Jal Jeevan
-
జలజీవన్ మిషన్ లో ఏపీ టాప్
-
‘జలజీవన్ మిషన్’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ‘జలజీవన్ మిషన్’ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలుస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఈ పథకం అమలు జరుగుతుండగా.. రాష్ట్రాల వారీగా పథకం అమలు జరుగుతున్న తీరుపై కేంద్రం ప్రతినెలా పథకం అమలులో పురోగతిపై జిల్లాల వారీగా ర్యాంకుల్ని ప్రకటిస్తూ వస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ విభాగం ‘జలజీవన్ మిషన్ సర్వేక్షణ్ బులెటిన్’ పేరుతో విడుదల చేస్తోంది. డిసెంబర్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం అమలు జరిగిన తీరుపై కేంద్రం తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో మన రాష్ట్రంలోని విశాఖపట్నం దేశంలోనే రెండవ ర్యాంక్ కైవసం చేసుకోగా.. మరో రెండు జిల్లాలు టాప్–10 ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఐదవ స్థానం దక్కగా, అనకాపల్లి జిల్లా దేశంలోనే టాప్–10 జిల్లాల జాబితాలో పదో స్థానాన్ని దక్కించుకుంది. మూడు అంశాల ఆధారంగా.. ప్రతినెలా జిల్లాల వారీగా ఆయా గ్రామాల్లో కొత్తగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వటం.. తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణ.. అందుకు గ్రామ స్థాయిలో కలి్పస్తున్న వసతులు అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా కేంద్రం ప్రతినెలా దేశంలోని జిల్లాలకు ర్యాంకులు కేటాయిస్తోంది. డిసెంబర్ నెలలో తమిళనాడులోని సేలం జిల్లా 91.79 మార్కుతో దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించగా.. మన రాష్ట్రంలోని విశాఖ జిల్లా 86.85 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా 81.83 మార్కులతో 5వ ర్యాంక్, అనకాపల్లి జిల్లా 72.55 మార్కులతో పదో ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల వారీగా వివిధ అంశాలపై ప్రతినెలా జిల్లాల వారీగా పథకం పురోగతిపై మార్కులను కేటాయిస్తూ ర్యాంకులు ఇస్తోందని.. ప్రతినెలా ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయని రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వివరించారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
‘జల్‌జీవన్’తో వందశాతం రక్షిత మంచి నీరు
సాక్షి, న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్‌లో భాగంగా తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలు వంద శాతం మేర ప్రతీ ఇంటికి సురక్షిత మంచినీటిని అందించాయని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రజలపై పన్నులు మోపి ఆదాయాలు పెంచుకున్నాయని వెల్లడించింది. కోవిడ్–19 మహమ్మారితో రాష్ట్రాల రెవెన్యూలకు పెద్దఎత్తున తగిలిన ఎదురుదెబ్బతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా వాటిని ఆదుకుందని పేర్కొంది. అయితే పట్టణ ఆర్థిక వనరులపై ఇటీవల ఆర్బీఐ ఇచి్చన నివేదికలో ఓఈసీడీ దేశాల కంటే భారత్‌లో ఆస్తిపన్ను వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయని ఎత్తిచూపింది. రాష్ట్రాలు వసూలు చేస్తున్న ఆస్తిపన్నుల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ఆస్తిపన్ను విధానాల్లో పెద్దఎత్తున సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందని ఆర్బీఐ నివేదికలో పేర్కొందని ఆర్థిక సర్వే వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ, అసోం, పుదుచ్చేరి 2022–23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీలను సవరించాయని మంగళవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2022–23లో పేర్కొన్నారు. వీటితోపాటు 2022 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు అకాల భారీ వర్షాల కారణంగా పంటనష్టం, సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల్లో అధిక ద్రవ్యోల్బణం నమోదైందన్నారు. ఈ కారణంగా టమోటాల ధరల పెరుగుదల ప్రభావం ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై పడిందని వెల్లడించారు. పెరిగిన ద్రవ్యోల్బణం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా సహా చాలా రాష్ట్రాల్లో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ–సీ) ద్రవ్యోల్బణం పెరిగిందని, దీనికి ఇంధనం, దుస్తులు ప్రధాన కారణమని ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రసూతి మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్) 2014–16లో లక్షకు 130 మంది ఉండగా, 2018–20లో లక్షకు 97గా నమోదైందని తెలిపింది. కాగా, 2030 నాటికి ప్రతి లక్ష సజీవ జననాలకు ప్రసూతి మరణాలరేటు(ఎంఎంఆర్) 70 కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యాన్ని తెలంగాణ(43), ఆంధ్రప్రదేశ్(45) సహా ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే సాధించాయని పేర్కొంది. ముఖ్యంగా, ప్రధానమంత్రి గతిశక్తి, కోవిడ్–19 నేపథ్యంలో లాజిస్టిక్స్ రంగంలోని ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకొని విడుదల చేసిన లీడ్స్–2022 సర్వేలో తెలంగాణ 90 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించి అచీవర్స్ జాబితాలో చేరిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. -
స్వచ్ఛ జల్ సే సురక్ష.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఏపీ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా కోసం తీసుకుంటున్న చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్‌లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘స్వచ్ఛ జల్ సే సురక్ష’ పేరుతో గతేడాది అక్టోబర్ 2 నుంచి ఈ ఏడాది జనవరి 26 వరకు కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశంలోని అన్ని గ్రామాల్లో సురక్షిత నీటి వాడకంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే రాష్ట్రాల్లో రక్షిత తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి మార్కులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి వనరులు(రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు, బావులు తదితరాలు) వద్ద నీటి నాణ్యత పరీక్షల నిర్వహణను కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. అలాగే నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ తదితర రసాయనాలతో పాటు ఈ–కోలి తదితర బ్యాక్టీరియా కారకాలను గుర్తించినప్పుడు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకుంది. వర్షాకాలం ముందు, తర్వాత నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల సంఖ్యను.. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి సౌకర్యాలను, నాణ్యత పరీక్షల నిర్వహణకున్న వసతులు, అందులో స్థానిక మహిళలకు తగిన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను కూడా కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. వీటన్నింటి ఆధారంగా 900 మార్కులకు గాను రాష్ట్రాలకు మార్కులు కేటాయించింది. ఈసారి 900 మార్కులకు గాను 598 మార్కులతో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 568 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది. 96% నీటి వనరుల వద్ద నాణ్యత పరీక్షలు.. ఏపీలో 87 శాతానికి పైగా గ్రామాల్లో స్థానికంగానే తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణకు అవసరమైన కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచినట్లు కేంద్ర జలశక్తి శాఖ గణాంకాల్లో తేలింది. 18,393 గ్రామాలుండగా, 96 శాతానికి పైగా అంటే 17,772 గ్రామాల్లోని వనరుల వద్ద రెండు విడతల పాటు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.64 లక్షల తాగునీటి వనరుల వద్ద పరీక్షలు నిర్వహించగా, 21,193 చోట్ల వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారని తెలిపింది. అందులో 20,739 చోట్ల ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రక్షిత మంచినీటి వనరులు కల్పించినట్టు కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. -
రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో భాగస్వామ్యం పెంచండి
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో స్థానికుల భాగస్వామ్యం పెరిగినప్పుడే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తాగునీటి సరఫరాకు అవకాశం ఉంటుందని గ్రామీణ మంచినీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) ఉన్నతాధికారులు పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్డబ్ల్యూఎస్, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాల అధికారులు, ఎన్జీవో ప్రతినిధులతో రెండు రోజుల వర్క్‌షాప్ విజయవాడలో ప్రారంభమైంది. ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి, జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరేరామ్ నాయక్, సీఈలు గాయత్రిదేవి, సంజీవరెడ్డి, రవికుమార్ అధికారులు, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఎన్జీవో ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు 40 ఎన్జీవో సంస్థలకు చెందిన 600 మంది ప్రతినిధులకు బాధ్యత అప్పగించింది. -
మెగా వాటర్ గ్రిడ్‌కు లైన్ క్లియర్.. డెల్టా వాసుల కల నెరవేరుస్తున్న ప్రభుత్వం
సాక్షి అమలాపురం: గోదావరి చెంతనే ఉన్నా.. గుక్కెడు స్వచ్ఛమైన తాగునీరు అందని వారెందరో. శివారు ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు.. గోదావరి మధ్య ఉన్న లంకవాసులకు సైతం స్వచ్ఛమైన తాగునీరందదు. గుక్కెడు నీటి కోసం అలమటించేవారెందరో.. ఒకవైపు గోదావరి కాలువల్లో రెట్టింపవుతున్న కాలుష్యం.. మరోవైపు వేసవిలో శివారుకు తాగునీరు అందని దుస్థితి.. వీటన్నింటికీ ముగింపు పలుకుతూ ఇప్పటికే ‘జల్‌జీవన్ మిషన్’లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇంటింటా కుళాయిల ఏర్పాటు పనులు వేగంగా చేస్తోంది. దీంతోపాటు ‘డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఇన్ కోస్టల్ ఏరియా’ అనే బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. జల్‌జీవన్ మిషన్‌లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులతో చేపట్టనున్న ఈ మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. రూ.1,650 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని 11 నియోజకవర్గాలు.. 32 మండలాల్లోని 451 గ్రామాలకు తాగునీరందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సుమారు 25 లక్షల మందికి నేరుగా గోదావరి నుంచి తాగునీరు అందించనుంది. ఈ నెలాఖరుకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకోనుంది. స్థల సేకరణ పూర్తయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రెండున్నరేళ్లలో దీని నిర్మాణం పూర్తి కానుంది. రెండు డెల్టాల పరిధిలో నిర్మాణం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో దీని నిర్మాణం జరుగనుంది. ఈ ప్రాజెక్టు వల్ల కోనసీమ జిల్లాకు అధికంగా మేలు జరగనుంది. జిల్లా పరిధిలోని మొత్తం 22 మండలాలకూ బ్యారేజీ నుంచి నేరుగా తాగునీరందనుంది. ఇక తూర్పు డెల్టా పరిధిలో కాకినాడ జిల్లాలో సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు మండలాలకు, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్, కడియం, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాలకు లబ్ధి చేకూరనుంది. ఐదుచోట్ల ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ వాటర్ గ్రిడ్‌లో భాగంగా ఐదు ప్రాంతాల్లో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల (ఆర్ఎస్ఎఫ్) నిర్మాణాలు చేయనున్నారు. గోదావరి నది నుంచి నేరుగా వచ్చే నీటిని ఇక్కడ శుద్ధి చేస్తారు. ఒక్కొక్క దానినీ 30 నుంచి 50 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్డీ) సామర్థ్యంతో నిర్మిస్తారు. ఇక్కడ నీటిని అధునాతన పద్ధతిలో ఫిల్టర్ చేసి, అక్కడి నుంచి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఓహెచ్‌బీఆర్)లకు పంపిస్తారు. ఉమ్మడి జిల్లాలో వీటిని పది చోట్ల నిర్మిస్తారు. వీటిలో అంబాజీపేట మండలం ముక్కామల, పి.గన్నవరం మండలం బెల్లంపూడి, ఆలమూరు మండలం మడికి, మండపేట మండలం తాపేశ్వరం, ఎల్ఎన్ పురం వద్ద సంప్లతో కూడిన ఓహెచ్బీఆర్ల నిర్మించనున్నారు. ఈ ఓహెచ్బీఆర్ల ఎత్తు 200 మీటర్లు ఉంటుంది. వీటికి అనుబంధంగా మూడు జిల్లాల పరిధిలో మరో మూడు ఓహెచ్‌బీఆర్‌లు నిర్మించనున్నారు. వంద అడుగుల ఎత్తున లక్ష లీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తారు. నాలుగు ఇన్లెట్లు డెల్టా వాసులకు నేరుగా తాగునీరు తరలించేందుకు బ్యారేజీ ప్రాంతంలో నాలుగు ఇన్లెట్లు నిర్మించనున్నారు. మధ్య డెల్టాలోని 16 మండలాలకు (కోనసీమ జిల్లా) బొబ్బర్లంక వద్ద ఇన్లెట్ ఏర్పాటు చేయనున్నారు. తూర్పు డెల్టాలోని ధవళేశ్వరం వద్ద మూడు ఇన్లెట్లు నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, రామచంద్రపురం, కె.గంగవరం (కోనసీమ జిల్లా), సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు (కాకినాడ జిల్లా), రాజమహేంద్రవరం రూరల్, కడియం (తూర్పు గోదావరి జిల్లా)లకు నీరు అందుతుంది. ఇప్పుడున్న పథకాలకు అనుసంధానం తూర్పు, మధ్య డెల్టాల్లోని వాటర్ గ్రిడ్ పరిధిలో ఇప్పటికే పలు పథకాలున్నాయి. 31 సీడబ్ల్యూసీ, 390 పీడబ్ల్యూసీ స్కీమ్‌ల ద్వారా తాగునీరు అందుతోంది. వీటిని వాటర్ గ్రిడ్ పరిధిలోకి తీసుకురానున్నారు. కొత్తగా మరికొన్ని పథకాలు రానున్నాయి. వీటితో పాటు జల్‌జీవన్ మిషన్ ద్వారా నిర్మిస్తున్న పైప్లైన్ల ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందించనున్నారు. రెండున్నరేళ్లలో పూర్తి మంచినీటి పథకాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని అనుమతులూ వచ్చిన వెంటనే పనులు మొదలు కానున్నాయి. రెండు డెల్టాల్లోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 20 ఏళ్ల తరువాత అవసరాలు కూడా తీర్చేలే పథకాన్ని రూపొందించాం. – సీహెచ్ఎన్వీ కృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి, అమలాపురం -
8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8% గృహాలకు వారంలో కేవలం ఒక్కరోజు నీరు సరఫరా అవుతుండగా, 74% మందికి వారమంతా అందుతున్నట్లు కేంద్రం జల్‌శక్తి శాఖ అధ్యయనంలో వెల్లడైంది. మరో 4% గృహాలకు వారంలో ఐదారు రోజులు, 14% మందికి కనీసం మూడు, నాలుగు రోజులు నీరు అందుతోందని ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మొత్తమ్మీద సరాసరిన రోజుకు మూడు గంటలు చొప్పున నీరు సరఫరా అవుతున్నట్లు వివరించింది. తమ ఇళ్లలోని కుళాయిల ద్వారా అందే నీటితో రోజువారీ అవసరాల్లో 80% వరకు తీరుతున్నట్లు ప్రతి ఐదుగురిలో నలుగురు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, యూపీల్లో కుళాయి కనెక్షన్లు లేని గృహాలు అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. కనీసం ఆరు రాష్ట్రాల్లోని 30%పైగా గృహాలకు గత వారం రోజులుగా కుళాయి నీరు కాలేదని వెల్లడైంది. ‘హర్ ఘర్ జల్’ పథకం అమలవుతున్న 91% గృహాల్లోని కుళాయిలు సర్వే చేపట్టిన రోజు పనిచేస్తున్నట్లు గుర్తించారు (జాతీయ స్థాయిలో ఇది 86%). 91% గృహాలకు 88% గృహాలకు అవసరాలకు సరిపోను (రోజుకు ప్రతి వ్యక్తికి 55 లీటర్లకు మించి) నీరు అందుతుండగా, 84% ఇళ్లకు రోజూ సరఫరా అవుతోంది. 90% గృహాలకు కుళాయిల ద్వారా మంచినీరు అందుతోంది. -
Guntur: పల్లెల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్
సాక్షి, గుంటూరు: ఏ పల్లెలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి వ్యక్తికీ రోజుకు సగటున 55 లీటర్ల నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. జలజీవన్ మిషన్ పథకం ద్వారా 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గతంలో ఒక వ్యక్తికి రోజుకు సగటున 45 లీటర్ల నీటిని అందించాలని, ఆ మేరకు తాగునీటి పథకాలను జలజీవన్ మిషన్‌లో భాగంగా విస్తరించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అయితే మారిన జీవన ప్రమాణాల నేపథ్యంలో సగటున ఓ వ్యక్తికి రోజుకు 55 లీటర్లు అవసరమని గుర్తించి మళ్లీ ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ పనులకు అక్టోబర్ 2020లో పాలనా అనుమతులు లభించగా, 2021లో మొదలయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వీటిని జిల్లాల వారీగా విభజించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఈ పనులు చేపడుతున్నారు. 5,79,156 ఇళ్లకు కుళాయిలు 2020 ఏప్రిల్ 1 నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2,21,270 ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. జల జీవన్ మిషన్ పథకం ద్వారా 2024 నాటికి ఈ సంఖ్యను 5,79,156కి చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం రూ.400.74 కోట్లతో 1,264 పనులు చేపట్టారు. వీటిని పని విలువను బట్టి విభజించి టెండర్లు పిలిచారు. కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. మూడు దశల్లో పనులు ► జలజీవన్ మిషన్ పనులను మూడు దశలుగా విభజించారు. ► తొలిదశలో ఇప్పటికే సగటున ఓ వ్యక్తికి రోజుకు 40 లీటర్లు ఇస్తున్న గ్రామాల్లో అందుబాటులో ఉన్న పథకాలను విస్తరించడం, అంతర్గత పైపు లైన్లను నిర్మించడం చేయనున్నారు. ► రెండో దశలో ఇప్పటికే ఉన్న పథకాలకు అదనపు నీటి సదుపాయాలను సమకూర్చనున్నారు. ► మూడో దశలో తాజా ప్రతిపాదనల మేరకు కొత్త పథకాల నిర్మాణం చేపట్టనున్నారు. ► ఉపరితల జలాల లభ్యత లేని ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాలను వినియోగించేలా పథకాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ► జలజీవన్ మిషన్ పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 25 శాతం మహిళలు, వార్డు మెంబర్లకు, 50 శాతం వెనకబడిన తరగతుల వారీకి సభ్యులుగా అవకాశం కల్పించారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి సమగ్ర వినియోగంపై దృష్టిసారించేలా చూడనున్నారు. -
AP: గొంతు తడిసి.. పల్లె మురిసి!
చిత్తూరు కార్పొరేషన్: తాగునీటి అవస్థలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. జలజీవన్ మిషన్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 3,72,233 కొళాయి కనెక్షన్లు ఇవ్వగా మిగిలిన 1,25,220 కనెక్షన్లను 2024కల్లా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీచేశాయి. సీజన్ ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించాలని సంకల్పించాయి. దీనిపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. జలజీవన్ లక్ష్యం ఇలా.. గ్రామంలోని అన్ని కుటుంబాలకు కొళాయి కనెక్షన్ ఇవ్వడం స్థానిక తాగునీటి వనరుల లభ్యత, సమస్యను అధిగమించడం ప్రస్తుత్తం ఉన్న తాగునీటి పంపిణీ వ్యవస్థ నుంచి మరింత మెరుగైన సేవలు అందించడం అవసరమైన చోట అదనపు బోర్లు, తాగునీటి ట్యాంకులు, అదనపు పైప్లైన్లు వేయడం ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించడం రెండేళ్లలో ప్రతి గడపకూ తాగునీరు జిల్లాలోని ప్రతి గడపకూ జలజీవన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా 2020–21 సంవత్సరంలో 2,82,755 కొళాయి కనెక్షన్లు, 2021–2022లో 89,478 కనెక్షన్లు ఇచ్చారు. దీనికి రూ.53 కోట్లమేర ఖర్చుచేశారు. అలాగే మరో రెండేళ్లలో 1,25,220 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం నిర్ధేశించుకున్నారు. కొత్తపనులు ఇలా.. జలజీవన్ ద్వారా జిల్లాకు 9,916 తాగునీటి పనులు మంజూరయ్యాయి. వీటికి రూ.2,234 కోట్లు ఖర్చుచేయనున్నారు. 1,060 జగనన్న కాలనీల్లో బోర్లు, పైప్లైన్లతోపాటు ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ ఇచ్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో సమగ్ర రక్షిత నీటి పథకాలు ఆరు, రక్షిత నీటి పథకాలు 10,360 ఉండగా వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచనున్నారు. అలాగే పశ్చిమ మండలాల్లో కెనాల్స్ నుంచి నీటిని శుద్ధి చేసి సమస్య ఉన్న 20 మండలాలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయనున్నారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. నీటి సరఫరా మెరుగు ఎండాకాలం తాగునీటి సరఫరా కష్టంగా ఉండేది. భూగర్భ జలాలు అడుగంటడంతో శివారు ప్రాంతాల్లో మంచినీటి పథకాలు పనిచేసేవి కావు. పొలాలు, ఇతర గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవస్థలు లేవు. జలజీవన్ మిషన్ ద్వారా రక్షిత మంచినీటి పథకాలు మెరుగుపడ్డాయి. కొత్త పనులకు టెండర్లు పిలిచాం. – విజయ్‌కుమార్, ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ ఈమె పేరు సంగీత. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కురమైపల్లె గ్రామం. గతంలో నీళ్లు తెచ్చుకోవడానికి అష్టకష్టాలు పడేది. గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి మోటారు వద్ద, అక్కడ నీరు రాకపోతే చేతిబోరు వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడేది. నీళ్లులేక ఇంట్లో పనులు చేయాలన్నా ఇబ్బందిగా ఉండేది. సకాలంలో కూలికెళ్లలేక అవస్థలు ఎదుర్కొనేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటి వద్దే కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేయడంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈమె పేరు వీరభద్రమ్మ(52). చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం, అగ్రహారం గ్రామవాసి. కిలోమీటరు దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. రోజూ అవస్థలు తప్పేవి కావు. ప్రస్తుతం జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించారు. ఇంటిముందే కొళాయి ఏర్పాటు చేయడంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. స్వచ్ఛమైన నీరు తాగుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు.