international standards
-
యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్య
సాక్షి, విశాఖపట్నం: అందుబాటులో ఉన్న వనరులతో అత్యుత్తమ అవకాశాలు సృష్టిస్తూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్యను అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 పేరుతో నేషనల్ స్కిల్ కాంక్లేవ్–2024 శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అమలు చేసేందుకు వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో పర్యటించామన్నారు. గత 30–40 ఏళ్లలో నైపుణ్య రంగంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర యువతలో ఏయే విభాగాల్లో నైపుణ్య కొరత ఉందో.. ఎందులో ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుని దానికనుగుణంగా కార్యాచరణ చేపట్టామని వివరించారు. స్థానిక పరిశ్రమల అవసరాలను బట్టి నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. సన్‌షైన్ ఏపీ కోసం 26 నైపుణ్య అకాడమీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు కూడా ఉన్నాయన్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాత వీరిలో 50 శాతం మందిని స్థానిక పరిశ్రమల అవసరాల కోసం ఉపయోగించుకోవాలని అన్ని సంస్థలకు దిశానిర్దేశం చేశామని చెప్పారు. రాష్ట్ర యువత.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా.. నైపుణ్య శిక్షణ అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ఏపీఎస్ఎస్డీసీ పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. పలు సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందాలు.. సదస్సులో భాగంగా.. ఏపీఎస్ఎస్డీసీతో వివిధ సంస్థలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నైపుణ్య శిక్షణకు సంబంధించి 100 మిలియన్ లెర్నర్స్ (అరిజోనా స్టేట్ యూనివర్సిటీ), ట్రస్టెడ్ జాబ్స్, తాత్విక్ బ్యూటీ–వెల్నెస్, ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ఏఐ), ఎక్సెల్ఐఆర్, జీయూవీఐ, హెచ్ఈఆర్ఈ టెక్నాలజీస్, రబ్బర్, కెమికల్, పెట్రో కెమికల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మొదలైన సంస్థలతో 6 ఎంవోయూలను ఏపీఎస్ఎస్డీసీ కుదుర్చుకుంది. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కోసం గత ఐదేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలపై రూపొందించిన వీడియో ప్రదర్శనకు దేశ, విదేశాల ప్రతినిధుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏపీఎస్ఎస్డీసీ ‘న్యూస్కిల్’ న్యూస్ లెటర్‌ను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. ఏపీఎస్ఎస్డీసీకి సహకారం అందిస్తూ ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగయ్యేలా చేస్తున్న బెస్ట్ ప్లేస్మెంట్, సీఎస్ఆర్ పార్టనర్లగా కియా మోటార్స్ ఇండియా లిమిటెడ్, లలితా జ్యుయెలర్స్ తదితర 13 సంస్థలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కియా మోటార్స్ ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్లీ, సెంట్రల్ ఎంఎస్ఎంఈ బోర్డు సీఈవో సేతు మాధవన్, సీడాప్ సీఈవో శ్రీనివాసులు, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేశ్ కుమార్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ నవ్య, పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాల కల్పనలో 3వ స్థానంలో ఏపీ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం.. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, హబ్‌లు ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తోంది. దేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్‌వన్‌కి చేరుకునే అవకాశాలున్నాయి. – డా. వినోద్ కుమార్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో ఏపీ విధానాలు భేష్ నైపుణ్య శిక్షణ కోసం ఏపీలోనూ అవలంబిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఐదు ప్రధాన విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. మా రాష్ట్రంలో 2.7 లక్షల మందికి ఏడాది కాలంలో ఉద్యోగాలు ఇవ్వగలిగాం. – డా. అపూర్వ పాల్కర్, మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీ వీసీ చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీతో తప్ప అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుగ్గన చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. టీడీపీకి ఒక అజెండా, విధానం అంటూ ఏమీ లేవని విమర్శించారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలతో సైతం పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. వీటితో ఒక్కో పార్టీతో రెండేసి సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. టీడీపీ తోక పార్టీ జనసేన సిద్ధాంతం ఏంటో ఆ పార్టీ శ్రేణులకు సైతం అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ ఆశయాలు, పేదల సంక్షేమమే వైఎస్సార్సీపీ అజెండా అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన హామీల అమలు కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని వెల్లడించారు. బీజేపీ, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు విభజన హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వైఎస్సార్సీపీ నెరవేరుస్తోందన్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో మన ఆడిటింగ్ ప్రమాణాలు
న్యూఢిల్లీ: భారత ఆడిటింగ్ ప్రమాణాలు చాలా మటుకు అంతర్జాతీయ అకౌంటింగ్ స్టాండర్డ్‌లకు అనుగుణంగానే ఉంటున్నాయని ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ అనికేత్ తలాతి చెప్పారు. ఆడిటర్లంటే ప్రతి ఒక్క లావాదేవీ, ప్రతి ఇన్వాయిస్ను తప్పకుండా చూస్తారని భావించడానికి ఉండదని ఆయన తెలిపారు. లిస్టెడ్ కంపెనీలు ప్రతి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను 45 రోజుల్లోగా, వార్షిక ఫలితాలను 60 రోజుల్లోగా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆడిటర్లు ప్రతి ఒక్క లావాదేవీని చూడటం సాధ్యపడదని, అసలు ఆడిట్ ఉద్దేశం అది కాదని ఆయన పేర్కొన్నారు. అయితే, రిపోర్టింగ్ ప్రమాణాలు, బాధ్యతల విషయంలో ఆడిటర్లు సాంకేతికంగా అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు, సమగ్రతను పాటించాల్సి ఉంటుందని అనికేత్ చెప్పారు. -
ఇంటిగ్రేటెడ్ స్టేషన్లుగా ఆర్టీసీ బస్టాండ్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఆర్టీసీ బస్స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వాటిని ఇంటిగ్రేటెడ్ స్టేషన్లుగా మార్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రూ.150 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఆయా బస్స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలతోపాటు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లను నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటి నిర్మాణం ఉండనుంది. అంతేకాకుండా మరో 21 బస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రస్తుతానికి మొత్తం ఐదు జిల్లాల్లో ఆర్టీసీ స్థలాలను కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా మారుస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో .. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఐదు జిల్లాల్లో ఏడు చోట్ల బస్ స్టేషన్లను నిర్మిస్తారు. ఇందుకోసం ఆర్కిటెక్చరల్ కన్సల్టెంట్ ఎంపిక కోసం ఆర్టీసీ ఇటీవలే టెండర్లు పిలిచింది. ఆటోనగర్– విజయవాడ, హనుమాన్ జంక్షన్ (కృష్ణా), తిరుపతి (చిత్తూరు), మద్దిలపాలెం, నర్సీపట్నం (విశాఖ), కర్నూలు, నరసరావుపేట (గుంటూరు) ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేశారు. ఒక్కో బస్టాండ్‌ను రూ.10 కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు కేటాయించనున్నారు. వైఫై సదుపాయం, మరుగుదొడ్ల విస్తరణ, రీ–పెయింటింగ్, ర్యాంపులు, రైయిలింగ్‌ల నిర్మాణం, డిజిటల్ డిస్ ప్లే బోర్డులు తదితర సౌకర్యాలు ఉండనున్నాయి. అంతేకాకుండా శ్రీకాకుళం, విజయనగరం,, కాకినాడ సహా పలు ప్రాంతాల్లో బస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. (అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జగన్) -
ఇంగ్లీష్‌తో పాటు తెలుగుకు ప్రాధాన్యత
సాక్షి, కృష్ణా: అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాష్ట్ర విద్యా ప్రణాళికను రూపొందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఇంగ్లీష్ తో పాటు తెలుగుభాషకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని మరోసారి మంత్రి స్పష్టం చేసారు. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షకు సురేష్ హాజరయ్యారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే అంశం పై కూలంకుష చర్చ జరిగిందని చెప్పారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యాప్రమాణాలు అందిస్తామని స్పష్టం చేశారు. అభ్యాసన ఫలితాలు, ఫౌండేషనల్ లెర్నింగ్ ఆధారంగా పాఠ్య పుస్తకాలు రూపొందించబడుతున్నాయని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు మూడు స్థాయిలలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించేందుకు ఆన్ లైన్ సేవలు వినియోగిస్తామన్నారు. పాఠశాలల్లో లాంగ్వేజ్ లేబరేటరీలు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి జరుగుతోందని ఆదిములపు సురేష్ తెలిపారు. -
ప్రజారవాణాలో స్మార్ట్.. ముంబయి బెస్ట్
అక్కడ ఇక్కడ సిటీబ్యూరో: మహానగరం విస్తరణలో వడివడిగా పరుగులు పెడుతోంది. ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలు అందుబాటులో తెస్తున్నట్టు నాయకులు చెబుతున్నారు. కానీ మౌలిక వసతుల కల్పనలో మాత్రం ఇంకా పాతికేళ్ల వెనుకే ఉన్నాం. సిటీ ఒకచోటు నుంచి మరోచోటుకు సొంత వాహనాలు లేని సిటీజన్లు నరకం చూడాల్సిందే. రాత్రయితే బస్సులు లేక అవస్థలు పడాల్సిందే. హైటెక్ యుగంలో ఉన్న హైదరాబాద్‌లో చాలా కాలనీలకు బస్సు రూట్లే లేవు. అయితే, మన పొరుగున ఉన్న ముంబయి మహానగరంలో మాత్రం బస్సుల కోసం పడిగాపులు పడకుండా, వ్యక్తిగత వాహనాలతో పనిలేకుండా తీరైన ప్రజారవాణా వ్యవస్థ అమల్లో ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ బల్దియాలో బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పడమేగాని అమలు చేయడం లేదు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇదే అంశాన్ని నాయకులు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు’ (బెస్ట్) సంస్థ విధానాలు.. గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ‘సాక్షి’ కథనం.. ఇక్కడంతా హడావిడే.. ముంబయి తరహాలో ప్రజా రవాణాను మెరుగుపర్చేందుకు ఆ నగరంలో అమలవుతున్న ‘క్యూ’ పద్ధతిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం హడావుడిగా నిర్ణయం తీసుకుంది. కానీ అది ఆచరణలో విఫలమైంది. అప్పట్లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రె డ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఆర్టీసీ జేఎండీ రమణారావు, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్, ఇతర అధికారుల బృందం ముంబయిలో పర్యటించింది. బస్సుల నిర్వహణ, ఆన్లైన్ సేవలు, క్యూ పద్ధతి వంటి అనేక అంశాలను పరిశీలించింది. ఈ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లో క్యూ పద్ధతి అమలు కావాలంటే కనీసం 1300 చోట్ల బస్‌బేలు అవసరమని ఆర్టీసీ పేర్కొంటున్నా.. ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమే. గ్రేటర్ ఆర్టీసీ - బెస్ట్ సేవలు ఇలా.. ⇒ గ్రేటర్ ఆర్టీసీ బెస్ట్ ⇒ మొత్తం బస్సులు: 3550 మొత్తం బస్సులు: 5000 ⇒ నగరంలో డిపోలు: 28 ముంబయిలో డిపోలు: 26 ⇒ నగర జనాభా: 80 లక్షలకు పైగా ముంబయి జనాభా సుమారు 2 కోట్లు ⇒ ప్రయాణికుల సంఖ్య: 34 లక్షలు ప్రయాణికుల సంఖ్య 45 లక్షలు ⇒ ఆక్యుపెన్సీ: 68 శాతం ఆక్యుపెన్సీ 75 శాతం ⇒ నగరంలో ఉన్న రూట్లు: 1050 సుమారు రూట్లు 750 ⇒ జీపీఎస్ కేవలం 80 బస్సుల్లోనే అన్ని బస్సులు జీపీఎస్ పరిధిలో ⇒ ఆన్లైన్ సేవలు విస్తరించాల్సి ఉంది బస్‌పాస్‌తో సహా అన్ని సేవలు ఆన్లైన్లోనే.. ⇒ కేవలం వంద బస్టాపుల్లో ఎల్ఈడీ డిస్ప్లే బస్సుల్లో ఎల్ఈడీ, స్టేజీ అనౌన్స్మెంట్ ⇒ క్యూ పద్ధతికి అనుకూలమైన రూట్లు లేవు అన్ని రూట్లలోనూ క్యూ పద్ధతి అమలు ⇒ మహిళలకు ముందు ద్వారం ఉన్నా అమలు లేదు మహిళలకు, పురుషులకు వేర్వేరు ద్వారాలు ⇒ ప్రతి 30 నిమిషాలకో ఒక బస్సు ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ⇒ రాత్రి 9 దాటితే బస్సు లభించడం కష్టం అన్ని వేళల్లోనూ అందుబాటులో బస్సులు ⇒ ఇక్కడ మాన్యువల్ టిక్కెట్లు అమలు స్మార్ట్‌కార్డుల ద్వారా ప్రయాణికులకు సేవలు -
హీరో సైకిల్స్ సరికొత్త రికార్డ్!
హైదరాబాద్: హీరో సైకిల్స్ లిమిటెడ్‌కు అరుదైన ఘనత దక్కింది. జూలై నెలలో కంపెనీ సైకిళ్ల విక్రయాలు 5.35 లక్షల మైలురాయిని అధిగమించాయని హీరో సైకిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకే నెలలో ఇంత పెద్ద మొత్తంలో సైకిళ్ల విక్రయాలు జరగడం అరుదైన సంఘటనే. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన తయారీ, అధిక నాణ్యత, మెరుగైన సేవలు వంటి తదితర అంశాలతో హీరో సైకిల్స్ వినియోగదారులను ఆకర్షిస్తోందని కంపెనీ చైర్మన్ పంకజ్ ముంజల్ తెలిపారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణ వల్ల వచ్చే మాసాల్లో కూడా కంపెనీ సైకిళ్ల విక్రయాలు 5 లక్షలుగా పైగా నమోదౌతాయని విశ్వాసం వ్యక్తంచేశారు. -
భూకంప జోన్ పరిధిలోనే రాజధాని
- నిర్మాణాలు విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలి -నేపాల్ అంత తీవ్రత లేకున్నా జాగ్రత్తలు అవసరం - రాజీపడితే భారీ మూల్యం - ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రిసెర్చ్ సెంటర్ అధిపతి ప్రదీప్‌కుమార్ హైదరాబాద్ : నవ్యాంధ్ర రాజధాని భూకంప తీవ్రత కలిగిన జోన్ పరిధిలోనే ఉందని ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ విభాగాధిపతి ఫ్రొఫెసర్ రామచర్ల ప్రదీప్‌కుమార్ చెప్పారు. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించి భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా వాటిని తీర్చిదిద్దాలని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన ప్రదీప్‌కుమార్‌తో సాక్షి ముచ్చటించింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనూ ..... సాక్షి : ఇటీవల ప్రపంచ వ్యాపితంగా భూకంపాల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.? ప్రదీప్ : అవును. పర్యావరణ పరిస్థితులు భూకంపాలను సష్టిస్తున్నాయి. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తాయని ముందుగా అంచనా వేసినా అందుకు తగిన విధంగా నిర్మాణాలు లేకపోవడం వలన నష్టం అధికంగా ఉంటుంది. సాక్షి : నవ్యాంధ్ర రాజధాని కష్ణా తీరం భూకంపాల జోన్లో ఉందా? ప్రదీప్ : కృష్ణా తీరమైన విజయవాడ పరిసరాలన్ని భూకంపాల జోన్-3లో ఉన్నాయి. నూతన రాజధానిలో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. అయితే జోన్-4, జోన్-5, జోన్-6 ఇలా భూకంపాల తీవ్రత కలిగిన ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. వాటితో పోల్చితే ఇక్కడ అంత భారీ ప్రభావం ఉండదు. సాక్షి : ఇటీవల నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది కదా...? ప్రదీప్ : అవును. అయితే నేపాల్ సరిహద్దు ప్రాంతాలైన కాశ్మీర్ జోన్-5లో ఉంది. సాక్షి :నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది కాదా. దానిపై భూకంపాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది.? ప్రదీప్ : జోన్-5 కన్నా అత్యధిక తీవ్రత కలిగిన టోక్యో, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లోనే భూకంపాలు తట్టుకునే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి ఇంజనీరింగ్ విధానాలను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలి. దానివలన భూకంపాలను ఎదుర్కొనేందుకు అవకాశముంటుంది. సాక్షి : ఏ విధమైన చర్యలు చేపట్టాలి? ప్రదీప్ :అంతర్జాతీయ ప్రమాణాల్లో భాగంగా ఐఎస్1893 (కెరిటెరియ ఫర్ ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రెక్చర్) బుక్ ప్రమాణాలను అనుసరించాలి. అలాగే పీర్‌రివ్యూ కమిటీ నిరంతరం పరిశీలించాలి. ఈ కమిటీ రెండు సంవత్సరాల కొకసారి మారుతుంది. దానివలన నిర్మాణాలను వివిధ రకాలుగా ఆయా రంగాల నిపుణులు పరిశీలిస్తారు. దీనివలన మంచి నిర్మాణాలు వస్తాయి. సాక్షి : భారీ బహుళ అంతస్తుల భవనాలను నమూనాలుగా చూపిస్తున్నారు. వాటిపై భూకంపాల ప్రభావం ఉండదా? ప్రదీప్ : ఆర్కిటెక్చర్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా స్ట్రెక్చరల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. దాని వలన మేలు జరుగుతుంది. ఏది ఏమైనా ప్రమాణాల విషయంలో రాజీ పడితే మూల్యం చెల్లించక తప్పదు. -
రోడ్లకూ ఆపరేషన్!
త్వరలో ‘గుంతలు లేని నగరం’ వడివడిగా అడుగులు తొలిదశలో 950 కి.మీ. టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ ఏప్రిల్ నుంచి అమలు సిటీబ్యూరో: విశ్వనగరం అంటే అందమైన భవనాలు... ఫ్లై ఓవర్లే కాదు. సాఫీ ప్రయాణానికి తోడ్పడే రహదారులూ అవసరమే. ఈ దిశగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు మరమ్మతులలోనూ అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని యోచిస్తోంది. రోడ్డు దెబ్బతిన్న విషయంపై ఫిర్యాదు అందిన 24 గంటల్లోగానే మరమ్మతులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ పనులు సమర్థంగా చేయగల సంస్థలను ఆహ్వానిస్తూ ఇప్పటికే టెండర్లు పిలిచింది. గుంతలు లేని నగరం (పాట్ హోల్ ఫ్రీ సిటీ)గా చేయాలనే తలంపుతో గత ఆగస్టులోనే జీహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా రోడ్డు డాక్టర్ యంత్రాన్ని వినియోగించింది. అది మరమ్మతులకు గురికావడంతో పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక రోడ్డు డాక్టర్ యంత్రాలను వినియోగించేందుకు తాజాగా సిద్ధమైంది. -
‘మెట్రో’ను తీర్చిదిద్దాలి
పనుల్లో అంతర్జాతీయ {పమాణాలు పాటించాలి మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి గోపాల్ సిటీబ్యూరో: నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లు, రహదారి జంక్షన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో రైళ్ల పనితీరు, జంక్షన్ల అభివృద్ధి, స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లు ,పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. నాగో ల్, ఉప్పల్ జంక్షన్ల వద్ద పాదచారులు నడిచేందుకు ప్రత్యేక మార్గాలు, బస్బే, ఆటోబేలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ప్రతి మెట్రో స్టేషన్ వద్ద ఇలాంటి ఏర్పాట్లు చేసేందుకు హెచ్ఎంఆర్, ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెట్రో స్టేషన్లలో చేపట్టనున్న భద్రతా ఏర్పాట్లపై సమగ్ర నివేదికను రూపొందించి త్వరలో జరగనున్న టాస్క్‌ఫోర్స్ కమిటీకి నివేదించాలని ఆదేశించారు. ఆయన వెంట హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఇతర పోలీసు, ట్రాఫిక్ విభాగాల ఉన్నతాధికారులు, ఎల్అండ్టీ అధికారులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని
జపాన్: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం జపాన్‌లో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వసతులు, వనరులను చంద్రబాబు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. రాజధాని నిర్మాణానికి సేవలందించాలని చంద్రబాబు ఈ సందర్భంగా మీడియాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో వివరించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన విశదీకరించారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు అందిస్తామని బాబు చెప్పారు. -
'అంతర్జాతీయ ప్రమాణాలతో రహదార్ల నిర్మాణం'
హైదరాబాద్: రాష్ట్రంలో రహదార్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలంగాణ డిప్యూటీ సీఎం టి.రాజయ్య స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం రాజయ్య అధ్యక్షతను మంత్రి వర్గ ఉప సంఘం శనివారం హైదరాబాద్‌లో భేటీ అయింది. అనంతరం రాజయ్య మాట్లాడుతూ... వీలైనంత త్వరగా ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అధికారులు కోరామని తెలిపారు. ఈ అంశంపై మళ్లీ 7 వ తేదీ సాయంత్రం మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అవుతుందని చెప్పారు. ఎలాంటి మెటీరియల్ వాడితే రహదారులు ఎక్కువ కాలం మన్నుతాయో అధ్యయం చేసి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేస్తామని టి.రాజయ్య వెల్లడించారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్‌గ్రిడ్
మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ అధికారులతో సమీక్ష ప్రమాణాలను నిక్కచ్చిగా పాటించే సంస్థలకే చోటు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని పంచాయుతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు నాణ్యతాప్రమాణాల విషయం లో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. గ్రావిటీ ఆధారంగా ప్రాజెక్టు ఉండాలని ఇటీవల సీఎం చేసిన సూచనపై అధికారులు చేసిన కసరత్తుపై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు మూడు గంటలపాటు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై కూలంకశంగా చర్చించిన మంత్రి కేటీఆర్, ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులకు తాను కూడా పలు సూచనలు చేశారు. వారంలోగా సర్వేపనులు ప్రారంభించండి.. వారంలోగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రాథమిక సర్వేను చేపట్టాలని, ఇందుకోసం ఏజెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లను ఆహ్వానించాలని వుంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాణాలను నిక్కచ్చిగా పాటించే సంస్థలకే ప్రాజెక్టు పనుల్లో అవకాశం కల్పించాలన్నారు. సర్వేను పర్యవేక్షించేందుకు ‘జీపీఎస్ వ్యవస్థ’ పరికరాలను కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పారు. అంతేకాకుండా.. ప్రాజెక్టు పనులను సీఎం స్వయంగా తన కార్యాలయం నుంచే పర్యవేక్షిం చేలా జియోస్పేషియల్ మ్యాపింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫ్లోరోసిస్ ప్రభావిత నల్లగొండ జిల్లా నుంచే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున, ఆ జిల్లాకు సంబంధించిన డీపీఆర్‌ను వుుందుగా పూర్తి చేయాలని కోరారు. ఇమేజింగ్ సర్వే పూర్తి వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టిన చర్యలపై అధికారులు మంత్రికి వివరిస్తూ.. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా చేపట్టిన నాలుగు లేయర్ల ఇమేజింగ్ సర్వేను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో గుజరాత్ పర్యటన .. ఇప్పటికే వాటర్‌గ్రిడ్‌ను నిర్వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం అధికారులతో కలిసి పర్యటించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. వాటర్‌గ్రిడ్ అంశంతో పాటు ఈ-పంచాయుతీ వ్యవస్థల పనితీరును కూడా పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. వాటర్‌గ్రిడ్ కోసం ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు మదింపు నివేదికను రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రగతిని సమీక్షకు వచ్చేవారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. -
అత్యాధునిక హంగులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
లంగర్‌హౌస్: అంతర్జాతీయ ప్రమాణాలాతో అత్యాధునిక హంగులతో, నగరానికి సరికొత్త అందాలను తెచ్చిపెట్టేలా ఫుట్ ఓవర్, స్కైవాక్‌లను ఏర్పాటుచేస్తున్నామని నగర కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, పాదచారుల సౌకర్యార్ధం వీటిని నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలో 70 ప్రాంతాల్లో 100 బ్రిడ్జిలను, స్కైవాక్‌లను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నామన్నారు. పశ్చిమ దిశలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను కలిపే లంగర్‌హౌస్ వద్ద ఉన్న టిప్పుఖాన్ బ్రిడ్జి, ఆర్టిలరీ సెంటర్ ప్రాంతాల్లో ఎంపీ అసదుద్దీన్, మేయర్ మాజీద్హుస్సేన్, కమిషనర్ తదితరులు మిలిటరీ అధికారులతో కలిసి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌లో ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయన్నారు. పాదచారుల సౌకర్యార్థం నగరంలోని ప్రధాన కూడళ్లలో 100 కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నామన్నారు. నాలుగు లైన్ల రోడ్లు, రద్దీ ఎక్కువ ఉన్న దాదాపు 70 ప్రాంతాల ను ఇప్పటికే గుర్తించామన్నారు పూర్తి స్తాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నామని ఆయన తెలిపా రు. వికలాంగులు, వృద్ధులు, చిన్నారుల కోసం ప్రతి ఫుట్ ఓవర్ బ్రిడ్డికి రెండు వైపులా లిఫ్ట్‌లు కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. గతంలో చేసినట్టు కాకుం డా సులువుగా ఉండేందుకు బ్రిడ్జిల నిర్మాణం, 3 సంవత్సరాల వరకు పర్యవేక్షణ ఒకరికి, బ్రిడ్జ్లపై వ్యాపార తదితర ప్రకటనల భాద్యతలు మరొకరికి, రోజు వారి శుభ్రత, పర్యవేక్షణ భాద్యతలు మరొకరికి అప్పజెప్పనున్నామన్నారు. ట్రాఫిక్ పోలీసులు, ప్రజలు సహకరించి ప్రమాదాలను అరికట్టాలన్నారు. అనంతరం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నగర మేయర్, అధికారుల బృందం ఆర్టిలరీ సెంటర్‌ను సందర్శించారు. మిలటరీ కమాండెంట్ అధికారి కిరణ్‌కుమార్‌తో కలిసి చర్చలు జరిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేస్తేనే సామాన్య ప్రజలు కూడా రోడ్డు దాటడానికి అనుకూలంగా ఉంటదని ఎంపీ సూచించడంతో మిలటరీ అధికారులు అందుకు అంగీకరించారు. త్వరలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నమూనా రూపకల్పన చేసి మిలటరీ అధికారులకు అందిస్తామని, వారి అంగీకరన అనంతరం నిర్మాణ పనులు చేపడతామని ఎంపీ అసదుద్దీన్ అన్నారు. మెహదీపట్నంలో నగరంలోనే సరికొత్త నమూనా బ్రిడ్జి.... మెహదీపట్నం వద్ద పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే బ్రిడ్జికి మరింత వన్నెను తీసుకువస్తూ నగరంలోనే సరికొత్త రూపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మాంచనున్నామని ఎంపీ, కమిషనర్ తెలిపారు. కింద వాహనాలకు కాని, అటు ఫ్లై ఓవర్‌కు కాని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా పాదచారులకు సరికొత్త అనుభూతిని కల్పించేలా ప్రత్యేక నిపుణలతో ఈ ఫుట్ ఓవర్‌బ్రిడ్జి రూపకల్పన పనులను ప్రారంభించామన్నారు. ఈ పర్యటనలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్, అధికారులు రవికుమార్, సత్యకుమార్ తదితరులు ఉన్నారు. -
పోలీసు ఖ్యాతిని పెంచాలి
మూడు నెలల్లో నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆధునిక ఇంటిగ్రేటెడ్ పోలీసు కమిషనరేట్ శాంతిభద్రతలు సవ్యంగా ఉంటేనే అభివృద్ధి సాక్షి,హైదరాబాద్: శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పోలీసులు సమర్ధవంతంగా పనిచేసి అంతర్జాతీయ ఖ్యాతిని గడించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునిచ్చారు. పోలీసు శాఖ కోసం కొత్తగా ఖరీదు చేసిన ఇన్నోవా, ద్విచక్ర వాహనాలకు గురువారం ట్యాంక్‌బండ్‌పై ఆయన పచ్చజెండాను ఊపి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసుశాఖను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చే దిశగా పలు చర్యలను చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చి శాంతిభద్రతలను కాపాడటంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు నెలల్లో హైదరాబాద్‌లోని ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడానికి రిలయన్స్ ముందుకు వచ్చిందని కేసీఆర్ వివరించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా పోలీసు శాఖ ఉమ్మడిగా పరిస్థితిని చక్కదిద్దాలని తమ పరిధి కాదంటూ నిర్లక్ష్యం చేయడం తగదని ఆయన సున్నితంగా హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బంజారాహిల్స్‌లో పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను నిర్మించబోతున్నామని కేసిఆర్ వెల్లడించారు. అమెరికాలోని మ్యాన్హటన్లో మాదిరిగా కాలనీలు, అపార్ట్మెంట్లలో సైతం ఫ్లాట్ల యాజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో నేరాలు గణనీయంగా తగ్గుతాయని , ఈ దిశగా అడ్మినిస్ట్రేటీవ్ స్టాప్ కాలేజీ కార్యాచరణను రూపొందించనుందని ఆయన అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల లాంటి ఘటనలు ఒక్కటి కూడా ఇక ముందు చోటు చేసుకోరాదని ఆ దిశగా పోలీసు యంత్రాంగాన్ని పటిష్టపరచాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీసుశాఖకు 1810 ఇన్నోవాలు, 2600 ద్విచక్ర వాహనాలను అన్ని సౌకర్యాలతో ఖరీదు చేస్తున్నామని , ఇందులో తొలి విడతగా వచ్చిన వాహనాలను హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు మహేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సత్యనారాయణ, మేయర్ మాజిద్ హుస్సేన్, హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించిన కొద్దిసేపటికే ప్రమాదం పోలీసు వాహనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన కొద్దిసేపటికే ట్యాంక్‌బండ్‌పై ఓ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఇన్నోవా ముందు భాగం పూర్తిగా ధ్వంసమయింది. సీఎం వాహనాల ట్రయల్ రన్ ప్రారంభించగా ఒకదాని వెంట ఒకటి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ విషయంపై గాంధీనగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా ట్యాంక్‌బండ్‌పై ఎలాంటి ప్రమాదం జరుగలేదని పేర్కొన్నారు. -
ఇదీ రీతి...ఇంకేం ఖ్యాతి?
జీహెచ్ఎంసీలో భారీగా ఇంజినీర్ల బదిలీలు ఇప్పటికే సిబ్బంది కొరత కొత్తవారి ఊసే లేదు ఉన్న వారికే అదనపు బాధ్యతలు కమిషనర్ నచ్చజెప్పినా వినని సర్కార్ సర్కార్ ఒక్క కలం పోటుతో 24 మంది జీహెచ్ఎంసీ ఇంజనీర్లను బదిలీ చేసింది. రూ.400 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన తరుణంలో ఈ చర్య చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఇంజనీర్ల కొరత ఉన్న సమయంలో అదనంగా నియమించాల్సింది పోయి ఉన్న వారిని బదిలీ చేసింది. అదీగాక వారి స్థానంలో కొత్త వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగించడంపై కమిషనర్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వాదనను ఆలకించని సర్కార్ బదిలీలకే మొగ్గుచూపింది. సాక్షి, సిటీబ్యూరో: విశ్వ ఖ్యాతి గడించేలా హైదరాబాద్ మహా నగరాన్ని తీర్చిదిద్దుతామని ఓ వైపు సర్కార్ చెబుతున్నా.. చర్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. హైదరాబాద్ ‘బ్రాండ్ ఇమేజ్’ను సొంతం చేసుకోవాలంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అద్దాల్లాంటి రహదారులను నిర్మించాలి. మరోవైపు బోనాలు, రంజాన్ పండుగలు వైభవంగా జరుపుకొనేలా ఏర్పాట్లు చేయాలి. అదీగాక వర్షాకాలం కావడంతో రహదారులకు మరమ్మతులు, ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తగిన సంఖ్యలో అధికారులను నియమించాల్సింది పోయి ఉన్న అధికారులను బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇంజినీర్ల బదిలీ వ్యవహారంపై కమిషనర్ సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మహానగరంలో దాదాపు రూ.400 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీలో తగిన సంఖ్యలో ఇంజినీర్లు లేరు. ఇంజినీర్ల పోస్టులు దాదాపు వంద వరకు భర్తీ కాకుండా ఉన్నాయి. చేయాల్సిన పనులెన్నో ఉన్నా తగినంతమంది ఇంజినీర్లు లేక ఎక్కడి పనులక్కడే మూలుగుతున్నాయి. ఈ దశలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 24 మంది ఇంజినీర్లను ప్రభుత్వం ఒక్క కలంపోటుతో బదిలీ చేసింది. వీరిలో ఆరుగురు సూపరింటెండింగ్ ఇంజినీర్లు, 18 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్నారు. వీరి స్థానే ఇతర ప్రాంతాల వారిని ఇక్కడకు బదిలీ చేసిందా? అంటే అదీ లేదు. దీంతో ఉన్న కొద్దిమందిపైనే మరింత భారం పడనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో డీఈఈలుగా ఉన్న వారికి ఈఈలుగా, ఈఈలుగా ఉన్నవారికి ఎస్ఈలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అంటే.. బదిలీ అయిన 24 మంది ఇంజినీర్ల బాధ్యతల్ని జీహెచ్ఎంసీలోని వారే అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన డీఈఈలు తగినంత మంది లేరు. ఇప్పుడు డీఈఈలకు ఈఈలుగా బాధ్యతలు అప్పగించడంతో వారు రెండు కేట గిరీలకు చెందిన పనులను ఏకకాలంలో చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈఈలు ఎస్ఈలుగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి ఉండటంతో వారిదీ అదే పరిస్థితి. ఇంజినీర్ ఇన్ చీఫ్‌కే చీఫ్ ఇంజినీర్ బాధ్యతల్ని సైతం అదనంగా అప్పగించారు. ఈ బదిలీల వల్ల అసలే అంతంతమాత్రంగా సాగుతోన్న ఇంజినీరింగ్ పనులు మరింత కుంటుపడనున్నాయి. అంతర్జాతీయ సదస్సు కోసం.. మరోవైపు మెట్రోపొలిస్ సదస్సు కోసం వచ్చే విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేలా రహదారులను తీర్చిదిద్దడమేకాక, పర్యాటక ప్రదేశాలనూ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు భావించారు. అందులో భాగంగా పలు పనులు చేపట్టాల్సి ఉంది. ఇంజినీర్లందరినీ ఒకేసారి బదిలీ చేస్తే ఈ పనులకు ఆటంకం కలుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలుస్తోంది. బదిలీ అయిన వారి స్థానంలో వేరేవారిని వెంటనే నియమించకపోతే నగరానికి తిప్పలు తప్పవనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పలు పనులు సగంలో ఉండటాన్ని, కొన్ని పనులు అసలే ప్రారంభం కాకపోవడాన్ని వివరిస్తూ ఇంజినీర్ల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ నేతృత్వంలో టీడీపీ పక్ష నాయకుడు శ్రీనివాసరెడ్డి, పలువురు కార్పొరేటర్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు. ఎక్కువ కష్టపడతాం.. పనులు పూర్తిచేస్తాం.. ఇదిలావుంటే అదనపు బాధ్యతలతో పదోన్నతులు రావడంతో పలువురు ఇంజినీర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆంధ్రాప్రాంతానికి చెందిన ఇంజినీర్లు జీహెచ్ఎంసీలో తిష్టవేయడం వల్లే సుదీర్ఘకాలంగా తమకు పదోన్నతులు రాకుండా పోయాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం తమకు లభించిన అవకాశంతో మరింత కష్టపడి సత్తా చాటుతామని వారు పేర్కొంటున్నారు. తెలంగాణ ఇంజినీర్ల సంఘం నాయకులు మోహన్‌సింగ్, కె.కిషన్‌లు మాట్లాడుతూ, నయాపైసా, నిమిషం సమయం కూడా ఖర్చు కాకుండా జీహెచ్ఎంసీలో బదిలీలు.. పదోన్నతులు జరిగిన అపూర్వ సందర్భమిదని వారు వ్యాఖ్యానించడం గమనార్హం.