సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ‘జలజీవన్ మిషన్’ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలుస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఈ పథకం అమలు జరుగుతుండగా.. రాష్ట్రాల వారీగా పథకం అమలు జరుగుతున్న తీరుపై కేంద్రం ప్రతినెలా పథకం అమలులో పురోగతిపై జిల్లాల వారీగా ర్యాంకుల్ని ప్రకటిస్తూ వస్తోంది.
కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ విభాగం ‘జలజీవన్ మిషన్ సర్వేక్షణ్ బులెటిన్’ పేరుతో విడుదల చేస్తోంది. డిసెంబర్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం అమలు జరిగిన తీరుపై కేంద్రం తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో మన రాష్ట్రంలోని విశాఖపట్నం దేశంలోనే రెండవ ర్యాంక్ కైవసం చేసుకోగా.. మరో రెండు జిల్లాలు టాప్–10 ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఐదవ స్థానం దక్కగా, అనకాపల్లి జిల్లా దేశంలోనే టాప్–10 జిల్లాల జాబితాలో పదో స్థానాన్ని దక్కించుకుంది.
మూడు అంశాల ఆధారంగా..
ప్రతినెలా జిల్లాల వారీగా ఆయా గ్రామాల్లో కొత్తగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వటం.. తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణ.. అందుకు గ్రామ స్థాయిలో కలి్పస్తున్న వసతులు అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా కేంద్రం ప్రతినెలా దేశంలోని జిల్లాలకు ర్యాంకులు కేటాయిస్తోంది. డిసెంబర్ నెలలో తమిళనాడులోని సేలం జిల్లా 91.79 మార్కుతో దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించగా.. మన రాష్ట్రంలోని విశాఖ జిల్లా 86.85 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా 81.83 మార్కులతో 5వ ర్యాంక్, అనకాపల్లి జిల్లా 72.55 మార్కులతో పదో ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల వారీగా వివిధ అంశాలపై ప్రతినెలా జిల్లాల వారీగా పథకం పురోగతిపై మార్కులను కేటాయిస్తూ ర్యాంకులు ఇస్తోందని.. ప్రతినెలా ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయని రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు వివరించారు.
చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి..
Comments
Please login to add a commentAdd a comment