ట్రంప్ పరిపాలనపై తొలి సర్వే: షాకింగ్ రిజల్ట్స్
వాషింగ్టన్: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసి నేటికి సరిగ్గా వారం రోజులైంది. ఈ సందర్భంగా ఆయన పరిపాలన తీరుపై ప్రఖ్యాత క్విన్నిపియాక్ యూనివర్సిటీ ఒక పోల్ సర్వే నిర్వహించింది. ప్రెసిడెంట్ హోదాలో తొలి(వివాదాస్పద) ప్రసంగం మొదలు, మొదటి ఐదు రోజులు ట్రంప్ పరిపాలన ఎలా ఉంది? ట్రంప్ సంతకాలు చేసిన ఫైళ్లలోని అంశాలు, వాటిని ఏమేరకు అమలు చేస్తారు? తదితర ప్రశ్నలతో నిర్వహించిన పోల్ సర్వే ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.
పోల్ సర్వేలో.. ‘ట్రంప్ సమర్థుడు, తెలివైనవాడే కానీ.. అవివేకి(కామన్‌సెన్స్‌లెస్)’అని జనం తీర్పు చెప్పడం గమానర్హం. సర్వేలో అడిగిన ప్రశ్నలకు.. 68 శాతం మంది ట్రంప్ సమర్థుడని, 65 శాతం మంది ఆయనను ఇంటెలిజెంట్ అని అన్నారు. అదేసమయంలో 62 శాతంమంది ట్రంప్ అవివేకిఅని తేల్చిపారేశారు. మొత్తంగా వందలో 36 శాతం మంది ‘ట్రప్ ఐదు రోజుల పరిపాల’కు మద్దతు పలకగా, 44 శాతం మంది వ్యతిరేకించారు. ‘కీలకమైన ఫైళ్లపై సంతకాలు చేశారు తప్ప,ఆ విధానాలను అమలు చేసే దిశగా ఆయన సర్కారు నడుం కట్టడంలేదు’ అని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. జాతి వివక్ష, లింగ వివక్ష సంబంధింత అంశాలపై ఆయన దృష్టిపెట్టనేలేదని విమర్శించారు.
కాగా, రిపబ్లికన్లలో 81 శాతం మంది ట్రంప్ పరిపాలనా విధానాన్ని సమర్థించగా, 3 శాతం మంది పెదవి విరిచారు. అదే డెమోక్రాట్లలో కేవలం 4 శాతం మందే ట్రంప్ రూలింగ్ బాగుందని మెచ్చుకోగా, 77 శాతం మంది చెత్తగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక మహిళల్లో 50 శాతంమంది ట్రంప్ ఐదురోజుల పాలలను తిరస్కరించగా, 33 శాతం మంది అంగీకరించారు. శ్వేతజాతీయుల్లో 43 శాతంమందే ట్రంప్‌కు మద్దతుపలకగా, నల్లజాతీయుల్లో 43 శాతం మంది వ్యతిరేకత వెలిబుచ్చారు. ఈ సర్వేలో మొత్తం 1,190 ఓటర్లు పాల్గొన్నట్లు క్విన్నిపియాక్ యూనివర్సిటీ తెలిపింది.