baldia
-
కమిషనర్‌తో బల్దియాకు ఆర్థిక భారం
రాయికల్: అసలే కొత్తగా ఏర్పడిన బల్దియా.. పైగా పన్నుల వసూలు చాలా తక్కువ. అలాంటి రాయికల్ మున్సిపాలిటీకి కమిషనర్‌గా రూ.1.49 లక్షల వేతనం ఉన్న గ్రేడ్–1 స్థాయికి చెందిన జగదీశ్వర్‌గౌడ్‌ను నియమించారు. వచ్చిన పన్నులతో పారిశుధ్య సిబ్బంది, కార్మికులకే వేతనాలు చెల్లించలేని పరిస్థితి. ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న తాము కమిషనర్‌కు ప్రతినెలా జనరల్‌ఫండ్ నుంచి అంత వేతనం చెల్లించలేమని, బల్దియాకు గ్రేడ్–1 స్థాయి కమిషనర్ కాకుండా.. ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని ఆగస్టు 31న నిర్వహించిన సమావేశంలో పాలకవర్గం తీర్మానం చేసి సీడీఎం (హైదరాబాద్)కు పంపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రభుత్వం గత ఫిబ్రవరి 21న జగదీశ్వర్‌గౌడ్‌ను బల్దియాకు కమిషనర్‌గా నియమించింది. ఆయనకు 8 నెలలుగా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచే జీతాలు చెల్లిస్తున్నారు. కనీసం ఆయన వేతనానికి సరిపడా కూడా పన్నులు వసూలు కాకపోవడంతో రాయికల్ పట్టణాభివృద్ధికి కేటాయించిన రూ.104.91 కోట్ల నిధుల నుంచే ప్రతినెలా రూ.1.49లక్షల వేతనం చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రేడ్–1 కమిషనర్ అయిన జగదీశ్వర్‌గౌడ్‌ను అదేస్థాయిలో ఉన్న మున్సిపాలిటీకి పంపించాలని, రాయికల్‌కు మాత్రం ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని కోరుతూ సీడీఎంకు తీర్మానం పంపినట్లు మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు తెలిపారు. చిన్న మున్సిపాలిటీ అయిన రాయికల్‌కు ఇన్చార్జి కమిషనర్.. లేదా ఎంపీడీవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తే కొంతైనా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని ప్రజలు, పాలకవర్గ సభ్యులు అంటున్నారు. -
Hyderabad: జీహెచ్ఎంసీ నెత్తిన మరో పిడుగు
సాక్షి, సిటీబ్యూరో: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన్ని తలపిస్తోంది బల్దియా దయనీయ పరిస్థితి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీ నెత్తిన మరో పిడుగు పడింది. ఆయా ప్రాంతాల్లో సాఫీ ప్రయాణంతో పాటు పర్యాటక ప్రాంతాలుగానూ తీర్చిదిద్దేందుకు మూసీ, ఈసీలపై 15 ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. గత జనవరిలోనే అందుకు అవసరమైన రూ.545 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఆ పనుల్ని ఎవరు చేపట్టాలో పేర్కొనలేదు. వర్షాల నేపథ్యంలో ఇటీవల మొత్తం 15 పనుల్లో రూ.168 కోట్లు అవసరమయ్యే 4 పనుల బాధ్యతలు జీహెచ్ఎంసీకి అప్పగించింది. ఒక పనిని కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి (కుడా)కు అప్పగించింది. మిగతా పనులను హెచ్ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌లకు ఇచ్చింది. పనులు చేపట్టేందుకు, అవసరమైన నిధులు సమకూర్చునేందుకు సంబంధిత ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొంది. సొంత వనరుల ద్వారా గాని.. రుణాల ద్వారా నిధులు సమకూర్చుకొని గాని పనులు చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే ఎస్సార్డీపీ, సీఆర్ఎంపీ, ఎస్‌ఎన్‌డీపీల కింద చేపట్టిన పనులకు చేసిన అప్పులతో అల్లాడుతున్న జీహెచ్ఎంసీ నెలనెలా సిబ్బంది జీతాలే సకాలంలో చెల్లించలేకపోతోంది. ప్రభుత్వ ఈ ఆదేశంతో మరింత అదనపు భారం కానుంది. మూసీపై ఏ ప్రభుత్వ విభాగం ఎన్ని బ్రిడ్జిలు నిర్మించాలో.. అందుకయ్యే వ్యయం వివరాలిలా.. జీహెచ్ఎంసీ: రూ.168 కోట్లు ♦మూసీపై ఇబ్రహీంబాగ్ కాజ్‌వేను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి :రూ. 39 కోట్లు ♦మూసారాంబాగ్‌ను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి: రూ.52కోట్లు ♦చాదర్‌ఘాట్ వద్ద హైలెవెల్ బ్రిడ్జి: రూ.42 కోట్లు ♦అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు:రూ.35కోట్లు. హెచ్ఆర్డీసీఎల్ : రూ.116 కోట్లు ♦కారిడార్ నంబర్ 99 మిస్సింగ్ లింక్ వద్ద హైలెవల్ బ్రిడ్జి:రూ. 52 కోట్లు. ♦ఈసాపై సన్‌సిటీ– చింతల్మెట్ కలుపుతూహైలెవల్ బ్రిడ్జి (పవర్ కారిడార్):రూ.32 కోట్లు. ♦బండ్లగూడ జాగీర్‌లో ఈసాపై ఇన్నర్‌రింగ్ రోడ్లు– కిస్మత్‌పూర్‌లను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి:రూ.32కోట్లు. కుడా: రూ.40 కోట్లు 1. అఫ్జల్‌గంజ్ వద్ద ఐకానిక్ పాదచారుల వంతెన: రూ.40కోట్లు. హెచ్ఎండీఏ: రూ.221 కోట్లు ♦ఉప్పల్ లేఅవుట్– మూసీ దక్షిణ ఒడ్డును కలుపుతూ కొత్త బ్రిడ్జి: రూ.42 కోట్లు. ♦మంచిరేవుల– నార్సింగిని కలుపుతూ హైవవెల్ బ్రిడ్జి: రూ.39 కోట్లు. ♦బుద్వేల్ వద్ద ( ఈసాకు సమాంతరంగా ఐటీపార్కులు, కనెక్టింగ్ రోడ్లను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి:రూ.32 కోట్లు. ♦హైదర్షాకోట్ – రామ్‌దేవ్‌గూడల మధ్య కొత్త వంతెన : రూ.42కోట్లు. ♦బుద్వేల్ వద్ద రెండో కొత్త బ్రిడ్జి (ఈసాకు సమాంతరంగా ఐటీ పార్కులు, కనెక్టింగ్ రోడ్లను కలుపుతూ): రూ.20 కోట్లు. ♦ప్రతాపసింగారం– గౌరెల్లి హైలెవల్ బ్రిడ్జి: రూ.35 కోట్లు. ♦మంచిరేవుల వంతెనకు కలుపుతూ కొత్త లింక్‌రోడ్డు: రూ.11 కోట్లు. మొత్తం వ్యయంలో సగం నిధులు హెచ్ఎండీఏ భరించాల్సిందిగా, మిగతా సగం నిధులు బ్యాంకు రుణం ద్వారా జీహెచ్ఎంసీ సమకూర్చాల్సిందిగా పరిపాలన అనుమతుల జారీ సమయంలోనే ప్రభుత్వం తెలిపింది. ఎవరు ఏ బ్రిడ్జీలు నిర్మించాలనేది తాజాగా స్పష్టం చేసింది. చదవండి: 16న ఏకకాలంలో ‘జనగణమన’ -
ఫోనొచ్చింది ఆపండహో!
గచ్చిబౌలి: అక్రమార్కులకు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. నిర్మాణాలను కూల్చివేయకుండా తమ పలుకుబడిని ప్రదర్శిస్తున్నారు. సర్కారు స్థలాల్లో పేదల గుడిసెలను నిర్దాక్షిణ్యంగా తొలగించే బల్దియా యంత్రాంగం.. బడాబాబుల అక్రమాల జోలికి మాత్రం వెళ్లేందుకు సాహసించడంలేదు. ఒకవేళ వెళ్లినా వాటిని తూతూమంత్రంగా కూల్చేసి చేతులు దులుపుకుంటోంది. దీనికి తాజా ఉదాహరణ ‘ఇన్ఫినిటీ’ నిర్మాణం కూల్చివేత. ‘ఈ అక్రమం ఇన్ఫినిటీ’ అనే శీర్షికన ‘సాక్షి’లో దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి సదరు కట్టడాన్ని కూల్చివేయాలని ఎన్ఫోర్స్మెంట్ డీఈ అనురాగ్, శేరిలింగంపల్లి సర్కిల్ టీపీఎస్ రమేష్‌ను ఆదేశించారు. దీంతో ఆగమేఘాల మీద మంగళవారం అక్కడికి వెళ్లిన యంత్రాంగం.. ఇన్ఫినిటీ నిర్మాణం కూల్చివేతను మొదలుపెట్టారు. దీని నిర్వాహకులు జీహెచ్ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామని కూల్చివేతలు ఆపాలని ఒత్తిడి చేశారు. వీటిని పట్టించుకోకుండా కూల్చివేతలు సాగుతుండగానే నిర్వాహకులు చెప్పినట్లు అటు వైపు నుంచి వెస్ట్ జోనల్ ఎన్ఫోర్స్మెంట్ నోడల్ అధికారి, చందానగర్ ఉప కమిషనర్ సుధాంశ్ ఫోన్ నుంచి రావడం.. కూల్చివేతలను అర్ధాంతరంగా నిలిపివేసి వెనుదిరిగారు. నేను ఎవరికీ ఫోన్ చేయలేదు ‘ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్ కూల్చివేతలు ఆపాలని నేనెవరికీ ఫోన్ చేయలేదు’ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. మాట్లాడినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు. నియోజవర్గంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో ఎప్పుడు తాను జోక్యం చేసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఉప కమిషనర్ల కనుసన్నల్లోనే.. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్ నిర్మాణం చేపడుతున్న సమయంలో ఆరు నెలల క్రితం ‘న్యాక్ గా’ ‘సాక్షి’లో వచ్చిన కథనంపై శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసు సిద్ధం చేసినట్లు సమాచారం.. శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ వెంకన్న నోటీసుపై సంతకం చేయకపోవడంతో నోటీసులు జారీ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అయిదెకరాల సువిశాల విస్తీర్ణంలో చేపట్టిన ఇన్ఫినిటీకి ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాల ఆన్లైన్ జాబితాలో లేకుండా పోయింది. దీంతో ఎంచక్కా ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌కు చిక్కకుండా దర్జాగా నిర్మాణం పూర్తి చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. గోపన్‌పల్లిలోని పెద్ద చెరువు సమీపంలో ఓ గిరిజన వ్యక్తి వంద గజాల్లో ఇంటి నిర్మాణం చేపడితే ఎన్ఫోర్స్మెంట్ టీమ్ కూల్చివేసింది. అక్కడ కూల్చివేతలు జరపాలని ప్రజా ప్రతినిధుల జోక్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కూల్చివేతలు జరపాలన్నా, నిలిపివేయాలన్నా ప్రజాప్రతినిధులతోనే సాధ్యమని స్థానికులు పేర్కొంటున్నారు. (చదవండి: అన్నింటా అభివృద్ధి సాధిస్తూ..) -
సర్టిఫికెట్ల జారీ.. జీహెచ్ఎంసీ రూటే సపరేటు!
సాక్షి, హైదరాబాద్: ‘ఊరంతా ఓ దారి.. ఉలిపి కట్టెది మరో దారి’ అన్న చందంగా మారింది బల్దియా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు. దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు.. సదరు సర్టిఫికెట్ల జారీ ఒకేవిధంగా ఉండేందుకు కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ కార్యాలయం ఓఆర్‌జీఐ అనే ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, స్థానిక సంస్థలు బర్త్, డెత్‌లకు సంబంధించిన వివరాల నమోదు, సర్టిఫికెట్ల జారీ, తదితర అంశాలకు ఆ పోర్టల్‌ను వినియోగించాల్సిందిగా సూచించింది. జీహెచ్ఎంసీలో మాత్రం దాన్ని పట్టించుకోకుండా, సొంత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించుకున్నారు. దాని ద్వారా తరచూ ఇబ్బందులు తలెత్తుతుండగా, పరిష్కారం కోసం దాదాపు ఏడాది కాలంగా కసరత్తు చేస్తున్నారు. అయినా ఇబ్బందులు పూర్తిగా తొలగలేదు. లక్షల రూపాయల వ్యయం మాత్రం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచన మేరకు ఓఆర్‌జీఐ సాఫ్ట్‌వేర్‌ను ఎందుకు వినియోగించుకోలేదన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ► ఇటీవల బోగస్ బర్త్‌సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో, అందుకు సొంత వెబ్‌పోర్టల్ కూడా ఒక కారణమై ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓఆర్‌జీఐ సాఫ్ట్వేర్ పూర్తిగా ఉచితం అయినందున దాన్ని వినియోగించుకున్నట్లయితే జీహెచ్ఎంసీకి ఖర్చు తగ్గేది. అసలే ఆర్థిక భారం పెరిగిపోయిన పరిస్థితుల్లో ఖర్చు తగ్గడమే కాక, బోగస్ సర్టిఫికెట్ల జారీ వంటి అవకతవకలకు ఆస్కారం ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► అన్ని విధాలా ఆమోదయోగ్యమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోకపోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. దేశమంతటా ఒకే విధమైన యూనిఫామ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉండాలనే తలంపుతోనే కేంద్ర ప్రభుత్వం ఓఆర్‌జీఐ పోర్టల్ అందుబాటులోకి తెచ్చినట్లు ఈ అంశంలో అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. దాని ద్వారా ఆన్లైన్లో జనన, మరణాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే సదుపాయంతోపాటు ఆయా వివరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా గణాంకాలు వెలువరించే సందర్భాల్లో సైతం ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. (క్లిక్: ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్) ► ఆన్లైన్లోని వివరాలను, సమాచారాన్ని వివిధ స్థాయిల్లోని ఉన్నతాధికారులు వీక్షించి, పర్యవేక్షించేందుకు సైతం సదుపాయం ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీకి సాఫ్ట్వేర్ నిర్వహణ ఖర్చు కూడా ఉండేది కాదని చెబుతున్నారు. అయినప్పటికీ, దాన్ని వినియోగించుకోకుండా సొంత పోర్టల్‌ను వాడుతుండటమే సందేహాలకు తావిస్తోంది. (క్లిక్: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల వైశాల్యం ఎంతో తెలుసా?) -
సిద్దిపేట బల్దియాకు లీడర్షిప్ అవార్డు
సిద్దిపేటజోన్: వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛబడి పేరిట ప్రజల్లో చెత్త పునర్వినియోగంపై అవగాహన ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో నెట్వర్క్ కలిగి, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖకు అనుబంధంగా పనిచేసే ఎర్త్ డే ఆర్గనైజేషన్, సిద్దిపేట మున్సిపాలిటీ లీడర్షిప్ అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క సిద్దిపేటకే ఈ అవార్డు రావడం విశేషం. సిద్దిపేటతో పాటు కోయంబత్తూరు, భువనేశ్వర్, చండీగఢ్, వాడి, జమ్మూ, రాజ్‌కోట్, బెంగళూరు తదితర పట్టణాలకు సైతం ఈ పురస్కారం లభించింది. సోమవారం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. -
బల్దియా లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
-
బల్దియా పోరుకు సిద్ధం..
సిద్దిపేట బల్దియా పోరుకు సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల పునర్విభజన పూర్తైన విషయం తెలిసిందే. రెండో ఘట్టంగా కుల గణన ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఈ నెల 14లోగా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని సూచించింది. – సిద్దిపేటజోన్ వార్డుల వారిగా ఓటరు తుది జాబితా ఈనెల 11లోగా విడుదల చేయాలని, అదేవిధంగా వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈనెల 14లోగా ప్రచురించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి జాబితా అందజేయాలని ఆదేశించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఈనెల 12లోగా శిక్షణ పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అవసరమైన సిబ్బంది నియమాలను, సామగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్‌పేపర్ల ముద్రణ, ఇండెలిబుల్ ఇంక్ తదితర ఏర్పాట్లు చూడాలని ఈసీ సూచించింది. త్వరలో పరిశీలకుల నియామకం సిద్దిపేట మున్సిపల్ పరిధిలో గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుత అవసరమైన కేంద్రాల సంఖ్య సరిపోల్చి వాడుకోవాలని సూచనలు చేసింది. బ్యాలెట్ బాక్స్‌లు అవసరమైన మేరకు వాటిని తయారు చేసి సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వార్డ్ వారీగా బ్యాలెట్ పేపర్లను అంచనా వేసుకొని ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్‌లను గుర్తించాలని ఆదేశించింది. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కోడ్ అమలులో ఉంటుందని, సాధారణ, వ్యయ పరిశీలకులను త్వరలో నియమిస్తామని కమిషన్ పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఈసీ సూచనలు చేసింది. పోలింగ్ కేంద్రాల నోటిఫికేషన్ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఈసీ సెక్రటరీ అశోక్‌కుమార్ పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. ►ఏప్రిల్ 8న పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ►8 నుంచి 11వ తేదీ వరకు ఫిర్యాదుల స్వీకరణ ►9న రాజకీయ పార్టీల సమావేశం ►12న ఫిర్యాదుల పరిష్కారం ►14న పోలింగ్ కేంద్రాల తుది జాబితా సిద్ధంగా ఉన్నాం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మేము సమర్థవంతంగా నిర్వహిస్తాం. షెడ్యూల్ మేరకు ఒక్కో ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఎన్నికల నిర్వహణ కోసం అవరసమైన సిబ్బంది, అధికారుల నియామకాలను కలెక్టర్ అనుమతితో చేపడుతాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
ఎంజే... నిండా వెలుగులే...
సాక్షి, హైదరాబాద్ : నవీకరణ పనుల్లో భాగంగా ఎంజే మార్కెట్ లైటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఫ్లోరింగ్ పనులు మరో వారం రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. అలాగే నగరంలో మార్పులు గమనిస్తున్నారా! జంక్షన్లలో జిలుగులు.. సెంట్రల్ డివైడర్లకు రంగులు.. ఐలాండ్లలో వాటర్ ఫౌంటైన్లు.. రోడ్లకు లేన్ మార్కింగ్‌లు.. ఫ్లైఓవర్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఎల్ఈడీ వెలుగులు.. పార్కుల్లో ఆకట్టుకునేలా ఫర్నిచర్.. ఇలా ఒకటేమిటి వివిధ ప్రాంతాల్లో మనసుకు ఆహ్లాదంగా, కనువిందుగా సరికొత్త దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. రానున్న ఏడెనిమిది నెలల్లో ఇవి మరింత విస్తృతం కానున్నాయి.. దాదాపు పది నెలల్లో బల్దియా పాలకమండలి ఎన్నికలు జరగనుండటంతో.. ఈలోగా నగర ముఖచిత్రాన్ని మార్చేందుకు, సరికొత్త హైదరాబాద్‌ను ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకనుగుణంగా మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులతో తరచూ సమీక్షలునిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పలు ఆదేశాలుజారీ చేస్తూ, బాగున్న వాటిని మరిన్ని పెంచాల్సిందిగా సూచిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఖైరతాబాద్ జంక్షన్ సుందరీకరణ, ఇందిరాపార్కులో పంచతత్వ పార్కు, శేరిలింగంపల్లి జోన్‌లోని ప్లాస్టిక్ ఫుట్‌పాత్‌లు తదితరమైనవి అన్ని జోన్లలోనూ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. బాగున్నవాటిని సత్వరం చేయా ల్సిందిగా మంత్రి కేటీఆర్ సూచిస్తున్నారు. అంతేకాదు.. ఇతర నగరాల్లో బాగున్నవి అధ్యయనం చేసి ఇక్కడ ఆచరించాలని పేర్కొనడంతో ఈ వారం ఆరంభంలో పలువురు జోనల్, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీర్లు, తదితర అధికారులు పుణెను సందర్శించి వచ్చారు. అంతకుముందు నాగపూర్ తదితర ప్రాంతాలను సందర్శించి వచ్చారు. పుణెలోని పార్కుల మాదిరి ఫర్నిచర్, రహదారుల్లో క్యారేజ్ వే తక్కువున్న విశాలమైన ఫుట్‌పాత్‌లు, రహదారుల మార్గాల్లోని భవనాల సెట్‌బ్యాక్‌ల్లో ఫుట్‌పాత్‌లు, వీలైనన్ని చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు వంటివి నగరంలోనూ అవకాశమున్న ప్రాంతాల్లో ఆచరించేందుకు సిద్ధమవుతున్నారు. రూ.59.86 కోట్లతో జంక్షన్లలో సిగ్నలింగ్.. వీటితోపాటు ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకూ సిద్ధమయ్యారు. ప్రస్తుతం 221 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ సంస్థ కాంట్రాక్టు ముగియడంతో మరో మూడేళ్ల పాటు వాటి కొనసాగింపు, కొత్తగా 155 జంక్షన్లలో సిగ్నలింగ్ సిస్టమ్, 98 ప్రాంతాల్లో ఫెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఖర్చయ్యే రూ.59.86 కోట్లకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. నగరంలో 65 ఫౌంటెన్లకుగాను తొలిదశలో 25 ప్రాంతాల్లో రూ. 25 లక్షలతో ఆధునికీకరణ పనులకు సిద్ధమయ్యారు. వీటితోపాటు రాత్రి ఒంటిగంట వరకు ఆహారం అందించే స్ట్రీట్‌ఫుడ్ వంటి వాటిపైనా దృష్టి సారించారు. సంగీత్, ఎల్బీనగర్, లక్డికాపూల్, నల్లగొండ జంక్షన్లు సహా ఇరవై జంక్షన్లను వివిధ థీమ్‌లతో అభివృద్ధి చేయనున్నారు. ఇటీవలే మెట్టుగూడ సమీపంలోని ఆలుగడ్డ బావి జంక్షన్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దడం తెలిసిందే. పార్కులను నిర్వహించేందుకు రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. నగరవ్యాప్తంగా మూడువేల పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లైఓవర్ల కింద, రోడ్ల వెంట గోడలకు హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏర్పాటు ఆలోచనలున్నాయి. ప్రత్యేక థీమ్‌లతో మరికొన్ని పార్కులు తీర్చిదిద్దనున్నారు. యోగా శిక్షకులను అందుబాటులో ఉంచనున్నారు. -
ట్రేడ్ దెబ్బకు బ్రేక్
సాక్షి,సిటీబ్యూరో: తరిగిపోతున్న నిధులను పెంచుకునేందుకు బల్దియా సిద్ధమైంది. ఇప్పటికే పలు కసరత్తులు చేసిన గ్రేటర్‌అధికారులు.. త్వరలో ట్రేడ్ లైసెన్సుల ఫీజులను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ట్రేడ్ లైసెన్సుల ఫీజు ద్వారా ఏటా రూ.50 కోట్లు వసూలవుతోంది. ఈ నిధులు రెట్టింపు కన్నా అధికంగా వచ్చే అవకాశం ఉందని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి గురువారం స్టాండింగ్ కమిటీ ముందుంచారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, జోనల్,అడిషనల్ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ట్రేడ్ ఆదాయం పెంపుపై సమగ్ర చర్చ జరిగింది. అయితే, నగరంలో ఉన్న దుకాణాల్లో చిన్నవి ఎన్ని.. పెద్దవి ఎన్ని.. వంటి సమగ్ర వివరాలు లేకపోవడంతో ఆ వివరాలన్నీ వచ్చాక పెంపు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం రహదారుల వెడల్పును బట్టి ఆయా దుకాణాలకు ట్రేడ్ లైసెన్సు ఫీజు వసూలు చేస్తున్నారు. రోడ్డు వెడల్పు 20 అడుగుల లోపు ఉంటే చదరపు అడుగుకు రూ.3, 20 నుంచి 30 అడుగుల వరకు రూ.4, 30 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు రోడ్లున్న ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ.6గా ట్రేడ్ లైసెన్సు ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే, ఎక్కువ మొత్తం ఫీజు వసూలు చేయకుండా సీలింగ్ సైతం అమలులో ఉంది. దీంతో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న దుకాణాల నుంచి రావాల్సినంత లైసెన్స్ ఫీజు రావడం లేదని అధికారులు, పాలకులు భావించారు. సీలింగ్‌తో ఆదాయానికి గండి చదరపు అడుగుకు ఫీజు రూ.3 ఉన్న ప్రాంతాల్లో రూ.10వేలు, 20–30 అడుగుల రోడ్డున్న ప్రాంతాల్లో రూ.50 వేలు, 30 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు రోడ్డున్న ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు సీలింగ్ ఉంది. అంటే 30 అడుగుల కంటే రోడ్డు వెడల్పు ఎక్కువున్న ప్రాంతాల్లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే వాణిజ్య దుకాణానికి లెక్క మేరకు రూ.3 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, అక్కడ సీలింగ్ ఉండటంతో రూ.2 లక్షలే వసూలు చేస్తున్నారు. అలా లక్ష రూపాయల ఆదాయం తగ్గుతోందని భావించి ఈ సీలింగ్ పరిమితి ఎత్తివేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే, పెద్ద విస్తీర్ణాల్లో (సీలింగ్‌కు మించి ఎక్కువ ఫీజు వచ్చే అవకాశమున్నవి) ఎన్ని దుకాణాలున్నాయో లెక్క లేకపోవడంతో వాటిని పరిశీలించాక, అన్నీ పరిగణలోకి తీసుకొని ట్రేడ్ లైసెన్సుల ఫీజు సవరించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని వాయిదా వేశారు. చిన్న, పెద్ద దుకాణాల వివరాలు.. సీలింగ్ ఎత్తివేస్తే పెరిగే ఫీజు అన్నీ పరిశీలించాక ఫీజు పెంచాలని నిర్ణయించారు. రోడ్డు వెడల్పును పరిగణనలోకి తీసుకున్నా హైటెక్ సిటీకి, చాదర్‌ఘాట్‌కి ఒకే రకమైన ఫీజు ఏ మేరకు సబబు అనే అభిప్రాయాలు కూడా కమిటీ సమావేశంలో వ్యక్తమయ్యాయి. మరోవైపు.. గ్రేటర్లో ఉన్న అన్ని దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్‌ను వసూలు చేస్తే ఫీజు పెంచకపోయినా ఎంతో ఆదాయం పెరుగుతుందని, ముందు ఆ పనిచేయాలనే అభిప్రాయాలు కూడా సమావేశంలో వెలువడ్డాయి. గ్రేటర్లో చిన్నవి, పెద్దవి వెరసి దాదాపు ఐదున్నర లక్షల వరకు వ్యాపారాలుండగా, ట్రేడ్ లైసెన్సులు చెల్లిస్తున్నవి లక్ష కూడా మించలేదు. ఎయిర్ ప్యూరిఫైర్ల ఏర్పాటుకు ఓకే.. ♦ గ్రేటర్ హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వంద ప్రాంతాల్లో ఎయిర్ ప్యూరిఫైయర్ల ఏర్పాటుకు సీఎస్సార్ కింద బహుగుణ టెక్నో మోటివ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఎంఓయూకు మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో సహా 24 అంశాలను సమావేశం ఆమోదించింది. వాటిలో ముఖ్యమైన అంశాలు ఇవీ.. ♦ జీహెచ్ఎంసీలోని 19 మున్సిపల్ కాంప్లెక్స్‌ల్లో ఉన్న 716 దుకాణాల కేటాయింపుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, నాయీ బ్రాహ్మణులు, వాషర్మెన్, మహిళా సంఘాల ఫెడరేషన్లకు రిజర్వేషన్ల వర్తింపు ♦ ఖాజాగూడ పెద్దచెరువులో సీఎస్సార్ నిధులతో జపనీస్ గార్డెన్ ఏర్పాటు ♦ కొండాపూర్ రంగన్నకుంట చెరువు పునరుద్ధరణకు సీఎస్సార్ కింద యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌తో ఒప్పందం ♦ జీహెచ్ఎంసీలో 709 కి.మీ రోడ్డు మార్గాన్ని ఐదేళ్ల పాటు రూ.1,827 కోట్లతో నిర్వహణతో పాటు స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణలను కూడా సంబంధిత ఏజెన్సీలే చేసేలా సవరణ తీర్మానానికి ఆమోదం ♦ గ్రేటర్లో 221 ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ పనులు చేస్తున్న బీఈఎల్‌కు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు. -
రంగు పడుద్ది
ఇంటి గుమ్మానికి ఎరుపు రంగు గుర్తు.. డేంజర్ అనడానికి సిగ్నల్లాగ.. ఎదురింటికి ఆరెంజ్ గుర్తు.. ఆ పక్క ఇంటికి గ్రీన్.. ఇంకో ఇంటికి బ్లూ.. అంతేకాదు.. మనం మారితే.. ఆ రంగు కూడా మారుతుందట! ప్రస్తుతం ఖైరతాబాద్‌లోనే.. రేప్పొద్దున్న సిటీ అంతా ఈ రంగులు వస్తాయట.. ఈ కలర్ కోడ్ మీద కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారట.. ఇంతకీ ఈ రంగుల వెనకున్న కథ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి, బల్దియా ఆధ్వర్యంలో మహోద్యమంగా చేపడుతోన్న జలనాయకత్వం.. జలసంరక్షణ (వాక్) ఉద్యమంలో భాగంగా సిటీలో ఇంటింటికీ రంగుల గుర్తులను వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.. ఇంట్లో జరుగుతున్న నీటి వృథా లేదా సంరక్షణను బట్టి రంగులను వేస్తారు. ప్రస్తుతం ఖైరతాబాద్ డివిజన్లోని మాతానగర్ బస్తీలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. నీటివృథా, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంటి యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో నీటి వృథా తగ్గితే.. ఇంటికి వేసే రంగు గుర్తు మారుస్తారు. ఈ వినూత్న విధానంపై కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడితే విలువైన తాగునీటిని సంరక్షించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయంగా లెక్కేస్తారు.. జలమండలి పరిధిలో ప్రతీ కాలనీ, బస్తీలకు తాగునీటిని సరఫరా చేసే పైపులైన్లకున్న వాల్‌్వను తిప్పినపుడు ఆ నీరు ఎన్ని ఇళ్లకు..ఏ మోతాదులో సరఫరా అవుతోంది...సరఫరా జరిగిన నీటికి సంబంధించి శాస్త్రీయంగా బిల్లింగ్ జరుగుతుందా అన్న విషయాలను సైతం లెక్కేస్తారు. దీని వల్ల ఆ వీధిలో ఏ ఇంట్లోనైనా నీటి వృథా అధికంగా ఉందా? లేదా అన్న అంశాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోనున్నారు. నగరంలో నిత్యం వృథా అవుతోన్న 50 మిలియన్ గ్యాలన్ల తాగునీటితో చెన్నై మహానగరం నీటి కొరతను తీర్చవచ్చు. అందుకే ప్రస్తుతం 40 శాతం మేర ఉన్న నీటి వృథాను 20 శాతానికి తగ్గించేందుకు జలసంరక్షణ.. జలనాయకత్వం ఉద్యమాన్ని చేపట్టాము. ఇందులో స్వయం సహాయక బృందాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోపాటు బల్దియా, జలమండలికి సంబంధించి అన్ని స్థాయిల అధికారులు పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఈనెల 19న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాము. - ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎరుపు - జలమండలి సరఫరా చేస్తున్న తాగు నీటి వృథా అత్యధికంగా ఉన్నట్లు లెక్క. - వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంత లేకపోవడం, నల్లా నీళ్లతో ఫ్లోర్ క్లీనింగ్, జంతువులు, కార్లు, ద్విచక్రవాహనాలను కడగడం వంటివి చేస్తే... - పైపులు, మోటార్లు, వాల్‌్వలు, మీటర్ చాంబర్లలో నీటి వృథా అధికంగా ఉండడం, మీ ఇంట్లోని సంప్ నిండి.. వీధిలోకి నీళ్లు వృథాగా పొంగి పొర్లడం - మీ సంప్ నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటిని మళ్లించే పైపులైన్లలో లీకేజీ ఉండడం వంటివి.. కాషాయం పైన చెప్పిన విధంగా తొమ్మిది రకాల వృథా కాకుండా.. అందులో ఏ ఐదు రకాల వృథా జరిగినా ఈ గుర్తు పడుతుంది.. పచ్చ మీ ఇంట్లో నీటి వృథాను అరికట్టేందుకు పైన పేర్కొన్న అంశాలను తక్కువ సమయంలో కట్టడి చేయడంతోపాటు ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే.. ఈ రంగు వేస్తారు. నీలం నీటి వృథా అస్సలు లేదు.. పైగా.. మీ ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంత ఉంటే.. ఇంటికి నీటి బిందువును ప్రతిబింబించేలా నీలం గుర్తు వేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
సిద్దిపేట బల్దియాకు అవార్డుల పంట
సిద్దిపేటజోన్ : సిద్దిపేట మున్సిపాలిటీ ఆరు అంశాల్లో 2018 స్కోచ్ అవార్డులను కైవసం చేసుకొని ఢిల్లీలో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. శుక్రవారం ఢిల్లీలోని కానిస్ట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో స్కోచ్ గ్రూప్ సీఈఓ గుర్షారాన్ దంజాల్ చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి అవార్డులను స్వీకరించారు. గత మూడేళ్లుగా వరుసగా అవార్డులను అందుకున్న సిద్దిపేట బల్దియా ఈ ఏడాది ఏకంగా ఆరు నామినేషన్లలో మెరుగైన ఫలితాలను సాధించి అవార్డులను దక్కించుకుంది. సిద్దిపేట బల్దియా గెలుచుకున్న అవార్డులకు సంబంధించిన అంశాలిలా ఉన్నాయి. 1.ఈ– గవర్నెన్స్ ద్వారా సుస్థిర సేవలు, పరిపాలన అందించండం, 2. స్వచ్ఛ భారత్ మిషన్‌ను పటిష్టంగా అమలు చేసి క్లీన్ సిటీగా మార్చడంలో కృషి చేసినందుకు రజిత స్కోచ్ అవార్డులు పొందింది. 3. సుస్థిరమైన పట్టణం (సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు సత్వర సేవలు అందించడం), 4. స్థిరమైన అమృత్ పట్టణ నగరీకరణ, 5. స్థిరమైన పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత పాటించడం. 6. సమర్థవంతమైన పాలన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం లాంటి విభాగాల్లో సిద్దిపేట రజిత స్కోచ్ అవార్డులను అందుకుంది. ఒకే ఏడాదిలో ఆరు స్కోచ్ అవార్డులను కైవసం చేసుకున్న పట్టణంగా సిద్దిపేట చరిత్ర సృష్టించింది. -
నీకు సగం.. నాకు సగం..
బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీగా ఆవిర్భవించడంతో గతంలో గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్‌గా ఆర్డీవో రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించి, బల్దియాపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. బల్దియాలో జీతభత్యాలు, జమా ఖర్చులు, ఆదాయ వనరులు, అక్రమ లే అవుట్లు, మున్సిపల్ స్థలాలపై ఆయన విచారిస్తున్నారు. అయితే వీటిలో కీలకమైన లేఅవుట్లు, 10శాతం భూముల కేటాయింపులపై ఆర్డీవో చేతికి ఫైళ్లు అందకుండా కొందరు అక్రమార్కులు ఫైళ్లనే మాయం చేశారు. 1990 నుంచి 2015 వరకు గల ఫైళ్లను మొత్తం బల్దియాలోనే లేకుండా చేశారు. కొందరు వార్డు సభ్యులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు ఏకంగా పాత ఫైళ్లనే గల్లంతు చేయడం చర్చనీయాంశమవుతోంది. బల్దియా పరిధిలో చేసే లే అవుట్ల సందర్భంగా పార్కులు, ఇతర ప్రజా కార్యకలాపాల కోసం కేటాయించే భూమిని కొందరు వార్డు సభ్యులు, అధికారుల సహకారంతో విక్రయించిన సంఘటనలు కోకొల్లాలుగా ఉన్నాయి. 1995 నుంచి 2018 వరకు లే అవుట్లకు సంబంధించిన భూములు జీపీ పరిధిలో ఉండాలి. అయితే వార్డు సభ్యులు ‘నీకు సగం.. నాకు సగం’ అనే రీతిలో అధికారులతో మిలాఖాత్ అయి ఆ భూములను అమ్ముకున్నారు. చేతులు మారిన భూములు.. వాస్తవానికి బాన్సువాడ బల్దియా పరిధిలో అధికారికంగా 28,509 గజాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. 1983 నుంచి 2018 వరకు గ్రామ పంచాయతీ(ప్రస్తుత బల్దియా) పరిధిలో 63 లే అవుట్లు చేశారు. వీటిలో 10 శాతం చొప్పున భూములను కేటాయించారు. అయితే ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల పేరిట భూములను ధారాదత్తం చేశారు. వాటిని ప్లాట్లుగా మార్చి ఇద్దరు, ముగ్గురు చేతులు మార్చి మరీ అమ్ముకున్నారు. ప్రస్తుతం పదిశాతం భూముల్లో భవనాలు వెలిసాయి. జీపీ లెక్కల ప్రకారం 4,298 గజాల భూమిని సంఘాలకు కేటాయించారు. అయితే అనధికారికంగా మరో 10వేల గజాల భూమి కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. కొందరు అక్రమార్కులు 10శాతం భూములను కాజేసేందుకు పాలకవర్గంతో తీర్మానాలు కూడా చేయించారు. ప్రస్తుతానికి 14,211 గజాల భూమి మున్సిపాలిటీ ఆధీనంలో ఉంది. లేఅవుట్ ఫైళ్లు గల్లంతవడంతో ఆ భూములను గుర్తించడం మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. ఇన్చార్జి కమిషనర్ రాజేశ్వర్ మున్సిపల్ కార్యాలయంలోని అన్ని రికార్డులను పక్షం రోజుల క్రితమే స్వాధీనం చేసుకున్నారు. వాటిలో లేఅవుట్ ఫైళ్లు లేకపోవడం గమనార్హం. ఫైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం.. బల్దియాకు కీలకం లే అవుట్ ఫైళ్లు. వాటి ఆధారంగానే రోడ్లు, ప్లాట్లు, ఇండ్ల నిర్మాణాలు, జీపీకి కేటాయించిన భూములను గుర్తిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ ఫైళ్ల మాయంతోపాటు వాటి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఫైళ్లను గల్లంతు చేస్తే తాము చేసిన అక్రమాలను కప్పి పుచ్చవచ్చని, అమ్మిన భూములను స్వాధీనం చేసుకొనే వీలుండదని పక్కా ప్రణాళిక ప్రకారం వీటిని మున్సిపాలిటి కాకముందే మాయం చేశారు. అనుమతులన్నీ పెండింగ్‌లోనే.. గత నెల 20న బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మూడు నెలల క్రితమే బాన్సువాడ మున్సిపాలిటీగా మారనుందనే ప్రచారం జరగడంతో అనేక మంది భవన నిర్మాణాల కోసం దరఖాస్తులు చేసుకొని వార్డు సభ్యుల ద్వారా అనుమతులు పొందారు. అయినా మరో వంద దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారం వాటికి అనుమతి ఇవ్వాలి. లేఅవుట్ల ఫైళ్లు కూడా ఆర్డీవో పెండింగ్‌లో పెట్టారు. మున్సిపాలిటీలో ఆదాయ వనరుల వివరాలు స్పష్టంగా లేవు. అక్రమాలపై వెంటనే విచారిస్తాం.. మున్సిపాలిటీలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతాం. లే అవుట్ ఫైళ్ల గల్లంతవగా, దీనిపై ఆరా తీçస్తున్నాం. ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. సిబ్బంది రాగానే బల్దియా పాలనను గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా. జీపీకి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఇకపై ఏ అనుమతి లేనిదే పనులు చేయరాదు. –రాజేశ్వర్, ఇన్చార్జి కమిషనర్ -
బల్దియా పోల్ శాతం66.30
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : చెదురు మదురు ఘటనలు మినహా జిల్లాలో ఆదివారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 9 గంటల వరకు మందకొడిగా సాగింది. ఆ తర్వాత ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. బోధన్ 24వ వార్డులో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు గంటసేపు అంతరాయం కలిగింది. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ ఆర్మూరులలో అక్కడక్కడా పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. బోధన్‌లో జోరుగా... జిల్లాలో మొత్తంగా పుర పోలింగ్ ఓటింగ్ శాతం 66.30గా నమోదైనట్లు అధికారులు ఆదివారం రాత్రి ప్రకటించారు. అత్యధికంగా బోధన్‌లో (73)శాతం ఓటిం గ్ నమోదు కాగా.. అత్యల్పంగా నిజామాబాద్ నగరంలో(54.70) శాతం నమోదైంది. నిజామాబాద్‌లో 2,42,440 ఓట్లకు గాను 1,32,617 మంది ఓటు వేశా రు.పోలింగ్ 54.70 శాతంగా నమోదైంది. కామారెడ్డిలో 58,905 మంది ఓటర్లకు 39,832 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా, 67.72 శాతంగా పోలింగ్ నమోదైంది. ఆర్మూరులో 34,752 మందికి 26,246 మంది ఓట్లేయగా 69.77 శాతం, బోధన్‌లో 55,875కు 40,791 ఓట్లు పడగా 73 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓట్లు గల్లంతు... పలుచోట్ల ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. నిజామాబాద్‌లోని నాగారం డివిజన్లో ఓట్లు గల్లంతు కాగా, 41వ డివిజన్లో కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్యన గొడవ జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్‌లో ఓటర్ స్లిప్పులు అందక కొందరు...పేర్లు గల్లంతవడం వల్ల మరికొందరు ఓటుహక్కును వినియోగించుకోలేక పోయారు. పోలింగ్ కేంద్రాలు తెలియక , సరైన గుర్తింపు కార్డులు లేక కొందరు ఓటు వినియోగించుకోలేక పోయారు. నిజామాబాద్, ఆర్మూరులలో పోలీసుల ఓవరాక్షన్... నిజామాబాద్, ఆర్మూరు సీఐలు శ్రీనివాస్, సైదులు ఓవర్ యాక్షన్ చేశారని జిల్లా కలెక్టర్, ఎస్పీ, మానవ హక్కుల సంఘానికి పలువురు ఫిర్యాదులు చేశారు. ఆర్మూరులో పోలీసుల తీరుతో గొడవ జరగగా, స్థానిక డీఎస్పీ ఆకుల రాంరెడ్డి రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. అర్ధరాత్రి తన ఇంటిపై పడి కుటుంబసభ్యులను చితకబాదారని నిజామాబాద్ నగర సీఐ సైదులుపై 48 డివిజన్ అభ్యర్థి బొబ్బిలి మాధురి కలెక్టర్ , ఎస్పీ, హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలోని 28వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి ఓటర్మార్క్ జాబితాను అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లగా, రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిజామాబాద్ ఖిల్లా చౌరస్తాలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగ్గా పోలీసులు లాఠీచార్జి చేశారు. -
66 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బల్దియా పోరులో ప్రధాన ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ జరిగింది. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. ముఖ్యంగా మహిళలు, యువత తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండాకాలం కావడంతో అధిక సంఖ్యలో ఓటర్లు ఉదయాన్నే ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిశాయి. వృద్ధులు, రోగులు, వికలాంగులు కూడా ఓటు వేసేందుకు వచ్చారు. ఆరు మున్సిపాలిటీల్లో సగటున 66.41 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలో 187 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 1,095 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 325 కేంద్రాల ద్వారా పోలింగ్ నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది ఓటర్లకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారు. ఓటర్లను మినహా కేంద్రాల్లో 200 మీటర్ల దూరం వరకు ఎవ్వరిని అనుమతించలేదు. ఆదిలాబాద్ మున్సిపల్ వార్డుల్లో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ అహ్మద్‌బాబు, ఎన్నికల పరిశీలకులు సుకుమార్ పరిశీలించారు. పోలింగ్ తీరును పర్యవేక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ గజరావు భూపాల్, అదనపు ఎస్పీ జోయల్ డేవిస్ పట్టణంలోని పిట్టలవాడ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రత్యేక పరిశీలకులుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు సుకుమార్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల తీరును పరిశీలించారు. పలుచోట్ల చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. భైంసాతోపాటు మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈవీఎంల మొరాయింపు మంచిర్యాలలోని 22, 28 వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 19వ వార్డు బూత్లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదిలాబాద్ బొక్కలగూడ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆరు మున్సిపాలిటీల పరిధిలో 315 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించారు. పలుచోట్ల సాంకేతిక లోపాలు తలెత్తాయి. నిర్మల్ మున్సిపాలిటీలో రెండు పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కనెక్టు కాలేదు. ఆదిలాబాద్ పట్టణంలోని మరో పోలింగ్ కేంద్రంలోనూ మొరాయించింది. వీటిని సరిచేసే సరికే చాలా మట్టుకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం పోలింగ్ మందకొడిగా సాగగా, ఎండ తీవ్రతకు ఓటర్లు బయటకు రాలేదు. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి ఓటర్ల రాక ఎక్కువైంది. ఐదు గంటల లోపు కేంద్రాలకు చేరుకున్న వారందరికి అధికారులు స్లిప్‌లను పంపిణీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. అత్యధికంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో73.91 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ మున్సిపాలిటిలో 59.42 శాతం ఓట్లు పోలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మున్సిపల్ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మంచిర్యాల మున్సిపాలిటీలోని 19వ వార్డులో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని శిశుమందిర్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకోవడంతో నాయకులు తోపులాడుకున్నారు. నిర్మల్‌లోని సోమవార్‌పేట్‌లో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అనుచరులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ మాధవరెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓ అభ్యర్థికి చెందిన సమీపబంధువు ఎన్నికల విధుల్లో ఉండటంతో ప్రత్యర్థి అభ్యర్థులు అభ్యంతరం తెలపడంతో ఆ ఉద్యోగిని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. భైంసాలో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెట్టిన కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నీడ లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. మండే ఎండలో గంటల తరబడి నిలబడి ఓటేశారు. కేంద్రాల వద్ద కనీసం టెంటు కూడా వేయకపోవడం పట్ల ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు కేంద్రాల్లో తాగునీటి వసతి సరిగ్గా లేకపోవడంతో దాహంతో ఇబ్బంది పడ్డారు. ఏర్పాట్లలో లోపం.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని అధికార యంత్రాంగం ప్రకటించినా ఆచరణలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సాక్షాత్తు కలెక్టర్ అహ్మద్ బాబు క్యాంపు కార్యాలయానికి ఎదురుగా ఉన్న 19వ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కేంద్రం పరిధిలో సుమారు 70 మంది ఓటర్ల పేర్లు గల్లంతవడంతో వారు ఆందోళనకు దిగారు. అంగన్వాడీ సిబ్బంది ఓటరు స్లిప్‌లు ఇచ్చినా, వాటిని తీసుకుని ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల్లోకి వెళితే సిబ్బంది ఓటు లేదని తిప్పిపంపడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్ అహ్మద్‌బాబు అక్కడికి చేరుకున్నారు. 33వ వార్డు ఇంద్రానగర్లోనూ చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. నిర్మల్‌లోని 21వ వార్డుల్లో అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు అధికారులు గుర్తింపు కార్డులను శనివారమే జారీ చేయాల్సి ఉండగా, పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి కూడా వాటిని జారీ చేయలేదు. ఇలా ఆదిలాబాద్ మున్సిపల్లోని రెండో నంబర్ పోలింగ్ వద్ద ఇద్దరు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం ఎన్నికల ఘట్టం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీ ఎంలలో నిక్షిప్తమై ఉంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షె డ్యూల్ ప్రకారం బుధవారం (ఏప్రిల్ 2న) ఓట్ల లెక్కింపు జరగాలి. కానీ ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో షెడ్యూల్ ప్రకారం లెక్కింపు జరుగుతుందో.. లేదోనని అభ్యర్థుల్లో ఉ త్కంఠ నెలకొంది. ఈ అంశంపై న్యాయస్థానం ఏప్రిల్ 1న తీ ర్పు ఇవ్వనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.