middle class people
-
AP: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఐటీ చెల్లింపుదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా ఆదాయాన్ని వెల్లడించి ప్రభుత్వానికి పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్ల సంఖ్య ఏకంగా 18 లక్షలు పెరిగిందని, దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంతటి పెరుగుదల లేదని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. నిజానికి దేశవ్యాప్తంగా పెరిగిన ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2015–2020 మధ్య 3.81 కోట్లుండగా... 2020–23 మధ్య మాత్రం 1 కోటి మాత్రమే. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉన్నా... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ ఐదేళ్లలో కేవలం 5 లక్షల మందే ట్యాక్స్ పేయర్లు పెరిగినట్లు ఎస్బీఐ తెలియజేసింది. మొత్తంగా చూస్తే 2015– 2023 మధ్య రాష్ట్రంలో 23 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు పెరిగారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరిగాయని, తక్కువ ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఆదాయాల కేటగిరీల్లోకి వెళుతున్నారని... ఆదాయాన్ని వెల్లడించి పన్ను చెల్లిస్తుండటంతో ట్యాక్స్ పేయర్ల సంఖ్య పెరుగుతోందని సంస్థ తెలియజేసింది. ఫలితంగా 2023లో ఐటీ రిటర్నుల దాఖల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు అగ్ర స్థానాల్లో నిలిచాయి. పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల ఆదాయం.. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక మేరకు... 2014లో దేశంలో మధ్యతరగతి ప్రజల సగటు ఆదాయం రూ.4.4 లక్షలు. 2023 నాటికి అది రూ.13 లక్షలకు పెరిగింది. 2047 నాటికి ఇది రూ.49.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. గడిచిన పదేళ్లలో రూ.5 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.10 లక్షల ఆదాయ కేటగిరీలో పన్ను చెల్లించే వారు ఏకంగా 8.1 శాతం పెరిగారు. అలాగే రూ.10 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.20 లక్షల ఆదాయ కేటగిరీకి వెళ్లిన వారు 3.8 శాతం మంది. ఇక రూ.20 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.50 లక్షల కేటగిరీకి చేరింది 1.5 శాతం. రూ.50 లక్షల కేటగిరీ నుంచి రూ.1 కోటి కేటగిరీకి 0.2 శాతం మంది, రూ.1 కోటికి పైగా ఆదాయ కేటగిరీలో 0.02 శాతం మంది పెరిగారని నివేదిక విశ్లేషించింది. ఐటీ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుదల ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడించింది. దేశ జనాభా 2023లో 140 కోట్లుండగా 2047 నాటికి ఇది 161 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 53 కోట్లు. 2047 నాటికి 72.5 కోట్లకు పెరగవచ్చని అంచనా. అంటే.. మొత్తం జనాభాలో ప్రస్తుతం ఉద్యోగులు 37.9 శాతం ఉండగా 2047 నాటికి 45 శాతానికి పెరుగుతారని నివేదిక వెల్లడించింది. 2023లో ఐటీ పరిధిలోకి 31.3 కోట్ల మంది ఉద్యోగులు రాగా 2047 నాటికి 56.5 కోట్లకు ఈ సంఖ్య పెరగవచ్చని అంచనా. ట్యాక్స్ పేయర్లలో ఉద్యోగుల వాటా ప్రస్తుతం 59.1 శాతం ఉండగా 2047 నాటికి ఇది 78 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. -
మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారే..కానీ సేవల్లో శ్రీమంతులు
ఆ ముగ్గురూ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. అయితేనేం సేవలో మాత్రం శ్రీమంతులని నిరూపించుకున్నారు. తమకు ఉన్నంతలోనే సాయపడుతు న్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఒకతను కరోనా సమయంలో పేదలకు అండగా నిలిస్తే.. మరొకతను ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. ఓ మహిళ బాలికలకు తోడుగా నిలిచారు. ఆత్మకూరుకు చెందిన పున్నేపల్లి సుబ్రహ్మణ్యం, కరవళ్ల రవీంద్రారెడ్డి, జ్యోతి జయలక్ష్మి విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. – ఆత్మకూరు వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని.. పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కరవళ్ల రవీంద్రారెడ్డి సామాన్య రైతు. పొలం పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమారులను చదివించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది తన కొడుకు పుట్టినరోజు నాడు 200 మందికిపైగా పేదలకు దుప్పట్లు, వస్త్రాలు అందజేస్తుంటారు. ఇంకా నల్లపరెడ్డిపల్లి, బట్టేపాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మెరిట్ విద్యార్థులకు, ఆత్మకూరు కళాశాలలో మంచి మార్కులు సాధించిన వారికి నగదు బహుమతులు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం పేదలకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. ఈయన సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, సమీప బంధువులు తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు పెట్టి.. దొరవారిసత్రం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పున్నేపల్లి సుబ్రహ్మణ్యం బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అండగా ఉంటారనుకున్న అక్కలు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో దాతల సహకారంతో సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్నారు. బీకాం కంప్యూటర్స్ చేశారు. ఈయన 18 ఏళ్ల క్రితం ఆత్మకూరులో స్థిరపడ్డారు. ఆత్మకూరు, ఉదయగిరి, వింజమూరు ప్రాంతాల్లో కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఆయన వల్ల అనేక మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఇంకా తల్లి పేరుతో రమా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా మదర్‌థెరిస్సా జయంతి రోజున గిరిజన, దళితకాలనీల్లో పేదలకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు పంపిణీ చేస్తుంటారు. ఉపాధి కోసం పలువురికి ఉచితంగా కంప్యూటర్లను అందజేశారు. ఈయన సేవలను చూసి పలువురు తమవంతుగా ఆర్థిక సాయాన్ని ట్రస్ట్‌కు అందజేస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నో కాలనీల్లో నిత్యావసర సరుకులు, భోజన ప్యాకెట్లను రోజుల తరబడి పంపిణీ చేశారు. దాతల సహకారంతో నెల్లూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశారు. చేసిన సేవలకు గానూ ఇప్పటికి ఆరుసార్లు మంత్రులు, కలెక్టర్ ద్వారా అవార్డులు అందుకున్నారు. బాలికలకు భరోసా జ్యోతి జయలక్ష్మి ఆత్మకూరు మండలం కరటంపాడు మజరా శ్రీనివాసపురం దళితకాలనీకి చెందిన మహిళ. ఆమె పుట్టి పెరిగింది తమిళనాడు రాష్ట్రంలోనైనా వివాహానంతరం శ్రీనివాసపురంలో స్థిరపడ్డారు. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. చిన్నప్పటి నుంచి సేవా భావాలు కలిగిన జయలక్ష్మి కిశోర బాలికల సమస్యలను అర్థం చేసుకుని వారికి కావాల్సిన న్యాప్కిన్లు, సోప్‌లు అందజేశారు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత తన సేవలను మరింత విస్తరించారు. పౌష్టికాహారం తయా రు చేసి పేద పిల్లలకు అందిస్తున్నారు. పేద బాలికలకు యూనిఫాం కొనుగోలు చేసి అందజేశారు. కాలనీల్లో ప్రజలకు పరిశుభ్రత, దాని ప్రాధాన్యం వివరిస్తూ వారిని క్రమశిక్షణ దిశగా నడిపిస్తున్నారు. -
సకల సౌకర్యాలతో లేఅవుట్లు.. తక్కువ ధరకే ఉద్యోగులు, మధ్యతరగతి వారికి ప్లాట్లు
సొంతిల్లు...ప్రతి ఒక్కరి కల. నిరుపేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇంటిస్థలం ఇస్తోంది. అర్హత ఆధారంగా ఇల్లు కూడా కట్టిస్తోంది. కానీ ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు ఆ అవకాశం లేదు. వీరంతా దాదాపు పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. సమీపంలో స్థలం కొందామంటే..ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా అనుమతుల తిరకాసులెన్నో...ఇలాంటి వారికీ ప్రభుత్వం అండగా నిలిచింది. ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ పేరుతో సకల సౌకర్యాలు, అన్ని అనుమతులతో కూడిన స్థలాన్ని అతితక్కువ ధరకే అందిస్తోంది. హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా): మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (ఎంఐజీ) పేరుతో లేఅవుట్ల రూపొందించి తక్కువ మొత్తానికే పట్టణ పరిధిలో ఇంటి స్థలాలను అందిస్తోంది. న్యాయపర సమస్యలు లేకుండా క్లియర్ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటోంది. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ పేరిట పట్టణ సమీప ప్రాంతాల్లోనే వందల ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో లేఅవుట్లు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో రెండు ప్రాంతాల్లో.. జిల్లాలోని ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాల్లో ఎంఐజీ లేఅవుట్లు సిద్ధం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గం కుణుతూరులో ఇప్పటికే ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయ. మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరమయ్యాయి. సదుపాయాలు ఇలా.. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్లన్నీ ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా రిజిష్టర్ అయి ఉంటాయి. లేఅవుట్లో 60 అడుగుల బీటీ రోడ్డు, 40 అడుగుల సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, ఫుట్‌పాత్‌లు, ఈఎల్‌ఎస్‌ఆర్‌లతో నీటి సరఫరా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, భూగర్భ మురుగు కాల్వలు, వీధి దీపాలు ఉంటాయి. అలాగే వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలతో పాటు ఆహ్లాదం పంచేలా పార్కులు అభివృద్ధి చేస్తారు. ఇతర అన్ని రకాల సదుపాయలూ కల్పిస్తారు. అర్హతలు ఇలా.. ఎంఐజీ లేఅవుట్లలో ఒక కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయిస్తారు. సంవత్సర ఆదాయం రూ. 18 లక్షల్లోపు ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఆధార్ కార్డు ద్వారా మాత్రమే దరఖాస్తు నమోదు సాధ్యమవుతుంది. ఆసక్తి కలిగిన వారు migapdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసి ప్లాటు కేటగిరీ మొత్తం విలువలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్లలో విక్రయాల అనంతరం పారదర్శకంగా లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు ప్లాటు నంబర్లు కేటాయిస్తారు. ఆ తర్వాత నిర్ణీత సమయంలో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్లాటు కేటాయింపు రద్దు చేసి, అర్హత కలిగిన ఇతరులకు కేటాయిస్తారు. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ నుంచి దరఖాస్తుదారులు నెలలోపు ప్లాటు మొత్తంలో 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వందశాతం చెల్లిస్తే 5 శాతం రాయితీ కూడా ఇస్తారు. ఉద్యోగులకు 20 శాతం రాయితీ.. ప్రభుత్వ ఉద్యోగులకు మరికొంత లబ్ధి చేకూరే విధంగా లేవుట్ మొత్తం ప్లాట్లలో పదిశాతం రిజర్వు చేశారు. అంతేకాకుండా లేఅవుట్ ఏర్పాటు చేసిన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ఇంటి స్థలం కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఫాం–16 సమర్పించాల్సి ఉంటుంది. ► హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం కోడూరు గ్రామ సమీపంలో బెంగళూరు 44 జాతీయ రహదారి పక్కనే 774, 775 సర్వే నంబర్లలో 7 ఎకరాల్లో 98 ప్లాట్లతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లేఅవుట్లో సెంటు రూ.3.63 లక్షలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ లేవుట్‌లో వివిధ అభివృద్ధి పనుల కోసం పబ్లిక్ హెల్త్ ఎస్ఈ టెండర్లు ఆహ్వానించారు. ► ధర్మవరం నియోజకవర్గంలో కుణుతూరు సర్వే నంబర్లు 498,499, 628 నుంచి 642 వరకు 120 ఎకరాల్లో 1,272 ప్లాట్లతో అతిపెద్ద జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేశారు. 2021 నవంబర్ 21న రూ.106.00 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ లేఅవుట్లో సెంటు ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్లాట్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని అనుమతులతో లేఅవుట్లు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్ల పథకం వల్ల మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొంత రాయితీ కూడా ఉంటుంది. అన్ని మౌలిక వసతులతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, వివాదాలు లేని లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 150/200/240 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు రూ. 3 లక్షల నుంచి రూ.18 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారందరూ అర్హులు. ఆసక్తి గల వారు సచివాలయం, లేదా మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సంప్రదించవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తుచేసుకోవచ్చు. – డాక్టర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, హిందూపురం అన్ని సదుపాయాలతో అభివృద్ధి ఎంఐజీ లేఅవుట్లలో అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. నిజంగా ఇది మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు మంచి అవకాశం. కొడికొండ వద్ద, హైవే పక్కనే లేఅవుట్ సిద్ధం అవుతోంది. హిందూపురం ప్రాంత ప్రజలకు చక్కటి అవకాశం. త్వరలోనే మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభమవుతున్నాయి. ధర్మవరం కుణుతూరు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలోనే అది పూర్తవుతుంది. – ఈశ్వరయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అహుడా.అనంతపురం. -
బడ్జెట్ 2022: మధ్యతరగతి వర్గానికి ఒకింత ఊరట!
బడ్జెట్ కసరత్తులో కేంద్రం తలమునకలై ఉంది. జనవరి 31న మొదలయ్యే మొదటి విడత సమావేశాలు.. ఫిబ్రవరి 11 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇక బడ్జెట్ వస్తుందంటే.. తమకు ఊరట దక్కుతుందా? అని అన్నివర్గాలు ఆశగా చూస్తుంటాయి. ఈ క్రమంలో మధ్యతరగతికి ఒకింత ఊరట ఇచ్చే అంశాల తెరపైకి వచ్చాయి. రెండు దఫాలుగా జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో ‘బడ్జెట్’ ఎలా ఉండబోతుందో అనే అంశంపై జోరుగా ఆర్థిక మేధావుల్లో చర్చ నడుస్తోంది. 2022-23 బడ్జెట్లో కేంద్రం మధ్యతరగతి ప్రయోజనాల దృష్ట్యా.. రెండు రకాల పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో మొదటిది.. స్టాండర్డ్ డిడక్షన్.. ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకునే వెసులుబాటు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో ఎత్తివేసిన ఈ ప్రయోజనాన్ని.. తిరిగి 2018-19 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మొదట రూ.40,000గా ప్రకటించి.. ఆపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.50,000కు పెంచింది. ఇప్పుడు దీన్ని మరి కొంత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మాదిరే రూ.10,000 పెంచుతారా? మరింత ప్రయోజనం కల్పిస్తారా? అనే దానిపై బడ్జెట్లోనే స్పష్టత రానుంది. వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగుతున్న నేపథ్యంలో.. కొన్ని దేశాలు అమలు చేస్తున్న తరహా ప్రయోజనాల్ని ఆశిస్తున్నారు. పిల్లల చదువు పొదుపు.. ఏటేటా పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. సుకన్య సమృద్ధి యోజన.. అదీ అమ్మాయిలకు తప్పించి మరేయితర ప్రయోజనం చేకూరడం లేదు. ఈ తరుణంలో ‘సెక్షన్ 80-సీ’ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇదే మంతప్రయోజనంగా లేదనేది అసలు విషయం. ఎందుకంటే జీవిత బీమా ప్రీమియం, ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. పైగా పాఠశాల ఉన్నత విద్య, ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం చేసే పొదుపు, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్! -
మధ్యతరగతి ‘మేలు’పర్వతం.. రూ.480 కోట్ల విలువ చేసే కొండ ప్రాంతం
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. మధ్యతరగతి ప్రజల సొంతిల్లు సాకారం దిశగా అడుగులు వేస్తోంది. జగనన్న స్మార్ట్ సిటీల ఏర్పాటులో భాగంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ స్థలాలను కేటాయించాలంటూ సర్కారు ఆదేశించడంతో మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్(ఎంటీఎంసీ) పరిధిలోని మధ్యతరగతి ప్రజల కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానిక అధికారులతో కలసి స్థలాన్వేషణ చేపట్టారు. అనేక చర్చోపచర్చల అనంతరం కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే ఉన్న కొండను ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 33.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండను తొలచి బహుళ అంతస్తులు నిర్మించి మధ్యతరగతి ప్రజలకు ఇళ్లను కేటాయించనున్నారు. ఈ నివాసాల్లో డబుల్, త్రిబుల్ బెడ్రూమ్లు నిర్మించేందకు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. రూ.వందల కోట్ల విలువ ఈ కొండ ప్రాంతం జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఇక్కడ ఎకరం భూమి విలువ రూ.15 కోట్లు పలుకుతోంది. మొత్తం 33.8 ఎకరాల విలువ రూ.480 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. బైపాస్‌రోడ్‌లో ఒక సెంటు స్థలం కొనాలంటే రూ.20 లక్షలపైన ఉంది. డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనాలంటే రూ.50లక్షలపై మాటే. త్రిబుల్ బెడ్రూమ్ కొనాలంటే రూ.60లక్షలు పైనే ఉంటుంది. అదే పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు వేసే వెంచర్లలో అయితే త్రిబుల్ బెడ్ రూమ్ రూ.1.25 కోట్లు ఉంటుంది. అదే నాణ్యతతో అతి తక్కువ ధరలకు మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ఇళ్లను అందజేయనుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విజయవాడకు ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో.. ఈ కొండకు ఆనుకుని ఒక పక్క జాతీయ రహదారి మరో పక్క ఎయిమ్స్ రహదారి ఉన్నాయి. కేవలం జాతీయ రహదారికి 500 మీటర్లు, ఎయిమ్స్ రహదారికి 25 మీటర్లు దూరం మాత్రమే ఉంది. విజయవాడకు వెళ్లాలంటే కేవలం 5 నిమిషాలు. గుంటూరు వెళ్లాలంటే 25 నిమిషాల సమయం పడుతుంది. ఇలాంటి విలువైన స్థలం కార్పొరేట్ సంస్థలకు ఇస్తే కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. కానీ.. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం కేటాయించడంపై ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిమ్స్ రోడ్ సీఆర్డీఏకు అప్పగింత.... ఇప్పటికే తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి కొండ ప్రాంతాన్ని సర్వే చేసి 33.8 ఎకరాల భూమిని సీఆర్డీడీఏకు అప్పగించారు. సీఆర్డీఏ అధికారులు అతి త్వరలోనే ఆ కొండను ఆధునిక పద్ధతుల్లో తొలచి భవనాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆరునెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని ఏపీఎంఆర్డీ అధికారులు స్పష్టంచేశారు. సర్వే పూర్తయింది జగనన్న స్మార్ట్ సిటీ కోసం కేటాయించిన కొండ ప్రాంతం సర్వే పూర్తయింది. ఇప్పటికే స్థలం చుట్టూ బౌండరీ రాళ్లను ఏర్పాటు చేసి ఏపీఎంఆర్డీ అధికారులకు అప్పగించాం. త్వరలో వారు అక్కడ పనులను చేపట్టి ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. – శ్రీనివాసులురెడ్డి, తాడేపల్లి తహసీల్దార్ ఉద్యోగులకు ఉపయోగం మా నాన్నగారు ఉద్యోగి కావడంతో మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి కలగలేదు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల మాకు మేలు చేస్తుంది. జగనన్న స్మార్ట్ సిటీ అమల్లోకి వస్తే మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని మధ్యతరగతి కుటుంబీకులకు అద్దెల బాధలు తొలగిపోతాయి. ఇక్కడ ఏ ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా రూ.6 వేల నుంచి రూ.15 వేలు చెల్లించాల్సి వస్తోంది. సంపాదించిన జీతం ఇంటి అద్దెకే కట్టాలి. ఆ ఇళ్లు వస్తే ఇక ఆ బాధ ఉండదు. – మధు, ఉండవల్లి సెంటర్ మాట నిలబెట్టుకున్న జగనన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి బంగారు కొండ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మధ్య తరగతి ప్రజల కోసం తాడేపల్లి కొలనుకొండలో ఇంత విలువైన స్థలం కేటాయిస్తారని కలలోనైనా ఊహించలేదు. గత ప్రభుత్వంలో జాతీయ రహదారి పక్కన ఉన్న విలువైన స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. కానీ జగనన్న అలా చేయకుండా ఎకరం రూ.15 కోట్లు ఉన్న స్థలాన్ని మధ్యతరగతి ప్రజలకు కేటాయించడం హర్షణీయం. – కత్తిక రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ, దుర్గగుడి బోర్డ్ మెంబర్ -
Jagananna Smart Town Scheme: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికా బద్ధంగా ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల (ఎంఐజీ – మిడిల్ ఇన్‌కం గ్రూప్ లేఔట్లు) నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికకు బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ప్లాట్లకు ఉన్న డిమాండ్‌ను తెలుసుకోవడం కోసం నిర్వహించిన ప్రాథమిక సర్వేకు అపూర్వ స్పందన లభించింది. ఈ పథకం కింద ప్లాట్ పొందడానికి 3.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. స్మార్ట్ టౌన్ షిప్ లే ఔట్లు అన్నీ ఒకే విధంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఔట్లను ప్రభుత్వం లబ్ధిదారులను సరసమైన ధరలకు అందించనుంది. లేఔట్లకు భూసేకరణ, ప్లాట్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక.. ఇలా ప్రతి దశలో పారదర్శకతతో వ్యవహరిస్తుంది. జిల్లా స్థాయి కమిటీల నుంచి వచ్చిన స్థలాల వివరాలు, లేఔట్ల ఏర్పాటు, ఇతర ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ స్క్రూటినీ చేసి ఆమోదిస్తుంది. జిల్లాల్లో స్మార్ట్ టౌన్లకు అవసరమైన భూమిని అంచనా వేయడం, మార్గదర్శకాల మేరకు భూమిని గుర్తించడం, ప్లాట్లను నిర్మించడం జిల్లా కమిటీల బాధ్యత అని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలతో లేఔట్లు ► డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో మూడు కేటగిరీల్లో ప్లాట్లు. ► లేఔట్లలో 60 అడుగులు బీటీ, 40 అడుగులు సీసీ రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం. నీటి నిల్వ, సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు. ► అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్‌లు, ఇతర వసతుల కల్పన. ► నగరాలు, పట్టణాల్లోని మార్కెట్ విలువ, లేఔట్‌కు చుట్టుపక్కల ఉన్న ఇతర లేఔట్ల ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయిస్తుంది. ► అనంతరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి ధరల్లో మార్పులు చేర్పులు చేస్తూ ప్రతిపాదనలు అందితే రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదిస్తుంది. ఇవీ అర్హతలు ► ఒక కుటుంబానికి ఒకే ప్లాట్ ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వార్షిక ఆదాయం రూ.18 లక్షల లోపు ఉండాలి. ► 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ► లబ్ధిదారుడు ఏపీలో నివసిస్తూ ఉండాలి. ► ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్లాట్ల కేటాయింపు ఇలా.. ► డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) రూపొందించిన వెబ్సైట్లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా స్థానిక వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ► ప్లాట్ అమ్మకం ధరపై 10 శాతం మొత్తాన్ని దరఖాస్తు సమయంలో ఆర్టీజీఎస్/ఎన్ఈఎఫ్టీ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ► లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు ప్లాట్ పొందలేకపోతే లాటరీ అనంతరం నెల రోజులకు దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని వెనక్కు ఇస్తారు. చెల్లింపులు ఇలా.. ► ప్లాట్ పొందిన దరఖాస్తుదారులు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించాలి. ► అగ్రిమెంట్ కుదుర్చుకున్న నెల రోజులకు 30 శాతం, ఆరు నెలలలోపు మరో 30 శాతం, ఏడాది లోపు మిగతా 30 శాతం చెల్లించాలి. ఒక నెలలోపు ప్లాట్ అమ్మకం మొత్తాన్ని చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇస్తారు. వాయిదా చెల్లించడంలో ఆలస్యం అయితే 0.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. -
మధ్య తరగతి సొంతింటి కల నెరవేరుస్తాం
చిలకలపూడి (మచిలీపట్నం): పేదవారికి ఇప్పటికే సొంతింటి కల నెరవేర్చి స్థల పట్టాలు ఇచ్చామని, మధ్య తరగతి కుటుంబీకులకు కూడా అతి తక్కువ ధరతో సొంతింటి కలను నెరవేర్చేందుకు వైఎస్ జగన్ స్మార్ట్ కాలనీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నెలకు రూ.12 వేలకు పైగా ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాల వారికి మూడు కేటగిరీల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి 150, 200, 240 గజాల చొప్పున స్థలాలు విభజించి.. వాటిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. వీటన్నింటికి అయిన ఖర్చును మాత్రమే దరఖాస్తుదారుని వద్ద తీసుకుని ఇంటి పట్టా అందజేయటం జరుగుతుందన్నారు. ఆ స్థలాల కోసం సచివాలయాల్లో ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో మొదటిదశగా మచిలీపట్నం, గుడివాడ మునిసిపాలిటీలను గుర్తించినట్టు చెప్పారు. మునిసిపాలిటీ పరిధికి అతి దగ్గరగా ఈ కాలనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
మధ్య తరగతి ప్రజలే లోకువ
జాతిహితం గొప్ప ప్రభుత్వం ఆ 1.7ను విస్తరింపచేయడానికి ఏదో ఒకటి చేయాలని ఇది సూచిస్తుంది. ఆ క్రమంలో మొదటి తెలివైన చర్య పెద్ద నోట్ల రద్దు అని భావించారు. తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. కానీ ఆశించిన పెరుగుదల ఏదీ? వాస్తవానికి ఈ ఒక్క లక్ష్య సాధనలోనే అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫలితంగా, పెద్దమొత్తంలో పన్ను ఎగవేతదారు లను, లేదా పన్ను చెల్లించని కోట్లాదిమందిని పట్టుకోవడానికి బదులుగా దాచుకోవడానికి తమవద్ద ఏదీ లేని వారిపైనే దాడిచేయడానికి సిద్ధమవుతున్నారు. తరతరాలుగా కాసాబ్లాంకా సంస్కృతి విస్తరిస్తున్నది. ఆ కారణంగా దానికి సంబంధించినవే శిలాక్షరాల వంటి రెండు పంక్తులతో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్ భారత మధ్య తరగతి ప్రజానీకానికి ఏం ఒరగబెట్టిందనే విషయం చెప్పవచ్చు. రిక్ కేఫ్ అమెరికన్ ఉదంతం సందర్భంలో కెప్టెన్ రెనాల్ట్ అనే ఎందుకూ కొరగాని పోలీసు చెబుతాడు చూడండి, ‘ఎప్పుడూ పట్టుకునే అనుమానితులనే పట్టు కోండి!’ అని. అలాగే జరిగింది. భ్రష్టత్వం వల్ల కావచ్చు, రాజకీయం ప్రయోజనాలతో ఓట్ల కోసం డబ్బును వెదజల్లడం వల్ల కావచ్చు– మన ప్రభుత్వానికి నిరంతరం డబ్బుకి కొదవే. ప్రభుత్వం ఎప్పుడూ ఈ దురదృష్టకర మధ్య తరగతి మీదే పడుతుంది. మరీ ముఖ్యంగా వేతనాల మీద ఆధారపడి జీవించే ఉద్యోగులే కనిపిస్తూ ఉంటారు. వీళ్లని ఎంతవరకు వీలుంటే అంత వరకు ఊపిరి సలపకుండా చేసేయవచ్చు. వీళ్ల గురించి మాట్లాడేవారు లేరు. ప్రజా ప్రతినిధులు లేరు. అలాగే వీరందరికీ సమంగా వర్తించే ఏకసూత్రం కూడా ఏదీ లేదు. అలా వాళ్ల మెడ పట్టుకుని, వెనక ఒక్క తన్ను తన్నితే చాలు వారి నుంచి ఏదైనా సరే కక్కించవచ్చు. పైగా రాజ కీయాలకు వచ్చిన ప్రమాదం కూడా ఏమీ ఉండదు. పెద్ద నోట్ల రద్దు తరహా రాజకీయం ఒకవేళ వారి నుంచి ఏదైనా పెద్ద ఆరోపణ వస్తే, అది పేదందరికి దృశ్యానం దపు తృప్తిని కలిగించేదే అవుతుంది. ప్రస్తుత వాతావరణంలో ఈ పరిస్థితిని పెద్ద నోట్ల రద్దు తరహా రాజకీయం అని పిలవవచ్చు. ఏదో ఒకటి నాటకీ యంగా చేయాలి. అది పేదల దగ్గరకు తీసుకెళ్లి, ఆ చర్యతో వారు నష్టపోయే అవకాశం ఉందని చెప్పేటట్టు చేయాలి. నేను చెప్పేది కొంచెం ఓర్పుగా వినండి, ధనవంతులు ఎంతగా నష్టపోతున్నారో మీకు అవగాహన లేదు. అయితే వాస్తవానికి ధనికులు ఎప్పుడూ దెబ్బతినరు. అది వేరే విషయం. పేదలు నమ్ముతారు. వారిలో గందరగోళం అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఇక మధ్య తరగతినైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు గాయ పరచవచ్చు. ఈ బడ్జెట్ మన స్మృతిపథంలో ఎంతోసేపు ఉండదు. అది వెంటనే వార్తాకథనం కూడా కాలేదు. అందులో చాలా విషయాలు 2019 సంవత్సరం వేసవిలో బీజేపీ ఎన్నికల ప్రణాళిక తయారయ్యే వరకు కూడా మనని వెంటా డుతూనే ఉంటాయి. కానీ స్టాక్, బాండ్ల మార్కెట్లో మారణహోమం సృష్టిస్తూ ఇవాళ మాత్రం సజీవంగానే ఉంది. మార్కెట్ విధ్వంసక అత్యవసర బడ్జెట్‌గా వెళ్లింది కాబట్టి, ఇది దాదా ప్రణబ్ ముఖర్జీ పునరావృత ఒడాఫోన్ సవరణ తరగతికి చెందుతుంది. చాలా విషపూరితం. ఆయన తరువాత ఇద్దరు ఆర్థికమంత్రులు బడ్జెట్లు సమర్పించిన ఆరేళ్ల కాలంలో కూడా శస్త్ర చికిత్స చేసేటప్పుడు ధరించే గ్లోవ్స్ ధరించి కూడా అలాంటి బడ్జెట్ జోలికి మాత్రం వెళ్లలేదు. బ్యాంకు నగదు లావాదేవీలపై పన్ను, సెక్యూరిటీల లావాదేవీల మీద పన్ను, ఉద్యోగుల స్టాక్ ఆప్షన్‌ను తిర గరాసిన పన్నులను కూడా వెంటపెట్టుకుని వచ్చిన పి. చిదంబరం బడ్జెట్ కూడా మార్కెట్లను కకావికలు చేసింది. పైన ముగ్గురు ఆర్థిక మంత్రులలో ఆయన కూడా ఒకరు. మధ్య తరగతి మదుపునకు దెబ్బ కానీ ఈ బడ్జెట్ చేసిందేమిటంటే, మధ్య తరగతి మదుపులకు దశాబ్దంగా ఉన్న భద్రత మీద దాడి. మధ్య తరగతికి ఎటూ పాలుపోని పరిస్థితిని కల్పిం చింది. ఇదంతా నేను బిజినెస్ స్టాండర్డ్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, ఆర్థిక వ్యవస్థ విశ్లేషకుడు టీఎన్ నైనన్ మాటల ఆధారంగా రాస్తున్నాను. ఆయన షేర్ల మీద దీర్ఘకాలిక కేపిటల్ గెయిన్స్ పన్నును ఉపసంహరించుకోమని గట్టిగా కోరారు. 2017, జనవరి 6న ఆయన నిర్వహించిన వారాంతపు జ్ఞాపకాల కార్య క్రమంలో ఈ విషయం గురించి వాదించారు. లోటును తగ్గించాలని ఆర్థిక మంత్రి కోరుకుంటే ఈక్విటీ ప్రాఫిట్ల మీద పన్ను విధించడం తప్ప మరో మార్గం లేదని నైనన్ చెప్పారు. ఆర్థికమంత్రి కూడా నైనన్ సలహా విలువైన దని గ్రహించారు. లోటును తగ్గించడానికి ఆయన సూచించిన విధానం బల మైనదని కూడా గుర్తించారు. ఈ అంశాన్నే నేను మరో కోణం నుంచి వివరి స్తున్నాను. ఆ కోణం పరిశీలించడానికి అనువైనది కూడా. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? మొదటిగా ఒక ప్రశ్న. ఆర్థిక విధానంలో ఎదరుయ్యే పరిణామాలతో, ఎగుడు దిగుళ్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఒక ప్రభుత్వం ఎన్నికల రాజకీ యాల కోసం ప్రజాధనం యథేచ్ఛగా వెచ్చించగలదా? అలాగే తన ఇష్టం వచ్చినట్టు పన్నులు విధించగలదా? అలా అని నేను పేదల అనుకూల పథ కాలను లేదా రాయితీలను విమర్శించడం లేదు. అయితే పెద్ద నోట్ల రద్దు వంటి ఒక వికృత ఆలోచన ఒక సంవత్సరపు స్థూల జాతీయోత్పత్తిలో 1 నుంచి 2 శాతం పెరుగుదలకు మంగళం పాడింది. అక్కడితో ఆగకుండా చిన్న చిన్న వ్యాపారులకు నష్టం చేయడంతో పాటు ఎన్నో ఉద్యోగాలను ఊడ గొట్టింది. దీని వెనుక ఉన్న ఆర్థికపరమైన ప్రతిపాదన లక్షలాది మందిని అధికారిక ఆర్ధిక వ్యవస్థ నుంచి అనధికార ఆర్థిక వ్యవస్థకు నెట్టింది. ఆర్థికవేత్త కౌశిక్ బసు ఆర్థికసర్వేలో ప్రత్యేకంగా కనిపించే కొన్ని వాక్యాలను కను గొన్నారు. అవి పెద్ద నోట్ల రద్దు ఆలోచన విఫలమైందని అంగీకరించేవి. ముందు తీసుకున్న విధాన పరమైన చర్యల ప్రభావం అదృశ్యం కావడమే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత మందగమనానికి కారణమని 2017–18 ఆర్థిక సర్వేలో చెప్పడమంటే పెద్ద నోట్ల రద్దు పెద్ద తప్పిదమని అంగీకరించడమేనని కౌశిక్ ట్వీట్ చేశారు. తరువాతి వాదన లేదా ప్రశ్న రాజకీయాలకు సంబంధించినది. మధ్య తరగతిని ప్రభుత్వాలు (ఒక్క బీజేపీ ప్రభుత్వాలే కాదు, మొత్తం అన్ని ప్రభు త్వాల గురించి) అంత కర్కశంగా చూడడానికి కారణం వారి వెనుక ఎలాంటి లాబీ లేకపోవడమే. అలాగే ఎన్నికలను నిర్దేశించే ఎలాంటి శక్తి వారి వద్ద లేకపోవడం కూడా. ఈ తరహా బడ్జెట్ మీ రాజకీయాల వరకు సానుకూల మైనదే కావచ్చు. కానీ పేదలను ఒప్పించగలగాలి. అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి కూడా కావలసినంత వెచ్చిస్తామని చెప్పాలి. ఎందుకంటే వారికి కూడా ఓటు హక్కు ఉంది. మీ ప్రభుత్వాన్ని ఓట్లతో ముంచెత్తిన మధ్య తరగతికి నష్టం జరగకుండా అదనపు పరిహారాలు ఇవ్వాలి. కొన్ని గణాంకాలు మన విశ్లేషణలో కనిపిస్తాయి. అందులో ఒక అంశం– కేవ లం 1.7 శాతం భారతీయులు ఆదాయపు పన్ను చెల్లిస్తారు. 2015–16 నాటి అంచనాల అధికారిక సమాచారంలో ఈ విషయం పేర్కొన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో, అదికూడా అత్యధికంగా మధ్య తరగతి ఉన్న దేశంలో ఈ విషయం భయంకరంగా అనిపిస్తుంది. దీనిని మరో ప్రశ్న రూపంలో చెప్పవచ్చు. అంటే దేశంలో వంద శాతం పన్నును ఈ 1.7 శాతమే చెల్లిస్తున్నారా? పన్ను చెల్లింపుదారులు ఇంతేనా? గొప్ప ప్రభుత్వం ఆ 1.7ను గొప్పగా విస్తరింపచేయడానికి ఏదో ఒకటి చేయాలని ఇది సూచిస్తుంది. ఆ క్రమంలో మొదటి తెలివైన చర్య పెద్ద నోట్ల రద్దు అని భావించారు. తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. కానీ ఆశించిన పెరుగుదల ఏదీ? వాస్తవానికి ఈ ఒక్క లక్ష్య సాధనలోనే అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫలితంగా, పెద్దమొత్తంలో పన్ను ఎగ వేతదారులను, లేదా పన్ను చెల్లించని కోట్లాదిమందిని పట్టుకోవడానికి బదులుగా దాచుకోవడానికి తమవద్ద ఏదీ లేని వారిపైనే దాడిచేయడా నికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వేతన జీవులు తమ పొదుపులను ఎక్కడ పెడతారు? ఎందుకంటే వారివద్ద నగదు లేదు. వీరు ఆస్తుల కొనుగోళ్లవైపు అడుగు పెట్టడం కష్టం. పైగా ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో ఆస్తులు తమ విలువను వేగంగా కోల్పోయాయి. బ్యాంకులు, ప్రభుత్వ పొదుపు పథకాలు కూడా వడ్డీ రేట్లను తగ్గించివేశాయి. కానీ ఈ బ్యాంకులే తాము అప్పులిచ్చినవారికి ఈఎమ్ఐ రేట్లను తగ్గించడానికి పూనుకోవడం లేదు. ప్రభుత్వాలలాగే దురాశాపూరితమైన బ్యాంకులు కూడా భారీస్థాయి ఎగవేతదారులు ధ్వంసం చేసిన బ్యాలెన్స్ షీట్లను మళ్లీ పూరించుకోవడానికి నివాస గృహాలు, విద్య, వాహనాలను ఆశించే మధ్యతరగతి డిపాజిట్‌దారులు, రుణగ్రహీతలపైనే కన్నేస్తున్నాయి. నాటి ఆర్థిక మంత్రి చిదంబరం 2004లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ల తక్షణ పతనానికి కారణమైనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఆర్థికమంత్రులు తరచుగా చెప్పే మాటలనే వల్లె వేశారు. నేను బడ్జెట్‌ను రైతుకోసం రూపొం దించాలా లేక బ్రోకర్ కోసం రూపొందించాలా? అప్పుట్లో నేను దీనిపై వ్యాఖ్యానిస్తూ ఆధునిక ఆర్థిక వ్యవస్థ పనితీరు ఇకపై రైతు వెర్సెస్ బ్రోకర్‌గా ఉండకూడదని, అది ఇక నుండి రైతు, అలాగే బ్రోకర్‌లాగా కూడా ఉండాలని రాశాను. ఎందుకంటే వ్యవసాయం, ద్రవ్యమార్కెట్లు ఒక దాన్నొకటి నిషేధిం చుకోవడం లేదు. అందుకే చిదంబరం బడ్జెట్ తర్వాత అనేక దిద్దుబాట్లకు గురైంది. పలు నష్టనివారణ చర్యలు చేపట్టింది. జైట్లీ సమర్పించిన ఈ బడ్జెట్ కూడా దాన్నే అనుసరించాల్సి ఉంటుంది. భారతీయ మధ్యతరగతి దాదాపుగా పట్టణ స్వభావంతో కూడి ఉంటోంది. గుజరాత్ ఎన్నికల్లో మాదిరి అది ఇప్పటికీ నరేంద్రమోదీ పట్ల అభిమానం చాటుతోంది. గత నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం తగ్గిన చమురు ధరల ప్రయోజనాన్ని మధ్యతరగతికి అందించకుండా, దానినుంచి అదనపు వసూళ్లకు పూనుకుంటున్నప్పటికీ ఆ వర్గం మోదీ పట్ల విశ్వాసం ప్రదర్శిస్తూనే ఉంది. ఇప్పుడు పొదుపులను నిరుత్సాహపరుస్తున్న ప్రభుత్వ చర్య మధ్య తరగతికి మరింత గాయాన్ని కలిగిస్తోంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupt -
క్యాష్ కష్టాలు... ఇంకెన్నాళ్లో!
చేవెళ్లరూరల్/మొయినాబాద్ రూరల్/షాబాద్: బ్యాంకులలో నగదు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం బ్యాంకులకువ వచ్చిన ఉద్యోగులు, పిన్సనర్లు, ప్రజలు నగదుకోసం క్యూలు కట్టిన కొందిరికి మాత్రమే నగదు లభించింది. నెలరోజులు కావస్తున్న నేటికి పెద్దనోట్ల రద్దుతో ఏర్పాడిన సమస్య ఓ కొలిక్కి రాకపోవటంతో ప్రజలు నానా తంటాలుపడుతున్నారు. ప్రతిరోజు బ్యాంకుల చుట్టు తిరిగే పనిగానే ప్రజల నిత్యకృత్యమైంది. ఇచ్చే నగదు అయినా ఎక్కువగా ఇవ్వకపోవటంతో కేవలం 2వేలు, 4వేలు మాత్రమే ఇస్తుండటంతో అవీ కనీస అవసరాలకు కూడా సరిపోకపోవటంతో ప్రజలు రోజు బ్యాంకు వద్దకు వచ్చే పని పడుతుంది. కనీసం ఏటీఎం కేంద్రాల్లోనైనా డబ్బులు అందుబాటులో ఉంటాయంనుకుంటే అవీకూడా లేదు. ఎప్పుడూ చూసి మూసి ఉన్న ఏటీఎం కేంద్రాలే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు మరో మార్గం లేక బ్యాంకులలో ఇచ్చే 2వేలు, 4వేలకు సైతం ఉదయంన్నే వచ్చి క్యూకడుతున్నారు. కొన్ని బ్యాంకులల్లో ఉదయం వచ్చిన వారికి 2వేల రూపాయల చోప్పున టోక్లను ఇచ్చి మద్యాహ్నం నుంచి టోకన్లు ఇచ్చిన వారికి నగదును అందించే పనులు చేస్తున్నారు. దీంతో మద్యాహ్నం డబ్బుల కోసం వచ్చిన వారికి బ్యాంకులో డబ్బులు లేవనే చెబుతున్నారు. ఉన్న వారకు అందరికి అందించే ప్రయత్నం చేశాం. ఇక నగదు లేదని అంటున్నారు. అయితే వచ్చిన వారు సైతం ఇచ్చే 2వేల రూపాయలు, 4వేల రూపాయలు ఎందుకు సరిపోవటం లేదని వాపోతున్నారు. బ్యాంకు అధికారులను అడిగితే తమకే డబ్బులు రావటం లేదంటున్నారని చెబుతున్నారు. ఏమి చేయాలో తెలియటం లేదు. నిత్యవసర ఖర్చులకు సైతం ఈ డబ్బులు సరిపోవటం లేదంటున్నారు. ఉద్యోగులకు సైతం ఒకేసారి 10వేల రూపాయలు అందిస్తామని చెప్పారు. కాని ఎక్కడ అది అమలు కావటం లేదు. ఎవరికి 10వేలు ఇవ్వలేదు. అందిరితోపాటు సమానంగానే బ్యాంకుల్లో ఉద్యోగులకు నగదు అందిస్తుండటంతో ఉద్యోగులు వీటితో నెలరోజులు ఎలా గడుపాలని అంటున్నారు. రోజు బ్యాంకులకు వచ్చే పరిస్థితి లేదని ఇలా అయితే మా పరిస్థితి ఏమి కవాలని అంటున్నారు. ప్రభుత్వం, బ్యాంకు అధికారులు స్పందించి బ్యాంకులలో ప్రజలకు అవసరమైన నగదును అందించేలా.... ఎటీఎం కేంద్రాల్లో విరివిగా నగదు అందుబాటులో ఉంచితే చాలా వరకు సమస్య తీరుతుందని అంటున్నారు. -
నెల రోజులుగా ఇబ్బందులే..
తప్పని పెద్దనోట్ల కష్టాలు రూ.2వేల నోట్లకు దొరకని చిల్లర జోగిపేట : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం నేటికి నెల రోజులు అవుతున్నా పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు తీరలేదు. 30 రోజులుగా బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతూనే ఉంది. బ్యాంకులు ఇచ్చే రూ.4 వేల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. నెల మొదటి వారంలో పాలవాడికి, పనివాడికి, ఇంటి అద్దెకు చెల్లించాల్సిన డబ్బులు చేతులో లేకపోవడంతో వచ్చే నెల ఇస్తామంటూ వారు ప్రాధేయపడుతున్నారు. నల్లడబ్బు వెలికి తీయాలనే ఆలోచన మంచిదే అరుునా సామాన్యులకు ఇబ్బంది కాకుండా ముందస్తుగా డబ్బులను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందని పలువురు అంటున్నారు. జోగిపేట ప్రాంతంలో ఇప్పటికి కొత్త రూ.500 నోట్లు ఇంకా రాలేదు. దీంతో చిల్లర కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. బ్యాంకు వారు రూ.2 వేల నోట్లను ఇస్తుండటంతో వాటికి సరిపడా చిల్లరను మాత్రం ఏ దుకాణదారు ఇవ్వడం లేదు. పెద్దనోట్లకు చిల్లర లేదంటూ హోటళ్లు, చిన్న చిన్న కిరాణ దుకాణాలల్లో ముందే చెప్పేస్తున్నారు. నెలసరి వేతనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడక తప్పడం లేదు. ప్రభుత్వం ఉద్యోగులకు నెలసరి వేతనాల్లో నుంచి రూ.10 వేల నగదు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఆ డబ్బుల కోసం ఉద్యోగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. మహిళా ఉద్యోగులు క్యూలో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఆసరా పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కూడా క్యూలో నిలబడి నిరీక్షిస్తున్నారు. మునిపల్లి: కొత్త నోట్ల కోసం మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు, ఉద్యోగులు బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. బుధవారం మండలంలోని బుదేరా, మునిపల్లి గ్రామాల్లో గల బ్యాంకుల వద్ద ప్రజలు డబ్బుల కోసం ఉదయం 8.30 గంటలకే క్యూలో నిలబడ్డారు. క్యూలో చివర నిలబడిన వారికి డబ్బులు దొరకకపోవడంతో అధికారుల తీరుపై మండిపడ్డారు. ఉన్న డబ్బంతా బ్యాంకులో డిపాజిట్ చేసి... కూలీలకు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నించారు. బ్యాంకు అధికారులు మాత్రం ఒక్కొక్కరికి కేవలం రూ.రెండు వేలు మాత్రమే ఇచ్చారు. -
వంటింట్లో సరుకుల మంట
- ఆకాశ మార్గం పట్టిన ధరలు - ఉడకనంటున్న పప్పులు - చిటపటలాడుతున్న చింతపండు - ఎండుమిర్చికి ధరల ఘాటు - నూనెలు సలసలా ఏలూరు సిటీ :వంట సరుకుల ధరలు ఆకాశ యానం చేస్తుండటంతో వంటింట్లో మంట రేగుతోంది. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. నెలవారీ బడ్జెట్ అమాంతం పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం పప్పుకూడు తిందామన్నా కష్టమవుతోందని సామాన్యులు బావురుమంటున్నారు. చింతపండుతో చారు పెట్టుకుందామన్నా ధర చూస్తే భయమేస్తోంది. ‘ధర’దడలు ఇలా గడచిన ఆరు నెలల కాలంలో నిత్యావసర సరుకుల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మొన్నటి వరకూ కిలో రూ.82 పలికిన కందిపప్పు ధర ఇప్పుడు రూ.110 నుంచి రూ.115 మధ్య ఉంది. సగటున కిలోకు రూ.30 పెరిగింది. దీంతో కందిపప్పు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పెసరపప్పు కిలో రూ.95 నుంచి రూ.110 వరకు ధర పలుకుతోంది. మొన్నటివరకూ రూ.86 ఉండే కిలో మినుముల ధర రూ.96కు పెరిగింది. వేరుశనగ గుళ్ల ధర రూ.85 నుంచి రూ.116కు ఎగబాకింది. పచ్చి శనగపప్పు కిలో రూ.60, పంచదార కిలో రూ.40 వరకు విక్రయిస్తున్నారు. కనీసం చింతపండుతో రసం చేసుకుందామన్నా కష్టంగా మారింది. మొన్నటివరకూ కిలో రూ.76 వరకు ఉన్న చింతపండు ధర అమాంతం రూ.140కి పెరి గింది. ఎండుమిర్చి కిలోకు రూ.25 పెరి గింది. వెల్లుల్లి కిలో రూ.60 నుంచి రూ.75 వరకు పలుకుతోంది. వీటికి తోడు నూనె ధరలు కూడా దిగిరానంటున్నాయి. వేరుశనగ నూనె కిలో రూ.85నుంచి రూ.95, పామాయిల్ కిలో రూ.55 నుంచి రూ.60, సన్‌ఫ్లవర్ ఆయిల్ కిలో రూ.70 నుంచి రూ.80 వరకు ధర పలుకుతున్నాయి. -
అమ్మకానికి ‘స్వగృహ’ భూములు
ప్రాజెక్టుకు తెరదించే దిశగా వడివడిగా అడుగులు స్థలాలమ్మి ఖజానాకు నిధులు సీఎం సమీక్ష తర్వాత నిర్ణయం ఈలోగా అధికారుల ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా 528 ఎకరాలు సాక్షి, హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే విలాసవంతమైన ఇళ్లను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కథ కంచికి చేరబోతోంది. ఈ కార్పొరేషన్‌కు మంగళం పాడే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దీనిపై తుది నిర్ణయం వెల్లడించనప్పటికీ కార్పొరేషన్లో జరుగుతున్న వ్యవహారాలు మాత్రం దీనిని స్పష్టం చేస్తున్నాయి. స్వగృహ పనులు ఎక్కడా జరపవద్దని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న అధికారులు నిర్మాణాలు పోగా మిగిలిన ఖాళీ భూముల వివరాలను సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాజీవ్ స్వగృహపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అందులో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవలే రూ. లక్ష కోట్లకుపైగా మొత్తంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయ సమీకరణలో భాగంగా ప్రభుత్వం భూములను అమ్మాలని నిర్ణయిం చింది. ఇదే కోవలో స్వగృహ కార్పొరేషన్‌కు ఖాళీగా ఉన్న భూములను విక్రయించాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో కొన్ని ఖాళీ భూములను అమ్మిన అధికారులు... అలా వచ్చిన మొత్తాన్ని స్వగృహ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వెచ్చించారు. కానీ, ఈసారి అమ్మగా వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాకే జమ చేయనున్నారు. హైదరాబాద్ శివారులో 90 ఎకరాలు... స్వగృహ ప్రాజెక్టుల నిర్మాణం కోసమని రాజధానికి నలువైపులా గతంలో భారీగా భూములను ఆ కార్పొరేషన్ సేకరించింది. ఇందులో నాగోలు సమీపంలోని బండ్లగూడ, ఘట్కేసర్ వైపు పోచారం, జవహర్‌నగర్, గాజులరామారంలలో నిర్మాణాలు జరిపింది. బహదూర్‌పల్లి, బాచుపల్లిల్లో పనులు ప్రారంభించలేదు. జవహర్‌నగర్‌లో నిర్మాణ స్థలం పోను ఇంకా దాదాపు 12 ఎకరాల స్థలం ఉంది. గాజుల రామారంలో 10 ఎకరాల స్థలంలో జీప్లస్ 14 పద్ధతిలో మూడు బ్లాకులు, పాక్షికంగా మరో రెండు బ్లాకులు నిర్మించారు. ఇది పోను మరో 10 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. బహదూర్‌పల్లిలో 40 ఎకరాలు, బాచుపల్లిలో 28 ఎకరాల మేర పూర్తి ఖాళీగా ఉంది. బాచుపల్లి భూములపై కోర్టు వివాదాలున్నాయి. వీటి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో 438 ఎకరాలు... నిజామాబాద్‌లో 100 ఎకరాలు భూమి సిద్ధంగా ఉంది. ఇక్కడ నిర్మాణ పనులు మొదలు కాలేదు. ఇందులో 50 ఎకరాలను స్వయంగా స్వగృహ కార్పొరేషన్ పరిహారం చెల్లించి సేకరించడం విశేషం. నగర వెలుపల శాటిలైట్ టౌన్‌షిప్స్ అభివృద్ధి చేసే ఆలోచనలో భాగంగా పటాన్చెరు సమీపంలోని లక్డారం గ్రామంలో స్వగృహ ఏకం గా 250 ఎకరాలను సమీకరించుకుంది. కానీ, ఇక్కడ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టకపోవడంతో అదంతా ఖాళీగా ఉంది. కరీంనగర్లో 60 ఎకరాల భూమి ఉండగా అందులో 30 ఎకరాల్లో 40 వ్యక్తిగత ఇళ్ల నమూనాలో పనులు మొదలుపెట్టారు. పునాది దశలోనే వాటిని నిలిపివేశారు. మిగతా 30 ఎకరాలు ఖాళీగా ఉంది. వరంగల్ హంటర్‌రోడ్డులో కూడా పనులు ప్రారంభించలేదు. ఖమ్మంలో 250 ఇళ్లను నిర్మించారు. కానీ, దరఖాస్తులు లేకపోవడంతో అవి దుమ్మకొట్టుకుపోతున్నాయి. వీటిని గంపగుత్తగా అమ్మాలని ఇప్పటికే నిర్ణయించారు. వీటిని అమ్మితే దాదాపు రూ.80 కోట్లు సమకూరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఇల్లు కట్టిచూడు
- నింగిని తాకిన నిర్మాణ సామాగ్రి ధరలు - మార్కెట్లో సిమెంటు కొరత - స్తంభించిన గృహ నిర్మాణాలు - ఇబ్బందుల్లో 2.50 లక్షల మంది కార్మికులు విజయవాడ సిటీ : సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన భవన నిర్మాణ ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర విభజన.. రాజధాని ఏర్పాటు వంటి అంశాల నేపథ్యంలో భూముల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గృహ నిర్మాణ సామగ్రి ధరలు కూడా చుక్కలనంటడంతో జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఈ రంగానికి అనుబంధంగా 26 రకాల వృత్తులతో జీవనం సాగిస్తున్న సుమారు 2.50 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాలు పనుల్లేక పస్తులుంటున్నాయి. రెండేళ్లుగా రకరకాల ఇబ్బందులతో నిర్మాణ రంగం నత్తనడక నడుస్తోంది. రాష్ట్ర విభజన క్రమంలో విజయవాడ చుట్టూ పెండింగులో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు నిర్మాణ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భూముల విలువలకు రెక్కలొచ్చినట్లే నిర్మాణ రంగంలో ముడిసరకుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనికితోడు మార్కెట్లో సరకు లభ్యం కాకపోవడంతో నిర్మాణ రంగంలో స్తబ్దత నెలకొంది. సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు గృహ నిర్మాణంసమెంటు కృత్రిమ కొరత.. కొన్ని కంపెనీలు హఠాత్తుగా సిమెంట్ కొరతను సృష్టించాయి. తెలంగాణ ప్రాంతంలో కంపెనీల నుంచి మన ప్రాంతానికి స్టాక్ ఇవ్వకపోవడంతో నగర మార్కెట్లో సిమెంట్ కొరత ఏర్పడింది. దీంతో డీలర్లు తమ వద్ద ఉన్న నిల్వలను అమాంతం నల్లబజారుకు తరలించారు. ఈ క్రమంలో కృత్రిమ కొరత ఏర్పడింది. పైనుంచి స్టాక్ రావడం లేదనే సాకుతో డీలర్లు అమ్మకాలను నిలిపివేశారు. కొద్ది రోజులుగా బ్రాండెడ్ సిమెంటు దొరకక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఎన్నికల ముందు వరకు బస్తా రూ. 230 ఉన్న బ్రాండెడ్ సిమెంటు ఇప్పుడు రూ.350కి విక్రయిస్తున్నారు. బ్లాకులో అయితేనే బ్రాండెడ్ సరకు ఇస్తున్నారు. జిల్లాలో 300కు పైగా సిమెంటు షాపులు, డీలర్లు ఉన్నారు. వీటి ద్వారా సీజన్లో నెలకు 50 వేల టన్నుల సిమెంటు విక్రయాలు జరుగుతుంటాయి. అన్‌సీజన్‌లో కూడా దాదాపు 25 వేల టన్నుల సిమెంటు విక్రయిస్తారని అంచనా. జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల సిమెంటు కొరత ఏర్పడింది. ఇసుకకూ ఇక్కట్లే.. జిల్లాలో 72 ఇసుక క్వారీలున్నాయి. వీటికి ఏడాది నుంచి వేలం పాటలు నిర్వహించకుండా పెండింగులో ఉంచారు. దీంతో ఎక్కడికక్కడ ఇసుక మాఫియాలు పెచ్చుపెరిగి అక్రమ తవ్వకాలు సాగించి అధిక రేట్లు దండుకుంటున్నారు. పదిటైర్ల లారీ ఇసుకకు రూ.17 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. టిప్పర్‌కు రూ. ఏడున్నర వేలు వసూలు చేస్తున్నారు. అదీ దూర ప్రాంతాలకు అయితే మరింత గుంజుతున్నారు. భారీగా పెరిగిన ఇనుము, కంకర ధరలు.. నెల రోజులుగా నగర మార్కెట్లో స్టీల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇనుము ధరలు సగటున రూ. 40 వేల నుంచి రూ. 52 వేల వరకు పెరిగాయి. కంకర ధరను కూడా బాగా పెంచేశారు. నెల రోజుల క్రితం రెండు యూనిట్ల కంకర రూ. ఆరు వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.10 వేలకు చేరింది. ముడిసరకు ధరలు పెరగడంతో ఆ ప్రభావం భవన నిర్మాణ రంగంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న రాడ్‌బెండింగ్, పెయింటింగ్, కార్పెంటర్, బ్రిక్ ఇండస్ట్రీస్ తదితర వృత్తులలో పనిచేసే కార్మికులు పనుల్లేక, పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు.