నెలకు రూ.1.49 లక్షల వేతనం
చెల్లించలేని స్థితిలో రాయికల్ మున్సిపాలిటీ
ఇన్‌చార్జిని నియమించాలని తీర్మానం
రాయికల్: అసలే కొత్తగా ఏర్పడిన బల్దియా.. పైగా పన్నుల వసూలు చాలా తక్కువ. అలాంటి రాయికల్ మున్సిపాలిటీకి కమిషనర్‌గా రూ.1.49 లక్షల వేతనం ఉన్న గ్రేడ్–1 స్థాయికి చెందిన జగదీశ్వర్‌గౌడ్‌ను నియమించారు. వచ్చిన పన్నులతో పారిశుధ్య సిబ్బంది, కార్మికులకే వేతనాలు చెల్లించలేని పరిస్థితి.
ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న తాము కమిషనర్‌కు ప్రతినెలా జనరల్‌ఫండ్ నుంచి అంత వేతనం చెల్లించలేమని, బల్దియాకు గ్రేడ్–1 స్థాయి కమిషనర్ కాకుండా.. ఇన్‌చార్జి కమిషనర్‌ను నియమించాలని ఆగస్టు 31న నిర్వహించిన సమావేశంలో పాలకవర్గం తీర్మానం చేసి సీడీఎం (హైదరాబాద్)కు పంపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రభుత్వం గత ఫిబ్రవరి 21న జగదీశ్వర్‌గౌడ్‌ను బల్దియాకు కమిషనర్‌గా నియమించింది.
ఆయనకు 8 నెలలుగా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచే జీతాలు చెల్లిస్తున్నారు. కనీసం ఆయన వేతనానికి సరిపడా కూడా పన్నులు వసూలు కాకపోవడంతో రాయికల్ పట్టణాభివృద్ధికి కేటాయించిన రూ.104.91 కోట్ల నిధుల నుంచే ప్రతినెలా రూ.1.49లక్షల వేతనం చెల్లిస్తున్నారు.
ఈ క్రమంలో గ్రేడ్–1 కమిషనర్ అయిన జగదీశ్వర్‌గౌడ్‌ను అదేస్థాయిలో ఉన్న మున్సిపాలిటీకి పంపించాలని, రాయికల్‌కు మాత్రం ఇన్‌చార్జి కమిషనర్‌ను నియమించాలని కోరుతూ సీడీఎంకు తీర్మానం పంపినట్లు మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు తెలిపారు. చిన్న మున్సిపాలిటీ అయిన రాయికల్‌కు ఇన్‌చార్జి కమిషనర్.. లేదా ఎంపీడీవోకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తే కొంతైనా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని ప్రజలు, పాలకవర్గ సభ్యులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment