే కాక గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఓటరు స్లిప్ లే కపోయినా ఓటరు జాబితాలో పేరున్నవారు ఏదేని ఫొటో గుర్తింపుకార్డును చూపి ఓటు వేయవచ్చునన్నారు. 11 రకాలైన డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపినా జాబితాలో పేరున్నవారు ఓటు వేయవచ్చని.. ఓటరు జాబితాలో పేరున్నదీ లేనిదీ జీహెచ్‌ంఎసీ వెబ్‌సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని తెలిపారు.
జాబితాలో పేరు లేకపోతే మాత్రం ఓటుహక్కు ఉండదని స్పష్టం చేశారు. ఓటర్ల సదుపాయం కోసం పోలింగ్‌కేంద్రాల వద్ద బీఎల్‌ఓలు, హెల్ప్‌డె స్క్‌లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. జిల్లా పరిధిలోని 3,386 పోలింగ్ కేంద్రాల వద్ద లైవ్ వెబ్‌కాస్టింగ్ ఉంటుందని, దీని ద్వారా ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న 1480 భవనాల వద్ద ఈ- హెల్ప్‌డెస్క్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.
ఎన్నికల విధుల కోసం 22,348 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను నియమించామన్నారు. వీరితోపాటు 255 మంది సెక్టోరల్ అధికారులు, 1,482 మంది అదనపు సెక్టోరల్ అధికారులు ఉంటారన్నారు. అవసరానికి మించి ఈవీఎంలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా జరిగేందుకు వీలుగా తగినన్ని పోలీసు బృందాలు, బలగాలు అందుబాటులో ఉన్నాయని సోమేశ్‌కుమార్ వివరించారు.
30న సెలవు
అందరూ ఓటు వేసేందుకు వీలుగా 30వ తేదీన జిల్లాలోని అన్ని హోటళ్లు, మాల్స్, థియేటర్లు, పార్కులు మూసివే యనున్నట్లు తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైన గుర్తింపు కార్డులివీ...
1. పాస్‌పోర్టు 2.డ్రైవింగ్‌లెసైన్సు 3. కేంద్ర/ రాష్ట్ర/ప్రభుత్వాల్లో పనిచేసే వారి సర్వీసు ఐడీ కార్డులు 4. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలిచ్చే గుర్తింపు కార్డులు 5. బ్యాంకు/పోస్టాఫీసు పాస్‌బుక్స్ (ఫొటోలతో కూడినవి) 6. పాన్‌కార్డు 7. ఆధార్ కార్డు 8. ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు 9. ఎంఎన్‌ఆర్ ఈజీఏ జాబ్‌కార్డు 10. కార్మికశాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్‌కార్డు 11.పెన్షన్ డాక్యుమెంట్( ఫొటోతో కూడినది).