అత్యాధునిక హంగులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
లంగర్‌హౌస్: అంతర్జాతీయ ప్రమాణాలాతో అత్యాధునిక హంగులతో, నగరానికి సరికొత్త అందాలను తెచ్చిపెట్టేలా ఫుట్ ఓవర్, స్కైవాక్‌లను ఏర్పాటుచేస్తున్నామని నగర కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, పాదచారుల సౌకర్యార్ధం వీటిని నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలో 70 ప్రాంతాల్లో 100 బ్రిడ్జిలను, స్కైవాక్‌లను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నామన్నారు.
పశ్చిమ దిశలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను కలిపే లంగర్‌హౌస్ వద్ద ఉన్న టిప్పుఖాన్ బ్రిడ్జి, ఆర్టిలరీ సెంటర్ ప్రాంతాల్లో ఎంపీ అసదుద్దీన్, మేయర్ మాజీద్‌హుస్సేన్, కమిషనర్ తదితరులు మిలిటరీ అధికారులతో కలిసి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌లో ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయన్నారు. పాదచారుల సౌకర్యార్థం నగరంలోని ప్రధాన కూడళ్లలో 100 కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నామన్నారు.
నాలుగు లైన్ల రోడ్లు, రద్దీ ఎక్కువ ఉన్న దాదాపు 70 ప్రాంతాల ను ఇప్పటికే గుర్తించామన్నారు పూర్తి స్తాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నామని ఆయన తెలిపా రు. వికలాంగులు, వృద్ధులు, చిన్నారుల కోసం ప్రతి ఫుట్ ఓవర్ బ్రిడ్డికి రెండు వైపులా లిఫ్ట్‌లు కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. గతంలో చేసినట్టు కాకుం డా సులువుగా ఉండేందుకు బ్రిడ్జిల నిర్మాణం, 3 సంవత్సరాల వరకు పర్యవేక్షణ ఒకరికి, బ్రిడ్జ్‌లపై వ్యాపార తదితర ప్రకటనల భాద్యతలు మరొకరికి, రోజు వారి శుభ్రత, పర్యవేక్షణ భాద్యతలు మరొకరికి అప్పజెప్పనున్నామన్నారు.
ట్రాఫిక్ పోలీసులు, ప్రజలు సహకరించి ప్రమాదాలను అరికట్టాలన్నారు. అనంతరం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నగర మేయర్, అధికారుల బృందం ఆర్టిలరీ సెంటర్‌ను సందర్శించారు. మిలటరీ కమాండెంట్ అధికారి కిరణ్‌కుమార్‌తో కలిసి చర్చలు జరిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేస్తేనే సామాన్య ప్రజలు కూడా రోడ్డు దాటడానికి అనుకూలంగా ఉంటదని ఎంపీ సూచించడంతో మిలటరీ అధికారులు అందుకు అంగీకరించారు. త్వరలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నమూనా రూపకల్పన చేసి మిలటరీ అధికారులకు అందిస్తామని, వారి అంగీకరన అనంతరం నిర్మాణ పనులు చేపడతామని ఎంపీ అసదుద్దీన్ అన్నారు.
మెహదీపట్నంలో నగరంలోనే సరికొత్త నమూనా బ్రిడ్జి....
మెహదీపట్నం వద్ద పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే బ్రిడ్జికి మరింత వన్నెను తీసుకువస్తూ నగరంలోనే సరికొత్త రూపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మాంచనున్నామని ఎంపీ, కమిషనర్ తెలిపారు. కింద వాహనాలకు కాని, అటు ఫ్లై ఓవర్‌కు కాని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా పాదచారులకు సరికొత్త అనుభూతిని కల్పించేలా ప్రత్యేక నిపుణలతో ఈ ఫుట్ ఓవర్‌బ్రిడ్జి రూపకల్పన పనులను ప్రారంభించామన్నారు. ఈ పర్యటనలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్, అధికారులు రవికుమార్, సత్యకుమార్ తదితరులు ఉన్నారు.