GHMC: Rs 168 Crore Burden on Greater Hyderabad Municipal Corporation - Sakshi
Sakshi News home page

GHMC: బల్దియాపై పిడుగు!  మరో రూ.168 కోట్ల భారం మోపిన సర్కారు  

Published Wed, Aug 3 2022 7:09 AM | Last Updated on Wed, Aug 3 2022 3:06 PM

Rs 168 Crore Burden on Greater Hyderabd Muncipal Corporation - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన్ని తలపిస్తోంది బల్దియా దయనీయ పరిస్థితి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీహెచ్‌ఎంసీ నెత్తిన మరో పిడుగు పడింది. ఆయా ప్రాంతాల్లో సాఫీ ప్రయాణంతో పాటు పర్యాటక ప్రాంతాలుగానూ తీర్చిదిద్దేందుకు మూసీ, ఈసీలపై 15 ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. గత జనవరిలోనే అందుకు అవసరమైన రూ.545 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఆ పనుల్ని ఎవరు చేపట్టాలో పేర్కొనలేదు. వర్షాల నేపథ్యంలో ఇటీవల మొత్తం 15 పనుల్లో రూ.168 కోట్లు అవసరమయ్యే 4 పనుల బాధ్యతలు జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. ఒక పనిని కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి (కుడా)కు అప్పగించింది. మిగతా పనులను హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌లకు ఇచ్చింది. పనులు చేపట్టేందుకు, అవసరమైన నిధులు సమకూర్చునేందుకు సంబంధిత ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొంది. సొంత వనరుల ద్వారా గాని.. రుణాల ద్వారా  నిధులు సమకూర్చుకొని గాని పనులు  చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే ఎస్సార్‌డీపీ, సీఆర్‌ఎంపీ, ఎస్‌ఎన్‌డీపీల కింద చేపట్టిన పనులకు చేసిన అప్పులతో అల్లాడుతున్న జీహెచ్‌ఎంసీ నెలనెలా సిబ్బంది జీతాలే సకాలంలో చెల్లించలేకపోతోంది. ప్రభుత్వ ఈ ఆదేశంతో 
మరింత అదనపు భారం కానుంది. 

మూసీపై ఏ ప్రభుత్వ విభాగం ఎన్ని బ్రిడ్జిలు నిర్మించాలో.. అందుకయ్యే వ్యయం వివరాలిలా..   
జీహెచ్‌ఎంసీ: రూ.168 కోట్లు 
మూసీపై ఇబ్రహీంబాగ్‌ కాజ్‌వేను కలుపుతూ హైలెవల్‌ బ్రిడ్జి :రూ. 39 కోట్లు  
మూసారాంబాగ్‌ను కలుపుతూ  హైలెవల్‌ బ్రిడ్జి: రూ.52కోట్లు  
చాదర్‌ఘాట్‌ వద్ద హైలెవెల్‌ బ్రిడ్జి: రూ.42 కోట్లు  
అత్తాపూర్‌ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు:రూ.35కోట్లు. 

హెచ్‌ఆర్‌డీసీఎల్‌ : రూ.116 కోట్లు  
కారిడార్‌ నంబర్‌ 99 మిస్సింగ్‌ లింక్‌ వద్ద హైలెవల్‌ బ్రిడ్జి:రూ. 52 కోట్లు. 
ఈసాపై సన్‌సిటీ– చింతల్‌మెట్‌  కలుపుతూహైలెవల్‌ బ్రిడ్జి (పవర్‌ కారిడార్‌):రూ.32 కోట్లు. 
బండ్లగూడ జాగీర్‌లో ఈసాపై ఇన్నర్‌రింగ్‌ రోడ్లు– కిస్మత్‌పూర్‌లను కలుపుతూ హైలెవల్‌ బ్రిడ్జి:రూ.32కోట్లు. 

కుడా: రూ.40 కోట్లు  
1. అఫ్జల్‌గంజ్‌ వద్ద ఐకానిక్‌ పాదచారుల వంతెన: రూ.40కోట్లు.  
హెచ్‌ఎండీఏ: రూ.221 కోట్లు  
ఉప్పల్‌ లేఅవుట్‌– మూసీ దక్షిణ ఒడ్డును కలుపుతూ కొత్త బ్రిడ్జి: రూ.42 కోట్లు. 
మంచిరేవుల– నార్సింగిని కలుపుతూ హైవవెల్‌ బ్రిడ్జి: రూ.39 కోట్లు. 
బుద్వేల్‌ వద్ద ( ఈసాకు సమాంతరంగా ఐటీపార్కులు, కనెక్టింగ్‌ రోడ్లను కలుపుతూ హైలెవల్‌ బ్రిడ్జి:రూ.32 కోట్లు. 
హైదర్షాకోట్‌ – రామ్‌దేవ్‌గూడల మధ్య కొత్త వంతెన : రూ.42కోట్లు. 
బుద్వేల్‌ వద్ద రెండో కొత్త బ్రిడ్జి (ఈసాకు సమాంతరంగా ఐటీ పార్కులు, కనెక్టింగ్‌ రోడ్లను కలుపుతూ): రూ.20 కోట్లు.  
ప్రతాపసింగారం– గౌరెల్లి హైలెవల్‌ బ్రిడ్జి: రూ.35 కోట్లు. 
మంచిరేవుల వంతెనకు కలుపుతూ కొత్త లింక్‌రోడ్డు: రూ.11 కోట్లు.  

మొత్తం వ్యయంలో సగం నిధులు హెచ్‌ఎండీఏ భరించాల్సిందిగా, మిగతా సగం నిధులు బ్యాంకు రుణం ద్వారా జీహెచ్‌ఎంసీ సమకూర్చాల్సిందిగా పరిపాలన అనుమతుల జారీ సమయంలోనే ప్రభుత్వం తెలిపింది. ఎవరు ఏ బ్రిడ్జీలు నిర్మించాలనేది తాజాగా స్పష్టం చేసింది.
చదవండి: 16న ఏకకాలంలో ‘జనగణమన’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement