సాక్షి, అమరావతి: ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, ఇతర సదుపాయాల కల్పనపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలినుంచీ ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తోంది. ఇందులో భాగంగా నాడు–నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది.
ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛత, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి. దేశంలోనే కాయకల్ప గుర్తింపు కలిగిన అత్యధిక ఆస్పత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది.
3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపు
పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆస్పత్రుల్లో పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించి అంటు వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు నియంత్రించడానికి ‘కాయకల్ప’ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రుల్లో స్వచ్ఛత, రోగులకు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న సదుపాయాలు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుధ్యం, రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు వంటి ఏడు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఆస్పత్రులకు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా 2022–23లో దేశవ్యాప్తంగా 20,336 ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ అవార్డులను కేటాయించారు.
ఇందులో 3,161 ఆస్పత్రులకు అవార్డులు పొందిన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2,619 ఆస్పత్రులతో తమిళనాడు రెండో స్థానంలో, 2,414 ఆస్పత్రులతో ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో 734, కర్ణాటకలో 371, కేరళలో ఆస్పత్రులకు మాత్రమే అవార్డులు లభించాయి. ఇదిలా ఉండగా ఆస్పత్రుల్లో జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించే విభాగంలోనూ ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2022–23లో దేశవ్యాప్తంగా 2,041 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) లభించగా.. ఇందులో 18 శాతం ఆస్పత్రులు ఏపీ నుంచి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment