సాక్షి, హైదరాబాద్ : భవన, లేఅవుట్ల అనుమతుల్లో భారీ సంస్కరణలు చోటు చేసుకోనున్నాయి. జాప్యానికి, అవినీతికి అడ్డుకట్ట పడనుంది. భవన నిర్మాణ అనుమతులను ఇంట్లో కూర్చొని ఇన్‌స్టంట్(తక్షణం)గా పొందవచ్చు. భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీలో అవినీతి నిర్మూలన, సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతుల జారీ నిమిత్తం కొత్త పాలసీ అమలులోకి రానుంది. పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులిచ్చేందుకు ఆరేళ్ల కింద తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ పాలసీ స్ఫూర్తిగా రూపకల్పన చేసిన టీఎస్–బీపాస్ విధానాన్ని బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ పాలసీకి చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో దీనిని అమలు చేయనుంది.
75 చదరపు గజాల ఇళ్లకు అనుమతి అక్కర్లేదు..
ఏడు మీటర్ల ఎత్తుతో 75 చదరపు గజాల ప్లాట్‌లో భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. భవనం నిర్మించడానికి దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్ చేసుకుని టోకెన్ ఫీజుగా రూ.1 చెల్లిస్తే సరిపోనుంది. (టోకెన్ ఫీజుతోపాటు తొలి ఆస్తిపన్నుగా రూ.100 చెల్లించడం ఐచ్ఛికం). ప్లాటు సైటు, ఫ్లోర్ల సంఖ్యను తెలపడంతోపాటు సదరు స్థలం ప్రభుత్వ స్థలం/చెరువులు/ఇతర నిషేధిత భూమికాదని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది.
స్వీయ ధ్రువీకరణతో తక్షణ అనుమతి
75 నుంచి 600 చదరపు గజాల వరకు (500 చదరపు మీటర్లు) ప్లాట్లలో 10 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణానికి స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుతోపాటు నిర్దేశిత ఫీజులు చెల్లిస్తే ఆన్‌లైన్‌లో తక్షణ అనుమతులు(ఇన్‌స్టంట్ పర్మిషన్æ) జారీ కానున్నాయి. జీహెచ్‌ఎంసీలో జోనల్ కమిషనర్, జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ స్వీయ ధ్రువీకరణ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనుంది. ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొందినట్టు తేలితే సదరు అనుమతులను అధికారులు ఉపసంహరించుకుంటారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా జారీ చేసిన అన్ని అనుమతులను టీఎస్–బీపాస్ వెబ్‌సైట్‌లో ప్రదర్శన కోసం ఉంచనున్నారు. వీటిపై ఎవరైనా 21 రోజుల్లోగా అభ్యంతరం తెలియజేయడానికి అవకాశం కల్పించనున్నారు.
భారీ భవనాలకు 21 రోజుల్లో అనుమతులు
600 చదరపు గజాల(500 చదరపు మీటర్ల) పైన ఉన్న స్థలంలో నివాస భవనాలు, 10 మీటర్లకుపైగా ఎత్తైన నివాస భవనాలు, అన్ని నాన్ రెసిడెన్షియల్ భవనాలు, లేఅవుట్లకు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అన్నిరకాల అనుమతులను సింగిల్ విండో విధానంలో జారీ చేయనున్నారు. ఇంటి అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల్లో 95 శాతం 600 చదరపు గజాలలోపు స్థలాలకు సంబంధించినవే ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పిస్తే సరిపోనుంది. అనుమతుల కోసం ఏ ప్రభుత్వ శాఖనూ సంప్రదించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు పరిశీలన అనంతరం 21 రోజుల్లో అనుమతి జారీ చేయాలి. లేని పక్షంలో 22వ రోజు ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా పర్మిషన్ జనరేట్ కానుంది. ఇలా ఆటోమెటిక్‌గా జారీ చేసిన అనుమతుల కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం/ భవన నియమాళిని ఉల్లంఘించడం/ మాస్టర్ ప్లాన్ భూవినియోగం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు తేలితే అనుమతుల జారీ తేదీ నుంచి 21 రోజుల్లోగా వాటిని ఉపసంహరించుకునే అధికారం సంబంధిత అధికారులు కలిగి ఉంటారు.
కలెక్టర్లు, గ్రేటర్ కమిషనర్‌కు కీలక బాధ్యతలు
– టీఎస్–బీపాస్ ద్వారా వచ్చే భవన, లేఅవుట్ దరఖాస్తులకు సకాలంలో అనుమతులు జారీ అయ్యేలా జిల్లా స్థాయిలో కలెక్టర్, జీహెచ్‌ఎంసీలో కమిషనర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ పర్యవేక్షించనుంది.
– రిజిస్ట్రేషన్/స్వీయ ధ్రువీకరణ కేటగిరీల భవనాలకు అనుమతుల మేరకే నిర్మిస్తున్నారా? లేదా అని ఆకస్మిక తనిఖీలు జరిపేందుకు ఈ కమిటీ బృందాలను ఏర్పాటు చేయనుంది.
– అన్ని నడుస్తున్న ప్రాజెక్టులను సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనుంది.
– అక్రమ/అనధికార నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చిన 48 గంటల్లోగా తనిఖీలు జరిపించనుంది.
– ఏవైనా ఉల్లంఘనలు ఉంటే కూల్చివేతలు/ సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంది.
తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలు
తప్పుడు సమాచారం/నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్, స్వీయ ధ్రువీకరణ కేటగిరీలో అనుమతులు పొందినట్టు రుజువైతే సంబంధిత నిర్మాణాలను నోటీసు లేకుండా కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉండనుంది. అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులపై జరిమానాలు, చర్యలు ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment