సాక్షి అమలాపురం: గోదావరి చెంతనే ఉన్నా.. గుక్కెడు స్వచ్ఛమైన తాగునీరు అందని వారెందరో. శివారు ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు.. గోదావరి మధ్య ఉన్న లంకవాసులకు సైతం స్వచ్ఛమైన తాగునీరందదు. గుక్కెడు నీటి కోసం అలమటించేవారెందరో.. ఒకవైపు గోదావరి కాలువల్లో రెట్టింపవుతున్న కాలుష్యం.. మరోవైపు వేసవిలో శివారుకు తాగునీరు అందని దుస్థితి.. వీటన్నింటికీ ముగింపు పలుకుతూ ఇప్పటికే ‘జల్‌జీవన్ మిషన్’లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇంటింటా కుళాయిల ఏర్పాటు పనులు వేగంగా చేస్తోంది. దీంతోపాటు ‘డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఇన్ కోస్టల్ ఏరియా’ అనే బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
జల్‌జీవన్ మిషన్‌లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులతో చేపట్టనున్న ఈ మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. రూ.1,650 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని 11 నియోజకవర్గాలు.. 32 మండలాల్లోని 451 గ్రామాలకు తాగునీరందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సుమారు 25 లక్షల మందికి నేరుగా గోదావరి నుంచి తాగునీరు అందించనుంది. ఈ నెలాఖరుకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకోనుంది. స్థల సేకరణ పూర్తయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రెండున్నరేళ్లలో దీని నిర్మాణం పూర్తి కానుంది.
రెండు డెల్టాల పరిధిలో నిర్మాణం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో దీని నిర్మాణం జరుగనుంది. ఈ ప్రాజెక్టు వల్ల కోనసీమ జిల్లాకు అధికంగా మేలు జరగనుంది. జిల్లా పరిధిలోని మొత్తం 22 మండలాలకూ బ్యారేజీ నుంచి నేరుగా తాగునీరందనుంది. ఇక తూర్పు డెల్టా పరిధిలో కాకినాడ జిల్లాలో సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు మండలాలకు, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్, కడియం, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాలకు లబ్ధి చేకూరనుంది.
ఐదుచోట్ల ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్
వాటర్ గ్రిడ్‌లో భాగంగా ఐదు ప్రాంతాల్లో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల (ఆర్‌ఎస్‌ఎఫ్) నిర్మాణాలు చేయనున్నారు. గోదావరి నది నుంచి నేరుగా వచ్చే నీటిని ఇక్కడ శుద్ధి చేస్తారు. ఒక్కొక్క దానినీ 30 నుంచి 50 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్‌డీ) సామర్థ్యంతో నిర్మిస్తారు. ఇక్కడ నీటిని అధునాతన పద్ధతిలో ఫిల్టర్ చేసి, అక్కడి నుంచి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఓహెచ్‌బీఆర్)లకు పంపిస్తారు. ఉమ్మడి జిల్లాలో వీటిని పది చోట్ల నిర్మిస్తారు.
వీటిలో అంబాజీపేట మండలం ముక్కామల, పి.గన్నవరం మండలం బెల్లంపూడి, ఆలమూరు మండలం మడికి, మండపేట మండలం తాపేశ్వరం, ఎల్‌ఎన్ పురం వద్ద సంప్‌లతో కూడిన ఓహెచ్‌బీఆర్‌ల నిర్మించనున్నారు. ఈ ఓహెచ్‌బీఆర్‌ల ఎత్తు 200 మీటర్లు ఉంటుంది. వీటికి అనుబంధంగా మూడు జిల్లాల పరిధిలో మరో మూడు ఓహెచ్‌బీఆర్‌లు నిర్మించనున్నారు. వంద అడుగుల ఎత్తున లక్ష లీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తారు.
నాలుగు ఇన్‌లెట్‌లు
డెల్టా వాసులకు నేరుగా తాగునీరు తరలించేందుకు బ్యారేజీ ప్రాంతంలో నాలుగు ఇన్‌లెట్‌లు నిర్మించనున్నారు. మధ్య డెల్టాలోని 16 మండలాలకు (కోనసీమ జిల్లా) బొబ్బర్లంక వద్ద ఇన్‌లెట్ ఏర్పాటు చేయనున్నారు. తూర్పు డెల్టాలోని ధవళేశ్వరం వద్ద మూడు ఇన్‌లెట్‌లు నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, రామచంద్రపురం, కె.గంగవరం (కోనసీమ జిల్లా), సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు (కాకినాడ జిల్లా), రాజమహేంద్రవరం రూరల్, కడియం (తూర్పు గోదావరి జిల్లా)లకు నీరు అందుతుంది.
ఇప్పుడున్న పథకాలకు అనుసంధానం
తూర్పు, మధ్య డెల్టాల్లోని వాటర్ గ్రిడ్ పరిధిలో ఇప్పటికే పలు పథకాలున్నాయి. 31 సీడబ్ల్యూసీ, 390 పీడబ్ల్యూసీ స్కీమ్‌ల ద్వారా తాగునీరు అందుతోంది. వీటిని వాటర్ గ్రిడ్ పరిధిలోకి తీసుకురానున్నారు. కొత్తగా మరికొన్ని పథకాలు రానున్నాయి. వీటితో పాటు జల్‌జీవన్ మిషన్ ద్వారా నిర్మిస్తున్న పైప్‌లైన్‌ల ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందించనున్నారు.
రెండున్నరేళ్లలో పూర్తి
మంచినీటి పథకాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని అనుమతులూ వచ్చిన వెంటనే పనులు మొదలు కానున్నాయి. రెండు డెల్టాల్లోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 20 ఏళ్ల తరువాత అవసరాలు కూడా తీర్చేలే పథకాన్ని రూపొందించాం.
– సీహెచ్‌ఎన్‌వీ కృష్ణారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా అధికారి, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment