అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్‌గ్రిడ్
మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ
అధికారులతో సమీక్ష ప్రమాణాలను నిక్కచ్చిగా పాటించే సంస్థలకే చోటు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని పంచాయుతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు నాణ్యతాప్రమాణాల విషయం లో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. గ్రావిటీ ఆధారంగా ప్రాజెక్టు ఉండాలని ఇటీవల సీఎం చేసిన సూచనపై అధికారులు చేసిన కసరత్తుపై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు మూడు గంటలపాటు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై కూలంకశంగా చర్చించిన మంత్రి కేటీఆర్, ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులకు తాను కూడా పలు సూచనలు చేశారు.
వారంలోగా సర్వేపనులు ప్రారంభించండి..
వారంలోగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రాథమిక సర్వేను చేపట్టాలని, ఇందుకోసం ఏజెన్సీల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లను ఆహ్వానించాలని వుంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాణాలను నిక్కచ్చిగా పాటించే సంస్థలకే ప్రాజెక్టు పనుల్లో అవకాశం కల్పించాలన్నారు. సర్వేను పర్యవేక్షించేందుకు ‘జీపీఎస్ వ్యవస్థ’ పరికరాలను కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పారు. అంతేకాకుండా.. ప్రాజెక్టు పనులను సీఎం స్వయంగా తన కార్యాలయం నుంచే పర్యవేక్షిం చేలా జియోస్పేషియల్ మ్యాపింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫ్లోరోసిస్ ప్రభావిత నల్లగొండ జిల్లా నుంచే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున, ఆ జిల్లాకు సంబంధించిన డీపీఆర్‌ను వుుందుగా పూర్తి చేయాలని కోరారు.
ఇమేజింగ్ సర్వే పూర్తి
వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టిన చర్యలపై అధికారులు మంత్రికి వివరిస్తూ.. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా చేపట్టిన నాలుగు లేయర్ల ఇమేజింగ్ సర్వేను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో గుజరాత్ పర్యటన ..
ఇప్పటికే వాటర్‌గ్రిడ్‌ను నిర్వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం అధికారులతో కలిసి పర్యటించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. వాటర్‌గ్రిడ్ అంశంతో పాటు ఈ-పంచాయుతీ వ్యవస్థల పనితీరును కూడా పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. వాటర్‌గ్రిడ్ కోసం ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు మదింపు నివేదికను రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రగతిని సమీక్షకు వచ్చేవారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు.