సొంతిల్లు...ప్రతి ఒక్కరి కల. నిరుపేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇంటిస్థలం ఇస్తోంది. అర్హత ఆధారంగా ఇల్లు కూడా కట్టిస్తోంది. కానీ ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు ఆ అవకాశం లేదు. వీరంతా దాదాపు పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. సమీపంలో స్థలం కొందామంటే..ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా అనుమతుల తిరకాసులెన్నో...ఇలాంటి వారికీ ప్రభుత్వం అండగా నిలిచింది. ‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్’ పేరుతో సకల సౌకర్యాలు, అన్ని అనుమతులతో కూడిన స్థలాన్ని అతితక్కువ ధరకే అందిస్తోంది.
హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా): మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ (ఎంఐజీ) పేరుతో లేఅవుట్ల రూపొందించి తక్కువ మొత్తానికే పట్టణ పరిధిలో ఇంటి స్థలాలను అందిస్తోంది. న్యాయపర సమస్యలు లేకుండా క్లియర్ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటోంది. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ పేరిట పట్టణ సమీప ప్రాంతాల్లోనే వందల ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో లేఅవుట్లు ఏర్పాటు చేస్తోంది.
జిల్లాలో రెండు ప్రాంతాల్లో..
జిల్లాలోని ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాల్లో ఎంఐజీ లేఅవుట్లు సిద్ధం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గం కుణుతూరులో ఇప్పటికే ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయ. మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరమయ్యాయి.
సదుపాయాలు ఇలా..
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్లన్నీ ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా రిజిష్టర్ అయి ఉంటాయి. లేఅవుట్‌లో 60 అడుగుల బీటీ రోడ్డు, 40 అడుగుల సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, ఫుట్‌పాత్‌లు, ఈఎల్‌ఎస్‌ఆర్‌లతో నీటి సరఫరా, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, భూగర్భ మురుగు కాల్వలు, వీధి దీపాలు ఉంటాయి. అలాగే వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలతో పాటు ఆహ్లాదం పంచేలా పార్కులు అభివృద్ధి చేస్తారు. ఇతర అన్ని రకాల సదుపాయలూ కల్పిస్తారు.
అర్హతలు ఇలా..
ఎంఐజీ లేఅవుట్లలో ఒక కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయిస్తారు. సంవత్సర ఆదాయం రూ. 18 లక్షల్లోపు ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఆధార్ కార్డు ద్వారా మాత్రమే దరఖాస్తు నమోదు సాధ్యమవుతుంది. ఆసక్తి కలిగిన వారు migapdtcp.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసి ప్లాటు కేటగిరీ మొత్తం విలువలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
లేఅవుట్లలో విక్రయాల అనంతరం పారదర్శకంగా లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు ప్లాటు నంబర్లు కేటాయిస్తారు. ఆ తర్వాత నిర్ణీత సమయంలో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్లాటు కేటాయింపు రద్దు చేసి, అర్హత కలిగిన ఇతరులకు కేటాయిస్తారు. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ నుంచి దరఖాస్తుదారులు నెలలోపు ప్లాటు మొత్తంలో 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వందశాతం చెల్లిస్తే 5 శాతం రాయితీ కూడా ఇస్తారు.
ఉద్యోగులకు 20 శాతం రాయితీ..
ప్రభుత్వ ఉద్యోగులకు మరికొంత లబ్ధి చేకూరే విధంగా లేవుట్ మొత్తం ప్లాట్లలో పదిశాతం రిజర్వు చేశారు. అంతేకాకుండా లేఅవుట్ ఏర్పాటు చేసిన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ఇంటి స్థలం కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఫాం–16 సమర్పించాల్సి ఉంటుంది.
► హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం కోడూరు గ్రామ సమీపంలో బెంగళూరు 44 జాతీయ రహదారి పక్కనే 774, 775 సర్వే నంబర్లలో 7 ఎకరాల్లో 98 ప్లాట్లతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లేఅవుట్‌లో సెంటు రూ.3.63 లక్షలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ లేవుట్‌లో వివిధ అభివృద్ధి పనుల కోసం పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ టెండర్లు ఆహ్వానించారు.
► ధర్మవరం నియోజకవర్గంలో కుణుతూరు సర్వే నంబర్లు 498,499, 628 నుంచి 642 వరకు 120 ఎకరాల్లో 1,272 ప్లాట్లతో అతిపెద్ద జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ఏర్పాటు చేశారు. 2021 నవంబర్ 21న రూ.106.00 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ లేఅవుట్‌లో సెంటు ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్లాట్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
అన్ని అనుమతులతో లేఅవుట్లు
మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ లేఅవుట్ల పథకం వల్ల మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొంత రాయితీ కూడా ఉంటుంది. అన్ని మౌలిక వసతులతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, వివాదాలు లేని లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 150/200/240 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు రూ. 3 లక్షల నుంచి రూ.18 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారందరూ అర్హులు. ఆసక్తి గల వారు సచివాలయం, లేదా మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తుచేసుకోవచ్చు.
– డాక్టర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, హిందూపురం
అన్ని సదుపాయాలతో అభివృద్ధి
ఎంఐజీ లేఅవుట్లలో అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. నిజంగా ఇది మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు మంచి అవకాశం. కొడికొండ వద్ద, హైవే పక్కనే లేఅవుట్ సిద్ధం అవుతోంది. హిందూపురం ప్రాంత ప్రజలకు చక్కటి అవకాశం. త్వరలోనే మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభమవుతున్నాయి. ధర్మవరం కుణుతూరు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలోనే అది పూర్తవుతుంది.
– ఈశ్వరయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అహుడా.అనంతపురం.
Comments
Please login to add a commentAdd a comment