సాక్షి, విశాఖపట్నం: అందుబాటులో ఉన్న వనరులతో అత్యుత్తమ అవకాశాలు సృష్టిస్తూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్యను అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 పేరుతో నేషనల్ స్కిల్ కాంక్లేవ్–2024 శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అమలు చేసేందుకు వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో పర్యటించామన్నారు.
గత 30–40 ఏళ్లలో నైపుణ్య రంగంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర యువతలో ఏయే విభాగాల్లో నైపుణ్య కొరత ఉందో.. ఎందులో ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుని దానికనుగుణంగా కార్యాచరణ చేపట్టామని వివరించారు. స్థానిక పరిశ్రమల అవసరాలను బట్టి నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. సన్‌షైన్ ఏపీ కోసం 26 నైపుణ్య అకాడమీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు కూడా ఉన్నాయన్నారు.
శిక్షణ ఇచ్చిన తర్వాత వీరిలో 50 శాతం మందిని స్థానిక పరిశ్రమల అవసరాల కోసం ఉపయోగించుకోవాలని అన్ని సంస్థలకు దిశానిర్దేశం చేశామని చెప్పారు. రాష్ట్ర యువత.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా.. నైపుణ్య శిక్షణ అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.
పలు సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందాలు..
సదస్సులో భాగంగా.. ఏపీఎస్‌ఎస్‌డీసీతో వివిధ సంస్థలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నైపుణ్య శిక్షణకు సంబంధించి 100 మిలియన్ లెర్నర్స్ (అరిజోనా స్టేట్ యూనివర్సిటీ), ట్రస్టెడ్ జాబ్స్, తాత్విక్ బ్యూటీ–వెల్‌నెస్, ట్రైన్‌డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ఏఐ), ఎక్సెల్‌ఐఆర్, జీయూవీఐ, హెచ్‌ఈఆర్‌ఈ టెక్నాలజీస్, రబ్బర్, కెమికల్, పెట్రో కెమికల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మొదలైన సంస్థలతో 6 ఎంవోయూలను ఏపీఎస్‌ఎస్‌డీసీ కుదుర్చుకుంది.
ఏపీలో నైపుణ్యాభివృద్ధి కోసం గత ఐదేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలపై రూపొందించిన వీడియో ప్రదర్శనకు దేశ, విదేశాల ప్రతినిధుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ‘న్యూస్కిల్’ న్యూస్ లెటర్‌ను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీకి సహకారం అందిస్తూ ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగయ్యేలా చేస్తున్న బెస్ట్ ప్లేస్‌మెంట్, సీఎస్‌ఆర్ పార్టనర్లగా కియా మోటార్స్ ఇండియా లిమిటెడ్, లలితా జ్యుయెలర్స్ తదితర 13 సంస్థలకు అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కియా మోటార్స్ ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్లీ, సెంట్రల్ ఎంఎస్‌ఎంఈ బోర్డు సీఈవో సేతు మాధవన్, సీడాప్ సీఈవో శ్రీనివాసులు, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేశ్ కుమార్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ నవ్య, పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాల కల్పనలో 3వ స్థానంలో ఏపీ
రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం.. స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు, హబ్‌లు ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తోంది. దేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్‌వన్‌కి చేరుకునే అవకాశాలున్నాయి. – డా. వినోద్ కుమార్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో
ఏపీ విధానాలు భేష్
నైపుణ్య శిక్షణ కోసం ఏపీలోనూ అవలంబిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఐదు ప్రధాన విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. మా రాష్ట్రంలో 2.7 లక్షల మందికి ఏడాది కాలంలో ఉద్యోగాలు ఇవ్వగలిగాం. – డా. అపూర్వ పాల్కర్, మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీ వీసీ
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీతో తప్ప అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుగ్గన చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. టీడీపీకి ఒక అజెండా, విధానం అంటూ ఏమీ లేవని విమర్శించారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలతో సైతం పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. వీటితో ఒక్కో పార్టీతో రెండేసి సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. టీడీపీ తోక పార్టీ జనసేన సిద్ధాంతం ఏంటో ఆ పార్టీ శ్రేణులకు సైతం అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ ఆశయాలు, పేదల సంక్షేమమే వైఎస్సార్‌సీపీ అజెండా అని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన హామీల అమలు కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని వెల్లడించారు. బీజేపీ, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు విభజన హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వైఎస్సార్‌సీపీ నెరవేరుస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment