సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా ఆదాయాన్ని వెల్లడించి ప్రభుత్వానికి పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్ల సంఖ్య ఏకంగా 18 లక్షలు పెరిగిందని, దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంతటి పెరుగుదల లేదని ఎస్‌బీఐ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది.
నిజానికి దేశవ్యాప్తంగా పెరిగిన ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2015–2020 మధ్య 3.81 కోట్లుండగా... 2020–23 మధ్య మాత్రం 1 కోటి మాత్రమే. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉన్నా... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ ఐదేళ్లలో కేవలం 5 లక్షల మందే ట్యాక్స్ పేయర్లు పెరిగినట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. మొత్తంగా చూస్తే 2015– 2023 మధ్య రాష్ట్రంలో 23 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు పెరిగారు.
గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరిగాయని, తక్కువ ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఆదాయాల కేటగిరీల్లోకి వెళుతున్నారని... ఆదాయాన్ని వెల్లడించి పన్ను చెల్లిస్తుండటంతో ట్యాక్స్ పేయర్ల సంఖ్య పెరుగుతోందని సంస్థ తెలియజేసింది. ఫలితంగా 2023లో ఐటీ రిటర్నుల దాఖల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు అగ్ర స్థానాల్లో నిలిచాయి.
పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల ఆదాయం..
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక మేరకు... 2014లో దేశంలో మధ్యతరగతి ప్రజల సగటు ఆదాయం రూ.4.4 లక్షలు. 2023 నాటికి అది రూ.13 లక్షలకు పెరిగింది. 2047 నాటికి ఇది రూ.49.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. గడిచిన పదేళ్లలో రూ.5 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.10 లక్షల ఆదాయ కేటగిరీలో పన్ను చెల్లించే వారు ఏకంగా 8.1 శాతం పెరిగారు. అలాగే రూ.10 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.20 లక్షల ఆదాయ కేటగిరీకి వెళ్లిన వారు 3.8 శాతం మంది. ఇక రూ.20 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.50 లక్షల కేటగిరీకి చేరింది 1.5 శాతం. రూ.50 లక్షల కేటగిరీ నుంచి రూ.1 కోటి కేటగిరీకి 0.2 శాతం మంది, రూ.1 కోటికి పైగా ఆదాయ కేటగిరీలో 0.02 శాతం మంది పెరిగారని నివేదిక విశ్లేషించింది.
ఐటీ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుదల
ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ వెల్లడించింది. దేశ జనాభా 2023లో 140 కోట్లుండగా 2047 నాటికి ఇది 161 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 53 కోట్లు. 2047 నాటికి 72.5 కోట్లకు పెరగవచ్చని అంచనా. అంటే.. మొత్తం జనాభాలో ప్రస్తుతం ఉద్యోగులు 37.9 శాతం ఉండగా 2047 నాటికి 45 శాతానికి పెరుగుతారని నివేదిక వెల్లడించింది. 2023లో ఐటీ పరిధిలోకి 31.3 కోట్ల మంది ఉద్యోగులు రాగా 2047 నాటికి 56.5 కోట్లకు ఈ సంఖ్య పెరగవచ్చని అంచనా. ట్యాక్స్ పేయర్లలో ఉద్యోగుల వాటా ప్రస్తుతం 59.1 శాతం ఉండగా 2047 నాటికి ఇది 78 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment