raikal
-
కమిషనర్‌తో బల్దియాకు ఆర్థిక భారం
రాయికల్: అసలే కొత్తగా ఏర్పడిన బల్దియా.. పైగా పన్నుల వసూలు చాలా తక్కువ. అలాంటి రాయికల్ మున్సిపాలిటీకి కమిషనర్‌గా రూ.1.49 లక్షల వేతనం ఉన్న గ్రేడ్–1 స్థాయికి చెందిన జగదీశ్వర్‌గౌడ్‌ను నియమించారు. వచ్చిన పన్నులతో పారిశుధ్య సిబ్బంది, కార్మికులకే వేతనాలు చెల్లించలేని పరిస్థితి. ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న తాము కమిషనర్‌కు ప్రతినెలా జనరల్‌ఫండ్ నుంచి అంత వేతనం చెల్లించలేమని, బల్దియాకు గ్రేడ్–1 స్థాయి కమిషనర్ కాకుండా.. ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని ఆగస్టు 31న నిర్వహించిన సమావేశంలో పాలకవర్గం తీర్మానం చేసి సీడీఎం (హైదరాబాద్)కు పంపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రభుత్వం గత ఫిబ్రవరి 21న జగదీశ్వర్‌గౌడ్‌ను బల్దియాకు కమిషనర్‌గా నియమించింది. ఆయనకు 8 నెలలుగా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచే జీతాలు చెల్లిస్తున్నారు. కనీసం ఆయన వేతనానికి సరిపడా కూడా పన్నులు వసూలు కాకపోవడంతో రాయికల్ పట్టణాభివృద్ధికి కేటాయించిన రూ.104.91 కోట్ల నిధుల నుంచే ప్రతినెలా రూ.1.49లక్షల వేతనం చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రేడ్–1 కమిషనర్ అయిన జగదీశ్వర్‌గౌడ్‌ను అదేస్థాయిలో ఉన్న మున్సిపాలిటీకి పంపించాలని, రాయికల్‌కు మాత్రం ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని కోరుతూ సీడీఎంకు తీర్మానం పంపినట్లు మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు తెలిపారు. చిన్న మున్సిపాలిటీ అయిన రాయికల్‌కు ఇన్చార్జి కమిషనర్.. లేదా ఎంపీడీవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తే కొంతైనా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని ప్రజలు, పాలకవర్గ సభ్యులు అంటున్నారు. -
Ranga Reddy: ఫాస్ట్ ట్యాగ్ విషయంలో గొడవ.. కొట్టుకున్న సర్పంచ్, టోల్ ప్లాజా సిబ్బంది
సాక్షి, రంగారెడ్డి: షాద్ నగర్ పట్టణ పరిధిలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న రాయికల్ టోల్ ప్లాజా వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ ప్లాజా సిబ్బందికి, జడ్చర్ల పరిధిలోని నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ ప్రనిల్ చందర్‌కు మధ్య వాగ్వివాదం జరగడంతో ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. సర్పంచ్ ప్రనిల్ చందర్ టోల్ ప్లాజా వద్ద వెళ్తుండగా అతని ఫాస్ట్ ట్యాగ్‌లో డబ్బులు అయిపోయాయి. అతను రీఛార్జ్ చేసుకునే క్రమంలో కొంత ఆలస్యం అయింది. వెనుక వాహనాల వారు హారన్స్ కొడుతుండడంతో వాహనాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో టోల్ ప్లాజా సిబ్బందికి ఇతనికి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు దూషించుకోవడంతో గొడవ ప్రారంభమైంది. చదవండి: హైదరాబాద్‌లో మహిళ హంగామా.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో గొడవ అయితే సర్పంచ్ ప్రనిల్ చందర్ సర్పంచుల సంఘంలో నాయకుడిగా ఉన్నారు. సర్పంచ్ ప్రనిల్ చందర్‌పై దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, స్నేహితులు రాయికల్ టోల్ ప్లాజా వద్దకు వచ్చి టోల్ ప్లాజా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రనిల్ చందర్ తరపున అనుచరులు హంగామా సృష్టించి, టోల్గేట్ క్యాబిన్లను అద్దాలను ధ్వంసం చేశారు. పరస్పర దాడులతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున అనుచరులు తరలిరావడంతో ప్రనిల్ తో పాటు పలువురికి గాయాలు కూడా అయ్యాయి. -
హైవే ఎక్కుతున్నారా.. ఓసారి జేబులు చెక్ చేసుకోండి!
షాద్‌నగర్: టోల్ బాదుడు ఏటా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. యథావిధిగా ఈ ఏడాది కూడా టోల్‌ప్లాజాలో ధరలు పెరుగుతుండటంతో జాతీయ రహదారిపై ప్రయాణం మరింత భారం కానుంది. టోల్ ప్లాజాలో రుసుములు పెరుగుతుండటంతో అటు వాహనదారులు, ఇటు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ –బెంగళూరు 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజాలో రుసుము భారీగా పెరిగింది. పెంచిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులపై మరింత భారం బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణించే వారిపై భారం మరింత పెరగనుంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం టోల్ ధరలు పెంచుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు సరికాదంటున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు, వాహనదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారి వెంట సబ్వే సరిగా లేకపోవడంతో రోడ్డు పక్కన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా తప్పని పెంపు షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు జాతీయ రహదారిని (సుమారు 58 కి.మీ) రూ.600 కోట్లతో విస్తరించి అవసరమైన చోట బైపాస్ నిర్మించారు. ఈ జాతీయ రహదారిని 2009లో కొత్తూరులో ప్రారంభించారు. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులో నిర్మించిన టోల్ ప్లాజాలో ఏటా టోల్ రుసుము పెంచుతూ వస్తున్నారు. స్కూల్ బస్సుల నుంచి యథావిధిగా.. టోల్ ప్లాజాలో నెలవారీ పాసుల రుసుమును కూడా పెంచుతున్నారు. కారు, ప్యాసింజర్, వ్యాను లేక జీపు రూ.2,115 నుంచి రూ.2,425, లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు రూ. 3,700 నుంచి రూ. 4,245, ట్రక్కు, బస్సు రూ.7,395 నుంచి రూ.8,485, మల్టీయాక్సిల్ వాహనాలు రూ.11,895 నుంచి రూ.13,635కి పెంచనున్నారు. స్కూల్ బస్సుల నుంచి యథావిధిగా నెలవారీగా రూ.1000 వసూలు చేయనున్నారు. అన్ని వాహనాలపై బాదుడే.. టోల్గేట్లో ఈసారి అన్ని రకాల వాహనాలైన కారు, ప్యాసింజర్ వ్యాన్, లైట్ కమర్షియల్ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్ వాహనాలు (అనేక చక్రాల వాహనం)లకు రుసుములను భారీగా పెంచనున్నారు. దీంతో టోల్ ప్లాజాకు ఆదాయం కూడా పెరగనుంది. నిత్యం ఈ టోల్ ప్లాజా నుంచి సుమారు 15వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు సుమారు రూ.28లక్షల మేర ఆదాయం సమకూరుతుంది. టోల్ ధరలు పెరుగుతుండటంతో మరో రూ.మూ డు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. (క్లిక్: మందుబాబులకు షాక్.. తాగేదంతా మద్యం కాదు) రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పెట్రోల్, ఢీజిల్ ధరల పెరుగుదల, టోల్ రుసుములు రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాహనాల యజమానులు తమ లారీలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మళ్లీ టోల్ ధరల పెంపుతో భారం తప్పదు. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుసుము తగ్గించాలి కరోనా నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టోల్ రుసుము పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన వస్తోంది. రుసుము తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – శివకుమార్, షాద్‌నగర్ -
Telangana Rains: 11 గంటల ఉత్కంఠకు తెర.. హమ్మయ్య! ఆ తొమ్మిది మంది సేఫ్
సాక్షి, రాయికల్(జగిత్యాల): ఎప్పటిలాగానే చేనులో పత్తి పనులు చేసేందుకు వారం క్రితం 9మంది కౌలు రైతులు కుర్రులోకి వెళ్లారు.. పనులు ముగించుకుని మరో రెండుమూడ్రోరోజుల్లో తిరిగి రావాల్సి ఉంది.. కానీ, గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. నురగలు కక్కుతూ వరద పోటెత్తింది. అప్పటిదాకా ఎంతోనిబ్బరంగా ఉన్న రైతుల్లో ఒక్కసారిగా భయం చోటుచేసుకుంది.. ఇక తాము బతుకుతామో, లేక వరదలో చిక్కుకుని చనిపోతామోననే ఆందోళన మొదలైంది.. వెంటనే మొబైల్ఫోన్ల ద్వారా గ్రామస్తులకు సమాచారం అందించారు.. కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ ఆగమేఘాలపై ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షితంగా కుర్రులోంచి బయటకు తీసుకురావడంతో 11గంటల ఉత్కంఠకు తెరపడింది. బాలుడిని కుర్రులోంచి బయటకు తీసుకొస్తున్న సహాయక సిబ్బంది అందరూ కౌలురైతులే.. రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన మూడు గిరిజన కుటుంబాలకు చెందిన 9మంది కౌలు రైతులు సమీప గోదావరి నదిలోని కుర్రు(పాయ)లో పత్తి చేనులో పనులు చేసేందుకు వెళ్లారు. ఇందులో వల్లె రఘునాథ్, రంగారావు, దేవిదాస్, సహేబ్రావు, కొమ్రె విజయ్, డొక్కె కార్తీక్, సత్యబామ, విజయ, సునీత తమతమ పనుల్లో నిమగ్నమయ్యారు. చదవండి: ఫోన్ ఉన్నా సిగ్నల్స్ లేకపోవడంతో.. రాత్రంతా వాగులోనే.. మంత్రి కొప్పుల చొరవ.. ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరిస్థితిని సమీక్షిస్తూ విషయాన్ని సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లారు. తొలుత బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్ పంపాలని నిర్ణయించారు. వాతావరణం అనుకూలించదనే సూచనతో నిజామబాద్‌లోని ఎన్డీఆర్ఎఫ్ బందాలకు రంగంలోకి దించారు. వారు బోర్నపల్లి ప్రాంతానికి రాత్రి 7 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. రెండు బోట్ల సాయంతో రైతులు ఉన్న కుర్రు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ బోట్లలో బాధితులను గోదావరి తీరానికి సురక్షితంగా చేర్చారు. సుమారు రెండు గంటలపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించాయి. గోదావరి ఉధృతి.. బోర్నపల్లికి చెందిన రవీందర్రావు అనే యజమానికి చెందిన కుర్రులోని వ్యవసాయ భూమిని తొమ్మిది మంది రైతులు కౌ లుకు తీసుకుని పత్తి పంట వేస్తున్నారు. ఇది నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాల పరిధిలోకి వస్తుంది. భారీవర్షాలకు తోడు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రైతులు పనిచేస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు ఫలించిన అధికారుల కృషి.. ఉదయం 11గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ రవి, ఎస్పీ సిందూశర్మ అక్కడే మకాం వేశారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. చివరకు రాత్రి 7గంటలకు రైతులు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: 64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు అందరిలో ఆనందం.. వరద ఉధృతికి ఇక తాము బతకలేమనే అభిప్రాయానికి వచ్చిన కౌలురైతులను 21 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకు రావడంతో ఆనందం వ్యక్తమైంది. కలెక్టర్, ఎస్పీతోపాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కసారిగా ఉప్పొంగింది దాదాపు పదిరోజులుగా కుర్రు ప్రాంతంలో సాగు పనులు చేసుకుంటున్నాం. గోదావరి నది ఒక్కసారిగా పొంగింది. ప్రాణాలు పోతాయనుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడాయి. – రఘునాథ్, కౌలురైతు భయమేసింది వ్యవసాయం కోసం కుర్రులోకి పోయినం. ఒక్కసారిగా గంగ పొంగడంతో భయపడ్డాం. అధికారుల కృషితో సురక్షితంగా బయటకు వచ్చాం. పడవలో మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చారు. అధికారులకు ధన్యవాదాలు. -జయంత, కౌలురైతు చలికి వణికినం వర్షానికి విపరీతమైన చలివేసింది. భయమైంది. అమ్మనాన్న దగ్గర ఉన్నా. గంగలోకి వరదనీరు బాగా వచ్చింది. చనిపోతనని భయమైంది. అమ్మనాన్న ఉండటంతో ధైర్యంగా ఉన్నా. సార్లు వచ్చి మమ్మల్ని బోటులో తీసుకొచ్చిండ్రు. – కార్తీక్, బాలుడు మాటలు రావడం లేదు వర్షం తీవ్రం కావడం, గోదావరి నది ఉప్పొంగడంతో ఏం చేయాలో మాటలు రాలేదు. అధికారుల కృషితో ప్రాణాలతో బయటపడ్డాం. అధికారులు అందరు కలిసి మమ్మల్ని రక్షించారు. అందరికీ పదివేల దండాలు. – దేవదాసు, కౌలురైతు రెండు గంటలు శ్రమించాం కౌలురైతులను కుర్రు నుంచి బయటకు తీసుకురావడానికి రెండుగంటల పాటు శ్రమించాం. మాది విజయవాడ బెటాలియన్. రెండుబోట్ల సాయంతో 21 మందిమి ఘటన స్థలానికి వెళ్లాం. రైతులను సురక్షితంగా తీసుకువచ్చాం. – ఉపేందర్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్కుర్రు ఆపరేషన్ ఇలా.. ►వారం క్రితం బోర్నపల్లి శివారులోని గోదావరి మధ్యలో గల కుర్రులోకి 9మంది రైతులు వెళ్లారు. ►మంగళవారం ఉదయం 9 గంటలు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ►10.00 : భయంతో వణికిపోయిన రైతులు గ్రామస్తులకు సమాచారం అందించారు. ►10.30 : గ్రామస్తులకు తొలుత కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మకు సమాచారం చేరవేశారు. ►11.00 : స్పందించిన కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి సమీపంలోని గోదావరి తీరంలోకి చేరుకున్నారు. ►11.30 : మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కలెక్టర్ సమాచారం ఇచ్చారు. ►మధ్యాహ్నం 12.00 : మంత్రి కొప్పుల ఈశ్వర్.. సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ►12.30 : హెలికాప్టర్ పంపించి బాధితులను రక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► 01.00 : వాతావరణం అనుకూలించకపోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ► 01.15 : ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలని నిర్ణయం ►మధ్యాహ్నం 2.30 : నిజామాబాద్‌లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం చేరవేత. ► 03.00 : నిజామాబాద్ నుంచి వాహనంలో బయలు దేరిన 21మంది సభ్యులు గల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ►రాత్రి 07.00 : సంఘటన స్థలానికి చేరుకున్న సహాయ బృందాలు ►08.15 : అన్నీ సిద్ధం చేసుకుని రెండు బోట్లతో గోదావరిలోని కుర్రులోకి బయలు దేరిన సహాయక బృందాలు ►రాత్రి 09.51 గంటలు : 9మంది కౌలురైతులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా నదీతారానికి చేరుకున్నారు. -
పెరిగిన టోల్‌ప్లాజా ధరలు.. నేటి నుంచి అమల్లోకి!
సాక్షి, షాద్‌నగర్: ప్రయాణికులు, వాహనదారులపై మరింత భారం పడనుంది. టోల్ ప్లాజా ధరలు పెరగనుండటంతో జేబులు మరింత ఖాళీ కానున్నాయి. ఏటా టోల్ ప్లాజా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజాలో పెంచిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటా పెంపు.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు ఉన్న జాతీయ రహదారిని సుమారు 58 కిలోమీటర్ల మేర రూ.600 కోట్ల వ్యయంతో విస్తరించారు. అవసరమైన చోట్ల బైపాస్‌లు నిర్మించారు. 2009లో పనులు పూర్తిచేసి కొత్తూరులో ప్రారంభించారు. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ శివారులో నిర్మించిన టోల్ ప్లాజా రుసుంను ఏటా పెంచుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు టోల్ చార్జీలు కూడ పెంచడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన చార్జీలు సెప్టెంబర్ 1నుంచి అమలులోకి వస్తాయని టోల్‌ప్లాజా నిర్వాహకులు ప్రకటనలు కూడా జారీ చేశారు. చదవండి: ఇక్కడ బస్టాప్ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు! పెరగనున్న పాసుల రుసుము టోల్ ప్లాజాలో నెల వారీ పాసుల రుసుంను కూడా పెంచనున్నారు. కారు, ప్యాసింజర్ వ్యాను లేక జీపు రూ.1,960 నుంచి రూ.2,115లు, లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు రూ.3,430 నుంచి రూ.3,700, ట్రక్కు, బస్సు రూ.6,860 నుంచి రూ.7,395, మల్టీయాక్సిల్ వాహనాలు రూ.11,025 నుంచి రూ.11,895లు పెంచనున్నారు. స్కూల్ బస్సుకు నెలవారీ పాసు రుసుము రూ.1,000 వసూలు చేయనున్నారు. ఈ సారి పెంచేశారు గతేడాది కారు, ప్యాసింజర్ వ్యాన్లతో పాటుగా, లైట్ కమర్షియల్ వాహనాలకు టోల్ రుసుం పెంచలేదు. కానీ ఈసారి మాత్రం కారు, ప్యాసింజర్ వ్యాన్, లైట్ కమర్షియల్ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్ వాహనాల (అనేక చక్రాల వాహనం) రుసుం పెంచనున్నారు. అయితే పెంచిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోని రానున్నాయి. పెరగనున్న ఆదాయం షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా మీదుగా నిత్యం సుమారు పదివేల వాహనాలకుపైగా రాకపోకలు సాగిస్తాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది తమ సొంత వాహనాలపై ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ టోల్ ప్లాజాలో నిత్యం సుమారు రూ.25 లక్షల రూపాయల వరకు రుసుం వసూలవుతుంది. చార్జీలు పెంచడంతో టోల్ ఆదాయం రోజుకు రూ.2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈమేర వాహనదారులపై భారం పడనుంది. వాహనం వెళ్లేందుకు రానుపోను (కొత్త చార్జీలు) కారు, జీపు ప్యాసింజర్ వ్యాన్ రూ.70 రూ.105 లైట్ కమర్షియల్, మినీ బస్ రూ.125 రూ.185 ట్రక్కు, బస్సు రూ.245 రూ.370 మల్టియాక్సిల్ వాహనాలు రూ.395 రూ.595 భారం మోపడం సరికాదు ఏటా టోల్ రుసుం పెంచి వాహనదారులపై భారం మోపడం సరికాదు. చార్జీల పెంపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు, ట్రక్కులకు కిరాయిలే సరిగా రావడం లేదు. ఈ సమయంలో కిస్తులు కట్టడం కూడా గగనమవుతోంది. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, షాద్‌నగర్ -
రోటీన్ లైఫ్‌తో విసిగి పోయారా ?.. ఈ వీడియో మీ కోసమే...
Karimnagar Raikal Waterfall: కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా మన లైఫ్స్టైల్లో ఎంతో మార్పు వచ్చింది. బయట కాలు పెట్టాలంటే భయం. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. పార్కుల్లో అరకొర జనమే, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఇళ్లు, ఆఫీసు, మార్కెట్ తప్ప మరో ఎక్సైట్మెంట్ కరువైంది జీవితానికి. ఈ బోర్డమ్ను బ్రేక్ చేసేందుకు రా.. రమ్మంటోంది రాయికల్ జలపాతం. జలజల... ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే అడవిలో రాళ్ల బాటలో ప్రకృతిలో మమేకం అవుతూ కాలినడకన కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇదొక చక్కని వేదిక. ఇంట్లో రోటీన్ లైఫ్‌కి భిన్నంగా.. ఆఫీస్ ఒత్తిడికి దూరంగా... ప్రకృతిలో మమేకం అవుతూ జల సవ్వడిలో కష్టాలను కరించేస్తూ.. ఎత్తైన కొండలను ఒక్కో అడుగు వేస్తూ ఎక్కేస్తూ... ఇటు అడ్వెంచర్.. అంటూ నేచర్ బ్యూటీలను ఒకేసారి అనుభవించాలంటే ఇటు వైపు ఓ సారి వెళ్లండి. ఇలా వెళ్లొచ్చు - హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల నుంచి వచ్చే వారు పీవీ స్వగ్రామమైన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చేరుకోవాలి. - వంగర నుంచి రాయికల్ గ్రామానికి చేరుకోవాలి - రాయిల్కల్ నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎత్తైన పర్వత పాదాల వద్ద రాయికల్ చెరువు కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడి వరకు బైకులు, కార్లు వెళ్లగలవు - చెరువు సమీపంలో వాహనాలు నిలిపి సుమారు 1.5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే జలపాతం చేరుకోవచ్చు. కొండల నడుమ వరంగల్ నగరం నుంచి 43 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఎత్తన కొండల నడుమ ఈ జలపాతం ఉంది . ఏళ్ల తరబడి స్థానికులకే తప్ప బయటి ప్రపంచానికి ఈ జలపాతం గురించి తెలియదు. ఇటీవలే ఈ జలపాతానికి వస్తున్న టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. 170 అడుగుల ఎత్తు నుంచి చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదక్కడ. 170 అడుగుల ఎత్తు నుండి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతుంటుంది. మొత్తం ఐదు జలపాతాల సమాహారం రాయికల్ జలపాతం. పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: - జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేవు, కాబట్టి సందర్శకుల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సెల్ఫీ మోజులో నిర్లక్ష్యంగా ఉన్న అనవసరపు సాహాసాలు చేసినా... ఆహ్లాదంగా, ఆనందంగా సాగాల్సిన పర్యటన మరో రకంగా మారుతుంది. - కొండల పై భాగంలో ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి పైకి వెళ్లే ప్రయత్నం చేయకుండా ఉంటే మేలు - మద్యం తాగివెళ్లొద్దు. - ఫొటోల కోసం లోతు ప్రాంతాల దగ్గరకు వెళ్లొద్దు. - జలపాతాలు ఎక్కే ప్రయత్నం చేయకూడదు. - కొండలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి షూ ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. - ఫుడ్, వాటర్ తదితర వస్తువులేమీ అక్కడ లభించవు. కాబట్టి పర్యటకులు తమతో పాటు అవసరమైన వస్తువులు తీసుకెళ్లడం బెటర్. టి. కృష్ణ గోవింద్, సాక్షి, వెబ్‌డెస్క్. -
వావ్.. జలజల జలపాతాలు
వర్షాలతో తెలంగాణలోని జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కొండల నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహాలను చూసి సందర్శకులు పులకించిపోతున్నారు. జలకాలాటలతో సందడిగా గడుపుతున్నారు. సందడిగా బొగత.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకుంది. చిలుకల పార్క్, ప్రకృతి అందాలను వీక్షిస్తూ పర్యాటకులు ఆనందంగా గడిపారు. – వాజేడు సదర్మాట్కు జలకళ నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టుకు సాగు నీరందించే సదర్మాట్ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించు కుంది. కనీస నీటిమట్టం 7.6 అడుగులు కాగా ప్రస్తుతం 8 అడుగుల మేర నుంచి వరద వెళుతోంది. జల సోయగాన్ని తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. – ఖానాపూర్ ఆహ్లాదం.. భీమునిపాదం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని అటవీ ప్రాంతంలో భీమునిపాదం జలపాతం కనువిందు చేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గుట్టలపైనుంచి వరద నీరు జలపాతానికి చేరడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. – గూడూరు జలజల జలపాతం.. ఇటీవల కురిసిన వర్షాలతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. శని, ఆదివారాల్లో భారీవర్షాలు కురవడంతో జలపాతం ఉధృతి పెరిగింది. దీంతో పర్యాటకుల రద్దీ నెలకొంది. – సైదాపూర్ (హుస్నాబాద్) కన్నుకుట్టేలా.. మిట్టే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మిట్టే జలపాతం జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ వాగుపై సప్తగుండాలు ఉండటం విశేషం. – సిర్పూర్ (యూ) (ఆసిఫాబాద్) -
బాలిక గర్భంపై ‘సోషల్’ వార్.. ఎమ్మెల్యేకు తలనొప్పి
సాక్షి, రాయికల్(జగిత్యాల): రాయికల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. రాయికల్ మండలంలోని అధికార పార్టీ నేతలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ విషయం వారంరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత వ్యవహార శైలి ఇదీ అంటూ పేరు ప్రస్తావించకుండా మరోనేత ఫేస్బుక్, వాట్సప్‌లో మెసేజ్ పెడుతున్నారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులతోపాటు జనం నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పందించి సోషల్ మీడియా వార్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. బాలిక ఫొటో వాట్సప్‌లో పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. చదవండి: వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు -
నేనలాంటోడిని కాదు.. నన్ను నమ్మండి !
సాక్షి, కోరుట్ల(జాగిత్యాల) : ‘ఎంత సేపు ఇక్కడ ఎదురుచూస్తరు.. నేను అటుదిక్కే పోతున్న.. మిమ్మల్ని మోటార్ సైకిల్ మీద రాయికల్‌లో దించుతా. భయపడకండి.. నిన్నమొన్ననే నలుగురిని కాల్చి సంపిండ్రు.. నేను అలాంటోడిని కాదని’.. ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను నమ్మబలికాడు. గుట్టల వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి విఫలయత్నం చేశాడు. ఓ అమ్మాయి ప్రతిఘటించి రాళ్లతో దాడి చేయగా.. బంగారు చైన్ లాక్కొని పరారయ్యాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామారావుపల్లెకు చెందిన డిగ్రీ విద్యార్థిని (17), 8వ తరగతి విద్యార్థిని (14) రాయికల్ వెళ్లడానికి సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని బస్టాప్ వద్ద ఉన్నారు. అటు నుంచి మోటార్ సైకిల్‌పై వెళ్తున్న కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెకు చెందిన కుంచం వేణు వారిని చూసి, తాను రాయికల్ వెళ్తున్నానని, మిమ్మల్ని దింపుతానని పిలిచాడు. అతడి మోటార్ సైకిల్‌పై వెళ్లేందుకు వారిద్దరూ కొంత సందేహించినా నమ్మించాడు. ఇద్దరిని బైక్‌పై ఎక్కించుకొని కోరుట్ల మండలం కల్లూర్ మోడల్ స్కూల్ వెనుక భాగంలో ఉన్న అయిలాపూర్ గుట్టల వద్దకు తీసుకెళ్లగా, తమను ఎక్కడికి తీసుకెళ్తున్నావని బాలికలు అడిగితే, పొలం దగ్గర నీళ్ల మోటారు ఆన్ చేసి వెళ్దామని చెప్పాడు. అయిలాపూర్ గుట్టల సమీపంలో ఇద్దరినీ బెదిరించి అత్యాచారానికి విఫలయత్నం చేశాడు. తెగువ చూపిన చిన్నారి కుంచం వేణు తమపై అకృత్యానికి పాల్పడే అవకాశం ఉందన్న భయంతో ఓ బాలిక (14) కేకలు వేస్తూ ప్రతిఘటించింది. వేణుపై రాళ్లతో దాడి చేసింది. దీంతో భయపడిన వేణు.. డిగ్రీ విద్యార్థిని మెడలో ఉన్న 10 గ్రామలు బంగారు చైన్ లాక్కొని పరారయ్యాడు. విషయాన్ని అమ్మాయిలు ఫోన్ ద్వారా తమ తల్లిదండ్రులకు తెలిపినట్లు సమాచారం. దీంతో కోరుట్ల పోలీసులు నిందితుడి కోసం గాలించారు. అతడి వివరాలను ఇటిక్యాల గ్రామంలోని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కనిపెట్టారు. నిందితుడిపై ఫోక్సో యాక్టుతోపాటు సెక్షన్లు 363, 54, 392, 323, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
కన్నుల పండువగా వేణుగోపాలస్వామి కల్యాణం
రాయికల్ : మండలంలోని చింతలూరు గ్రామంలోని వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు చెరుకు మహేశ్వరశర్మ, మధుశర్మ ఆధ్వర్యంలో ఆలయంలోని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రోత్సవాల మధ్య కల్యాణం కన్నుల పండువగా జరిపారు. హాజరైన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్‌కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. సర్పంచ్ కదుర్ల లక్ష్మి,రాయికల్ మార్కె ట్ కమిటీ చైర్మన్ ఎనుగందుల ఉదయశ్రీ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో... ఇబ్రహీంపట్నం : మండలంలోని వేములకుర్తి గ్రామంలో శనివారం రాత్రి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి కల్యాణాన్ని అర్చకులు మంత్రరాజం రాముచార్యులు, రామకృష్ణచార్యులు, అజయ్‌చార్యులు వేదమంత్రాలతో నిర్వహిం చారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5 వేల మందికి అన్నదానం చేశారు. గ్రామానికి చెందిన నిర్మల్ ఏపీపీ గుడ్ల రామకృష్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోటగిరి యేసుగౌడ్, సత్త య్య, హరీశ్, శ్రీకాంత్, వీడీసీ సభ్యులు దొనికెన నారా యణ, రాధారపు ప్రభాకర్, గంగాధర్, నాయకులు పెం ట లింబాద్రి, ఆంకతి రాజన్న పాల్గొన్నారు. -
సౌదీలో రాయికల్ వాసి మృతి
రాయికల్ : రాయికల్‌కు చెందిన గొల్లపల్లి హరీందర్ (46) అనే కార్మికుడు అనారోగ్యంతో సౌదీలో మృతిచెందాడు. తొమ్మిదేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లిన హరీందర్ వారం క్రితం అనారోగ్యంతో మృతిచెందగా.. కుటుంబీకులకు ఆలస్యంగా సమాచారం అందింది. విషయం తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేలా చర్యలు చేపట్టాలని వారు వేడుకుంటన్నారు. -
రికార్డుస్థాయిలో ప్రసవాలు
రాయికల్ : రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆగస్టు నెలలో రికార్డుస్థాయిలో 50 ప్రసవాలు జరగడంతో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కేక్ కట్‌చేశారు. వైద్యులు శ్రీనివాస్, చైతన్యసుధ, అవంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్పత్రి చరిత్రలోనే ఒకే నెలలో రికార్డుస్థాయిలో 50 ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ సేవాదృక్పథం అలవర్చుకోవాలి
రాయికల్(షాద్‌నగర్‌రూరల్): ప్రతిఒక్కరూ సేవాధక్పథం అలవర్చుకొని సేవా కార్యక్రమాలు చేపట్టాలని తహసీల్దార్ చందర్రావు అన్నారు. కష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు ఆర్యవైశ్య, అనుబంధసంఘాల ఆధ్వర్యంలో మండల పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద ఉచితంగా అల్పాహారం అందించే కార్యరకమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం వాసవీ, వనితాక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పుష్కరభక్తులకు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ చందర్రావు హాజరై‡కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన కష్ణా పుష్కరాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని వసతులను కల్పించిందని అన్నారు. పుష్కరాలకు వెళ్లే భక్తులను దష్టిలో పెట్టుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విట్టదుర్గయ్య, హకీంరాజేష్, విఠ్యాల రామేశ్వర్, కిశోర్గుప్త, శివప్రసాద్, దొంతు పాండురంగయ్య, గందెసురేష్, శశిధర్, మాధవీలత, శ్రీలత, ఎంసానిశ్రీను, పెద్దిరాంమోహన్, శివభాస్కర్, శ్రీనివాస్, నాగిళ్లభవాని, సంతోష్‌బాబు, బాల్‌రాజ్, అనుమారివెంకటయ్య, గోవర్ధన్, సూర్యప్రకాష్, రంగయ్య, వెంకటరమణ, విజయభాస్కర్, చంద్రశేఖర్, సంధ్య, నవలత, శిరీష, శారద తదితరులు పాల్గొన్నారు. -
రాయికల్‌ను జగిత్యాల రెవెన్యూ డివిజన్లో ఉంచాలి
రాయికల్ : రాయికల్ మండలాన్ని జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు తురగ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా రాయికల్ జగిత్యాల రెవెన్యూ డివిజన్లో ఉందని మండలంలోని ప్రజలకు వర్తక, వ్యాపారపరంగా జగిత్యాలతో సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా రాయికల్ మండలాన్ని కోరుట్ల రెవెన్యూలో కలపడం సరికాదన్నారు. తహసీల్దార్ చంద్రప్రకాశ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజంగి అశోక్, వెంకటేశ్వర్‌రెడ్డి, వేణు, రాంచంద్రం, ధర్మపురి, రమేశ్, నరేశ్ పాల్గొన్నారు. -
అస్తవ్యస్తంగా ట్రాఫిక్
ప్రైవేట్ వాహనాల ఇష్టారాజ్యం నిరుపయోగంగా బస్టాండ్ రాయికల్: రాయికల్ అంగడిబజార్‌లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారడంతో సమస్య మరింత జటిలంగా తయారైంది. గతంలో శివాజీ ఏరియా నుంచి గాంధీ విగ్రహం దాకా నిర్మించిన బైపాస్ రోడ్డు ద్వారా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపారు. అనంతరం వ్యాపారుల ఆందోళనతో విరమించారు. దీంతో మళ్లీ ప్రయాణికులకు తిప్పలు మొదలయ్యాయి. రాయికల్ మండలంలో 27 గ్రామాలతోపాటు మేడిపెల్లి, కోరుట్ల, మల్లాపూర్ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు అంగడిబజార్ ముఖ్య కూడలిగా మారింది. కోరుట్ల, జగిత్యాల ఆర్టీసీ బస్సులు ఇక్కడే వచ్చి ఆగుతున్నాయి. ప్రైవేట్ వాహనాలు ఇక్కడే నిలుపుతున్నారు. నిలబడేందుకు కూడా స్థలం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్‌ను మెరుగుపర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. అంగడిబజార్‌లో అన్నీ సమస్యలే.. అంగడిబజార్‌లో ప్రయాణికులకు అన్నీ సమస్యలే. నిలబడేందుకు కూర్చొవడానికి షెల్టర్ లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం లే క తిప్పలు పడుతున్నారు. ఎండాకాలం, వానకాలంలో దుకాణాల ఎదుట నిలబడితే వ్యాపారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లక్షలు వెచ్చించారు..నిర్లక్ష్యంగా వదిలేశారు.. మండల కేంద్రంలో లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్‌ను నిర్లక్ష్యంగా వదిలేశారు. పందులు, పశువులకు నివాస కేంద్రంగా మారి శిథిలావస్థకు చేరుకుంది. ఊరికి దూరంగా ఉందని కొంతమంది వ్యాపారులు బస్టాండ్‌ను వినియోగంలోకి రాకుండా చేశారు. బస్టాండ్ సమీపంలోనే తహసీల్, ఎంపీడీవో, ఐకేపీ, అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం బస్టాండ్‌ను ఆధునీకరించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
సీఎంతో నాకెలాంటి విభేదాల్లేవు
ఇద్దరిదీ ఒకేదారి రాజకీయాలపై ఎలాంటి ఆలోచన లేదు త్వరలోనే జేఏసీ సమావేశం ‘సాక్షి’తో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాయికల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెలంగాణ రాజకీయ జేఏసీ(టీజేఏసీ) చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో కరువు పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడుతుంటే... ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నానని అన్నారు. తమ ఇద్దరిదీ ఒకే దారి అని పేర్కొన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, తాను జేఏసీతో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకూ పోరాటం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, కోదండరాం మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని చాలా మంది అంటున్నారని, అది కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. తమ ఇద్దరిదీ ఒకే పంథా అని అన్నారు. జేఏసీలోంచి వివిధ సంఘాలు వారి ఇష్టానుసారంగానే బయటకు వెళ్తున్నాయని తెలిపారు. త్వరలోనే జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తనకు రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. అన్నా హజారే వంటి నాయకులు సేవ చేస్తున్నారే తప్ప రాజకీయాల్లోకి వస్తున్నారా? అని అన్నారు. కరువుపై అధ్యయనం చేసి రైతులకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. -
చలి తీవ్రతకు వృద్ధురాలి మృతి
రాయకల్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన బుగ్గిళ్ల మల్లవ్వ(65) అనే వృద్ధురాలు చలి తీవ్రతకు తట్టుకోలేక శనివారం సాయంత్రం మృతిచెందింది. రెండు రోజులుగా చలి తీవ్రత ఎక్కువ కావడంతో ఇబ్బందిపడుతుండేదని కుటుంబసభ్యులు తెలిపారు. -
పిచ్చికుక్కల స్వైరవిహరం
రాయికల్ (కరీంనగర్ జిల్లా) : పిచ్చికుక్కల స్వైరవిహరంతో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామంలో జరిగింది. గత కొంతకాలంగా గ్రామంలో పిచ్చికుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. తాజాగా ఆదివారం గ్రామంలో ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. -
‘గల్ఫ్’ గోస పట్టించుకోరా?
రాయికల్: పొట్ట చేతపట్టుకొని ఏడారి దేశాలకు వెళ్లిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వారి సమస్యలను వినేందుకు కనీసం ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని, కేరళ తరహాలో పటిష్టమైన వ్యవస్థను రూపొందించి అమలు చేస్తామని హామీలిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలవుతున్నా ప్రత్యేక మంత్రిత్వ శాఖ గానీ, ప్రత్యేక వ్యవస్థ గానీ రూపుదాల్చలేదు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని గల్ఫ్ బాధితులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి సుమారు పదిహేను లక్షల మంది కార్మికులు ఉపాధికోసం గల్ఫ్‌బాట పట్టారు. ఏజెంట్లు, దళారుల మాయమాటలు నమ్మి, తీరా ఆయా దేశాలకు వెళ్లిన తర్వాత పరిస్థితి తారుమారు అవుతోంది. ఏజెంట్లు చెప్పిన పని లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చేందుకు తక్కువ జీతాలకు ఏ పని దొరికినా కాదనకుండా చేయాల్సి వస్తోంది. ఏజెంట్ల మోసం నకిలీ వీసాలు, సందర్శక వీసాలపై వెళ్లిన పలువురు అక్కడి పోలీసులకు చిక్కి జైలుపాలవుతున్నారు. అనార్యోగం కారణాలు, ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల శవాలు స్వస్థలాలకు రావడానికి నెలలు పడుతోంది. వివిధ కారణాలతో తిరిగివచ్చిన కార్మికులు ఇక్కడ సరైన ఉపాధి లేక సతమతమవుతున్నారు. మరికొంతమంది చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలెన్నో. ఇవ్వన్నీ ఒక ఎత్తయితే, గతేడాది దుబాయ్, సౌదీఅరేబియా దేశాలు ఆంక్షలు విధించినప్పుడు స్వదేశం తిరిగి వచ్చేందుకు వేలాది మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. స్వదేశం రాలేక ఆంక్షల గడువు ముగిసిన తర్వాత కూడా దొంగచాటుగా పనిచేసుకుంటున్న వందలాది మంది జైళ్లపాలయ్యారు. ఇటీవల ఇరాక్‌లో అంతర్యుద్ధం నేపథ్యంలో మన రాష్ట్రానికి చెందిన పలువురు ఆయా కంపెనీల శిబిరాల్లో తలదాచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమందిని స్వదేశానికి తీసుకొచ్చినప్పటికీ ఇంకా వేలాది మంది కార్మికులు ప్రాణభయంతో అక్కడే బిక్కుబిక్కుమంటున్నారు. కేరళలో ఇలా... వలస కార్మికుల రక్షణ విషయంలో కేరళ రాష్ట్ర పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తమ పౌరులకు ఏ ఆపద వచ్చినా ఆగమేఘాలపై స్పందించి తగిన రక్షణ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ యంత్రాంగం విదేశాలకు వెళ్లే కార్మికుల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పేర్లు నమోదు చేసుకోవడం మొదలు ఆయా దేశాల్లో పని పద్ధతులు, అక్కడ మెలగాల్సిన తీరుపై ముందుగా కార్మికులకు అవగాహన కల్పిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవాసాంధ్రుల వ్యవహారాల శాఖను ఏర్పాటు చేశారు. ఆయన మరణానంతరం పాలకులు ఆ శాఖను నిర్వీర్యం చేయడమే కాకుండా కొంతకాలానికి దానిని ఎత్తివేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలోప్రవాస తెలంగాణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని గల్ఫ్ బాధితులు కోరుతున్నారు. తద్వారా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.