Water Grid project
-
మెగా వాటర్ గ్రిడ్‌కు లైన్ క్లియర్.. డెల్టా వాసుల కల నెరవేరుస్తున్న ప్రభుత్వం
సాక్షి అమలాపురం: గోదావరి చెంతనే ఉన్నా.. గుక్కెడు స్వచ్ఛమైన తాగునీరు అందని వారెందరో. శివారు ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు.. గోదావరి మధ్య ఉన్న లంకవాసులకు సైతం స్వచ్ఛమైన తాగునీరందదు. గుక్కెడు నీటి కోసం అలమటించేవారెందరో.. ఒకవైపు గోదావరి కాలువల్లో రెట్టింపవుతున్న కాలుష్యం.. మరోవైపు వేసవిలో శివారుకు తాగునీరు అందని దుస్థితి.. వీటన్నింటికీ ముగింపు పలుకుతూ ఇప్పటికే ‘జల్‌జీవన్ మిషన్’లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇంటింటా కుళాయిల ఏర్పాటు పనులు వేగంగా చేస్తోంది. దీంతోపాటు ‘డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఇన్ కోస్టల్ ఏరియా’ అనే బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. జల్‌జీవన్ మిషన్‌లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులతో చేపట్టనున్న ఈ మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. రూ.1,650 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని 11 నియోజకవర్గాలు.. 32 మండలాల్లోని 451 గ్రామాలకు తాగునీరందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సుమారు 25 లక్షల మందికి నేరుగా గోదావరి నుంచి తాగునీరు అందించనుంది. ఈ నెలాఖరుకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకోనుంది. స్థల సేకరణ పూర్తయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రెండున్నరేళ్లలో దీని నిర్మాణం పూర్తి కానుంది. రెండు డెల్టాల పరిధిలో నిర్మాణం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో దీని నిర్మాణం జరుగనుంది. ఈ ప్రాజెక్టు వల్ల కోనసీమ జిల్లాకు అధికంగా మేలు జరగనుంది. జిల్లా పరిధిలోని మొత్తం 22 మండలాలకూ బ్యారేజీ నుంచి నేరుగా తాగునీరందనుంది. ఇక తూర్పు డెల్టా పరిధిలో కాకినాడ జిల్లాలో సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు మండలాలకు, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్, కడియం, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాలకు లబ్ధి చేకూరనుంది. ఐదుచోట్ల ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ వాటర్ గ్రిడ్‌లో భాగంగా ఐదు ప్రాంతాల్లో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల (ఆర్ఎస్ఎఫ్) నిర్మాణాలు చేయనున్నారు. గోదావరి నది నుంచి నేరుగా వచ్చే నీటిని ఇక్కడ శుద్ధి చేస్తారు. ఒక్కొక్క దానినీ 30 నుంచి 50 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్డీ) సామర్థ్యంతో నిర్మిస్తారు. ఇక్కడ నీటిని అధునాతన పద్ధతిలో ఫిల్టర్ చేసి, అక్కడి నుంచి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఓహెచ్‌బీఆర్)లకు పంపిస్తారు. ఉమ్మడి జిల్లాలో వీటిని పది చోట్ల నిర్మిస్తారు. వీటిలో అంబాజీపేట మండలం ముక్కామల, పి.గన్నవరం మండలం బెల్లంపూడి, ఆలమూరు మండలం మడికి, మండపేట మండలం తాపేశ్వరం, ఎల్ఎన్ పురం వద్ద సంప్లతో కూడిన ఓహెచ్బీఆర్ల నిర్మించనున్నారు. ఈ ఓహెచ్బీఆర్ల ఎత్తు 200 మీటర్లు ఉంటుంది. వీటికి అనుబంధంగా మూడు జిల్లాల పరిధిలో మరో మూడు ఓహెచ్‌బీఆర్‌లు నిర్మించనున్నారు. వంద అడుగుల ఎత్తున లక్ష లీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తారు. నాలుగు ఇన్లెట్లు డెల్టా వాసులకు నేరుగా తాగునీరు తరలించేందుకు బ్యారేజీ ప్రాంతంలో నాలుగు ఇన్లెట్లు నిర్మించనున్నారు. మధ్య డెల్టాలోని 16 మండలాలకు (కోనసీమ జిల్లా) బొబ్బర్లంక వద్ద ఇన్లెట్ ఏర్పాటు చేయనున్నారు. తూర్పు డెల్టాలోని ధవళేశ్వరం వద్ద మూడు ఇన్లెట్లు నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, రామచంద్రపురం, కె.గంగవరం (కోనసీమ జిల్లా), సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు (కాకినాడ జిల్లా), రాజమహేంద్రవరం రూరల్, కడియం (తూర్పు గోదావరి జిల్లా)లకు నీరు అందుతుంది. ఇప్పుడున్న పథకాలకు అనుసంధానం తూర్పు, మధ్య డెల్టాల్లోని వాటర్ గ్రిడ్ పరిధిలో ఇప్పటికే పలు పథకాలున్నాయి. 31 సీడబ్ల్యూసీ, 390 పీడబ్ల్యూసీ స్కీమ్‌ల ద్వారా తాగునీరు అందుతోంది. వీటిని వాటర్ గ్రిడ్ పరిధిలోకి తీసుకురానున్నారు. కొత్తగా మరికొన్ని పథకాలు రానున్నాయి. వీటితో పాటు జల్‌జీవన్ మిషన్ ద్వారా నిర్మిస్తున్న పైప్లైన్ల ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందించనున్నారు. రెండున్నరేళ్లలో పూర్తి మంచినీటి పథకాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని అనుమతులూ వచ్చిన వెంటనే పనులు మొదలు కానున్నాయి. రెండు డెల్టాల్లోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 20 ఏళ్ల తరువాత అవసరాలు కూడా తీర్చేలే పథకాన్ని రూపొందించాం. – సీహెచ్ఎన్వీ కృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి, అమలాపురం -
ప్రతిష్టాత్మక పనులకు నిధుల కొరత రాకూడదు
రాయలసీమ కరువు నివారణ పనులు, స్టేట్ వాటర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ (పోలవరం నుంచి వరద జలాల తరలింపు), ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ – తాగునీటి వసతి కల్పన, కృష్ణా – కొల్లేరు ప్రాంతం ఉప్పు నీటిమయం కాకుండా చూసే పనులను ప్రాధాన్యతగా చేపట్టాలి. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నిధుల సమీకరణపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను పెట్టుకుని, కచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకు వేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పనులకు సంబంధించి నిధుల సమీకరణ విషయమై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి మిగిలిన నిధులివ్వాలి ► విద్యా రంగంలో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, ఇకపై సమీకరించాల్సిన నిధుల గురించి సీఎం ఆరా తీశారు. ► మొదటి విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందు కోసం దాదాపు రూ.3,600 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు రూ.920 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. ► మిగిలిన నిధులు విడుదల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 కల్లా మొదటి విడత నాడు–నేడు కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు. – పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్.. డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని అ«ధికారులు సీఎంకు తెలిపారు. ఇందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. వైద్య, ఆరోగ్య రంగంలో ఖర్చు అంచనా ఇలా.. ► 16 కొత్త మెడికల్ కాలేజీలు, ఒక సూపర్ స్పెషాల్టీ, ఒక క్యాన్సర్ ఆస్పత్రి, ఒక మానసిక చికిత్సాసుపత్రి కోసం రూ.6,657 కోట్లు. ► ప్రస్తుతం ఉన్న 11 ఆస్పత్రులు, 6 అనుబంధ సంస్థలు, 7 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం మరో రూ.6,099 కోట్లు. ► ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.1,236 కోట్లు. ► పీహెచ్‌సీల్లో కొత్త వాటి నిర్మాణం, ఉన్న వాటి పునరుద్ధరణ కోసం రూ.671 కోట్లు. ► విలేజ్ క్లినిక్స్‌లో 11,197 కేంద్రాల పునరుద్ధరణ, కొత్త వాటి నిర్మాణం కోసం రూ.1,745 కోట్లు. ► ఇప్పటికే నిధులు సమకూరిన వాటి పనులు వేగవంతం చేయాలని, మిగతా వాటికి నిధులు అనుసంధానం చేసుకుని ప్రణాళికతో ముందుకు సాగాలని సీఎం అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలోనూ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ► రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీటిని అందించే ప్రయత్నాల్లో భాగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. తొలిదశలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరులోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, కడప జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం రూ.19,088 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీనికి నిధుల అనుసంధానం గురించి సీఎంకు వివరించారు. నిధుల సమీకరణ టై అప్ జరిగిందని తెలిపారు. ► వీటితోపాటు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 7 నియోజకవర్గాలతో పాటు, డోన్ నియోజకవర్గంలో కూడా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రకాశం జిల్లాలోని మిగిలిన పశ్చిమ ప్రాంతంలో, అనంతపురం జిల్లాలోనూ వాటర్ గ్రిడ్ పనులు చేపట్టాలన్నారు. వీటికి డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ► హైబ్రీడ్ యాన్యుటీ (హెచ్ఏఎం) విధానంలో చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులకు అక్టోబర్‌లో టెండర్లు ఖరారు చేస్తామని, ఆ వెంటనే వర్క్ ఆర్డర్లు ఇస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ► ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక, విద్య, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, జల వనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘సీమ’ కరువు నివారణ పనులకు త్వరలో టెండర్లు ► రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న, చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.98 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. వీటిలో రూ.72 వేల కోట్లు కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయనున్నారు. ► రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ఉద్దేశించిన పనులకు ఖర్చు చేసే నిధుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలో దీనికి సంబంధించి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ► ఎట్టి పరిస్థితుల్లో అక్టోబరు 1 నుంచి రాయలసీమ కరువు నివారణ పనులు ప్రారంభం కావాలని, టెండర్లు వీలైనంత త్వరగా ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. -
వాటర్ గ్రిడ్‌కు అధిక నిధులివ్వండి
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటిలో మంచి నీటి కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి 365 రోజుల పాటు నీటి సరఫరా చేయడానికి ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ పథకం అమలుకు కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలసి వినతిపత్రం అందజేసేందుకు సోమవారం రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్ష నాయకుడు మిథున్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, వాటర్ గ్రిడ్ ఇన్చార్జి ఎండీ గిరిజా శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఈఎన్సీ కృష్ణారెడ్డిలు సోమవారం కేంద్రమంత్రిని కలుస్తారని అధికారవర్గాలు తెలిపాయి. 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయి ఏర్పాటు లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే కొత్తగా ‘జల జీవన్ మిషన్’ పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అవసరమయ్యే నిధులను కేంద్రం– రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమకూర్చుకోవాలన్నది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్రం ప్రారంభించిన జలజీవన్ మిషన్ కార్యక్రమం లాంటి లక్ష్యాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందే వాటర్ గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టిన అంశాన్ని అధికారుల బృందం కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. అందుకనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాటర్ గ్రిడ్ పథకం అమలుకు జలజీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్రం నుంచి అధికంగా నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కోరనుంది. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా ప్రణాళికలు.. వాటర్ గ్రిడ్ పథకం అమలుకు మొత్తం రూ. 49,938 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. ప్రతి వేసవిలోనూ నీటి సరఫరాకు ఆటంకం లేకుండా ఉండేందుకు సాగునీటి రిజర్వాయర్ల నుంచి నేరుగా పైపుల ద్వారా మంచినీటి పథకాలకు నీటి సరఫరా జరిగేలా ఈ వాటర్ గ్రిడ్‌ను డిజైన్ చేశారు. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా పెరుగుతున్న అవసరాలకు తగ్గుట్టు గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికీ రోజుకి వంద లీటర్ల చొప్పున, మున్సిపాలిటీలో 135 లీటర్ల చొప్పున, నగరాల్లో 150 లీటర్ల చొప్పున సరఫరా చేయడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి సరఫరాకు వీలుగా మొత్తం వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి 2020–21 సంవత్సరంలో రూ. 8,040 కోట్లు, 2021–22లో రూ. 11,166 కోట్లు, 2022–23లో రూ. 13,409 కోట్లు, 2023–24లో రూ. 17,323 కోట్ల చొప్పున ఈ పథకానికి ఖర్చు చేయనున్నారు. -
ఇక ఇంటింటికీ గో‘దారి’
గోదారమ్మ... జిల్లాలోని ప్రతి ఇంటి తలుపూ తట్టనుంది. గోదారి ఇన్నాళ్లూ పుడమి తల్లి గర్భాన్ని తడిపి సస్యశ్యామలం చేయడమే కాకుండా జనం దాహార్తిని తీరుస్తూ వచ్చింది. ఇప్పుడు మరింత ముందుకు సాగి వైఎస్సార్ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో ఇంటింటికీ కుళాయి నీళ్లతో గొంతు తడపనుంది. స్వచ్ఛమైన నీళ్లు తాగాలంటే టిన్ల రూపంలో రూ.10 నుంచి రూ.20 వరకూ కొనుగోలు చేయాల్సిందే. ఆ కష్టాలకు చెక్ పెడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాట నీటి మూట కాదంటూ అధికారం చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరూపించుకున్నారు జగన్. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కాలువల్లో కలుషితమైన నీటిని వేడి చేసి వడగట్టి తాగాల్సిన అవసరం ఇక ఎదురుకాదు. ఆక్వా చెరువులతో తాగునీరు కాలుష్యమైపోయి గుక్కెడు శుద్ధి చేసిన నీరు దొరకడమే గగనమైపోతున్న పరిస్థితులకు ఇక చెల్లు చీటీ. ఎందుకంటే ఇక ఇంటింటికీ గోదావరి జలాలు రానున్నాయి. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి దారిపొడవునా జనం తాగు నీటి ఇబ్బందులను తీసుకువెళ్లారు. ఒక మధ్య తరగతి కుటుంబం నెలకు తాగునీటి కోసం రూ.1000 నుంచి రూ.1200 ఖర్చుపెడుతున్న పరిస్థితిని తెలుసుకుని నాడు ఆయన చలించిపోయారు. ఆ సమయంలోనే ప్రతి ఇంటికీ నేరుగా స్వచ్ఛమైన గోదావరి జలాలు అందిస్తానని మాట ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడు నెలలు తిరగకుండానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జిల్లా చరిత్రలోనే తొలిసారి ఇంటింటికీ గోదావరి జలాలు అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో రూపొందించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పరిశీలించిన ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు ఆ డిజైన్‌నే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించడం విశేషం. జిల్లాలో ఈ ప్రాజెక్టు కోసం రూ.4000 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా రూ.3,960 కోట్లకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ప్రస్తుతం జిల్లాలో ఉన్న 52 (సీపీడబ్ల్యూ స్కీమ్స్) సమగ్ర రక్షిత మంచినీటి పథకం) ద్వారా మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోంది. ఈ పథకాల ద్వారా జిల్లాలోని 45 శాతం మందికి మాత్రమే మంచి నీటిని సరఫరా చేయగలుగుతున్నారు. తలసరి 40 లీటర్లు నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. అంటే ఒక గ్రామంలో 75 కుటుంబాలుంటే ఒక పబ్లిక్ ట్యాప్ (వీధి కుళాయి) ఉంటుంది. ఆ కుటుంబాలన్నీ ఆ ఒక్క ట్యాప్ నుంచి తెచ్చుకోవాల్సిందే. అది కూడా వారానికి నాలుగైదు రోజులు మాత్రమే సరఫరా. జిల్లాలో ఏ మంచినీటి పథకమైనా పంట కాలువలే మూలాధారం. ప్రస్తుతం చెత్తా చెదారంతో, ఆక్వా మురుగు నీరు, వ్యర్థ జలాలతో పంట కాలువలలో నీరు కాలుష్య కారకంగా మారిపోయింది. చివరకు చూస్తూ, చూస్తూ ఆ నీటిని తాగలేక మార్కెట్లో మంచినీటి టిన్నులను కొనుక్కునే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు సహా అమలాపురం, రామచంద్రపురం, తుని తదితర పట్టణాల నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యం కుళాయి నీటిని తీసుకువెళుతుంటారు. ఈ పరిస్థితి మార్చేస్తామంటూ గత చంద్రబాబు ప్రభుత్వం ఊరూవాడా మంచినీటి పథకాలకు శంకుస్థాపనలతో హడావుడి చేసేసింది. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లని నమ్మించి మోసం చేసింది. జగన్ సర్కారు చిత్తశుద్ధితో... ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ సర్కారు ఓ అడుగు ముందుకు వేసి జిల్లా రక్షిత మంచినీటి పథకాల రూపురేఖలనే మార్చేసే వాటర్ గ్రిడ్‌కు ప్రణాళిక రూపొందించి. గత సెప్టెంబరులో ఆర్డబ్ల్యూ ఎస్ ఉభయ గోదావరి జిల్లాల అధికారులు రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో పవర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.గాయత్రీ దేవి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ గ్రిడ్‌నే రోల్‌మోడల్‌గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అమలు చేస్తున్నారు. తొలి విడతలో ఎంపికైన జిల్లాల్లో మన జిల్లా ఉండటంతో ఇక్కడి ప్రజలకు భారీ ప్రయోజనం కలగనుంది. ఇక ముందు తలసరి 40 లీటర్లకు బదులు 100 లీటర్లు నీటిని సరఫరా చేయనున్నారు. ఒక గ్రామంలో 2,500 మంది ఉంటే అందులో 45 శాతం అంటే వెయ్యి మందికి మాత్రమే ప్రస్తుతం పథకాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇక ముందు 2,500 మందికి పూర్తిగా నీటిని అందించనున్నారు. అదీ కూడా గోదావరి నుంచి నేరుగానే సరఫరా చేస్తారు. ‘రాష్ట్రానికే రోల్‌మోడల్’ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు రాష్ట్రానికి రోల్ మోడల్‌గా నిలవడం చాలా అనందంగా ఉంది. మన జిల్లా అధికారులు రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అమలుచేసేలా ఉపయోగపడింది. జిల్లా ప్రజలకు ఇది చాలా ప్రయోజనం కలుగుతుంది. రూ.4000 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే రూ.3,960 కోట్లకు ఆమోదం తెలియజేయడం జిల్లా ప్రజలకు వరమే. ప్రతి ఆవాసానికి నేరుగా గోదావరి జలాలు అందించే ఈ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం 40 లీటర్లు మాత్రమే అందివ్వగలుగుతున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 100 లీటర్ల్ల నీటిని సరఫరా చేయగలుగుతాం. – డి.మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తలసరి 100 లీటర్లు శుద్ధిచేసిన నీరు రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు చేశాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా జిల్లాలో ప్రతి ఆవాసానికి మంచినీటి సరఫరాకు మార్గం సుగమం అవుతుంది. జిల్లాలో 2051 వరకూ పెరిగే జనాభా అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టును డిజైన్ చేశాం. పంట కాలువల ద్వారా నీటిని తీసుకుని శుద్ధిచేసి స్టోరేజీ ట్యాంకుల ద్వారా పబ్లిక్ కుళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక ముందు నేరుగా గోదావరి నీటిని తీసుకునే పాయింట్లోనే శుద్ధి చేసి నేరుగా స్కీమ్‌ల నుంచి పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తాం. ప్రతి ఇంటికీ కుళాయి నీటిని సరఫరా చేయాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. – టి.గాయత్రీదేవి,ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
రెండేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి..
సాక్షి, నరసాపురం: జిల్లాలో గోదావరి చెంత నుంచి శుద్ధి చేసిన జలాలను పైపులైన్ ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళిక ఆమోదం పొందిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 3,670 కోట్లతో ఈ పథకం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందని చెప్పారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా ప్రజల కల నిజం కాబోతుందని.. రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతికి ఇచ్చిన కానుక అని పేర్కొన్నారు. వాటర్ సప్లైకి ప్రతి ఇంటికి మీటర్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. -
కుళాయి ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేసేలా రూపొందించిన సరికొత్త వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు..రానున్న 30 ఏళ్ల కాలంలో అంటే 2051 సంవత్సరం నాటికి రాష్ట్రంలో పెరిగే జనాభా, పశు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ డ్రింకింగ్ వాటర్ స్లప్లయి కార్పొరేషన్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తుంది. ఏడాది మొత్తం సరఫరాకు అవసరమయ్యే నీరు ఏ ఏ సాగునీటి ప్రాజెక్టులలో అందుబాటులో ఉంటుందన్నది అంచనా వేసి.. ఆయా ప్రాజెక్టుల నుంచి వాటికి సమీపంలో ఉండే ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా నీటి తరలించడానికి వీలుగా ప్రాజెక్టు రూపకల్పన ఉంటుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. - ఈ ప్రాజెక్టు ద్వారా రోజూ గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి 105 లీటర్లు, పట్టణ, మున్సిపల్ ప్రాంతంలో135 లీటర్లు, నగరాల్లో ఉండే వారికి 150 లీటర్ల చొప్పన నీటి సరఫరా చేస్తారు. - ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి ఇంటికి మధ్య నీటి సరఫరా సమయంలో 10 శాతానికి మించి నీరు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. - నిర్ణీత ప్రామాణిక ప్రమాణల మేరకు ఉండే నీటినే సరఫరా చేస్తారు. - ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే నిధులను ప్రభుత్వ కేటాయింపులకు తోడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టును ప్లబిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ), హైబ్రీడ్ యానిటీ విధానంలో కాంట్రాక్టుకు అప్పగించేందుకు అనుమతి తెలిపింది. -
రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా మండు వేసవిలో సైతం తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.46,675 కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 2022 నాటికి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స, అనిల్‌కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెరిగే జనాభాను అంచనా వేసి, 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ డిజైన్‌ను అధికారులు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 46,982 నివాసిత ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని 110 పట్టణ, నగర పాలక ప్రాంతాలకు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని, మొదటి దశలో రూ.37,475 కోట్లు, రెండో దశలో రూ.9,200 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు అమలుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి రూ.2,500 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. భూగర్భ జలాల వినియోగం నిలిపివేత! వాటర్ గ్రిడ్ పథకంలో.. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి కుళాయిల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు. తాగునీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితి ఇకలేదని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. గిరిజన ప్రాంతాల్లో నదులు, నీటి వనరులు, రిజర్వాయర్ల నుంచి తాగునీరు సరఫరా చేస్తారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల కోసం జలజీవన్ మిషన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా వినియోగించుకోవాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ప్రాంతాల వారీగా ఎంత నీరు అవసరం? జలాశయాలు, నదులు, ఇతర వనరుల్లో ఉన్న నీటి లభ్యత ఎంత? అనేదానిపై సమగ్ర సమాచారం సేకరించాలని మంత్రులు ఆదేశించారు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్
సాక్షి, అమరావతి: 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలన్నదే లక్ష్యమని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో వాటర్‌గ్రిడ్ పథకంపై ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు దశల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ల నుంచి తాగునీటి అవసరాలకు పైప్లైన్ల ద్వారా నీటి సరాఫరా అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో దీర్ఘకాలంగా భూగర్భజలాల వినియోగిస్తున్నారని...ఆ మూడు జిల్లాల్లో సర్ఫేస్ వాటర్ సరఫరాకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్ కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని..ప్రత్యామ్నాయంగా పైప్లైన్ల ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. చిత్తూరు, కడప, నెల్లూరు,ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. గిరిజన గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని.. జిల్లాల్లో జలాశయాలు, నదులు, నీటివనరుల లభ్యతపై సమగ్ర అంచనాలు తయారు చేయాలన్నారు. -
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సీఎం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, రాజమహేంద్రవరం : అందరి నోటా ఒకటే మాట.. గోదావరికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కావాల్సిందే.. మూడున్నరేళ్లలో పూర్తి చేయాల్సిందే.. ప్రతి ఇంటికీ శుద్ధిచేసిన కుళాయి నీటిని సరఫరా జరగాల్సిందే.. సూచనలు, సలహాలకు అనుగుణంగా లోటుపాట్లు సమీక్షించుకొని ముందుకు వెళదాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై జరిగిన సమీక్షలో వ్యక్తమైన ఏకాభిప్రాయం ఇదీ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుగా వాటర్‌గ్రిడ్‌ను గోదావరి జిల్లాల్లోనే ప్రయోగాత్మకంగా అమలు చేయాలనుకోవడం ఈ ప్రాంత ప్రజలపై ఆయనకున్న ప్రత్యేక అభిమానాన్ని స్పష్టం చేస్తోందని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారు. చివరకు టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల, మంతెన కూడా ప్రాజెక్టును స్వాగతించారు. రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులతో జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన సుమారు 5 గంటలపాటు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై సుదీర్ఘ చర్చ జరిగింది. రెండు జిల్లాలకు కలిపి రూ.8,500 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్టుపై మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒకే మాట చెప్పారు. ప్రజాప్రతినిధులకు అవగాహన తొలుత ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు గాయత్రీదేవి, రాఘవయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు డీటైల్డ్ రిపోర్టుపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించాలనే ముఖ్యమంత్రి బృహత్ సంకల్పంలో అంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల నాని సూచించారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం, ఐ.పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో ఇన్‌టేక్ పాయింట్ల ఏర్పాటుపై చర్చ సాగింది. పేపర్ మిల్లు కాలుష్యం, నల్లా చానల్ కాలుష్యం ఉన్న ప్రాంతాల నుంచి గోదావరి ముడినీటిని (రావాటర్)ను సరఫరా చేయడమా లేక, ఎక్కడికక్కడ పంట కాలువల్లో నీటిని ఫిల్టర్‌చేసి సరఫరా చేయడం మంచిదా అనేది అధ్యయనం జరగాలని మంత్రులు పినిపే విశ్వరూప్, కన్నబాబు, శ్రీరంగనాథరాజు సూచించారు. తాను ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉండగా కోనసీమకు మంజూరు చేసిన మంచినీటి ప్రాజెక్టును ఈ సందర్భంగా విశ్వరూప్ వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువుల కాలుష్యంతో మంచినీటి కష్టాలను సోదాహరణంగా మంత్రి బోస్ వివరించి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇందుకు సరైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని గుర్తిం చాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రధాన కాలువల్లో నీటిని తీసుకుంటే ఎలా ఉంటుందనేది అధ్యయనం చేయాలని మంత్రి రంగనాథరాజు సూచించారు. ఇన్‌టేక్ పాయింట్ వద్దనే ఫిల్టరైజేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలా, నాలుగైదు నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్ పరిధి, మండల స్థాయిలో.. వీటిలో ఎక్కడ స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేయాలి, ఫిల్టరైజేషన్ ఎక్కడ చేయాలి తదితర అంశాలపై ఎంపీలు వంగా గీత, అనురాధ, భరత్‌రామ్, రఘురామకృష్ణంరాజు పలు సూచనలు చేశారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుతో ఇప్పుడున్న సీపీడబ్లు్యసీ, ఫిల్టరైజేషన్ ప్లాంట్లు ఎక్కడా వృథాకాకుండా వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని మంత్రి బోస్ నొక్కిచెప్పారు. గోరంట్లకు కన్నబాబు చురకలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును తమ ప్రభుత్వంలోనే రూపొందించామని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి గొప్పలకు పోయే ప్రయత్నాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తిప్పికొట్టారు. చంద్రబాబు ఈ వాటర్ గ్రిడ్‌కు కన్సెల్టెన్సీ పేరు చెప్పి రూ.38 కోట్లు ఖాళీ చేసిన విషయాన్ని గుర్తుచేసి మంత్రి కన్నబాబు గోరంట్లకు చురకలంటించారు. అటువంటి కన్సెల్టెన్సీల ప్రమేయం లేకుండానే ఆర్డబ్ల్యూఎస్ అధికా రుల సమర్థతపై నమ్మకంతో ప్రాజెక్టు నివేదిక రూపొందించే బాధ్యత అప్పగించిన ముఖ్య మంత్రి నిర్ణయాన్ని ప్రజాప్రతినిధులు స్వాగతించారు. ఈ విషయంలో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు మురళీధర్‌రెడ్డి, ముత్యాలరాజు కృషిని మంత్రులు అభినందించారు. ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పాలకొల్లు వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ కవురు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇక శుద్ధ జలధార
అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే... శుద్ధమైన నీటిని సేవించాలి. సంక్షేమ పథకాలతోనే సంతృప్తి చెందని సర్కారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ... వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో ప్రజలకు దశలవారీగా శుభ్రమైన నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రెండో విడతలో జిల్లాలో అమలు చేయనున్న పథకం కోసం జిల్లా అధికారులు రూ. 2600 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. నేడో రేపో దానిని మంత్రులకు అందించి ఆమోదింపజేయనున్నారు. జిల్లాలోని తాగునీటి పథకాల సంఖ్య: 1989 ఇందులో సోలార్ పథకాలు : 160 మల్టీ విలేజ్ స్కీంలు : 34 సాక్షి, బొబ్బిలి: ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రజలకు స్వచ్ఛమైన జలాన్ని ఇంటింటికీ అందించేందుకు నిర్ణయించింది. రెండో దశలో ఈ పథకం మన జిల్లాలో అమలు పరచనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని వర్తింపజేసి తాగునీటి సమస్యను నూరు శాతం పరిష్కరించే చర్యలు తీసుకోనున్నారు. జిల్లాకు పూర్తి స్థాయి వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అమలు పరిచేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలో దీనికి జలధార అనే నామకరణం చేశారు. జిల్లాలోని 34 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మండలాల్లో ఉన్న పథకాలను కూడా వినియోగిస్తారు. ఆయా పథకాలకు శుద్ధి చేసిన జలాన్ని సరఫరా చేసి ఆ నీటిని గ్రామాల్లోని ప్రజలకు ఇంటింటికీ అందజేస్తారు. ఇందుకో సం అన్ని గ్రామాల్లో అదనపు పైప్లైన్లు నిర్మించనున్నారు. రూ.2,600 కోట్లతో మాస్టర్‌ప్లాన్.. జిల్లాలో పథకం అమలుకు సంబంధించి గ్రామీ ణ నీటి సరఫరా విభాగం అధికారులు రూ. 2,600 కోట్లతో ప్రణాళికలు, మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. ఈ నిధులతో వాటర్ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓవర్‌హెడ్‌ట్యాంకులు, తాగునీటి పైప్‌లు నిర్మిస్తారు. తద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందజేస్తారు. విజయవాడ తరహాలో సాగునీటి ప్రాజెక్టుల్లోని మిగులు జలా లు వృధాగా పోకుండా వాటిని తాగునీటి అవసరాలకు వినియోగించే ప్రణాళికే వాటర్‌గ్రిడ్. ఈ జలాలను ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల సహాయంతో శుద్ధ జలాలుగా మారుస్తారు. ఇందుకోసం జిల్లాలోని తోటపల్లి, తాటిపూడి రిజర్వాయర్ల నీటిని తాగునీటి అవసరాలకోసం మారుస్తారు. దీనివల్ల మిగులు జలాలు వృధాగా నదుల్లోకి విడిచిపెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే నిత్యం బోర్లతో భూగర్భ జలాలను తోడేస్తూండటంవల్ల తలెత్తే పర్యావరణ ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చనేది ముఖ్యమంత్రి భావన. మనిషికి వందలీటర్ల నీరు పట్టణాల్లో ఓ వ్యక్తికి రోజుకు135 లీటర్ల నీరు అవసరం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 105 లీటర్ల నీరు అవసరమనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల్లో ఒకటి. వీటి ని అనుసరించి గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా సగటున ఓ వ్యక్తికి వంద లీటర్ల తాగునీరు ఇవ్వాలని జిల్లా అధి కారులు నిర్ణయించారు. తాగునీరు, వాడుక నీరు అన్న తేడా లేకుండా పూర్తి స్థాయిలో ఈ వా టర్‌గ్రిడ్‌ను అమలు పరచాలని నిర్ణయించారు. దీనిపై సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూ టీ సీఎం పాముల పుష్పశ్రీవా ణి, ఇన్‌ఛార్జి మంత్రులకు అధి కారులు అందజేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు వెంటనే ప్రారంభిస్తారు. మనిషికి వంద లీటర్ల నీరు.. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా ప్రతీ ఇంటిలోని ఒక్కో వ్యక్తికీ వందలీటర్ల చొప్పున నీటిని అందిస్తాం. ఇందుకోసం రూ.2,600 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశాం. త్వరలో ప్రభుత్వ పెద్దలకు అందజేస్తాం. – పప్పు రవి, ఎస్ఈ ఇన్చార్జి, గ్రామీణ నీటి సరఫరా విభాగం, విజయనగరం -
‘గ్రిడ్’కు తొలగనున్న ఆటంకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా(వాటర్‌గ్రిడ్) ప్రాజెక్ట్‌కు సంబంధించి రెండు ప్రధాన ఆటంకాలు త్వరలో తొలగిపోనున్నాయి. పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి రైల్వే, అటవీ శాఖల అనుమతుల విషయమై ఆయా శాఖల ఉన్నతాధికారులతో పంచాయతీరాజ్ అధికారులు సోమవారం చర్చలు జరిపారు. వివిధ ప్రాంతాల్లోని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద పైప్‌లైన్ ఏర్పాటుకు అనుమతుల నిమిత్తం పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఎస్ఎన్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్ఎన్ సింగ్ స్పందిస్తూ.. క్రాసింగ్‌ల వద్ద పనులు ఏవిధంగా చేయాలనే అంశంపై రెండు శాఖలతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయిద్దామని ప్రతిపాదించారు. ప్రాజెక్ట్‌కు సహకారాన్ని అందించాల్సిం దిగా రైల్వే ఇంజనీరింగ్ అధికారుల(అచ్యుతరావు, ఎస్కే గుప్తా)కు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక నోడల్ అధికారిని నియమిస్తామని ఎస్పీ సింగ్ చెప్పారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటవీ శాఖ నుంచి హామీ రైల్వే అధికారులతో చర్చల అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి శోభతో అనుమతుల విషయమై చర్చించారు. రాబోయే ఆరు నెలల్లో తాము చేయబోయే పనుల ప్రాధాన్యతను వివరించారు. త్వరితగతిన అనుమతులిప్పించి సహకరించాల్సిందిగా కోరారు. ప్రతిష్టాత్మకమైన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు అటవీ శాఖ నుంచి వీలైనంత త్వరగా అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా శోభ హామీ ఇచ్చారు. -
సిఎం అఖిలేష్‌తో భేటీ కానున్న కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్, అధికారుల బృందం గురువారం ఉదయం లక్నో బయలుదేరి వెళ్లారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో కేటీఆర్ బృందం భేటీ కానున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులపై యూపీ సిఎం ఆసక్తి కనిబరిచారు. దీంతో అఖిలేష్ ఆహ్వానం మేరకు ప్రాజెక్టు వివరాలను కేటీఆర్ బృందం ఆయనకు తెలియజేయనున్నారు. ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. కేటీఆర్‌తో పాటు అధికారులు రేమండ్ పీటర్, సురేందర్ రెడ్డి లక్నో వెళ్లారు. -
ఆదర్శంగా వాటర్‌గ్రిడ్
ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు ఈ ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి తొలివిడతలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు మంచినీరు ప్రాజెక్టుపై సమీక్షలో సీఎం కేసీఆర్ హైదరాబాద్: ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా అందించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలి చేలా చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. దీనికి సంబంధించి 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడిం చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పట్ల దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం సచివాలయంలో ఆ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఇతర ఉన్నతాధికారులతో కలసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాజెక్టు పను లు వేగంగానూ, పారదర్శకంగానూ జరగాలని అధికారులకు సూచించారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా, కరువు పీడిత మహబూబ్‌నగర్ జిల్లాలకు తొలిదశలో సురక్షితమైన తాగునీరు అందించి, ఆపై ప్రాజెక్టు పురోగతి మేరకు ఇతర జిల్లాలకు మంచి నీటిని సరఫరా చేయాలని చెప్పారు. నిధుల కొరత రానివ్వం: హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్), నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) సంస్థలు వాటర్‌గ్రిడ్‌లో రూ.13వేల కోట్లు పెట్టుబడులు పెట్టేం దుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, ఈ సంస్థలు మరో రూ.7వేల కోట్లు ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పా రు. మరికొన్ని సంస్థలు, కేంద్రం నుంచి కూడా కొంతమేరకు నిధులు అందవచ్చన్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన నిధులు సమాకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధికారులు కూడా అదే పట్టుదలతో పనిచేయాలని కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 26 ప్యాకేజీల్లో ఇప్పటికే 17 ప్యాకేజీలకు టెండర్లు పిలిచామని, మరో వారంలో మిగిలిన వాటికి టెండర్లు పిలుస్తామన్నారు. సీఎం స్పందిస్తూ.. దేశంలోని అన్ని ప్రముఖ సంస్థలు టెండర్లలో పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని, మరో 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత విషయంలో రాజీపడవద్దని సీఎం నిర్దేశించారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించాక నిపుణుల కమిటీ పరిశీలనకు పంపి అవసరమైన సూచనలు తీసుకోవాలని సూచించారు. రైల్వేశాఖ నుంచి బ్లాంకెట్ పర్మిషన్లు! ప్రాజెక్టుకు సంబంధించి వివిధ స్థాయుల్లో 311 చోట్ల రైల్వే లైన్లు అడ్డొస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ వెంటనే దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. పైప్లైన్లు రైల్వేలైన్ల క్రాసింగ్ కు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రెండు మూడు రోజుల్లో రైల్వేశాఖతో సమావేశమవ్వాలని అధికారులకు సూచించారు. అన్ని క్రాసింగ్లకు ఒకేసారి బ్లాంకెట్ పర్మిషన్లు పొందాలని అధికారులకు చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్థిక కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మిశ్రా, వాటర్‌గ్రిడ్ ఎండీ శాలిని మిశ్రా, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వాటర్ గ్రిడ్ దారి తప్పిందా?
-
‘తెలంగాణ తాగునీటి పథకం’గా వాటర్‌గ్రిడ్
పేరును ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు ‘తెలంగాణ తాగు నీటి పథకం’ పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్’ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన సురక్షిత తాగునీటి పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రతీ వారం క్షేత్రస్థాయిలో సమీక్షించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును మూడు దశాబ్దాల వరకు మంచినీటిని సరఫరా చేసే వ్యవస్థగా తీర్చిదిద్దాలని, ఇది అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సీఎం సూచించారు. పదిళ్లున్నా నీటి సరఫరా: ప్రధాన గ్రామాలతో పాటు గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, గంగిరెద్దుల, ఎరుకల గుడిసెలు.. ఇలా పదిళ్లున్న ఆవాసాలకు సైతం మంచినీటి ని అందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రతీ ఇంటికి మంచినీటి పైప్‌లైన్ వేసే బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులే చేపట్టాలని, పైపుల నాణ్యత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థల నుంచే వాటిని కొనుగోలు చేయాలని, ఆయా కంపెనీల గత చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పైపులు వేయడంతో పాటు వాటి నిర్వహణను కూడా పదేళ్లపాటు ఆయా కంపెనీలే చూసుకునేలా బాధ్యతలను అప్పగించాలన్నారు. ప్రతీ దశలోనూ హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఇంటేక్వెల్ ్స నిర్మాణ ం, ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపుల విషయంలో సహకారాన్ని నీటి పారుదల శాఖ అధికారులు అందించాలని సీఎం ఆదేశించారు. అటవీ భూములను అభివృద్ధి పనులకు వినియోగించుకునే విషయంలో దేశవ్యాప్తంగా కొత్త విధానం రానుందని, అటవీశాఖ నుంచి లక్ష ఎకరాలు సేకరించి నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైట్ ఆఫ్ వే కోసం ఆర్డినెన్స్: తెలంగాణ తాగునీటి పథకం ద్వారానే పట్టణ ప్రాంతాలకూ సురక్షితమైన తాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. పట్టణాల్లోని వివిధ వాడలకు నీటిని తరలిం చేందుకు పైపులైన్లను ఆయా మున్సిపాల్టీలే నిర్మించుకోవాలన్నారు.సక్రమ నీటి సరఫరాకు పట్టణాల సమీపంలోని గుట్టలను విని యోగించుకోవాలన్నారు. పట్టణాల్లోని కాంటూర్ లెవల్స్‌ను కూడా తీసుకొని పైపులైన్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. పైపులైన్ నిర్మాణానికి ‘రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్’ ఆర్డినెన్స్‌ను తేవాలని సీఎం నిర్ణయించారు. 620 ఇంజనీర్ పోస్టులకు ఓకే వాటర్‌గ్రిడ్‌లో 620 ఇంజనీర్ పోస్టులకు సీఎం పచ్చజెండా ఊపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే వీటి భర్తీ చేపట్టాలని ఆదేశించారు. గోదావరి న ది నుంచి మంచినీటిని తరలించే క్రమంలో 3 చోట్ల రైల్వే ట్రాక్‌ను దాటాల్సి వస్తోందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవతో మాట్లాడగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు రేమండ్ పీటర్, ఎస్కే జోషీ, గోపాల్, జనార్దన్‌రెడ్డి, మిశ్రా, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు సురేందర్‌రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మురళీధర్, మెట్రోవాటర్ వర్క్స్ ఎండీ జగదీశ్వర్ తదితరులున్నారు. -
వాటర్ గ్రిడ్ @ రూ.3,500 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘ప్రతి ఇంటికి నల్లా.. ప్రతి పౌరుడికీ రక్షిత నీరు’ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వాటర్‌గ్రిడ్’ ప్రాజెక్టు డిజైన్‌ను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. గోదావరి, కృష్ణా జలాలను తాగునీరు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్).. పథకం ఆచరణకు రూ.3,500 కోట్లు అవసరమని అంచనా వేసింది. 2011 లెక్కల ప్రకారం వాటర్‌గ్రిడ్ ప్రతిపాదిత ప్రాంత జనాభా 16,78,414. దీనికి అనుగుణంగా గోదావరి, శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి 6.824 టీఎంసీలను వాడుకునేలా ప్రణాళిక తయారు చేసింది. ఇదిలావుండగా మరోవైపు వాటర్‌గ్రిడ్ ఏర్పాటుపై శనివారం వికారాబాద్‌లో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జిల్లా అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. కృష్ణా, గోదావరి జలాలు మారుమూల పల్లెలకు సైతం రక్షిత నీరు అందించాలని భావిస్తున్న ప్రభుత్వం.. వాటర్‌గ్రిడ్ ద్వారా రెండు నదుల జలాలు వినియోగించుకునేలా ప్రాజెక్టును రూపొందించింది. గోదావరి జలాలను సెగ్మెంట్-1, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను సెగ్మెంట్-2 నిర్వచించింది. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి జిల్లా మీదుగా జంట నగరాలకు మంచినీటిని సరఫరా చేయాలని హైదరాబాద్ జలమండలి నిర్ణయించింది. ఈ నీటిలో 4.791 టీఎంసీలను జిల్లా అవసరాలకు కేటాయించారు. తద్వారా 28 మండలాలు, మూడు నగర పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల దాహార్తి తీరనుంది. కర్కల్‌పహాడ్, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, బొంరాస్‌పేట సమీపంలో ఏర్పాటు చేసే పంపింగ్ స్టేషన్ల నుంచి జిల్లాలోని నిర్ధేశిత ప్రాంతాలకు నీటి సరఫరా జరుగనుంది. ఇక సెగ్మెంట్-1లో ప్రతిపాదించిన గోదారి జలాలు కుత్బుల్లాపూర్, మేడ్చ ల్ నియోజకవర్గాలకు కేటాయించారు. ఈ నీటి ని ఘన్‌ఫూర్ నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు 2.033 టీఎంసీల పంపిణీ చేయనున్నారు. మూడేళ్లలో కార్యరూపం వాటర్‌గ్రిడ్ అంచనా వ్యయం రూ.3,500 కోట్లు కాగా, దీంట్లో ప్రాథమిక సరఫరా వ్యవస్థకు రూ.450 కోట్లు, ద్వితీయ స్థాయి సరఫరా వ్యవస్థకు రూ.2,300 కోట్లు, గ్రామాల్లో అంతర్గత సరఫరాకు రూ.750 కోట్లు అవసరమని అంచనా వేసింది. 2018 నాటికీ వాటర్‌గ్రిడ్ ద్వారా అన్ని గ్రామాలకు జలాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకానికి 3.64 మెగావాట్ల విద్యుత్ అవసరమని లెక్క తేల్చింది. కొందుర్గు వరకు గ్రావిటీ ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తున్నప్పటికీ అక్కడి నుంచి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు పంపింగ్‌కు చేసేందుకు మాత్రం విద్యుత్ తప్పనిసరి. -
వాటర్‌గ్రిడ్‌ను ముందే ‘నీరు’గార్చారు
- ఇక ‘లైడార్’ టెక్నాలజీ లేకుండానే సర్వే - ఖర్చు పెరగడం, అనుమతుల్లో జాప్యంతోనే వెనక్కి - సంప్రదాయ పద్ధతిలో సర్వేకే సర్కారు మొగ్గు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్ గ్రిడ్ లైన్ సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు ‘లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్’ (లైడార్) టెక్నాలజీని వినియోగించాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విరమించుకుంది. లైడార్ టెక్నాలజీకి బదులుగా లైన్ సర్వే నిమిత్తం సంప్రదాయ (టోటల్ స్టేషన్ అండ్ డీజీపీఎస్) పద్ధతులనే అవలంబించాలని నిర్ణయించినట్లు తెలిసింది. లేజర్ కిరణాలతో రిమోట్ సెన్సింగ్ (లైడార్) ద్వారా భూ ఉపరితలాన్ని సర్వే చేసే ప్రక్రియకు, సంప్రదాయ విధానం కంటే అధికంగా ఖర్చవుతుండడం ఒక కారణమైతే. లైడార్ టెక్నాలజీతో లైన్ సర్వేకు డి ఫెన్స్ విభాగం నుంచి అనుమతులు రావడం క్లిష్టంగా మారడం మరో కారణమని సంబంధిత అధికారులు తెలిపారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలన్నది లక్ష్యం. ఈ సమయంలో నిర్ణీత వ్యవధిలో పూర్తికావాలంటే అధునాతన పద్ధతులనే అవలంభించాలని, సంప్రదాయ పద్ధతుల ద్వారా నిర్దేశిత సమయంలో లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదని వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అధికారులు వాపోతున్నారు. అనుమతుల జారీలో జాప్యం.. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరుగుతోందని గ్రిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు చెబుతున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు వివిధ శాఖలు వెంటనే అన్ని అనుమతులు ఇవ్వాలని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అనుమతులు ఇచ్చే విషయంలో కొన్ని శాఖలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని అధికారులు వాపోతున్నారు. అనుమతుల కోసం దాదాపు అన్ని శాఖలకు నెల రోజుల కిందటే ప్రతిపాదనలు పంపినట్లు వారు చెబుతున్నారు. ఈ విషయమై ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు అధికారులు పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు దృష్టికి తేగా, అటవీ శాఖ నుంచి అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు చేపడతానని వారికి చెప్పారు. వాటర్ గ్రిడ్ నిర్మాణంలో భాగంగా అటవీ ప్రాంతంలో పైపులైన్ల ఏర్పాటుకు 4,265.48 ఎకరాలు, ఇతర నిర్మాణాల కోసం మరో 118 ఎకరాలను కేటాయించేందుకు అటవీశాఖ అనుమతించాల్సి ఉంది. -
‘గ్రిడ్’కు నీటిపారుదలశాఖ గ్రీన్‌సిగ్నల్
మంత్రి కేటీఆర్ వెల్లడి అటవీశాఖ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశం 27నుంచి జిల్లాల్లో పర్యటనలు సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు నీటి పారుదల శాఖ నుంచి రావాల్సిన అన్ని అనుమతులు ఇప్పటి కే లభించాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. అటవీశాఖ నుంచి రావాల్సిన అనుమతుల కోసం అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. వాట ర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి వివిధ జిల్లాల్లో జరు గుతున్న ఏర్పాట్లను ఆదివారం ఆయన ఆర్‌డబ్ల్యుఎస్ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వాటర్‌గ్రిడ్ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఈ నెల 27 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈనెల 27న మహబూబ్‌నగర్, 28న వరంగల్, 29న ఖమ్మం జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. సమాచారంతో సిద్ధంగా ఉండాలి... ఆయా జిల్లాల్లో తాను పర్యటనకు వచ్చేసరికి అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రతి జిల్లాకు సంబంధించిన గ్రిడ్ ప్రణాళికలపై ఆయా జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇంటేక్‌వెల్స్, పూర్తి స్థాయిలో పైప్‌లైన్ పరిమాణం, ఏయే వనరుల నుంచి ఎంత నీటిని సేకరించాలనుకుంటున్నారు... వంటి వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పొందుపర్చాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు వివిధ వనరుల నుంచి నీళ్లిచ్చేందుకు అవసరమైన పైప్‌లైన్ నిర్మాణాలు, ఎక్కడెక్కడ నీటి నిల్వ ట్యాంకులు చేపట్టేది.. తదితర అంశాలను సవివరంగా తెలపాలన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు కోరినపుడు పూర్తిస్థాయిలో సమాచారం అందించేలా వాటర్‌గ్రిడ్ పర్యవేక్షక అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. వాటర్‌గ్రిడ్ లైన్‌సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఫిబ్రవరి 10కల్లా పైలాన్! నల్లగొండ జిల్లాలో నిర్మిస్తున్న వాటర్‌గ్రిడ్ పైలాన్ ఫిబ్రవరి 10కల్లా పూర్తి కానుందని, ముఖ్యమంత్రి దానిని ఆవిష్కరిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేవలం పర్యటనలే కాకుండా, ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తానన్నారు. పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు. ఆర్‌డబ్ల్యుఎస్ విభాగం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, రెండ్రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 9 సర్కిళ్లను 16కు, 20 డివిజన్లను 46కు, 92 సబ్ డివిజన్లను 168కి పెంచనున్నట్లు మంత్రి వివరించారు. వాటర్‌గ్రిడ్ నిమిత్తం ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పోస్టులను కూడా వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు. -
నెలాఖరు కల్లా వాటర్‌గ్రిడ్ లైన్‌సర్వే పూర్తి చేయాలి
అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన లైన్ సర్వేను ఈనెలాఖరు కల్లా పూర్తి చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యుఎస్) విభాగం క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా మాట్లాడేందుకు ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని సోమవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్ల కార్యాలయాల్లోని అధికారులతో మంత్రి మాట్లాడారు. భవిష్యత్తులో వాటర్‌గ్రిడ్ పనులు జరిగే 40 ప్రాంతాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయానికి అనుసంధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులతో పాటు కేంద్ర కార్యాలయంలోని అధికారులతో మంత్రి వాటర్‌గ్రిడ్ పనులపై సుదీర్ఘం సమీక్షించారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోదావరికి కొత్త రూట్..!
సాక్షి,సిటీబ్యూరో: గోదావరి జలాలు సిటీలో గలగలా పారించేందుకు జలమండలి అధికారులు కొత్త రూట్ సిద్ధం చేస్తున్నారు. జలమండలి ప్రాజెక్టు సమీక్షలో సీఎం చేసిన సూచనల ఆధారంగా కసరత్తు ప్రారంభించారు. కొత్త రూట్లో పైప్లైన్ల ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలను నివేదిక రూపొందించేపనిలో పడ్డారు. విద్యుత్ ఖర్చు తగ్గించడంతో పాటు భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ)ద్వారానే రాజధాని నగరానికి నీటిని తరలించవచ్చు. పైపులైను మార్గంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తీరనుంది. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ వరదాయిని గోదావరి మంచినీటి పథకానికి కూడా సరికొత్త మార్గనిర్దేశం చేశారు. ఇటీవల జలమండలి ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన ఈ పథకానికి కొత్త మార్గాన్ని సూచించారు. కేసీఆర్ సూచించారు. సీఎం ఆదేశాలతో జలమండలి అధికారులు ప్రతిపాదనులు రూపొందిస్తున్నారు. కొత్త మార్గం ఇలా.. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని శామీర్‌పేట్ వరకు రూ.3500 కోట్ల అంచనా వ్యయంతో 186 కి.మీ మార్గంలో గోదావరి మంచినీటి పథకం పైప్‌లైన్ పనులను 2008లో ప్రారంభించిన విషయం విదితమే. ఈ పథకం మొదటి దశ ద్వారా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యం నిర్దేశించారు. పాత మార్గం ప్రకారం కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి-బొమ్మకల్-మల్లారం నీటిశుద్ధికేంద్రం-కొండపాక-ఘన్పూర్-శామీర్‌పేట్(నగర శివారు) మార్గంలో ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం సూచనల ప్రకారం కొత్త మార్గంలో బొమ్మకల్రిజర్వాయర్ను మినహాయించి ఎల్లంపల్లి(126 మీటర్ల ఎత్తున్న కాంటూరు)నుంచి కరీంనగర్ జిల్లాలోని ధర్మారం జగిత్యాల మార్గంలో ఎత్తై కొండ ప్రాంతం ఎండపల్లి(480మీటర్ల ఎత్తు)కి నీటిని పంపింగ్ చేసి అక్కడి నుంచి భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ) ఆధారంగా 10 టీఎంసీల నీటిని మల్లారం నీటి శుద్ధి కేంద్రానికి తరలించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. దీంతో ఆయన ఆదేశాలతో కొత్త మార్గం సాధ్యాసాధ్యాలపై జలమండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. గోదావరి పథకం తొలిదశను ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర సర్కారు లక్ష్యం నిర్దేశంచడంతో గోదావరి పథకం రెండోదశలో భాగంగా ఈ కొత్త మార్గం గుండా నీటిని తరలించాలా ? లేదా తొలిదశలోనే ఈ మార్గం గుండా నగరానికి నీటిని తరలించాలా ? అన్న అంశంపై అధికారులు పరిశీలనచేయనున్నారు. క్షేత్రస్థాయి పర్యటన తరవాత కొత్త మార్గంపై సీఎంకు నివేదిస్తామని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం తాము క్షేత్రస్థాయి పరిశీలన మాత్రమే జరుపుతున్నామని స్పష్టంచేశారు. నూతన మార్గంలో నేల వాలును తెలిపే కాంటూరు మ్యాపులను అధ్యయనం చేసిన తరవాతనే కొత్త మార్గంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. తీరనున్న పలు గ్రామాల దాహార్తి.. సీఎం సూచనల ప్రకారం గోదావరి ప్రస్తుత మార్గాన్ని స్వల్పంగా మార్చిన పక్షంలో పైప్‌లైన్‌కు ఆనుకొని ఉన్న కరీంనగర్,మెదక్ జిల్లాలకు చెందిన పలు గ్రామాల దాహార్తి తీరనుందని, అక్కడి జిల్లా గ్రిడ్లకు ఈ మార్గం దాహార్తిని తీర్చే వరదాయినిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త మార్గం గుండా పైప్లైన్లు వేస్తే నీటి పంపింగ్‌కు అయ్యే విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. -
గ్రేటర్ గ్రిడ్ కార్యాచరణేదీ..?
దాహార్తిని తీరిస్తేనే విశ్వనగర ఖ్యాతి జిల్లాలతోపాటే నగరంలోనూ చేపట్టాలి అప్పుడే సత్ఫలితాలు సాధ్యమంటున్న నిపుణులు సీఎం అనుమతికోసం అధికారుల ఎదురుచూపు సిటీబ్యూరో: సర్కార్ లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా నాలుగు కోట్ల పైమాటే. అందులో కోటి జనాభా రాష్ట్ర రాజధాని గ్రేటర్ పరిధిలోనే ఉంటుంది. కోటి మంది జనాభా దాహార్తి తీరిస్తేనే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు సగం విజయవంతమైనట్టేనని నిపుణులు అంటున్నారు. మహానగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలనుకుంటున్న సర్కార్.. గ్రేటర్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తేనే రాబోయే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడం సాధ్యపడుతుందని, తద్వారా ఈ పథకం సాకారమై నగరానికి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని విశ్లేషిస్తుండడం విశేషం. ఆర్‌డబ్ల్యూఎస్‌తోపాటే చేపడితేనే సత్ఫలితాలు.... ఔటర్ రింగ్‌రోడ్డు లోపల సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు పనులను జలమండలి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే సూత్రప్రాయంగా ప్రకటించారు. ఆ మేరకు జలమండలి రూ.13,495 కోట్ల అంచనాతో నగరంలో ప్రతి ఇంటికీ మంచినీళ్లిచ్చేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలపై కార్యాచరణ మొదలు పెట్టేందుకు సీఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని పది జిల్లాల పరిధిలో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు పనులను గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్)కు అప్పగించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాల్లో గ్రిడ్ పనులపైనే ప్రధానంగా దృష్టిసారించడంతో గ్రేటర్‌పై తాత్కాలికంగా ప్రతిష్టంభన నెలకొంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్ల మధ్యనున్న మహానగరానికి నీళ్లిచ్చేందుకు ఉద్దేశించిన గ్రేటర్ వాటర్‌గ్రిడ్ పథకాన్ని జిల్లా గ్రిడ్ పనులతోపాటే మొదలుపెడితేనే సర్కార్ ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. జాప్యం జరిగితే వ్యయ అంచనాలు భారీగా పెరిగి సర్కార్‌కు ఆర్థికంగా గుదిబండగా మారే ప్రమాదం ఉందని వారంటున్నారు. విశ్వనగరానికి గ్రిడ్ అవసరం... గ్రేటర్ పరిధిలో ప్రతి వ్యక్తికి నిత్యం 135 లీటర్ల చొప్పున (తలసరి నీటిలభ్యత) తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్‌ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలి. లేకుంటే విశ్వనగర ఖ్యాతి అందుకోవడం కష్టమే. కృష్ణా మూడోదశతోపాటు నాలుగో దశ కూడా అవసరం. గోదావరి, కృష్ణా జలాలతో మహానగరంలో ప్రతి ఇంటికీ పుష్కలంగా తాగునీటిని అందించడం కష్టమేమి కాదు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న గ్రిడ్ పనులతోపాటు గ్రేటర్‌గ్రిడ్ పనులను తక్షణం మొదలుపెడితేనే రెండింటి మధ్య సమన్వయం ఉంటుంది. - ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతనా సొసైటీ ఫర్ వాటర్ -
వాటర్ గ్రిడ్‌కు సిద్దిపేటే ‘దిక్సూచి’
తరలివస్తొన్న మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు సిద్దిపేట జోన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు ఒకప్పటి సిద్దిపేట మంచినీటి పథకం దిక్సూచిగా నిలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కె. చంద్రశేఖర్‌రావు తన కేబినెట్లోని సింహభాగం మంత్రులు, అధికార యంత్రాంగాన్ని తీసుకుని బుధవారం సిద్దిపేటకు రానున్నారు. పట్టణ శివారులోని మంచినీటి పథకం తీరు తెన్నులను రాష్ట్ర పాలక, అధికార యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో వివరించి భవిష్యత్తులో వాటర్ గ్రిడ్ సఫలీకృతానికి శ్రీకారం చుట్టారు. తాగునీటి సమస్య తీర్చిన ఆ ఇద్దరు సుమారు రూ. 25 వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గడపకు తాగునీరును అందించి ఫ్లోరైడ్ భూతాన్ని నిర్మూలించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అలాంటి ప్రాజెక్ట్ రూపకల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మరో వ్యక్తికి కూడా అపారమైన అనుభవం ఉంది. అతడే ఒకప్పటి సిద్దిపేట మంచినీటి పథకం నిర్వహణలో కీలక పాత్ర పోషించి నేడు రాష్ట్ర ప్రభుత్వ వాటర్‌గ్రిడ్ చీఫ్ టెక్నికల్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న సత్యపాల్‌రెడ్డి. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం సిద్దిపేట నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చడానికి అపర భగీరథ ప్రయత్నం చేసిన ఆ ఇద్దరు మళ్లీ సిద్దిపేట గడ్డపై బుధవారం గత సృ్మతులను గుర్తు తెచ్చుకోనున్నారు. తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న క్రమంలో సుమారు 185 గ్రామాలకు దప్పిక తీర్చి ప్రాజెక్ట్ రూపకల్పనలో నిర్వీరామంగా కృషి చేసిన సత్యపాల్‌రెడ్డి పేరు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితమే. సిద్దిపేట ప్రాజెక్ట్ నిర్వహణలో చోటుచేసుకున్న అపార అనుభవంతో జిల్లాలోని సింగూర్ నీటి పథకంతో పాటు, గుంటూరు, కృష్ణా జిల్లాలో తాగునీటి పథక నిర్వహణలో ఆయన భాగస్వాములయ్యారు. ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ పొందినప్పటి కీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్ గ్రిడ్ రూపకల్పనలో సాంకేతిక సలహాలతో పాటు పర్యవేక్షణకు సత్యపాల్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కన్సల్టెంట్ హోదాలో సత్యపాల్‌రెడ్డి మంగళవారం సిద్దిపేటలోని ఫిల్టర్‌బెడ్‌ను, కరీంనగర్ జిల్లా లోయర్ మానేర్ డ్యాం ను, మార్గమధ్యలో ఇన్‌టెక్ వెల్లను మాక్ ట్రయల్‌గా పరిశీలించి పథకం పని తీరును తెలుసుకున్నారు. సిద్దిపేట తాగునీటి పథక స్వరూపమిది పాతికేళ్ల క్రితం సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నం గునూరు మండలాలతో పాటు పట్టణం లో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ క్రమంలోనే 1999లో అప్పటి ఎమ్మె ల్యే, ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మా నేరు డ్యాం నుంచి సిద్దిపేట నియోజకవర్గానికి తాగునీరు అందించేందుకు శాశ్వ త మంచినీటి పథక రూపకల్పన చేశారు. ఈ నిర్వహణ బాధ్యతను గ్రా మీణ మంచినీటి సరఫర శాఖ విభాగానికి అప్పగించారు. అప్పట్లో స్థానిక ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న సత్యపాల్‌రెడ్డితో శాశ్వత మంచినీటి పథ కం గూర్చి ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ పలుమార్లు సమీక్షించారు. సుమారు రూ.60 కోట్ల వ్యయంతో కరీంనగర్ జిల్లా నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి 407 కిలోమీటర్ల పైప్ లైన్ పొడుగుతో మార్గమధ్యన మూడు ఇన్‌టెక్ వెల్ నిర్మాణాల ద్వారా భూగర్భం నుంచి తాగునీటిని లిఫ్టింగ్ చేసే ప్రక్రియను చేపట్టారు. రెండేళ్ల సుదీర్ఘ కృషి అనంతరం 2001లో సిద్దిపేట నియోజకవర్గంలోని సుమారు 185 గ్రామాల ప్రజలకు తాగునీటి అందించే ప్రక్రియ సఫలీకృతమైంది. సిద్దిపేట పథకం సత్ఫలితాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దొమ్మాట, రామాయంపేట, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో సింగూరు నీటి పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ పథక నిర్వహణలో కూడా సత్యపాల్‌రెడ్డి సిద్దిపేటలోని అపార అనుభవాన్ని సాంకేతిక పరిజ్ఞాన రూపంలో దోహదపడ్డారు. -
రేపు వాటర్‌గ్రిడ్‌పై మంత్రులకు అవగాహన
సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రుల బృందం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై మంత్రులకు అవగాహన కల్పించాల ని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం మంత్రులంతా అందుబాటులో ఉండాలని సీఎం కార్యాలయం నుంచి సమాచారం పంపించినట్లు తెలిసింది. అవగాహనలో భాగంగా.. సిద్దిపేటలోని మంచినీటి ప్రాజెక్టును మంత్రులకు చూపించాలని సీఎం భావిస్తున్నారు. సుమారు 200 గ్రామాలకు తాగునీటి అవసరాలను తీరుస్తున్న సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టును 2000 సంవత్సరంలో మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే. -
భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పనులు
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయమైన అవగాహన, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వాటర్‌గ్రిడ్ పనులను చేపట్టాలని సీఎం కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజె క్టు పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు. వాటర్‌గ్రిడ్ పనులపై బుధవారం సచివాలయంలో మంత్రి కె.తారకరామారావు, ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, రామకృష్ణారావు తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా మ్యాప్‌లు తెప్పించుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, గుట్ట లు, ఎత్తై ప్రదేశాలను పరిశీలించాలన్నారు. కృష్ణా, గోదావరి, ఇతర నదుల నీటిని గ్రామాలకు తరలించేందుకు లిఫ్ట్ కమ్ గ్రావిటీ మేరకు వాటర్‌గ్రిడ్ పైపులైన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నందున, మండలాల వారీగా కాంటూర్లను గుర్తించే ప్రక్రియపై దృష్టి సారించాలని అన్నారు. కాంటూర్ల వివరాలను తెలుపుతూ ఒక పుస్తకాన్ని ముద్రించాలని, ఈ పుస్తకం ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనిచేస్తున్న అధికారులందరికీ అం దుబాటులో ఉంచాలని కేసీఆర్ సూచించారు. ఇంటెక్ వెల్స్కు వెంటనే ప్రతిపాదనలు.. వాటర్‌గ్రిడ్‌లో భాగమైన ఇంటెక్ వెల్స్ నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది కనుక, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైన ఇంటెక్ వెల్స్, మోటార్లు.. తదితర అంశాలపై అంచనాలు రూపొందించాలని చెప్పారు. అవాంతరాలు ఎదురైనా నీటిని తోడేందుకు ఇబ్బంది రాకుండా అదనపు మోటార్లను ఇంటెక్ వెల్స్ వద్ద సిద్ధంగా ఉంచాలని సూచించారు. ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా పెద్దసంఖ్యలో ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్లాంట్లు, వాటి నిర్మాణానికి పట్టే సమయం.. తదితర అంశాలను అధ్యయనం చేసి ముందుకు సాగాలన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు, ట్రంక్, డిస్ట్రి బ్యూటరీ పైపులైన్లు కూడా నిర్మించాల్సి ఉన్నందున అధికారులు వేగంగా స్పందించాలని కోరారు. ఎంత సమయంలో వాటిని నిర్మించగలరో ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వాటర్‌గ్రిడ్‌లో 709 తాత్కాలిక ఉద్యోగాలకు అనుమతి వాటర్‌గ్రిడ్ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇం దులో భాగంగానే 709 తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనల మేరకు ఉద్యోగుల నియామకానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వం మంజూరు చేసిన 709 పోస్టుల్లో 47 సీనియర్ అసిస్టెంట్లు కాగా, 662 వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. అలాగే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ నిమిత్తం ఇంజనీరింగ్ అధికారుల(ఎస్ఈ)కు 26 ఇన్నోవా వాహనాలు కొనుగోలు చేసేం దుకు ప్రభుత్వం అనుమతించింది. -
వాటర్‌గ్రిడ్‌లో 700 ఉద్యోగాలు
వివిధ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం: మంత్రి కేటీఆర్ ఉపాధి హామీ కొనసాగింపునకు మండలి ఏకగ్రీవ తీర్మానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు కింద 700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వివిధ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి ఐదు నెలలు గడిచినా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన నివారణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ శాసనమండలిలో గురువారం పలువురు సభ్యులు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల్లో పేర్కొన్నవాటికి సంబంధం లేకుండా ప్రశ్నలు అడుగుతున్నారని మంత్రి అనడంతో.. ఎమ్మెల్సీలు నాగేశ్వర్, నర్సారెడ్డి, డి.శ్రీనివాస్ తదితరులు మండిపడ్డారు. ఇంతలో మంత్రి కేటీఆర్ కలుగజేసుకొని సభ్యులకు సర్దిచెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని పరిశీలిస్తోందని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా కమిటీని కూడా నియమించినట్లు చెప్పారు. నిరుద్యోగుల ఆశలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని, వాటర్‌గ్రిడ్ కింద 700 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. ఆర్ఎంపీలను డాక్టర్లుగా పరిగణించలేం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలను డాక్టర్లుగా పరిగణించలేమని, ప్రిస్క్రిప్షన్ రాసేందుకు కూడా అనుమతించేది లేదని ఉప ముఖ్యమంత్రి రాజయ్య స్పష్టం చేశారు. అయితే.. వారికి శిక్షణ ఇప్పించి గ్రామస్థాయిలో ‘కమ్యూనిటీ పారామెడిక్’లుగా వారి సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. మొత్తం 25,741 మందిని గుర్తించామని, వీరిలో ఇప్పటికే 12 వేల మందికి శిక్షణ పూర్తయిందన్నారు. రాష్ట్రంలో మలేరియా, డెంగీ, చికున్ గున్యా తదితర జ్వరాలు ఉన్నమాట వాస్తవమే గానీ, మరణాలు మాత్రం నమోదు కాలేదని చెప్పారు. జ్వరాల బారిన పడిన వారి కోసం అవసరమైన వైద్య పరీక్షలు, ప్లేట్లెట్ల సదుపాయాలను జిల్లా ఆసుపత్రుల్లో కల్పించామన్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో 20 పడకలతో ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘ఉపాధి’ని కుదించేందుకు కేంద్రం యత్నం: కేటీఆర్ గ్రామీణాభివృద్ధి కోసం గత యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కుదించాలని చూస్తున్నట్లు తెలిసిందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలోని 443 మండలాల్లో 73 మండలాలకే ఉపాధి హామీ పథకాన్ని పరిమితం చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న ఈ పథకం కొనసాగింపునకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉపాధి హామీని కొనసాగించాల్సిందేనని మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉపాధి హామీ పథకం కొనసాగింపుపై ఉభయ సభల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపనున్నట్లు మంత్రి వివరించారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్‌గ్రిడ్
మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ అధికారులతో సమీక్ష ప్రమాణాలను నిక్కచ్చిగా పాటించే సంస్థలకే చోటు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని పంచాయుతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు నాణ్యతాప్రమాణాల విషయం లో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. గ్రావిటీ ఆధారంగా ప్రాజెక్టు ఉండాలని ఇటీవల సీఎం చేసిన సూచనపై అధికారులు చేసిన కసరత్తుపై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు మూడు గంటలపాటు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై కూలంకశంగా చర్చించిన మంత్రి కేటీఆర్, ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులకు తాను కూడా పలు సూచనలు చేశారు. వారంలోగా సర్వేపనులు ప్రారంభించండి.. వారంలోగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రాథమిక సర్వేను చేపట్టాలని, ఇందుకోసం ఏజెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లను ఆహ్వానించాలని వుంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాణాలను నిక్కచ్చిగా పాటించే సంస్థలకే ప్రాజెక్టు పనుల్లో అవకాశం కల్పించాలన్నారు. సర్వేను పర్యవేక్షించేందుకు ‘జీపీఎస్ వ్యవస్థ’ పరికరాలను కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పారు. అంతేకాకుండా.. ప్రాజెక్టు పనులను సీఎం స్వయంగా తన కార్యాలయం నుంచే పర్యవేక్షిం చేలా జియోస్పేషియల్ మ్యాపింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫ్లోరోసిస్ ప్రభావిత నల్లగొండ జిల్లా నుంచే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున, ఆ జిల్లాకు సంబంధించిన డీపీఆర్‌ను వుుందుగా పూర్తి చేయాలని కోరారు. ఇమేజింగ్ సర్వే పూర్తి వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టిన చర్యలపై అధికారులు మంత్రికి వివరిస్తూ.. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా చేపట్టిన నాలుగు లేయర్ల ఇమేజింగ్ సర్వేను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో గుజరాత్ పర్యటన .. ఇప్పటికే వాటర్‌గ్రిడ్‌ను నిర్వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం అధికారులతో కలిసి పర్యటించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. వాటర్‌గ్రిడ్ అంశంతో పాటు ఈ-పంచాయుతీ వ్యవస్థల పనితీరును కూడా పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. వాటర్‌గ్రిడ్ కోసం ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు మదింపు నివేదికను రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రగతిని సమీక్షకు వచ్చేవారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. -
వాటర్ గ్రిడ్ @ఃరూ.2070 కోట్లు
నీలగిరి :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించాలనుకుంటున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అంచనాలు ఓ కొలిక్కివచ్చాయి. జిల్లావ్యాప్తంగా 24 గంటలూ అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు తాగునీటిని సరఫరా చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రిడ్ ప్రతిపాదనలు తయారుచేయడంలో జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అహర్నిశలు శ్రమించింది. గ్రిడ్ అమలుకు అవసరమయ్యే నీటి వనరులు, పనుల అంచనాలు, పైప్లైన్ల డిజైన్లకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జిల్లావ్యాప్తంగా నెలకొన్న తాగునీటి సమస్య తీరుతుంది. ప్రధానంగా ఫ్లోరైడ్ ప్రాంతాల్లో కలుషిత నీటిని తాగుతూ జీవచ్ఛవాల్లా మారుతున్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు కృష్ణా జలాలతో కళకళలాడుతాయి. తీవ్ర వర్షాభావంతో కొట్టుమిట్టాడుతూ ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు తాగునీటి గండం నుంచి గట్టెక్కుతాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కొరత లేకుండా కేటాయిస్తే నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ ఫలాలు ప్రజలకు అందుతాయి. కృష్ణాజలాలు...మంచినీటి చెరువులు అధికారులు రూపొందించిన ప్రణాళికల ప్రకారం నాలుగుచోట్ల గ్రిడ్లు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుకు రూ.2070 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొదటి గ్రిడ్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిర్మిస్తారు. దీని పరిధిలో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు ఉంటాయి. 2, 3 గ్రిడ్లు పానగల్లులోని ఉదయసముద్రం రిజ్వరాయర్ వద్ద నిర్మిస్తారు. ఈ రెండు గ్రిడ్ల పరిధిలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాలు ఉం టాయి. నకిరేకల్ నియోజకవర్గంలోని నాలు గు మండలాలు గ్రిడ్-2 పరిధిలోకి, రెండు మండలాలు గ్రిడ్-3లో కలిపారు. 4వ గ్రిడ్ నాగార్జునసాగర్ ఎడమ కా ల్వ ప్రవహించే ప్రాంతాల్లో నిర్మిస్తారు. దీని పరిధిలో మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులకు కృష్ణాజలాలతోపాటు, ముప్పారం, వాయిలసింగారం, మంచినీటి చెరువులను వినియోగిస్తారు. సమృద్ధిగా నీటి వనరులు... వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులకు అవసమయ్యే నీటి వనరులు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణాజలాలు, మంచినీటి చెరువులను వినియోగించనున్నారు. జిల్లాలో హ్యాబిటేషన్లు 3591లు దాకాఉన్నాయి. దీంట్లో ప్రస్తుతం 1541 హ్యాబిటేషన్లకు 2.5 టీఎంసీల తాగునీరు సరఫరా అవుతోంది. మిగిలిన 2050 హ్యాబిటేషన్లు, మున్సిపాలిటీలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కావాలంటే 7.08 టీఎంసీల నీరు అవసరమవుతుంది. మొత్తంగా అన్ని గ్రామాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా నీటిని అందించాలంటే 9.58 టీఎంసీల నీరు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు నుంచి తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం ఉదయసముద్రానికి 1.5 టీఎంసీలు విడుదల అవుతుంది. కాబట్టి గ్రిడ్లకు నీటి సమస్య అనేది ఉండదు. అయితే అన్ని సందర్భాల్లో ఐకేబీఆర్ నుంచి ఉదయ సముద్రానికి నీటి విడుదల సాధ్యం కానందున అక్కడినుంచి ఉదయ సముద్రానికి నేరుగా కొత్త పైప్‌లైన్ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఐకేబీఆర్ ద్వారా మూడు గ్రిడ్లకు, సాగర్ ఎడమ కాల్వల ద్వారా నాలుగో గ్రిడ్‌కు నీటిని అందిస్తారు. నాలుగు దశల్లో... ప్రభుత్వం నిధుల మంజూరులో వెనకడుగు వేయకుం డా శరవేగంగా పనులు చేపడితే నాలుగు దశల్లో పూర్తయ్యే అవకాశముంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాలను కూడా ఈ గ్రిడ్లను అనుసంధానం చేస్తారు. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను కూడా గ్రిడ్లకు కలుపుతారు. అదేవిధంగా ప్రస్తుతం గ్రామా ల్లో 8 గంటలపాటు నీటిని సరఫరా చేసే పైపులైన్లు ఉన్నాయి. గ్రిడ్ ఏర్పాటైతే 24గంటల పాటు నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. కాబట్టి లూప్ డిజైన్ ద్వారా ప్రస్తుతం ఉన్న పైప్‌లకు లింక్ చేస్తారు. దీంతో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయమూ ఏర్పడదు. జిల్లాకు ఎంతో ప్రయోజనం : రాజేశ్వరారవు, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు లైన్ ఎస్టిమేట్లు రూపొందించి ఈఎన్సీకి సమర్పించాం. జిల్లాలో నాలుగు గ్రిడ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. గ్రిడ్ల నిర్మాణం జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరం. ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగునీరు, వర్షాభావ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరుతుంది. గ్రిడ్-2లో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల, కట్టంగూరు, నార్కట్‌పల్లి, రామన్నపేట మండలాలు కలిపారు. 3లో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి, నకిరేకల్ మండలాలు కలిపారు. 4లో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాలు కలిపారు. ఆలేరు నుంచి వరంగల్ జిల్లాలో జనగామ నియోజకవర్గానికి తాగునీరు అందిస్తారు. తిరుమలగిరి నుంచి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి తాగునీరు అందిస్తారు. గ్రిడ్ అంచనా వ్యయం కావాల్సిన నీరు సంఖ్య (కోట్లలో) (టీఎంసీలలో) గ్రిడ్-1 రూ.470 2.00 గ్రిడ్-2 రూ.800 2.33 గ్రిడ్-3 రూ.400 1.77 గ్రిడ్-4 రూ.400 3.48 -
నట్టింట్లోకి నల్లా
సాక్షి, సంగారెడ్డి : గుక్కనీటికోసం తండ్లాడుతున్న మెతుకుసీమ వాసుల కష్టాలు తీర్చేందుకు సర్కార్ సన్నద్ధమైంది. ప్రతి పల్లెకు రక్షిత మంచినీరు అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు వీలుగా జిల్లా వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్ ప్రకాశ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో తయారవుతున్న జిల్లా వాటర్‌గ్రిడ్ డీపీఆర్ (డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) మరో వారంరోజుల్లో సిద్ధం కానుంది. ప్రతి వ్యక్తికి రోజుకు 100 నుంచి 70 లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు వీలుగా సుమారు రూ.3,500 కోట్ల వ్యయంతో జిల్లా వాటర్ గ్రిడ్ ప్రణాళికను అధికారులు రూపొందిస్తున్నారు. మెదక్ జిల్లాలోని పది నియోజవకర్గాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాలకు సైతం తాగునీటి సరఫరా అందించేందుకు వీలుగా వాటర్‌గ్రిడ్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వాటర్‌గ్రిడ్ కోసం సింగూరు నుంచి సుమారు 9 టీఎంసీల మంజీర జలాలు అవసరమవుతాయని అంచనా. సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా జలాల కేటాయింపుపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు త్వరలో నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావటం, భారీనీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు సైతం మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో వాటర్‌గ్రిడ్‌కు మంజీర జలాల కేటాయింపులో సమస్యలు తలెత్తకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. మూడు దశల్లో వాటర్‌గ్రిడ్ జిల్లాలో మూడు దశల్లో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు కానుంది. మొదట మెయిన్ గ్రిడ్ ఆ తర్వాత మండలాల్లో సబ్గ్రిడ్ను ఏర్పాటు చేస్తారు. సబ్గ్రిడ్ నుంచి గ్రామాలకు పైప్లైన్లు వేసి ఆతర్వాత పల్లెల్లో ఇంటింటికి తాగునీటి కనెక్షన్లు ఇస్తారు. వాటర్‌గ్రిడ్ ద్వారా జిల్లాలోని 2,456 గ్రామాలు, ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 28 తాగునీటి పథకాల ద్వారా 822 గ్రామాల్లోని 10.71 లక్షలకుపైగా జనాభాకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. మరో 842 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ పథకాలను సిద్ధం చేస్తోంది. ఇంకా 792 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి పథకాలు, నిర్మాణంలో ఉన్న పథకాలతోపాటు మొత్తం జిల్లాలోని 2,456 గ్రామాల్లోని 26.95 లక్షల మంది జనాభాకు వాటర్‌గ్రిడ్ ద్వారా రక్షిత మంచినీటి సరఫరా చేయనున్నారు. ప్రత్యేక అధికార వ్యవస్థ జిల్లా వాటర్‌గ్రిడ్ నిర్మాణం, నిర్వహణ నిర్వహణ పనుల కోసం ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీరును నియమించటంతోపాటు ఐదుగురు ఈఈలు, రెండు మండలాలకు ఒకరు చొప్పున డిప్యూటీ డీఈలు మండలానికి ఒకరు చొప్పున ఏఈ, ఇద్దరు వర్క్ఇన్స్పెక్టర్లు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి సూచించనున్నారు. -
వాటర్‌గ్రిడ్‌తో ‘గ్రేటర్’కు జలకళ
తీరనున్న భాగ్యనగరం దాహార్తి సీఎం సమీక్షతో చిగురిస్తున్న ఆశలు మరో రెండు రోజుల్లో కార్యాచరణకు శ్రీకారం సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేపట్టే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుతో గ్రేటర్ హైదరాబాద్ దాహార్తి తీరనుంది. మహానగరం జలకళతో కొత్త రూపు సంతరించుకోనుంది. సీఎం కేసీఆర్ బుధవారం ఈ అంశంపై నిర్వహించిన సమీక్షాసమావేశంలో హైదరాబాద్‌లో గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో ఈ అంశంపై సీఎం సమక్షంలో ప్రత్యేకంగా సమావేశమవడంతోపాటు గ్రేటర్ వాటర్‌గ్రిడ్‌పై కార్యాచరణకు శ్రీకారం చుట్టేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ఈ గ్రిడ్ ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సుమారు 39.22 టీఎంసీల నీళ్లు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని 1.20 కోట్ల జనాభా తాగునీటి అవసరాలు పూర్తిగా తీరనున్నాయి. అలాగే, హైదరాబాద్‌లో విలీనమైన 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల దాహార్తి తీరడంతోపాటు, కొత్తగా వచ్చే ఐటీఐఆర్, అర్బన్ నోడ్స్, అర్బన్ సెంట ర్లకు తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. కృష్ణా, గోదావరి, ఎల్లంపల్లి,సిం గూరు, మంజీరా, జూరాల, నాగార్జున సాగర్ జలాశయాల(మెయిన్సోర్స్) నుంచి తాగునీటిని నగరం నలుమూలలా సరఫరా చేసే గ్రేటర్ వాటర్‌గ్రిడ్ పథకం ప్రతిపాదనలను జలమండలి ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణ సీఎం కేసీఆర్‌కు నివేదించారు. దీన్ని ముఖ్యమంత్రి ఆమోదిస్తే ఈ పథకం పట్టాలెక్కనుంది. గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ఇలా... గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాకు 34.14 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాకు 5.8 టీఎంసీలు మొత్తంగా 39.22 టీఎంసీల నీటిని గ్రిడ్ ద్వారా నిరంతరం సరఫరా చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు జూరాల నుంచి 5 టీఎంసీలు,నాగార్జున సాగర్ జలాశయం నుంచి 16.5, ప్రాణహిత, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా 8.64 టీఎంసీలు, సింగూరు నుంచి 3 టీఎంసీలు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి ఒక్క టీఎంసీ నీటిని సేకరించాలని నిర్ణయించారు. ఇక రంగారెడ్డి జిల్లాకు జూరాల నుంచి 1 టీఎంసీ, నాగార్జునసాగర్ నుంచి 1.08 టీఎంసీ, ప్రాణహిత,ఎల్లంపల్లి నుంచి 1 టీఎంసీ, సింగూరు నుంచి 2 టీఎంసీల నీటిని సేకరించనున్నారు. గ్రేటర్ పరిధిలో ఒక్కొక్కరికి సుమారు 150 ఎల్పీసీడీ(లీటర్పర్ క్యాపిటా డైలీ) నీటిని సరఫరా చేయాలని ఈ గ్రిడ్ ద్వారా లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇందుకోసం ఆయా జలాశయాల నుంచి భూమ్యాకర్షణ శక్తి ద్వారా(గ్రావిటీ) నీటిని తరలించేందుకు భారీ మైల్డ్‌స్టీల్ పైప్లైన్లు ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ సర్కిళ్లు, డివిజన్లు, కాలనీలవారీగా నీటి సరఫరాకు పైప్లైన్న్లు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా నీటిశుద్ధి కేంద్రాలు, నీటి సరఫరాకు పలు ప్రాంతాల్లో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు,సర్వీసు రిజర్వాయర్లు,పంపుహౌజ్‌లు, విద్యుత్ పంపింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రధాన గ్రిడ్ల నుంచి సరఫరా ఇలా.... కృష్ణా గ్రిడ్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి(పార్ట్), నల్లగొండ, ఖమ్మం(పార్ట్), హైదరాబాద్. గోదావరి గ్రిడ్: ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి(పార్ట్), హైదరాబాద్. గ్రేటర్‌కు పుష్కలంగా మంచినీళ్లు హైదరాబాద్ వేగంగా విస్తరించడంతోపాటు జనాభా అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ వాటర్‌గ్రిడ్ రూపొందించాం. దీని ద్వారా శివారు ప్రాంతాల దాహార్తి తీరుతుంది. గుజరాత్ మోడల్ కంటే ఇది ఉత్తమమైంది. ఈ గ్రిడ్ ద్వారా కృష్ణా, ఎల్లంపల్లి, గోదావరి, మంజీరా, సింగూరు, జూరాల జలాశయాల నుంచి గ్రేటర్‌పరిధిలో నిరంతరం నీటిని సరఫరా చేయొచ్చు. -ఎం.సత్యనారాయణ (జలమండలి ఇంజనీర్ ఇన్ చీఫ్)