పోలీస్..! | Transfers to break the tension! | Sakshi
Sakshi News home page

పోలీస్..!

Published Sun, Oct 19 2014 12:54 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM

పోలీస్..! - Sakshi

పోలీస్..!

  • సీఐ పోస్టింగ్‌ల సీన్ చేంజ్
  •  టీఆర్‌ఎస్ నేతల ఒత్తిళ్లతో బదిలీలకు బ్రేక్!
  •  పోస్టింగ్‌ల రద్దు ఖరారు
  • సాక్షి ప్రతినిధి, వరంగల్ :  వరంగల్ రీజియన్ పరిధిలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల పోస్టింగ్‌ల కథ తిరగబడింది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో శుక్రవారం జరిగిన  29 మంది సీఐల బదిలీలకు బ్రేక్ పడింది. బదిలీల్లో పోస్టింగ్‌లు పొందిన వారు కొత్త స్థానాల్లో చేరొద్దని పోలీసు శాఖ ఉన్నతాధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ నిర్ణయం తీసుకునే వరకు పాత పోస్టింగ్‌లోనే కొనసాగాలని ఆదేశించారు.

    సాధారణ ఎన్నికల తర్వాత 29 మంది సీఐలను బదిలీ చేయడం ఇదే మొదటిసారి. ఆలస్యంగా జరిగిన ఈ బదిలీలు రాజకీయ కారణాలతో ఆగిపోయాయి. తెలంగాణలో పోలీసు శాఖను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ వ్యూహరచన చేస్తుండగా... అధికార టీఆర్‌ఎస్ నేతలే దీన్ని నీరుగారుస్తున్నారు. తమకు ఇష్టమైన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు చేసిన రాజకీయంతో పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారే పరిస్థితి నెలకొంది.     

    వరంగల్ రేంజ్ పరిధిలో 29 మంది సీఐలకు ఇచ్చిన పోస్టింగ్‌లను 24 గంటల్లోనే రద్దు చేస్తూ ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కొన్ని పోస్టింగ్‌లు ఇవ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఏళ్లుగా లూప్‌లైన్ సర్వీస్‌లో మగ్గుతున్న ఇన్‌స్పెక్టర్‌లకు తాజా బదిలీల్లో ప్రాధాన్యం ఇచ్చారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నాయకులకు ఇబ్బందికరంగా మారింది.

    ఎన్నికల సమయంలో, ఆ తర్వాత తమకు దగ్గరగా ఉంటున్న కొందరు సీఐలకు మంచి స్థానాల్లో పోస్టింగ్‌లు ఇస్తామని హామీలు ఇచ్చారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు, సీఐలకు మధ్య కొన్ని వ్యవహారాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయకుల ప్రతిపాదనలను పక్కనబెట్టి పోలీసు ఉన్నతాధికారులు నిబంధనల ప్రకారం పోస్టింగ్‌లు ఇచ్చారు.

    దీంతో రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇబ్బందికరంగా భావించారు. వెంటనే ఉన్నత స్థాయిలో రాజకీయ పలుకుబడితో ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా పోస్టింగ్‌లను నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే విషయంలో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోంది.
     
    లూప్‌లైన్ సీఐల మొర...

    ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, సిబ్బంది పోస్టింగ్ విషయంలో నిబంధనలు ఉంటాయి. కొన్నేళ్లు ఫోకల్ స్థానాల్లో విధులు నిర్వర్తించిన వారు మరికొన్నేళ్లు నాన్ ఫోకల్ పోస్టుల్లో విధులు నిర్వర్తించాలి. సివిల్ విభాగంలో సీఐలుగా పని చేసిన వారు అనివార్యంగా కొంతకాలం సీఐడీ, రైల్వే, ట్రాన్స్‌కో, ఎస్‌బీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పని చేయాలి. రాజకీయ కారణాలతో ఇది మారిపోతోంది. సివిల్ విభాగంలో సీఐలుగా పనిచేస్తున్న వారు... అధికార పార్టీ నేతల సహకారంతో వరుసగా ఇలాంటి పోస్టుల్లోనే పనిచేస్తున్నారు.

    తెలంగాణ రాష్ట్రంలో ఈ పద్ధతికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో తాము సూచించిన వారు లేకపోవడంతో రాజకీయ నాయకులు అసంతృప్తికి లోనయ్యారు. సీఐలకు ఇచ్చిన మాట నెరవేకపోవడంతో రాజకీయ నేతలకు కష్టంగా మారింది. బదిలీ అయిన సీఐలలో 16 మంది ప్రస్తుతం లూప్‌లైన్ పోస్టింగ్‌లోనే ఉన్నారు. మరో 13 మంది సీఐలు రాజకీయ నాయకులు ప్రతిపాదించిన వారు ఉన్నారు.

    లూప్‌లైన్ వారు దక్కించుకున్న పోస్టింగ్‌లకు సంబందించి ప్రజాప్రతినిధులు వేరే వారికి గతంలో మాట ఇచ్చారు. బదిలీ ఉత్తర్వులతో ప్రజాప్రతినిధులు ఇబ్బందిగా ఫీలయ్యారు. బదిలీ ఉత్తర్వులు నిలిపివేఆయలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ నేతల తీరు ఇలా ఉంటే... అధికార పార్టీ ప్రజాప్రతినిధికి సోదరుడు అయిన ఒక సీఐ పోస్టింగ్‌ల విషయంలో ఏకంగా హైదరాబాద్ సచివాలయంలో హంగామా చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
     
    అనుకున్నదే జరిగింది...
     
    నిబంధనల ప్రకారం జరిగిన సీఐల బదిలీల నిర్ణయంపై పోలీసు ఉన్నతాధికారుల్లోనూ కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి ఇదే నిజమవుతోంది. వరంగల్ రేంజ్ ఐజీ రవిగుప్తా శుక్రవారం నాలుగు జిల్లాల ఎస్పీలతో మాట్లాడుతూ... కొన్నేళ్లుగా లూప్‌లైన్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌లపై సానుభూతితోనే ఈ పోస్టింగ్‌లు ఇస్తున్నామని, ఆయా స్టేషన్ల పరిధిలో స్ధానిక ప్రజాప్రతినిధులను మేనేజ్ చేయాలని సూచించారు. కొంతమంది ఎస్పీలు సైతం స్థానిక ప్రజాప్రతినిధులకు పోస్టింగ్‌లపై ఫోన్‌లో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సీఐల పోస్టింగ్‌ల కథ మొదటికే వచ్చింది.
     
    మమ్మల్ని అణగదొక్కుతున్నారు

    పోలీసు శాఖలో తమను అణగదొక్కుతున్నారని సీఐ విష్ణుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బదిలీలో దళిత సీఐలకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. మరో సీఐ సుబ్బారావు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నాడు.
     
    అరగుండు, అరమీసంతో వచ్చిన ఆయన మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడికి చేరుకున్న మీడియా ఇదేంటని ప్రశ్నించగా... తాను ఇంటి సమస్యలతో బాధపడుతున్నానని, ఇలా వచ్చి తమ దేవుడైన అంబేద్కర్‌కు పూలమాల వేస్తే అన్ని సర్దుకుంటాయని ఒకరు చెప్పడంతో ఇలా చేశానని చెప్పారు. సిఐ పోస్టింగులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement