lay outs
-
సకల సౌకర్యాలతో లేఅవుట్లు.. తక్కువ ధరకే ఉద్యోగులు, మధ్యతరగతి వారికి ప్లాట్లు
సొంతిల్లు...ప్రతి ఒక్కరి కల. నిరుపేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇంటిస్థలం ఇస్తోంది. అర్హత ఆధారంగా ఇల్లు కూడా కట్టిస్తోంది. కానీ ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు ఆ అవకాశం లేదు. వీరంతా దాదాపు పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. సమీపంలో స్థలం కొందామంటే..ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా అనుమతుల తిరకాసులెన్నో...ఇలాంటి వారికీ ప్రభుత్వం అండగా నిలిచింది. ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ పేరుతో సకల సౌకర్యాలు, అన్ని అనుమతులతో కూడిన స్థలాన్ని అతితక్కువ ధరకే అందిస్తోంది. హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా): మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (ఎంఐజీ) పేరుతో లేఅవుట్ల రూపొందించి తక్కువ మొత్తానికే పట్టణ పరిధిలో ఇంటి స్థలాలను అందిస్తోంది. న్యాయపర సమస్యలు లేకుండా క్లియర్ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటోంది. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ పేరిట పట్టణ సమీప ప్రాంతాల్లోనే వందల ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో లేఅవుట్లు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో రెండు ప్రాంతాల్లో.. జిల్లాలోని ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాల్లో ఎంఐజీ లేఅవుట్లు సిద్ధం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గం కుణుతూరులో ఇప్పటికే ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయ. మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరమయ్యాయి. సదుపాయాలు ఇలా.. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్లన్నీ ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా రిజిష్టర్ అయి ఉంటాయి. లేఅవుట్లో 60 అడుగుల బీటీ రోడ్డు, 40 అడుగుల సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, ఫుట్‌పాత్‌లు, ఈఎల్‌ఎస్‌ఆర్‌లతో నీటి సరఫరా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, భూగర్భ మురుగు కాల్వలు, వీధి దీపాలు ఉంటాయి. అలాగే వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలతో పాటు ఆహ్లాదం పంచేలా పార్కులు అభివృద్ధి చేస్తారు. ఇతర అన్ని రకాల సదుపాయలూ కల్పిస్తారు. అర్హతలు ఇలా.. ఎంఐజీ లేఅవుట్లలో ఒక కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయిస్తారు. సంవత్సర ఆదాయం రూ. 18 లక్షల్లోపు ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఆధార్ కార్డు ద్వారా మాత్రమే దరఖాస్తు నమోదు సాధ్యమవుతుంది. ఆసక్తి కలిగిన వారు migapdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసి ప్లాటు కేటగిరీ మొత్తం విలువలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్లలో విక్రయాల అనంతరం పారదర్శకంగా లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు ప్లాటు నంబర్లు కేటాయిస్తారు. ఆ తర్వాత నిర్ణీత సమయంలో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్లాటు కేటాయింపు రద్దు చేసి, అర్హత కలిగిన ఇతరులకు కేటాయిస్తారు. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ నుంచి దరఖాస్తుదారులు నెలలోపు ప్లాటు మొత్తంలో 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వందశాతం చెల్లిస్తే 5 శాతం రాయితీ కూడా ఇస్తారు. ఉద్యోగులకు 20 శాతం రాయితీ.. ప్రభుత్వ ఉద్యోగులకు మరికొంత లబ్ధి చేకూరే విధంగా లేవుట్ మొత్తం ప్లాట్లలో పదిశాతం రిజర్వు చేశారు. అంతేకాకుండా లేఅవుట్ ఏర్పాటు చేసిన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ఇంటి స్థలం కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఫాం–16 సమర్పించాల్సి ఉంటుంది. ► హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం కోడూరు గ్రామ సమీపంలో బెంగళూరు 44 జాతీయ రహదారి పక్కనే 774, 775 సర్వే నంబర్లలో 7 ఎకరాల్లో 98 ప్లాట్లతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లేఅవుట్లో సెంటు రూ.3.63 లక్షలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ లేవుట్‌లో వివిధ అభివృద్ధి పనుల కోసం పబ్లిక్ హెల్త్ ఎస్ఈ టెండర్లు ఆహ్వానించారు. ► ధర్మవరం నియోజకవర్గంలో కుణుతూరు సర్వే నంబర్లు 498,499, 628 నుంచి 642 వరకు 120 ఎకరాల్లో 1,272 ప్లాట్లతో అతిపెద్ద జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేశారు. 2021 నవంబర్ 21న రూ.106.00 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ లేఅవుట్లో సెంటు ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్లాట్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని అనుమతులతో లేఅవుట్లు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్ల పథకం వల్ల మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొంత రాయితీ కూడా ఉంటుంది. అన్ని మౌలిక వసతులతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, వివాదాలు లేని లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 150/200/240 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు రూ. 3 లక్షల నుంచి రూ.18 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారందరూ అర్హులు. ఆసక్తి గల వారు సచివాలయం, లేదా మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సంప్రదించవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తుచేసుకోవచ్చు. – డాక్టర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, హిందూపురం అన్ని సదుపాయాలతో అభివృద్ధి ఎంఐజీ లేఅవుట్లలో అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. నిజంగా ఇది మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు మంచి అవకాశం. కొడికొండ వద్ద, హైవే పక్కనే లేఅవుట్ సిద్ధం అవుతోంది. హిందూపురం ప్రాంత ప్రజలకు చక్కటి అవకాశం. త్వరలోనే మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభమవుతున్నాయి. ధర్మవరం కుణుతూరు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలోనే అది పూర్తవుతుంది. – ఈశ్వరయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అహుడా.అనంతపురం. -
అక్కడ పిరం.. ఇక్కడ స్థిరం!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరులో స్థిరాస్తి వ్యాపారి ఒకరు అయిదెకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేసేందుకు స్థలాన్ని చూశాడు. భూ యజమానితో ఎకరాకు రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. సరిగా నెల తర్వాత 8 కి.మీ. దూరంలో ఉన్న కడ్తాల్‌లో ఎకరా రూ.4 కోట్ల చొప్పున లే అవుట్ ప్రారంభించాడు. అందేంటి? హెచ్ఎండీఏ పరిధిలో, హైవేకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కాదని.. ఎక్కువ ధర పెట్టి డీటీసీపీలో వెంచర్ వేశారేంటని ప్రశ్నించగా.. హెచ్ఎండీఏ పరిధిలో ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్ల కారణంగా నివాసిత స్థలం తక్కువగా ఉంది. పైగా లే–అవుట్ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూడాలి. ఫీజులూ ఎక్కువే. అదే డీటీసీపీ ఫ్రీ జోన్. చార్జీలు తక్కువే, పర్మిషన్లూ సులువుగా వచ్చేస్తాయని సమాధానమిచ్చాడు. పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాట్లూ త్వరగానే అమ్మకం జరుగుతాయని సెలవిచ్చాడు. .. ఇది ఆ ఒక్క డెవలపర్ అభిప్రాయమే కాదు. చాలా మంది బిల్డర్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రాంతాలలో కాకుండా దగ్గరగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలో వెంచర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హెచ్ఎండీఏలో కంటే డీటీసీపీ ప్రాంతాల్లోని భూముల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆంక్షల్లేవ్.. ఆకాశంలో ధరలు హెచ్ఎండీఏ పరిధిలో చాలా వరకు ప్రాంతాలు ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్లలో ఉంటాయి. ఇక్కడ ప్లాంటింగ్ లేదా నివాస భవనాలకు అనుమతి లేదు కేవలం పరిశ్రమలు, ఇతరత్రా నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. లే– అవుట్, నిర్మాణాలకు పనికొచ్చే రెసిడెన్షియల్ (ఆర్)–1 జోన్ స్థలాలు చాలా తక్కువగా ఉంటాయి. డీటీసీపీలో జోన్ల సమస్య ఉండదు కాబట్టి ఇక్కడ భూముల ధరలు హెచ్ఎండీఏతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ పలుకుతున్నాయని స్పేస్ విజన్ సీఎండీ నర్సింహారెడ్డి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఫీజు చదరపు మీటరుకు రూ.40 చెల్లించాలి. బెటర్మెంట్ చార్జీలు, పార్క్‌లు, ఇతరత్రా లోడ్ల పేరిట ఫీజుల మోత మోగుతుంది. పైగా అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాలి. డీటీసీపీలో గ్రామ పంచాయితీ తీర్మానాన్ని బట్టి ఫీజుల్లో తేడా ఉంటుంది. బెటర్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్, లే అవుట్ ఫీజు (చ.మీ.) గజానికి రూ.5–12 వరకు ఉంటుంది. డీటీసీపీలో రోడ్ల విస్తీర్ణం ఎక్కువే.. లే–అవుట్ విస్తీర్ణంలో 10 శాతం ఓపెన్ ప్లేస్, 30 శాతం రోడ్లకు పోగా మిగిలిన స్థలంలో ప్లాటింగ్ చేసుకోవచ్చు. రహదారుల హద్దులను బట్టి ఎకరం స్థలంలో 55–59 శాతం ప్లాటింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఎకరానికి సుమారుగా 2,600 గజాల నుంచి 2,900 గజాల ప్లాటింగ్ చేసుకోవచ్చు. హెచ్ఎండీఏలో పోలిస్తే డీటీసీపీలో రహదారుల విస్తీర్ణం కాస్త ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎండీఏలో 30 అడుగుల రోడ్లు ఉన్నా అనుమతులు వస్తాయి. అదే డీటీసీపీలో అయితే అంతర్గత రోడ్లు 33 ఫీట్లు ఉండాల్సిందే. ఒకవేళ హెచ్ఎండీఏ పరిధిలో అప్రోచ్ రోడ్ 40 ఫీట్లు ఉంటే ఇంటర్నల్ రోడ్ కూడా 40 ఫీట్లు ఉండాల్సిందే. హెచ్ఎండీఏ, డీటీసీపీ ఏ ప్రాంతంలోనైనా సరే లే–అవుట్‌లోని మొత్తం ప్లాటింగ్ 15 శాతం మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అమ్మకాలు సులువు.. అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలతో పోలిస్తే ఓపెన్ ప్లాట్ల విషయంలో కొనుగోలుదారుల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ధరే కొనుగోలు నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అందుకే చాలా మంది డెవలపర్లు హెచ్ఎండీఏ పరిధిలో అధిక ధర పెట్టి స్థలాన్ని కొని వెంచర్ చేస్తే డెవలపర్‌కు పెద్దగా లాభం ఉండదు. అదే హెచ్ఎండీఏ ప్రాంతం నుంచి 4–5 కి.మీ. దూరంలో ఉన్న డీటీసీపీలో తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి అన్ని రకాల అభివృద్ధి పనులను చేపట్టి ప్లాట్లను చేస్తే సులువుగా అమ్ముడవుతాయి. డెవలపర్‌కూ గిట్టుబాటవుతుంది. ప్రతికూల మార్కెట్ ఉన్న ప్రస్తుత సమయంలో డీటీసీపీలో వెంచర్లు చేయడమే ఉత్తమమని మిర్చి డెవ లపర్స్ ఎండీ మల్లారెడ్డి అన్నారు. (చదవండి: 4 గంటలు.. 3 సర్జరీలు) -
‘రియల్’ మోసాలకిక కళ్లెం
సొంతిల్లు కట్టుకోవడానికి తొలుత కాసింత స్థలం సమకూర్చుకోవాలన్నది సగటు మధ్యతరగతి కుటుంబం కల. ఈ కలను ఆసరాగా తీసుకుని కొందరు అక్రమార్కులు అక్రమ లే అవుట్లతో అందినకాడికి దోచుకుని, అమాయక ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి నగరాలు, పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సరైన అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అందులో ఇల్లు కట్టుకోలేక, ఆ స్థలాన్ని తిరిగి అమ్ముకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కష్టాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్నేళ్లుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏ సౌకర్యం లేని చోట ప్లాట్ కొని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్రమ లే అవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కట్టడికి ఉపక్రమించింది. కనీసం రోడ్డు, కరెంటు లైన్, మంచి నీటి వసతి కూడా లేని అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొని సామాన్య ప్రజలు మోసపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తూ తాజాగా ఆదేశాలుగా జారీ చేసింది. మరోవైపు ఒక వేళ ఇప్పటికే ఆ అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొన్న వారు సైతం నష్టపోకుండా.. ఈ అంశంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ లే అవుట్లను నియంత్రించడంతో పాటు వాటిలో ఇళ్ల ప్లాట్లను కొనుగోలు చేసే వారు మోసపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తగిన సూచనలు చేయాలంటూ ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూముల్లో ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు వేయడం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. గత పదేళ్ల కాలంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 431 మండలాల పరిధిలోని 3,716 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 78,303 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఇళ్ల నిర్మాణం కోసం 15,783 లే అవుట్లు కొత్తగా వెలిశాయి. అందులో 37,684 ఎకరాల్లో వేసిన 10,169 లే అవుట్లు అక్రమంగా వేసినవని పంచాయతీరాజ్ శాఖ ఇటీవల నిర్ధారించింది. ఇలాంటి అక్రమ లే అవుట్లలో 2,54,854 ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. 2015 నాటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 6,049 అక్రమ లే అవుట్లు ఉన్నాయని అప్పటి అధికారులు గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోకుంటే ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నష్టపోయే ప్రమాదం ఉందని నివేదికలు ఇచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ తర్వాత కూడా గ్రామాల్లో అక్రమ లే అవుట్ల దందా యధావిధిగా కొనుసాగింది. పర్యవసానంగా 2019 నాటికి అక్రమ లే అవుట్ల సంఖ్య 9,422కు పెరిగింది. 90 శాతం వాటిలో కరెంటు లైను కరువు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,169 అక్రమ లే అవుట్లలో కేవలం 4,179 లే అవుట్లకు మాత్రమే రోడ్డు వసతి ఉంది. కేవలం 362 లేఅవుట్లకు మాత్రం మంచి నీటి సరఫరా సౌకర్యం అందుబాటులో ఉంది. 814 లే అవుట్లకు కరెంటు లైను వసతి ఉన్నట్టు అధికారులు తేల్చారు. అంటే 9,355 అక్రమ లే అవుట్లకు కరెంటు లైను కూడా లేదు. నిబంధనల ప్రకారం.. అనుమతులు పొందిన లే అవుట్లకు మాత్రమే కొత్తగా రోడ్డు వసతితోపాటు కరెంటు లైను, మంచి నీటి పైపులైను ఏర్పాటుకు ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలు, గ్రామ పంచాయతీలు ముందుకొస్తాయి. అనుమతులు పొందని వాటికి ఆ వసతుల కల్పనకు ఆటంకాలు ఉంటాయి. ఇళ్ల కోసం కొత్తగా ఎలాంటి లే అవుటు ఏర్పాటు చేయాలన్నా, ముందుగా సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతి పొందడంతో పాటు లే అవుటు ప్లానింగ్‌కు సంబంధించి డీటీసీపీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమిలో లే అవుటు ఏర్పాటు చేస్తుంటే దానికీ వేరుగా అనుమతులు తీసుకోవాలి. ఈ సమయంలో లే అవుట్ల విస్తీర్ణం ప్రకారం నిబంధనల మేరకు వెడల్పైన అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలి. మొత్తం లే అవుట్ల విస్తీర్ణంలో పది శాతం భూమిని సంబంధిత గ్రామ పంచాయతీకి బదలాయించాల్సి ఉంటుంది. ఆ ప్రాంత స్థానికుల అవసరాల మేరకు భవిష్యత్‌లో అక్కడ పాఠశాల, పార్కు, మంచి నీటి ట్యాంకు వంటి వాటి ఏర్పాటుకు వీలుంటుంది. నగరాలు, పట్టణాల పక్కన ఉండే గ్రామాల్లోనే.. నగరాలు, పెద్ద పట్టణాలను ఆనుకొని ఉండే గ్రామాల్లోనే అక్రమ లే అవుట్ల దందా పెద్ద ఎత్తున సాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,684 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు విస్తరించి ఉండగా, అందులో నగరాలు, పెద్ద పట్టణాలు ఆనుకొని ఉన్న గ్రామాల్లోనే 29,075 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నాయని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన గ్రామాల్లో కేవలం 8,609 ఎకరాల్లో ఈ అక్రమ లే అవుట్లు ఉన్నాయి. -
‘ఎంఐజీ లే అవుట్ పనులు వేగవంతం చేయాలి’
మంగళగిరి: జగనన్న స్మార్ట్ కాలనీ ఎంఐజీ లే–అవుట్లో పనులు మరింత వేగవంతం చేయాలని సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పక్కన వేసిన జగనన్న స్మార్ట్ కాలనీతో పాటు పక్కనే వున్న పాత టౌన్షిప్లో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. విజయకృష్ణన్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులను సమన్వయం చేసుకుని టౌన్షిప్ మొత్తం పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. జగనన్న స్మార్ట్ కాలనీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని ఇప్పటివరకు సుమారు 600 దరఖాస్తులు రాగా 100 మందికిపైగా నగదు చెల్లింపులు చేశారని చెప్పారు. అనుకున్న సమయానికి జగనన్న స్మార్ట్ కాలనీని అభివృద్ధి చేసి యజమానులకు ప్లాట్లు అప్పగిస్తామని తెలిపారు. -
గ్రేటర్ హైదరాబాద్.. కలెక్టరే కింగ్!
లే అవుట్లకు అనుమతివ్వడం, అక్రమ లే అవుట్లను గుర్తించడం వంటి కీలక అధికారాలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పటి వరకు ఈ అధికారాలు హెచ్ఎండీఏ, డీటీసీపీ(డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)ల పరిధిలో ఉండేవి. రాజధానితో సహా చుట్టూరా ఏడు జిల్లాల్లో విస్తరించిన మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళికను పటిష్టం చేయాలని భావించిన ప్రభుత్వం..మాస్టర్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నూతన లే అవుట్లకు అనుమతుల మంజూరు, అక్రమ లే అవుట్లను తొలగించే విషయంలో నియంత్రణ అధికారాలు చెలాయించిన హెచ్ఎండీఏ, డీటీసీపీలు..ఇక నుంచి మాస్టర్ప్లాన్ల తయారీ, పట్టణాల సమగ్ర సమాచార నిర్వహణ, డిజిటల్ డోర్ నెంబర్లను రూపొందించడం, జీఐఎస్ బేస్ మ్యాపుల తయారీ తదితర విధులను చేపట్టాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ప్రధాన విధులను హెచ్ఎండీఏ, డీటీసీపీల పరిధి నుంచి మినహాయిస్తూ.. ఇక నుంచి లే అవుట్ల అనుమతుల మంజూరు, అక్రమ లే అవుట్లను తొలగించే అధికారాలను టీఎస్‌బీపాస్ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రత్యేక ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఇక రియల్ బూమ్‌కు రెక్కలే? రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎటువైపు చూ సినా వంద కిలోమీటర్ల పరిధి వరకు రియల్‌బూమ్ అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో రియల్ రంగం ఏటేటా శరవేగంగా ముందుకు దూసుకెళుతోంది. అయితే నూతన లే అవుట్ల ఏర్పాటుకు సంబంధించి హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాల నుంచి అనుమతులు సాధించడం రియల్టర్లకు, నిర్మాణ రంగ సంస్థలకు కత్తిమీద సాములానే పరిణమించింది. నెలలపాటు ఆయా విభాగాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అనుమతుల మంజూరు ఆలస్యమయ్యేది. ఆయా విభాగాల అధికారులు సవాలక్ష కొర్రీలు పెడుతూ దరఖాస్తు దారుల సహనాన్ని పరీక్షించేవారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులతోపాటు..అధికారులకు లక్షల రూపాయలు ముడుపులు సమర్పించుకున్నా అనుమతులు పొందడం సాధ్యపడడం లేదని పలువురి నుంచి ప్రభుత్వ దృష్టికి భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో ఇక నుంచి కలెక్టర్లకు ఈ అధికారాలను అప్పజెప్పడంతో లే అవుట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కానుందని, దీంతో రియల్‌బూమ్‌కు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలుంటాయని రియల్టర్లు అభిప్రాయపడుతుండడం విశేషం. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాల నూతన విధులు ఇలా.. ► మాస్టర్ప్లాన్ల తయారీ ► పట్టణ సమగ్ర సమాచార నిర్వహణ, డిజిటల్ డోర్ నెంబర్ల విధానాన్ని రూపొందించడం. ► ల్యాండ్ యూజ్ ప్రణాళికలను మండలాలు, స్థానిక సంస్థల వారీగా రూపొందించడం. ► ప్రజోపయోగ భవనాల డిజైన్లకు అనుమతుల మంజూరు, పార్కులు, ప్లే గ్రౌండ్స్, శ్మశానాలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థలకు అనుమతుల మంజూరు. ► ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడం. ► డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇక నుంచి హెచ్ఎండీఏకు ఆవల ల్యాండ్‌పూలింగ్ అంశానికి సంబంధించి సాంకేతిక అథారిటీగా వ్యవహరించనుంది. హెచ్ఎండీఏ పరిధిలో ఈ సంస్థనే ల్యాండ్‌పూలింగ్ అంశాన్ని పర్యవేక్షిస్తుంది. ► ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, టౌన్‌ప్లానింగ్ ప్రణాళికలను రూపొందించాలి. ► రహదారుల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన,పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రహదారుల విస్తరణ ప్రణాళికలు రూపొందించడం. ► తమ పరిధిలోని వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిలను రూపొందించడం. ► టీఎస్‌బీపాస్ అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం, సలహాలు అందజేయడం. -
జగనన్న స్మార్ట్ టౌన్స్ ఎంఐజీ లే అవుట్లకు ప్రభుత్వ భూములు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దిశగా మరో ముందడుగు వేసింది. జగనన్న స్మార్ట్ టౌన్స్ ఎంఐజీ గృహాల లే అవుట్లకు ప్రభుత్వ భూములు కేటాయించింది. వివిధ శాఖల పరిధిలోని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను మున్సిపల్ శాఖకు అప్పగించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అన్ని వసతులతో లేఅవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా ప్లాట్లు విక్రయించే ఈ ప్రాజెక్టు పట్ల మధ్యతరగతి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న డిమాండ్ సర్వేనే అందుకు నిదర్శనం. ఏప్రిల్ నెల 1 నుంచి 10 వరకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన డిమాండ్ సర్వేలో ఏకంగా 2,32,369 ప్లాట్లకు ఆసక్తి కనబరచడం విశేషం. వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఈ డిమాండ్ సర్వే నిర్వహించారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు చొప్పున మాత్రమే సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. -
ప్రతి లే అవుట్‌ను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం
ఒంగోలు అర్బన్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పేదలకు నిర్మించే ఇళ్ల తాలూకు లే అవుట్లను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో శుక్రవారం గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలతో కలిసి మంత్రి రంగనాథరాజు మీడియాతో మాట్లాడారు. ప్రతి లే అవుట్లో తాగునీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక వసతుల్ని అండర్ గ్రౌండ్ విధానంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద లే అవుట్లు ఉన్న చోట్ల బస్టాండ్‌తో పాటు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 2, 3, 4, 5 తేదీల్లో భారీగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని కేటాయించి నిర్మాణాలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం: మంత్రి సురేష్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు తమకు ముఖ్యమని చెప్పారు. అందువల్లే ముందునుంచీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపిందని, పరీక్షల రద్దును కేవలం రెండో ఆప్షన్‌గానే చూశామని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ స్పష్టం చేశామన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాసే నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. -
10 నెలలు..రూ.365 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల రూపంలో ‘మహా’ ఆదాయం సమకూరుతోంది. గత పది నెలల్లో రూ.365 కోట్లు హెచ్ఎండీఏ ఖజానాలో వచ్చి చేరాయి. ఒక్క ఏప్రిల్(రూ.ఏడు కోట్లు) మినహా మిగతా తొమ్మిది నెలల్లో రూ.29 కోట్లకుపైగానే డెవలప్మెంట్ చార్జీల రూపంలో ఆదాయం సమకూరింది. ఓవైపు కరోనా ప్రభావంతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని వస్తున్న ఊహగానాలకు హెచ్ఎండీఏకు వచ్చిన ఆదాయం తెర దించినట్టైంది. ఇప్పటికీ సొంతింటి కలతో పాటు పెట్టుబడుల రూపంలో ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లపై డబ్బులు వెచ్చించే వారి సంఖ్య పెరుగుతుండడంతో హెచ్ఎండీఏకు ఆదాయం వస్తోంది. ఎటువంటి వివాదం లేని..హెచ్ఎండీఏ అనుమతి పొందిన ప్లాట్లు, ఫ్లాట్లను తీసుకునేందుకు జనం ఆసక్తి చూపుతుండడంతో రియల్టర్లు వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలవైపు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో ఆదాయం కరోనా తర్వాత గతేడాది సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.62.94 కోట్ల ఆదాయం హెచ్ఎండీఏకు సమకూరింది. అతి తక్కువగా ఏప్రిల్ నెలలో రూ.6.89 కోట్లు వచ్చింది. ఇక మేలో రూ.31.90 కోట్లు, జూన్‌లో రూ.42.20 కోట్లు, జూలైలో రూ.48.42 కోట్లు, ఆగస్టులో రూ.37 కోట్లు, అక్టోబర్‌లో రూ.32.47 కోట్లు, నవంబర్‌లో రూ.33.23 కోట్లు, డిసెంబర్లో రూ.41.56 కోట్లు, జనవరిలో రూ.29.35 కోట్ల ఆదాయం సమకూరినట్టుగా హెచ్ఎండీఏ వర్గాలు తెలిపాయి. చదవండి: గ్రేటర్లో క్యాబ్ డౌన్! -
ఇన్‌స్టంట్‌గా ఇంటికి అనుమతి
సాక్షి, హైదరాబాద్ : భవన, లేఅవుట్ల అనుమతుల్లో భారీ సంస్కరణలు చోటు చేసుకోనున్నాయి. జాప్యానికి, అవినీతికి అడ్డుకట్ట పడనుంది. భవన నిర్మాణ అనుమతులను ఇంట్లో కూర్చొని ఇన్స్టంట్(తక్షణం)గా పొందవచ్చు. భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీలో అవినీతి నిర్మూలన, సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతుల జారీ నిమిత్తం కొత్త పాలసీ అమలులోకి రానుంది. పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులిచ్చేందుకు ఆరేళ్ల కింద తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ పాలసీ స్ఫూర్తిగా రూపకల్పన చేసిన టీఎస్–బీపాస్ విధానాన్ని బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ పాలసీకి చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో దీనిని అమలు చేయనుంది. 75 చదరపు గజాల ఇళ్లకు అనుమతి అక్కర్లేదు.. ఏడు మీటర్ల ఎత్తుతో 75 చదరపు గజాల ప్లాట్‌లో భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. భవనం నిర్మించడానికి దరఖాస్తుదారులు ఆన్లైన్లో రిజిస్ట్రర్ చేసుకుని టోకెన్ ఫీజుగా రూ.1 చెల్లిస్తే సరిపోనుంది. (టోకెన్ ఫీజుతోపాటు తొలి ఆస్తిపన్నుగా రూ.100 చెల్లించడం ఐచ్ఛికం). ప్లాటు సైటు, ఫ్లోర్ల సంఖ్యను తెలపడంతోపాటు సదరు స్థలం ప్రభుత్వ స్థలం/చెరువులు/ఇతర నిషేధిత భూమికాదని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. స్వీయ ధ్రువీకరణతో తక్షణ అనుమతి 75 నుంచి 600 చదరపు గజాల వరకు (500 చదరపు మీటర్లు) ప్లాట్లలో 10 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణానికి స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు నిర్దేశిత ఫీజులు చెల్లిస్తే ఆన్లైన్లో తక్షణ అనుమతులు(ఇన్స్టంట్ పర్మిషన్æ) జారీ కానున్నాయి. జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్, జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ స్వీయ ధ్రువీకరణ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనుంది. ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొందినట్టు తేలితే సదరు అనుమతులను అధికారులు ఉపసంహరించుకుంటారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా జారీ చేసిన అన్ని అనుమతులను టీఎస్–బీపాస్ వెబ్సైట్లో ప్రదర్శన కోసం ఉంచనున్నారు. వీటిపై ఎవరైనా 21 రోజుల్లోగా అభ్యంతరం తెలియజేయడానికి అవకాశం కల్పించనున్నారు. భారీ భవనాలకు 21 రోజుల్లో అనుమతులు 600 చదరపు గజాల(500 చదరపు మీటర్ల) పైన ఉన్న స్థలంలో నివాస భవనాలు, 10 మీటర్లకుపైగా ఎత్తైన నివాస భవనాలు, అన్ని నాన్ రెసిడెన్షియల్ భవనాలు, లేఅవుట్లకు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అన్నిరకాల అనుమతులను సింగిల్ విండో విధానంలో జారీ చేయనున్నారు. ఇంటి అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల్లో 95 శాతం 600 చదరపు గజాలలోపు స్థలాలకు సంబంధించినవే ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పిస్తే సరిపోనుంది. అనుమతుల కోసం ఏ ప్రభుత్వ శాఖనూ సంప్రదించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు పరిశీలన అనంతరం 21 రోజుల్లో అనుమతి జారీ చేయాలి. లేని పక్షంలో 22వ రోజు ఆన్లైన్లో ఆటోమెటిక్‌గా పర్మిషన్ జనరేట్ కానుంది. ఇలా ఆటోమెటిక్‌గా జారీ చేసిన అనుమతుల కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం/ భవన నియమాళిని ఉల్లంఘించడం/ మాస్టర్ ప్లాన్ భూవినియోగం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు తేలితే అనుమతుల జారీ తేదీ నుంచి 21 రోజుల్లోగా వాటిని ఉపసంహరించుకునే అధికారం సంబంధిత అధికారులు కలిగి ఉంటారు. కలెక్టర్లు, గ్రేటర్ కమిషనర్‌కు కీలక బాధ్యతలు – టీఎస్–బీపాస్ ద్వారా వచ్చే భవన, లేఅవుట్ దరఖాస్తులకు సకాలంలో అనుమతులు జారీ అయ్యేలా జిల్లా స్థాయిలో కలెక్టర్, జీహెచ్ఎంసీలో కమిషనర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ పర్యవేక్షించనుంది. – రిజిస్ట్రేషన్/స్వీయ ధ్రువీకరణ కేటగిరీల భవనాలకు అనుమతుల మేరకే నిర్మిస్తున్నారా? లేదా అని ఆకస్మిక తనిఖీలు జరిపేందుకు ఈ కమిటీ బృందాలను ఏర్పాటు చేయనుంది. – అన్ని నడుస్తున్న ప్రాజెక్టులను సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనుంది. – అక్రమ/అనధికార నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చిన 48 గంటల్లోగా తనిఖీలు జరిపించనుంది. – ఏవైనా ఉల్లంఘనలు ఉంటే కూల్చివేతలు/ సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలు తప్పుడు సమాచారం/నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్, స్వీయ ధ్రువీకరణ కేటగిరీలో అనుమతులు పొందినట్టు రుజువైతే సంబంధిత నిర్మాణాలను నోటీసు లేకుండా కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉండనుంది. అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులపై జరిమానాలు, చర్యలు ఉండనున్నాయి. -
ఆ వలలో చిక్కిన వారికి.. తప్పవు చిక్కులు
కాకినాడ రూరల్: అద్దె ఇళ్లల్లో.. చాలీచాలని ఇరుకు కొంపల్లో ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నవారు.. అప్పోసప్పో చేసి సొంతిల్లు కట్టుకోవాలని కలలు కంటారు. దీనిని సొమ్ము చేసుకొనే లక్ష్యంతో పట్టణాలు, నగరాలను ఆనుకొని ఉన్న పల్లెల్లో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తగిన అనుమతులు లేకుండానే ఇష్టానుసారం లే అవుట్లు వేసేస్తున్నారు. తక్కువ ధరల పేరుతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపై వల విసురుతున్నారు. ఆ వలలో చిక్కుకున్న వారికి చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు గుడా అధికారులు. నిబంధనలు పాటించకుండా వేసిన లే అవుట్లలోని స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు రావని స్పష్టం చేస్తున్నారు. అటువంటి అనధికార లే అవుట్లలోని ప్లాట్లను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల ఒత్తిళ్లతో జిల్లాలోని పలు వ్యవసాయ భూములు వ్యవసాయేతరంగా మారిపోయాయి. ఆ పార్టీ నేతల కనుసన్నల్లో రియల్ ఎస్టేట్ నిబంధనలను తుంగలో తొక్కి.. అనేకమంది యథేచ్ఛగా అనధికార లే అవుట్లు (నాన్ లే అవుట్లు) వేసేశారు. సామాజిక అవసరాలకు స్థలాలను మినహాయించకుండానే ప్లాట్లు వేసి అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారు. తగిన అనుమతులు లేని ఇటువంటి లే అవుట్లలో భవిష్యత్తులో భవన నిర్మాణాలకు అవకాశం ఉండదు. అంతేకాదు.. వీటిని అమ్ముకునే వీలు కూడా ఉండదని గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ (గుడా) అధికారులు స్పష్టం చేస్తున్నారు. 23 మండలాల పరిధిలో.. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతో పాటు తుని, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, మండపేట మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీలు, 43 మండలాల్లోని 598 రెవెన్యూ గ్రామాలు గుడా పరిధిలో ఉన్నాయి. మొత్తం 4396.84 చదరపు కిలోమీటర్ల మేర గుడా పరిధి విస్తరించి ఉంది. మొత్తం 23 మండలాల్లో విస్తరించి ఉన్న గుడా పరిధిలో 1,338 అనధికార లే అవుట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అత్యధికంగా 370 ఉండగా, కడియం మండలంలో అత్యల్పంగా 6 ఉన్నాయి. వీటిని ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని నిషేధిత భూముల రిజిస్టర్లో నమోదు చేయించారు. తద్వారా వాటి కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు. ఇటువంటి లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు ముందే మేల్కోవాలని, ఏప్రిల్ ఆరో తేదీలోగా వాటిని క్రమబదీ్ధకరించుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్తో ప్రయోజనాలు లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం (ఎల్ఆర్ఎస్) ద్వారా అనధికార లే అవుట్లను క్రమబదీ్ధకరించుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8న జీఓఎంఎస్ 10 ద్వారా అనుమతి ఇచ్చింది. దీని ద్వారా గత ఏడాది ఆగస్టు 31కి ముందు వేసిన అనధికార లే అవుట్లలోని ప్లాట్లను క్రమబదీ్ధకరించుకొనేందుకు అవకాశం ఇచ్చింది. జిల్లాలోని సంబంధిత యజమానులు తమ ప్లాట్లను ఏప్రిల్ ఆరో తేదీలోగా క్రమబద్దీకరించుకుంటే 14 శాతం ఓపెన్ స్పేస్ ఖరీదులో 50 శాతం మినహాయింపు లభిస్తుంది. పూర్తి వివరాలకు కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించాలని గుడా అధికారులు సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ను వినియోగించుకోండి.. రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే అవుట్ల క్రమబదీ్ధకరణకు ఎల్ఆర్ఎస్–2020కి జనవరిలో అనుమతి ఇచ్చింది. ఈ పథకాన్ని గుడా పరిధిలోని నాన్ లే అవుట్ల ప్లాట్ల యజమానులు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే 1,338 నాన్ లే అవుట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిషేధిత భూముల రిజిస్టర్లలో నమోదు చేశాం. దీనివల్ల భవిష్యత్తులో అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం ఉండదు. అందువల్ల ఎల్ఆర్ఎస్ మంచి అవకాశం. – ఆర్.అమరేంద్రకుమార్, వైస్ చైర్మన్, గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ -
లే అవుట్లను తలదన్నేలా!
సాక్షి, అమరావతి: అందమైన లే–అవుట్లు.. విశాలమైన అంతర్గత రోడ్లు... ప్లాట్ల దగ్గరి నుంచి సమీప గ్రామానికి లింకు రోడ్డు...! ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ వ్యాపార ప్రకటన కాదు... రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలివి. ఉగాది సందర్భంగా గూడులేని పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను రియల్ ఎస్టేట్ వెంచర్లను తలదన్నేలా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 9,100 ఎకరాల్లో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. దాదాపు 25 లక్షల మంది పేదలకు ఉగాదికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గతానికి భిన్నంగా ఇంటి పట్టా పొందిన లబ్ధిదారుడు వెంటనే గృహ నిర్మాణం ప్రారంభించేలా భూమిని పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో లే అవుట్ పనులు ఊపందుకున్నాయి. గ్రామాల్లో ఇళ్ల పట్టాల కోసం కేటాయించిన భూముల వివరాలను రెవిన్యూ శాఖ సర్వే నంబర్ల వారీగా గ్రామీణాభివృద్ధి శాఖకు తెలియజేసిన వెంటనే ఉపాధి హామీ నిధులతో చదును చేయడం, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఆయా చోట్ల పరిస్థితిని బట్టి ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఈ పనుల కోసం ఖర్చు చేస్తున్నారు. నెలాఖరుకు భూమి చదును, రోడ్లు పూర్తి - గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల కోసం రెవిన్యూ శాఖ ఇప్పటి వరకు 12,843 ప్రాంతాల్లో గుర్తించిన భూమి వివరాలను గ్రామీణాభివృద్ది శాఖకు అందజేయగా ఎలాంటి అభ్యంతరాలు లేని 9,633 గ్రామాల్లో చదును చేయడం మొదలైంది. - ముళ్ల పొదలు లాంటివి తొలగింపు పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. - భూమి చదును చేయడం, మెరక తోలడం, లే అవుట్ ప్రకారం రోడ్ల నిర్మాణానికి డ్రోన్లను వినియోగించారు. - ప్రతి ఎకరాకు గరిష్టంగా 4,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించి భూమి చదును చేస్తున్నారు. - ప్రతి ఎకరానికి గరిష్టంగా 800 మీటర్ల పొడవున అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. - ఇళ్ల పట్టాల కోసం గుర్తించిన భూమి నుంచి సమీపంలోని రోడ్డు లేదా గ్రామం వరకు గరిష్టంగా 5 కి.మీ పొడవున లింకు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. - భూమి చదును, అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆ భూమిని తిరిగి రెవిన్యూ శాఖకు అప్పగిస్తే లే అవుట్ ప్రకారం ప్లాట్ల వారీగా రాళ్లు పాతుతారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. - రాష్ట్రవ్యాప్తంగా 8,662 గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్లాట్లు కొంటే పాట్లే..!
సాక్షి, యాదాద్రి : జిల్లాలో మున్సిపాలిటీలు, జాతీయ రహదారులు, వైటీడీఏ, హెచ్ఎండీఏ మండలాల్లో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. వందల ఎకరాల సాగు భూములను స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్లుగా మార్చేస్తున్నారు. వీటిని విక్రయిస్తూ మూడు పువ్వులు, ఆరు కాయల్లా సంపాదన చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కళ్లు తెరవడం లేదు. వెరసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. నిబంధనలు పాటించకుండానే.. జిల్లాలో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గత ఏడాది వరకు 726 ఉన్న లేఅవుట్లు ఉండగా ప్రస్తుతం 1000కి చేరాయి. ఇందులో కేవలం 217 వెంచర్లకు మా త్రమే అనుమతులున్నాయి. వాటిలోనూ అనేక లొసుగులున్నాయి. వెంచర్లలో ప్రజాప్రయోజనాల కోసం 10శాతం భూములను సైతం వి డువకుండానే వ్యాపారులు ప్లాట్ల విక్రయాలు జరిపారు. ఎక్కడో ఓ చోట వెంచర్లో 10 శా తం భూమి వదిలినప్పటికీ ఇటీవల రియల్ఎ స్టేట్ వ్యాపారులు మాఫియాగా మారి ఆ స్థలా లను అక్రమ పద్ధతుల ద్వారా అమ్ముకున్నారు. నిబంధనలు పాటించడం లేదు జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల్లో అక్రమ వెంచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వెంచర్ చేసేటప్పుడు నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను వాణిజ్య భూములుగా మార్చాలి. ఇందుకోసం నాలా పన్ను చెల్లించాలి. అనంతరం 10శాతం భూమిని ప్రజా అవసరాల కోసం ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పేరున గిఫ్ట్‌గా రిజిస్ట్రేషన్ చేయాలి. మౌలిక వసతులైన రోడ్లు, మంచి నీరు, విద్యుత్ సౌకర్యం, పార్కులు ఏర్పాటు చే యాలి. గ్రామపంచాయతీల నుంచి ఎన్ఓసీ తీ సుకుని హెచ్ఎండీఏ, వైటీడీఏ, డీటీసీపీ ద్వారా లేఅవుట్‌కు అనుమతి పొందాలి. ఈప్రాథమిక అంశాలేమీ లేకుండానే రైతులకు సంబం ధించిన భూములను కొనుగోలు చేసి హద్దురాళ్లు నాటి క్రయవిక్రయాలు చేస్తున్నారు. కొన్ని సార్లు అధికారులు హద్దురాళ్లు, బోర్డులు తొలగించినా మరుసటి రోజు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. బ్రోచర్లపైనే అందమైన నమూనాలు.. హైదరాబాద్ కేంద్రంగా జిల్లాలోని అక్రమ లేఅవుట్ల ఫ్లాట్ల క్రయవిక్రయ వ్యాపారం సాగుతోంది. యాదాద్రి దేవస్థానం అభివృద్ధి, సమీ కృత కలెక్టర్, గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కు, ఎయి మ్స్, జాతీయ రహదారులు, ఎంఎంటీఎస్ రైలు, భువనగిరి ఖిలా, పోచంపల్లి, కొలనుపాక అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా అందమైన బ్రోచర్లు రూపొందించి ప్లాట్లు అంటడుతున్నారు. ఆదివారం వస్తే జాతరే.. అదివారం వచ్చిందంటే వెంచర్లు జాతరను తలపిస్తాయి. రియల్టర్లు తమ ఏజెంట్లద్వారా హైదరాబాద్ నుంచి కార్లలో కొనుగోలు దారులను తీసుకువచ్చి లేఅవుట్లలో విందులు, వినోదాలు ఏర్పాటు చేసి ప్లాట్ల కొనుగోలుకు ఒప్పిస్తున్నారు. ప్లాట్ మొత్తం ధరలో ఏజెంట్లకు 40శాతం కమీషన్ చెల్లిస్తున్నారు. ఏజెంట్లు అక్రమ లేఅవుట్ల ప్లాట్లను పేద, మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు. అక్రమ వెంచర్లు ఎక్కువగా ఉన్నదిక్కడే.. భువనగిరి మున్సిపాలిటీ, మండలంలో వడాయిగూడెం, వీరవెల్లి, రామచంద్రాపురం, అనంతారం, నందనం, గంగసానిపల్లి, జమ్మాపూర్, తాజ్పూర్, ముత్తిరెడ్డిగూడెం, పగిడిపల్లి, వడపర్తి, నాగిరెడ్డిపల్లి, హన్మాపూర్, ఆర్ఎన్తం డా, బస్వాపూర్, తుక్కాపూర్, చందుపట్ల, పెం చికల్పహాడ్, అనాజిపూర్, బొమ్మాయిపల్లి, చీమలకొండూర్, బాలంపల్లి, కూనూర్, రాయగిరి. బీబీనగర్ మండలం : అన్నంపట్ల, భట్టుగూడెం, బీబీనగర్, బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి, గొల్లగూడెం, గూడూరు, గుర్రాలదండి, జైనపల్లి, కొండమడుగు, లక్ష్మీదేవిగూడెం, మక్తానంతారం, మాదారం, ముగ్ధుంపల్లి, నెమురగోముల, పడమటిసోమారం, పల్లెగూడెం, రాఘవాపూర్, రహీంఖాన్‌గూడెం, రాయరావుపేట, రామునిగుండ్లతండా, రావిపహాడ్, రుద్రవెల్లి, వెంకిర్యాల. భూదాన్‌పోచంపల్లి : మున్సిపాలిటీ, మండలంలోని జలాల్పూర్, పిలాయిపల్లి, దేశ్ముఖి, పెద్దగూడెం, పోచంపల్లి, జగత్పల్లి, జలాల్పూర్. యాదగిరిగుట్ట : మున్సిపాలిటీ పరిధి లోని రామాజీపేట్తో పాటు చిన్నకందుకూర్, చొల్లేరు, దాత్తర్‌పల్లి, జంగంపల్లి, వంగపల్లి, కాచారం, బాహుపేట, పెద్దకందుకూర్,మోటకొండూర్, మల్లాపూర్, సాదువెల్లి, గౌరాయపల్లి, మాసాయిపేట, మహబూబ్‌పేట, సైదాపూర్. ఆలేరు : మున్సిపాలిటీ పరిధిలోని దిలావపూర్, గొలనుకొండ, ఇక్కుర్తి, కొలనుపాక, మంతపురి, మాటూరు, పటేల్‌గూడెం, రాఘవాపురం, శారా జీ పేట, శర్బనాపురం, తూర్పుగూడెం. మోత్కూర్ : మున్సిపాలిటీలో 15వెంచర్లను ఏర్పాటు చేశారు. 5వెంచర్లకు అనుమతులుం డగా 10వెంచర్లకు ఎలాంటి అనుమతులు లేవు. పోలీస్స్టేషన్లకు బాధితులు జిల్లాలో ఏర్పాటు చేసిన అక్రమం లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన Ðవారు పోలీస్ స్టేషన్లకు వెళ్లి పిర్యాదు చేస్తున్నారు. ఈ ఏడాది 100కు పైగా కేసులు నమోదైనట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారుహద్దురాళ్లు తొలగించాం. నెమిలె పంచాయతీ పరిధిలో వెంచర్‌కు డీటీసీ పీ(డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్) అనుమతి లేదు. డీపీఓ,ఈఓపీఆర్డీ ఆదేశాలతో ఇప్ప టికీ 4 సార్లు హద్దురాళ్లు తొలగించాం. –నెమిల పంచాయతీ కార్యదర్శి, రఘుపతిరెడ్డి -
గ్రీన్.. గుట్ట
సాక్షి, యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రంలోని పెద్దగుట్టలో పరుచుకున్న పచ్చదనం పర్యాటకులను, భక్తులను ఆకట్టుకుంటోంది. యాదాద్రి క్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చేపట్టిన అభివృద్ధి పనుల్లో పెద్దగుట్ట సుందరీకరణ ఒకటి. ఇప్పటికే ఇక్కడ చేపట్టిన లేఅవుట్లు, రోడ్లు, సుందరీకరణ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వారాంతంలో యాదాద్రికి వచ్చే భక్తులకు పెద్దగుట్ట కనువిందు చేస్తోంది. 250 ఎకరాల్లో లేఅవుట్ పనుల్లో భాగంగా 202 ఓపెన్ ప్లాట్లను సిద్ధం చేశారు. తిరుమల తరహాలో దాతల సాయంతో ప్రత్యేక సూట్లను అన్ని వసతులతో నిర్మించనున్నారు. త్వరలో దాతల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం రూ.207 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావొచ్చాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం.. పెద్దగుట్ట లేఅవుట్ అభివృద్ధిలో ప్రధానమైన రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి కావొస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం కోసం హెచ్ఎండీఏ పెద్ద ఎత్తున వివిధ రకాల మొక్కలను నాటుతోంది. అంతేగాకుండా రెండు చోట్ల చిన్న నీటి సరస్సులను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ల్యాండ్ స్కేప్‌లు ఏర్పాటు చేశారు. పాతగుట్టకు రోడ్డు సౌకర్యం.. పాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు పెద్దగుట్ట నుంచి రోడ్డు సౌకర్యం కల్పిం చారు. భక్తులు కొండపైన స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట పట్టణంతో సంబంధం లేకుండా పెద్దగుట్టపై నుంచి పాతగుట్ట స్వామివారి వద్దకు చేరుకునేలా రోడ్డును నిర్మించారు. నూతనంగా మరో రోడ్డును మల్లాపురం రోడ్డు నుంచి నిర్మిస్తున్నారు. ప్రారంభమైన ప్రెసిడెన్షియల్ సూట్లు గుట్టకు వచ్చే వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి తదితర వీవీఐపీల కోసం ఒక ప్రెసిడెన్షియల్ సూట్‌ను నిర్మిస్తున్నారు. 10 భవనాలు, గండి చెరువు వద్ద కల్యాణ కట్ట, గుట్ట చుట్టూ రింగ్‌రోడ్డు పనులు జరుగుతున్నాయి. తులసీ వనంలో నిర్మించిన రెండు సరస్సులలో బోటింగ్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. -
అందుబాటు లే అవుట్లు!
లే అవుట్లు.. స్థానికంగా చిన్న డెవలపర్లు అభివృద్ధి చేసే వెంచర్లు! కానీ, వీటికి విపరీతమైన మార్కెట్ ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాతైతే మరీనూ!! దీంతో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు లే అవుట్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇన్నాళ్లూ శివారు, సుదూర ప్రాంతాలకే పరిమితమైన లే అవుట్లు.. ఇప్పుడు అభివృద్ధి చెందే ప్రాంతంలో.. అదీ అందుబాటు ధరల్లో అన్ని రకాల ఆధునిక వసతులతో కస్టమర్లను రా..రమ్మంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే అపార్ట్మెంట్లలో నివసిస్తూ విసిగిపోయిన చాలా మంది.. కాస్త దూరం వెళ్లి ప్రశాంతంగా ఓ ఇల్లు కట్టుకుని నివసించాలనే నిర్ణయానికి వస్తున్నారు. ఇప్పుడే కాకపోయినా మూడు నాలుగేళ్లలో సొంతిల్లు కట్టుకోవాలని భావించేవారు శివారు ప్రాంతాల్లో ప్లాట్లను కొంటున్నారు. కాకపోతే రవాణా సదుపాయాలుండాలని కోరుకుంటున్నారు. భవిష్యత్తు అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతాలనే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో స్థల యజమానులకు కూడా లే అవుట్ల మీద అవగాహన వచ్చేసింది. తన భూమిని మంచి పేరున్న డెవలపర్‌కు ఇచ్చి లే అవుట్ చేసి విక్రయిస్తే ఆయా చుట్టుపక్కల ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని నిర్ణయానికి వస్తున్నారు. దీంతో పేరున్న డెవలపర్లు భారీ స్థాయిలో వెంచర్లు చేస్తున్నారు. పేరున్న నిర్మాణ సంస్థలెన్నో.. అపర్ణా, సుచిరిండియా, ఏవీ కన్స్ట్రక్షన్స్, ఏఆర్కే వంటి సంస్థలు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వెంచర్లకు శ్రీకారం చుట్టాయి. ఇటీవలే 26 ఎకరాల్లో కీసర్ మెడోస్ వెంచర్‌ను పూర్తి చేశామని.. తాజాగా బోగారంలో దేవకీ మెడోస్ పేరిట 47 ఎకరాలను అభివృద్ధి చేయనున్నామని ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో మరో 50 ఎకరాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అలాగే సుచిరిండియా బోగారంలోని హోలీమేరీ కళాశాలను ఆనుకొని ఓయ్స్టర్ బ్లూ పేరిట 60 ఎకరాలను, హకీంపేట్ రోడ్‌లోని తూంకుంటలో ఆర్యవర్తనగరి పేరిట 86 ఎకరాలను అభివృద్ధి చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు లే అవుట్లను అభివృద్ధి చేస్తే మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధి చెందే ప్రాంతాల్లోనే.. ఆర్గనైజ్ డెవలపర్లు లే అవుట్లు చేస్తే కొనుగోలుదారులకూ మంచిదే. ఎందుకంటే హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి ప్రభుత్వ విభాగాల అనుమతులతోనే అది కూడా అభివృద్ధి చెందే ప్రాంతాల్లోనే వెంచర్లకు శ్రీకారం చుడతారు. దీంతో త్వరితకాలంలోనే కస్టమర్లు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. పైగా డెవలపర్లకు సొంత మార్కెటింగ్ బృందం ఉంటుంది కాబట్టి.. మధ్యవర్తుల బెడద ఉండదు.దీంతో ధర కూడా తక్కువగా ఉంటుంది. నాలా కన్వర్షన్ చేసి.. రెసిడెన్షియల్ జోన్లోనే లే అవుట్‌ను వేస్తారు కాబట్టి నిర్మాణ అనుమతులకూ ఇబ్బందులుండవు. రీసేల్ విలువ పెరుగుతుంది.. అనుమతి ఉన్న వెంచర్లలో ప్లాట్లు కొంటే బ్యాంక్ లోన్‌ను కూడా సులువుగా అందిస్తుంది. 20 ఏళ్ల తర్వాత జరగబోయే అభివృద్ధిని, జనాభాను ముందుగానే ఊహించి అప్పటి అవసరాలకు తగ్గట్టుగా విశాలమైన రోడ్లు అంటే 80 అడుగుల వెడల్పు రోడ్లు, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంకుడు గుంతలు వంటి ఏర్పాట్లన్నీ ఉంటాయి. పైగా ఐదేళ్ల పాటు వీటి నిర్వహణ బాధ్యతలను కూడా డెవలపర్లే నిర్వహిస్తారు. దీంతో ఆయా ప్లాట్లకు రీసేల్ విలువ పెరుగుతుంది. ఉదాహరణకు.. రెండేళ్ల క్రితం ఘట్కేసర్లో గజం రూ.6,500. ఉప్పల్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ అక్కడ లే అవుట్ చేశాక ఇప్పుడక్కడ గజం ధర రూ.12 వేలకు చేరింది. అలాగే ఏడాది క్రితం గజం రూ.8 వేలున్న చెంగిచెర్లలో ఓ నిర్మాణ సంస్థ వెంచర్‌ను అభివృద్ధి చేశాక ఇప్పుడక్కడ గజం ధర రూ.12,500కు చేరింది. లే అవుట్లలో ఆధునిక వసతులు.. గతంలో లే అవుట్లలో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక వసతులు కల్పించేసి.. ప్లాట్లను విక్రయించేవాళ్లు. కానీ, ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉండే వసతులు అంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, బాంక్వెట్ హాల్, ఫంక్షన్ ఏరియా, పార్క్, ప్లే ఏరియా వంటి అన్ని రకాల ఏర్పాట్లు ఉంటున్నాయి. దీంతో కొనుగోలుదారులు వీకెండ్ టూర్‌గా ఎంజాయ్‌గా చేస్తున్నారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. పైగా లింక్ డాక్యుమెంట్లు, టైటిల్ పక్కాగా ఉంటాయి. న్యాయపరమైన సమస్యలేవీ ఉండవు గనక ప్రాపర్టీ కస్టమర్లు నిశ్చింతంగా ఉండవచ్చు. -
అక్రమ లే అవుట్లపై కలెక్టర్ కొరడా..!
విజయనగరం, బొబ్బిలి: పంచాయతీలు, మున్సిపాలిటీలకు పన్నులు ఎగ్గొట్టి.. నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్న లే అవుట్లపై కొరడా ఝుళిపించేందుకు కలెక్టర్ వివేక్‌యాదవ్ రంగంలోకి దిగారు. జిల్లాలోని లే అవుట్లపై నివేదిక ఇవ్వాలని జిల్లా పం చాయతీ అధికారి బి.సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీపీవో ఆధ్వర్యం లోని కమిటీలు అక్రమ లే అవుట్లు గుర్తించే పనిలో పడ్డాయి. జిల్లాలో అక్రమంగా ఉన్నవెన్ని? సక్రమ లే అవుట్లు ఎన్ని అన్న అంశాలపై కమిటీ సభ్యులు, అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో 746 అవుట్ల పరిశీలనలోకమిటీలు.. జిల్లాలో ఉన్న అక్రమ రియల్ ఎస్టేట్లపై అటు ఉడా అధికారుల సూచనలతో జిల్లా పంచాయ తీ అధికారులు ఓ నివేదిక సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,100కు పైబడి రియల్ ఎస్టేట్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే, కొత్తగా కలెక్టర్ ఆదేశించిన మీదట జిల్లాలోని 29 మండలాల్లో 746 రియల్ వెంచర్లు వెలసినట్టు నిర్ధారించారు. వీటిని ఆయా మండలాల్లోని కమిటీలు పరిశీలించనున్నాయి. ఇందులో 364 అధికార లే అవుట్లు కాగా, 382 అనధికార లే అవుట్లు ఉన్నట్టు ప్రాథమిక అంచనాకొచ్చినట్టు సమాచారం. భూ బదలాయింపు ఫీజు తగ్గినా రూ.కోట్లలో దోపిడీ.. ఇటీవల వాణిజ్యపరంగా ఇంటి స్థలాలుగా మార్చే వ్యవసాయ భూములకు మార్పిడి ఫీజు తగ్గింది. సుమారు 12 శాతం ఉండే ఈ పీజు ఇప్పుడు పదిలోపే చెల్లించాల్సి ఉంటుంది. అయినా రియల్టర్లు క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. దీంతో ఏటా ఈ అక్రమ రియల్ ఎస్టేట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతోంది. పరిశీలన ఇలా... కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశాలతో డీపీవో సత్యనారాయణ ఆధ్వర్యంలో వేసిన కమిటీలు లే అవుట్లను పరిశీలిస్తాయి. కమిటీ సభ్యులుగా స్థానిక పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, ఈవోపీఆర్డీలు ఉంటారు. వారు లే అవుట్లను గుర్తించి అందజేసిన నివేదికను తహసీల్దార్, సర్వేయర్లు పరిశీలించి డీపీవోకు అందజేస్తారు. వాటిని సరిపోల్చిన డీపీవో కలెక్టర్‌కు నివేదిస్తారు. అనంతరం వాటిపై చర్యలకు కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడా కమిటీలు పరిశీలనలకు దిగాయి. అంటకాగుతున్న క్షేత్రస్థాయి ప్రభుత్వ సిబ్బంది.. క్షేత్ర స్థాయిలో రియల్టర్లతో కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు అంటకాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేని రియల్ ఎస్టేట్లలో కొనుగోలుచేసిన ప్లాట్లలో వాస్తవానికి ఇళ్లను నిర్మించే అవకాశం లేదు. వాటిని కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ సిబ్బంది మేనేజ్ చేసి ఇళ్ల నిర్మాణానికి కూడా లంచాలు గుంజి అనుమతులు ఇచ్చేస్తున్నట్టు భోగట్టా! ఇది అందరికీ తెల్సిన విషయమే అయినా ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదన్నది సుస్పష్టం. చర్యలుంటాయా? అక్రమ రియల్ ఎస్టేట్లతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అటు వినియోగదారులకు జెల్ల కొడుతున్న రియల్టర్ల ఘరానా మోసాలకు ఇకనయినా చెక్ పడే అవకాశం ఉంటుందానని వినియోగదారులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా కలెక్టర్ వీటిపై నివేదిక కోరడంతో కాస్తయినా లైన్లో పడే పరిస్థితులు ఉంటే మంచిదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాటికినివేదిక సిద్ధం చేస్తాం! జిల్లాలో 29 మండలాల్లో 746 లే అవుట్లు ఉన్నట్టు గుర్తించాం. వీటిని కొత్తగా నియమిం చిన కమిటీలు గుర్తిస్తాయి. అవి ఇచ్చిన నివేదికను తహసీల్దార్లు, సర్వేయర్లు పరిశీలిస్తా రు. ఈ నివేదికను వారం రోజుల్లో కలెక్టర్‌కు నివేదిస్తాం. తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారు. – బలివాడ సత్యనారాయణ,జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం -
అక్రమ లేఅవుట్లపై కొరడా
కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో మూకుమ్మడి దాడులు పెద్ద ఎత్తున హద్దురాళ్ల తొలగింపు మంచిర్యాల రూరల్ : మంచిర్యాల మండలంలోని ఆయా గ్రామాల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ లే అవుట్ వెంచర్లపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. కలెక్టర్ జగన్మోహన్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకాధికారులు, ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లలో ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తొలగించారు. ప్రత్యేకాధికారులుగా మంచిర్యాల, లక్సెట్టిపేట, దండేపల్లి, మందమర్రి, కాసిపేట, నిర్మల్, జైపూర్, బెల్లంపల్లి ఈవోపీఆర్డీలు శంకర్, సత్యనారాయణ, ఎ.శివక్రిష్ణ, నసీరుద్దీన్, మేఘమాల, మోహన్, సతీశ్, వివేక్ ఉన్నారు. ముల్కల్ల, హాజీపూర్, దొనబండ, గుడిపేట, వేంపల్లి, తీగల్‌పహాడ్, నస్పూర్, పడ్తనపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో రియల్ వ్యాపారులు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లే అవుట్ వెంచర్లలోని హద్దురాళ్లను వీరు తొలగించారు. అందంగా ముస్తాబు చేసిన వెంచర్లలోని హద్దురాళ్లతో పాటు బీటీ రోడ్లను కూడా బ్లేడ్ ట్రాక్టర్‌తో తవ్వించారు. నస్పూర్‌లో 17 ఎకరాలు, వేంపల్లిలో 37, తీగల్‌పహాడ్‌లో 11, ముల్కల్లలో 32, హాజీపూర్‌లో 6, దొనబండలో 2, పడ్తనపల్లిలో 4, నర్సింగాపూర్‌లో 3, గుడిపేటలో 7 ఎకరాల్లో హద్దురాళ్లను తొలగించారు. ఈ మొత్తం 120 ఎకరాలు. ఈ హద్దురాళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు శ్రీనివాస్, అజ్మత్‌అలీ, ప్రదీప్, సఫ్దర్‌అలీ, శ్రీధర్, శ్రీపతి బాపు, సమ్మిరెడ్డి, కారోబార్లు పాల్గొన్నారు. చర్యలు తప్పవు మండలంలోని ఆయా గ్రామాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా లే అవుట్ చేసి వ్యాపారాలు సాగించే వారిపై చర్యలు తప్పవని మంచిర్యాల డివిజినల్ పంచాయతీ అధికారి(డీఎల్పీవో) వేముల శేఖర్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అక్రమ లే అవుట్ల ద్వారా అమాయక ప్రజలను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మూకుమ్మడి దాడులు నిర్వహించామని తెలిపారు. ప్రజలు మోసపోవద్దు! అక్రమ లే అవుట్లో ఏర్పాటు చేసిన ప్లాట్లను కొనుగోలు చేసి ఇబ్బందులకు గురికావొద్దని ప్రజలకు డీఎల్పీవో సూచించారు. ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇంటి నిర్మాణాల అనుమతుల విషయంలో సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. 2012 నుంచి వరుసగా ఇప్పటి వరకు రియల్ వ్యాపారులకు నోటీసులు పంపినా స్పందన లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
లేఔట్ల.. పంచాయితీ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పంచాయతీల్లో అక్రమ లేఔట్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. వేలాది ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే లే అవుట్లు పుట్టుకొస్తుండగా.. పంచాయతీ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా తేలిన ప్రాథమిక అంచనా మేరకు 80 గ్రామాల్లో ఏకంగా 4,200 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా మొత్తం 899 పంచాయతీల్లో సర్వే చేస్తే సుమారు లక్ష ఎకరాల్లో అక్రమ లే-ఔట్లు తేలే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అక్రమంగా వేసిన ఈ లే-ఔట్లలో పంచాయతీలకు భూమిని వదలడంలోనూ రియల్టర్లు తమ మార్కు కనబరుస్తున్నారు. వేసిన లే-ఔట్లలో 10 శాతం భూమిని పంచాయతీకి వదలకుండా దానిని కూడా విక్రయిస్తున్నారు. ఇంత తతంగం నడుస్తున్నప్పటికీ పంచాయతీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అక్రమ లే-ఔట్లలోనూ అక్రమాలే.. నిబంధనల మేరకు పంచాయతీ పరిధిలో ఏదైనా లే-ఔట్ వేస్తే 10 శాతం భూమిని సంబంధిత పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ భూమిలో సదరు పంచాయతీ ద్వారా పార్కును అభివృద్ధి చేయడం కానీ.. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ చేపట్టాలి. అంటే లే-ఔట్లలో నిర్మించే గృహాల్లో నివసించే కుటుంబాలకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. పంచాయతీ అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న ఈ అక్రమ లే-ఔట్లలో రియల్ వెంచర్లు 10 శాతం భూమిని కూడా వదలకుండా విక్రయించేస్తున్నారు. అంటే పంచాయతీ పేరిట భూమిని వదలడం లేదన్నమాట. ప్రాథమిక అంచనా మేరకు సర్వే చేసిన 80 గ్రామాల్లో 483 అక్రమ లే అవుట్లను గుర్తించారు. ఇందులో 4,137 ఎకరాల్లో అక్రమ లేఔట్లు వేసినట్టు ప్రాథమిక సర్వేలో తేలింది. నిబంధనల మేరకు ఇందులో 10 శాతం పంచాయతీకి దక్కాలి. అయితే, అక్రమ లే అవుట్ల వేసిన రియల్టర్లు కేవలం 25 ఎకరాలు మాత్రమే వదిలారు. వాస్తవానికి నిబంధనల మేరకు 10 శాతం అంటే 413 ఎకరాల మేరకు పంచాయతీకి రావాలి. అంటే మరో 388 ఎకరాల మేరకు పంచాయతీకి దక్కాల్సిన భూమిని కాస్తా రియల్ ఎస్టేట్ వ్యాపారులు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 899 గ్రామాల్లో సర్వే చేస్తే ఇంకా ఎంత విలువైన భూమి పంచాయతీలకు దక్కకుండా పోయిందో ఊహిస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని సర్వేలో పాల్గొన్న పంచాయతీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నప్పటికీ పంచాయతీ అధికారులు మాత్రం అక్రమ లే-ఔట్లపై కొరఢా ఝలిపించేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. ఉన్న సిబ్బందీ ఒకే చోట! జిల్లాలో మొత్తం 889 పంచాయతీలు ఉన్నాయి. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో(కర్నూలు, ఆదోని, నంద్యాల) 54 మండలాలు ఉండగా.. పంచాయతీ క్లస్టర్లు మాత్రం 570 ఉన్నాయి. ఈ పంచాయతీ క్లస్టర్లను నాలుగు గ్రేడ్లుగా విభజించారు. నాలుగు గ్రేడ్ల పంచాయతీ క్లస్టర్లకు కలిపి 478 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 92 పోస్టులు ఖాళీ ఉండగా.. ఉన్న పోస్టుల్లోనూ అధికశాతం పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్-1 పంచాయతీల్లోనే కొనసాగుతున్నారు. గ్రేడ్-1 పంచాయతీల్లో వాస్తవంగా 40 మంది పంచాయతీ కార్యదర్శులు ఉండాల్సి ఉండగా.. ఏకంగా 67 మంది పని చేస్తున్నారు. మరోవైపు గ్రేడ్-3 పంచాయతీల్లో 203 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేయాల్సి ఉండగా.. 59 మంది మాత్రమే ఉన్నారు. అంటే అసలే సిబ్బంది కొరత వేధిస్తుండగా.. ఉండాల్సిన వారి కంటే ఒకే చోట అధిక మంది ఉండటం పరిస్థితి మరింత దారుణంగా మారేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఫలితంగా ఒక్కో పంచాయతీ కార్యదర్శికే రెండు, మూడు గ్రామాలను అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వస్తోంది. ఫలితంగా పంచాయతీల్లో ఏమి జరుగుతున్నా వీరు పట్టించుకునే అవకాశం లేకుండాపోతోంది. దీంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ విస్తరణ అధికారులు(ఈవోలు) 53 మందికి గానూ 52 మంది ఉండటంతో ఈ శాఖ పనితీరు అధ్వానంగా మారింది.