ట్రేడ్‌ దెబ్బకు బ్రేక్‌ | Trade License Fees Stops GHMC | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌ దెబ్బకు బ్రేక్‌

Published Fri, Nov 8 2019 11:46 AM | Last Updated on Sat, Nov 9 2019 1:13 PM

Trade License Fees Stops GHMC - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: తరిగిపోతున్న నిధులను పెంచుకునేందుకు బల్దియా సిద్ధమైంది. ఇప్పటికే పలు కసరత్తులు చేసిన గ్రేటర్‌అధికారులు.. త్వరలో ట్రేడ్‌ లైసెన్సుల ఫీజులను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ట్రేడ్‌ లైసెన్సుల ఫీజు ద్వారా ఏటా రూ.50 కోట్లు వసూలవుతోంది. ఈ నిధులు రెట్టింపు కన్నా అధికంగా వచ్చే అవకాశం ఉందని భావించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి గురువారం స్టాండింగ్‌ కమిటీ ముందుంచారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్, జోనల్,అడిషనల్‌ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ట్రేడ్‌ ఆదాయం పెంపుపై సమగ్ర చర్చ జరిగింది. అయితే, నగరంలో ఉన్న దుకాణాల్లో చిన్నవి ఎన్ని.. పెద్దవి ఎన్ని.. వంటి సమగ్ర వివరాలు లేకపోవడంతో ఆ వివరాలన్నీ వచ్చాక పెంపు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం రహదారుల వెడల్పును బట్టి ఆయా దుకాణాలకు ట్రేడ్‌ లైసెన్సు ఫీజు వసూలు చేస్తున్నారు. రోడ్డు వెడల్పు 20 అడుగుల లోపు ఉంటే చదరపు అడుగుకు రూ.3, 20 నుంచి 30 అడుగుల వరకు రూ.4, 30 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు రోడ్లున్న ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ.6గా ట్రేడ్‌ లైసెన్సు ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే, ఎక్కువ మొత్తం ఫీజు వసూలు చేయకుండా సీలింగ్‌ సైతం అమలులో ఉంది. దీంతో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న దుకాణాల నుంచి రావాల్సినంత లైసెన్స్‌ ఫీజు రావడం లేదని అధికారులు, పాలకులు భావించారు.  

సీలింగ్‌తో ఆదాయానికి గండి
చదరపు అడుగుకు ఫీజు రూ.3 ఉన్న ప్రాంతాల్లో రూ.10వేలు, 20–30 అడుగుల రోడ్డున్న ప్రాంతాల్లో రూ.50 వేలు, 30 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు రోడ్డున్న ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు సీలింగ్‌ ఉంది. అంటే 30 అడుగుల కంటే రోడ్డు వెడల్పు ఎక్కువున్న ప్రాంతాల్లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే వాణిజ్య దుకాణానికి లెక్క మేరకు రూ.3 లక్షల ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, అక్కడ సీలింగ్‌ ఉండటంతో రూ.2 లక్షలే వసూలు చేస్తున్నారు. అలా లక్ష రూపాయల ఆదాయం తగ్గుతోందని భావించి ఈ సీలింగ్‌ పరిమితి ఎత్తివేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే, పెద్ద విస్తీర్ణాల్లో (సీలింగ్‌కు మించి ఎక్కువ ఫీజు వచ్చే అవకాశమున్నవి) ఎన్ని దుకాణాలున్నాయో లెక్క లేకపోవడంతో వాటిని పరిశీలించాక, అన్నీ పరిగణలోకి తీసుకొని ట్రేడ్‌ లైసెన్సుల ఫీజు సవరించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని వాయిదా వేశారు.
చిన్న, పెద్ద దుకాణాల వివరాలు.. సీలింగ్‌ ఎత్తివేస్తే పెరిగే ఫీజు అన్నీ పరిశీలించాక ఫీజు పెంచాలని నిర్ణయించారు. రోడ్డు వెడల్పును పరిగణనలోకి తీసుకున్నా హైటెక్‌ సిటీకి, చాదర్‌ఘాట్‌కి ఒకే రకమైన ఫీజు ఏ మేరకు సబబు అనే అభిప్రాయాలు కూడా కమిటీ సమావేశంలో వ్యక్తమయ్యాయి. మరోవైపు.. గ్రేటర్‌లో ఉన్న అన్ని దుకాణాలకు ట్రేడ్‌ లైసెన్స్‌ను వసూలు చేస్తే ఫీజు పెంచకపోయినా ఎంతో ఆదాయం పెరుగుతుందని, ముందు ఆ పనిచేయాలనే అభిప్రాయాలు కూడా సమావేశంలో వెలువడ్డాయి. గ్రేటర్‌లో చిన్నవి, పెద్దవి వెరసి దాదాపు ఐదున్నర లక్షల వరకు వ్యాపారాలుండగా, ట్రేడ్‌ లైసెన్సులు చెల్లిస్తున్నవి లక్ష కూడా మించలేదు. 

ఎయిర్‌ ప్యూరిఫైర్ల ఏర్పాటుకు ఓకే..
గ్రేటర్‌ హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వంద ప్రాంతాల్లో ఎయిర్‌ ప్యూరిఫైయర్ల ఏర్పాటుకు సీఎస్సార్‌ కింద బహుగుణ టెక్నో మోటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఎంఓయూకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో సహా 24 అంశాలను సమావేశం ఆమోదించింది. వాటిలో ముఖ్యమైన అంశాలు ఇవీ..
జీహెచ్‌ఎంసీలోని 19 మున్సిపల్‌ కాంప్లెక్స్‌ల్లో ఉన్న 716 దుకాణాల కేటాయింపుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, నాయీ బ్రాహ్మణులు, వాషర్‌మెన్, మహిళా సంఘాల ఫెడరేషన్లకు రిజర్వేషన్ల వర్తింపు
ఖాజాగూడ పెద్దచెరువులో సీఎస్సార్‌ నిధులతో జపనీస్‌ గార్డెన్‌ ఏర్పాటు
కొండాపూర్‌ రంగన్నకుంట చెరువు పునరుద్ధరణకు సీఎస్సార్‌ కింద యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌తో ఒప్పందం
జీహెచ్‌ఎంసీలో 709 కి.మీ రోడ్డు మార్గాన్ని ఐదేళ్ల పాటు రూ.1,827 కోట్లతో నిర్వహణతో పాటు స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణలను కూడా సంబంధిత ఏజెన్సీలే చేసేలా సవరణ తీర్మానానికి ఆమోదం
గ్రేటర్‌లో 221 ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణ పనులు చేస్తున్న బీఈఎల్‌కు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement