Trade license fees
-
ట్రేడ్ దెబ్బకు బ్రేక్
సాక్షి,సిటీబ్యూరో: తరిగిపోతున్న నిధులను పెంచుకునేందుకు బల్దియా సిద్ధమైంది. ఇప్పటికే పలు కసరత్తులు చేసిన గ్రేటర్‌అధికారులు.. త్వరలో ట్రేడ్ లైసెన్సుల ఫీజులను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ట్రేడ్ లైసెన్సుల ఫీజు ద్వారా ఏటా రూ.50 కోట్లు వసూలవుతోంది. ఈ నిధులు రెట్టింపు కన్నా అధికంగా వచ్చే అవకాశం ఉందని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి గురువారం స్టాండింగ్ కమిటీ ముందుంచారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, జోనల్,అడిషనల్ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ట్రేడ్ ఆదాయం పెంపుపై సమగ్ర చర్చ జరిగింది. అయితే, నగరంలో ఉన్న దుకాణాల్లో చిన్నవి ఎన్ని.. పెద్దవి ఎన్ని.. వంటి సమగ్ర వివరాలు లేకపోవడంతో ఆ వివరాలన్నీ వచ్చాక పెంపు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం రహదారుల వెడల్పును బట్టి ఆయా దుకాణాలకు ట్రేడ్ లైసెన్సు ఫీజు వసూలు చేస్తున్నారు. రోడ్డు వెడల్పు 20 అడుగుల లోపు ఉంటే చదరపు అడుగుకు రూ.3, 20 నుంచి 30 అడుగుల వరకు రూ.4, 30 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు రోడ్లున్న ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ.6గా ట్రేడ్ లైసెన్సు ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే, ఎక్కువ మొత్తం ఫీజు వసూలు చేయకుండా సీలింగ్ సైతం అమలులో ఉంది. దీంతో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న దుకాణాల నుంచి రావాల్సినంత లైసెన్స్ ఫీజు రావడం లేదని అధికారులు, పాలకులు భావించారు. సీలింగ్‌తో ఆదాయానికి గండి చదరపు అడుగుకు ఫీజు రూ.3 ఉన్న ప్రాంతాల్లో రూ.10వేలు, 20–30 అడుగుల రోడ్డున్న ప్రాంతాల్లో రూ.50 వేలు, 30 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు రోడ్డున్న ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు సీలింగ్ ఉంది. అంటే 30 అడుగుల కంటే రోడ్డు వెడల్పు ఎక్కువున్న ప్రాంతాల్లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే వాణిజ్య దుకాణానికి లెక్క మేరకు రూ.3 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, అక్కడ సీలింగ్ ఉండటంతో రూ.2 లక్షలే వసూలు చేస్తున్నారు. అలా లక్ష రూపాయల ఆదాయం తగ్గుతోందని భావించి ఈ సీలింగ్ పరిమితి ఎత్తివేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే, పెద్ద విస్తీర్ణాల్లో (సీలింగ్‌కు మించి ఎక్కువ ఫీజు వచ్చే అవకాశమున్నవి) ఎన్ని దుకాణాలున్నాయో లెక్క లేకపోవడంతో వాటిని పరిశీలించాక, అన్నీ పరిగణలోకి తీసుకొని ట్రేడ్ లైసెన్సుల ఫీజు సవరించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని వాయిదా వేశారు. చిన్న, పెద్ద దుకాణాల వివరాలు.. సీలింగ్ ఎత్తివేస్తే పెరిగే ఫీజు అన్నీ పరిశీలించాక ఫీజు పెంచాలని నిర్ణయించారు. రోడ్డు వెడల్పును పరిగణనలోకి తీసుకున్నా హైటెక్ సిటీకి, చాదర్‌ఘాట్‌కి ఒకే రకమైన ఫీజు ఏ మేరకు సబబు అనే అభిప్రాయాలు కూడా కమిటీ సమావేశంలో వ్యక్తమయ్యాయి. మరోవైపు.. గ్రేటర్లో ఉన్న అన్ని దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్‌ను వసూలు చేస్తే ఫీజు పెంచకపోయినా ఎంతో ఆదాయం పెరుగుతుందని, ముందు ఆ పనిచేయాలనే అభిప్రాయాలు కూడా సమావేశంలో వెలువడ్డాయి. గ్రేటర్లో చిన్నవి, పెద్దవి వెరసి దాదాపు ఐదున్నర లక్షల వరకు వ్యాపారాలుండగా, ట్రేడ్ లైసెన్సులు చెల్లిస్తున్నవి లక్ష కూడా మించలేదు. ఎయిర్ ప్యూరిఫైర్ల ఏర్పాటుకు ఓకే.. ♦ గ్రేటర్ హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వంద ప్రాంతాల్లో ఎయిర్ ప్యూరిఫైయర్ల ఏర్పాటుకు సీఎస్సార్ కింద బహుగుణ టెక్నో మోటివ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఎంఓయూకు మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో సహా 24 అంశాలను సమావేశం ఆమోదించింది. వాటిలో ముఖ్యమైన అంశాలు ఇవీ.. ♦ జీహెచ్ఎంసీలోని 19 మున్సిపల్ కాంప్లెక్స్‌ల్లో ఉన్న 716 దుకాణాల కేటాయింపుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, నాయీ బ్రాహ్మణులు, వాషర్మెన్, మహిళా సంఘాల ఫెడరేషన్లకు రిజర్వేషన్ల వర్తింపు ♦ ఖాజాగూడ పెద్దచెరువులో సీఎస్సార్ నిధులతో జపనీస్ గార్డెన్ ఏర్పాటు ♦ కొండాపూర్ రంగన్నకుంట చెరువు పునరుద్ధరణకు సీఎస్సార్ కింద యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌తో ఒప్పందం ♦ జీహెచ్ఎంసీలో 709 కి.మీ రోడ్డు మార్గాన్ని ఐదేళ్ల పాటు రూ.1,827 కోట్లతో నిర్వహణతో పాటు స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణలను కూడా సంబంధిత ఏజెన్సీలే చేసేలా సవరణ తీర్మానానికి ఆమోదం ♦ గ్రేటర్లో 221 ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ పనులు చేస్తున్న బీఈఎల్‌కు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు. -
ఆదాయం అవసరం లేదా..?
ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లపై అధికారుల నిర్లక్ష్యం టార్గెట్ 5.26కోట్లు, వసూళ్లు 1.38కోట్లు పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిలు వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సానిటరీ ఇన్స్పెక్టర్లకు వ్యాపారులపై వల్లమాలిన ప్రేమో లేక, నిర్లక్ష్యమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2017 జనవరి 31 నాటికి వంద శాతం వసూళ్లు చేయాల్సిన సానిటరీ ఇన్స్పెక్టర్లు కేవలం 26 వసూళ్లతో సరిపెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని చూస్తే సొంత ఆదాయంపై వీరికి ఏ మేరకు శ్రద్ధ ఉందో అవగతమవుతోంది. కార్పొరేషన్ పరిధిలో 17,559 మంది ట్రేడ్ లైసెన్స్‌లతో యాజమానులు వ్యాపారాలు నిర్వహిస్తునట్లు రికార్డులు చూపుతున్నాయి. కానీ నగరంలో రెట్టింపు స్థాయిలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది స్థానికంగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా మేనేజ్ చేసుకుంటూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. రికార్డుల్లో అధికారికంగా నమోదైన వ్యాపారుల నుంచి కుడా ఏడాదికోకమారు ఫీజు వసూలు చేయడంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు విఫలమవుతున్నారు. ఫలితంగా గత కొద్ది సంవత్సరాలుగా వేలాది మంది ట్రేడ్ లైసెన్స్‌దారుల వద్ద ఫీజు బకాయిలు పేరుకుపోతున్నాయి. లక్ష్యం రూ.5.28 కోట్లు.. వసూళ్లు రూ.1.38 కోట్లు గ్రేటర్ వరంగల్ 2016–17 సంవత్సరానికి గాను ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూ. 5.28 కోట్ల వసూళ్ల లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్ణీత గడువు 2017 జనవరి 31 నాటికి వసూలు చేయాలని అధికారులు ఆదేశించారు. గడువు దాటింది. కానీ ట్రేడ్ ఫీజు కేవలం రూ. 1.38కోట్లు వసూలు చేశారు. ట్రేడ్ ఫీజు, జరిమానాలతో ఇంకా రూ. 3.90కోట్లు ఫీజులు బాకాయిలు పేరుకుపోయాయి. బిర్రు శ్రీనివాస్ అనే సానిటరీ ఇన్స్పెక్టర్ మాత్రం 85 శాతం పన్నులు వసూలు చేయగా, భాస్కర్ 63శాతం, కుమారస్వామి 63 శాతం టార్గెట్ వసూలు చేశారు. మారో సానిటరీ ఇన్స్పెక్టర్ యాదయ్య 15 శాతం, కర్ణాకర్ 17శాతం, భీమయ్య 18శాతం వసూలు చేయడం గమనార్హం. కొత్త డిమాండ్ రూ.5.51కోట్లు ఈ ఏడాది కొత్త డిమాండ్ ఫిబ్రవరి 1న ఖరారైంది. పాత బకాయిలతోపాటు వడ్డీ, ఈ ఏడాది ట్రేడ్ లైసెన్స్ ఫీజుతో రూ.5.51కోట్లుగా నిర్ణయించారు. గత ఏడాది 3.90 కోట్ల బాకాయిలతో పాటు కొత్త లైసెన్స్ ఫీజు రూ.160కోట్లతో ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి 31లోగా చెల్లిస్తే దీనిపై జరిమానా విధించరు. కానీ మార్చి తర్వాత 3 నెలల వరకు 25 శాతం జరిమానా, ఏడాది గడిస్తే 50 శాతం జరిమానా వసూలు చేస్తారు. -
వారు కట్టరు..వీరికి పట్టదు
అధికారుల నిర్లక్ష్యం వ్యాపారులకు కలిసొస్తోంది. స్వతహాగా వ్యాపారులు ట్రేడ్ లెసైన్స్ ఫీజును చెల్లిద్దామని ముందుకు రారు. అధికారులు కూడా గట్టిగా అడగరు. ఫలితంగా మున్సిపల్ ఆదాయానికి గండి పడుతోంది. ప్రతి మునిసిపాలిటీల్లో 70శాతం ఇళ్లుంటే 30శాతం దుకాణాలే ఉంటాయి. కానీ వ్యాపారాలకు సంబంధించిన లెసైన్సులు కొందరికే ఉన్నాయి. ఏటా దుకాణాలు పెరుగుతున్నా మున్సిపల్ ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఉన్నవారు కూడా ఏళ్ల తరబడి నుంచి ఫీజు చెల్లించడానికి మొండికేస్తుండటంతో ట్రేడ్ లెసైన్సు రుసుము కోట్లల్లో పేరుకపోయింది. గద్వాల మున్సిపల్ పరిధిలో.. గద్వాల ప్రధాన రహదారిపై లెక్కలేనన్ని దుకాణాలు వెలిశాయి. ఇక్కడ గతంలో ఉన్న దుకాణ దారులు మినహా కొత్తగా పెట్టుకున్న దుకాణదారులు లెసైన్సు ఫీజు చెల్లించడం లేదు. ఏటా రూ.10 లక్షలు ట్రేడ్ లెసైన్సు ఫీజు లక్ష్యానికి గాను, ఏటా మార్చి ముగింపులో కేవలం లక్షకు మించి వసూలు చేయడంలేదు. మున్సిపల్ రికార్డుల ప్రకారం 1200 మంది మాత్రమే ట్రేడ్ లెసైన్సు పొందినట్లు సమాచారం. అనధికారికంగా సుమారు 3 వేల మందికి పైగా దుకాణ దారులు లెసైన్సు లేకుండా వ్యాపారులు కొనసాగిస్తున్నారు. వీరు కొన్నేళ్లుగా వ్యాపారాలు కొనసాగిస్తూ రూ.లక్షల్లో ఫీజు ఎగ్గొడుతున్నారు. అలాగే ఆస్తిపన్నులు సైతం పెద్ద మొత్తంలో పేరుకపోయాయి. ఎన్నికల నేపథ్యంలో పన్నుల వసూళ్లు మందగించాయి. ప్రస్తుత ఆస్తిపన్ను డిమాండ్ రూ.1.70 కోట్లుతో పాటు గత ఏడాది బకాయిలు సుమారు కోటి వరకు ఉన్నాయి. దుకాణాల అద్దెలు సుమారు రూ.10 లక్షలు, నీటి పన్ను బకాయిలు రూ.4 లక్షల వరకు పేరుకపోయి ఉన్నాయి.