సాక్షి, రాయికల్(జగిత్యాల): ఎప్పటిలాగానే చేనులో పత్తి పనులు చేసేందుకు వారం క్రితం 9మంది కౌలు రైతులు కుర్రులోకి వెళ్లారు.. పనులు ముగించుకుని మరో రెండుమూడ్రోరోజుల్లో తిరిగి రావాల్సి ఉంది.. కానీ, గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. నురగలు కక్కుతూ వరద పోటెత్తింది. అప్పటిదాకా ఎంతోనిబ్బరంగా ఉన్న రైతుల్లో ఒక్కసారిగా భయం చోటుచేసుకుంది.. ఇక తాము బతుకుతామో, లేక వరదలో చిక్కుకుని చనిపోతామోననే ఆందోళన మొదలైంది.. వెంటనే మొబైల్‌ఫోన్ల ద్వారా గ్రామస్తులకు సమాచారం అందించారు.. కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ ఆగమేఘాలపై ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షితంగా కుర్రులోంచి బయటకు తీసుకురావడంతో 11గంటల ఉత్కంఠకు తెరపడింది.
బాలుడిని కుర్రులోంచి బయటకు తీసుకొస్తున్న సహాయక సిబ్బంది
అందరూ కౌలురైతులే..
రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన మూడు గిరిజన కుటుంబాలకు చెందిన 9మంది కౌలు రైతులు సమీప గోదావరి నదిలోని కుర్రు(పాయ)లో పత్తి చేనులో పనులు చేసేందుకు వెళ్లారు. ఇందులో వల్లె రఘునాథ్, రంగారావు, దేవిదాస్, సహేబ్‌రావు, కొమ్రె విజయ్, డొక్కె కార్తీక్, సత్యబామ, విజయ, సునీత తమతమ పనుల్లో నిమగ్నమయ్యారు.
చదవండి: ఫోన్ ఉన్నా సిగ్నల్స్ లేకపోవడంతో.. రాత్రంతా వాగులోనే..
మంత్రి కొప్పుల చొరవ..
ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరిస్థితిని సమీక్షిస్తూ విషయాన్ని సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లారు. తొలుత బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్ పంపాలని నిర్ణయించారు. వాతావరణం అనుకూలించదనే సూచనతో నిజామబాద్‌లోని ఎన్డీఆర్‌ఎఫ్ బందాలకు రంగంలోకి దించారు. వారు బోర్నపల్లి ప్రాంతానికి రాత్రి 7 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. రెండు బోట్ల సాయంతో రైతులు ఉన్న కుర్రు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ బోట్లలో బాధితులను గోదావరి తీరానికి సురక్షితంగా చేర్చారు. సుమారు రెండు గంటలపాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రమించాయి.
గోదావరి ఉధృతి..
బోర్నపల్లికి చెందిన రవీందర్‌రావు అనే యజమానికి చెందిన కుర్రులోని వ్యవసాయ భూమిని తొమ్మిది మంది రైతులు కౌ లుకు తీసుకుని పత్తి పంట వేస్తున్నారు. ఇది నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాల పరిధిలోకి వస్తుంది. భారీవర్షాలకు తోడు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రైతులు పనిచేస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది.
సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు
ఫలించిన అధికారుల కృషి..
ఉదయం 11గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ రవి, ఎస్పీ సిందూశర్మ అక్కడే మకాం వేశారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. చివరకు రాత్రి 7గంటలకు రైతులు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: 64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు
అందరిలో ఆనందం..
వరద ఉధృతికి ఇక తాము బతకలేమనే అభిప్రాయానికి వచ్చిన కౌలురైతులను 21 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెండు బోట్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకు రావడంతో ఆనందం వ్యక్తమైంది. కలెక్టర్, ఎస్పీతోపాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఒక్కసారిగా ఉప్పొంగింది
దాదాపు పదిరోజులుగా కుర్రు ప్రాంతంలో సాగు పనులు చేసుకుంటున్నాం. గోదావరి నది ఒక్కసారిగా పొంగింది. ప్రాణాలు పోతాయనుకున్నాం. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడాయి.
– రఘునాథ్, కౌలురైతు
భయమేసింది
వ్యవసాయం కోసం కుర్రులోకి పోయినం. ఒక్కసారిగా గంగ పొంగడంతో భయపడ్డాం. అధికారుల కృషితో సురక్షితంగా బయటకు వచ్చాం. పడవలో మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చారు. అధికారులకు ధన్యవాదాలు.
-జయంత, కౌలురైతు
చలికి వణికినం
వర్షానికి విపరీతమైన చలివేసింది. భయమైంది. అమ్మనాన్న దగ్గర ఉన్నా. గంగలోకి వరదనీరు బాగా వచ్చింది. చనిపోతనని భయమైంది. అమ్మనాన్న ఉండటంతో ధైర్యంగా ఉన్నా. సార్లు వచ్చి మమ్మల్ని బోటులో తీసుకొచ్చిండ్రు.
– కార్తీక్, బాలుడు
మాటలు రావడం లేదు
వర్షం తీవ్రం కావడం, గోదావరి నది ఉప్పొంగడంతో ఏం చేయాలో మాటలు రాలేదు. అధికారుల కృషితో ప్రాణాలతో బయటపడ్డాం. అధికారులు అందరు కలిసి మమ్మల్ని రక్షించారు. అందరికీ పదివేల దండాలు.
– దేవదాసు, కౌలురైతు
రెండు గంటలు శ్రమించాం
కౌలురైతులను కుర్రు నుంచి బయటకు తీసుకురావడానికి రెండుగంటల పాటు శ్రమించాం. మాది విజయవాడ బెటాలియన్. రెండుబోట్ల సాయంతో 21 మందిమి ఘటన స్థలానికి వెళ్లాం. రైతులను సురక్షితంగా తీసుకువచ్చాం.
– ఉపేందర్, ఎన్డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్‌కుర్రు ఆపరేషన్ ఇలా..
►వారం క్రితం బోర్నపల్లి శివారులోని గోదావరి మధ్యలో గల కుర్రులోకి 9మంది రైతులు వెళ్లారు.
►మంగళవారం ఉదయం 9 గంటలు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.
►10.00 : భయంతో వణికిపోయిన రైతులు గ్రామస్తులకు సమాచారం అందించారు.
►10.30 : గ్రామస్తులకు తొలుత కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మకు సమాచారం చేరవేశారు.
►11.00 : స్పందించిన కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి సమీపంలోని గోదావరి తీరంలోకి చేరుకున్నారు.
►11.30 : మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కలెక్టర్ సమాచారం ఇచ్చారు.
►మధ్యాహ్నం 12.00 : మంత్రి కొప్పుల ఈశ్వర్.. సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
►12.30 : హెలికాప్టర్ పంపించి బాధితులను రక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
► 01.00 : వాతావరణం అనుకూలించకపోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.
► 01.15 : ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలని నిర్ణయం
►మధ్యాహ్నం 2.30 : నిజామాబాద్‌లోని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలకు సమాచారం చేరవేత.
► 03.00 : నిజామాబాద్ నుంచి వాహనంలో బయలు దేరిన 21మంది సభ్యులు గల ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
►రాత్రి 07.00 : సంఘటన స్థలానికి చేరుకున్న సహాయ బృందాలు
►08.15 : అన్నీ సిద్ధం చేసుకుని రెండు బోట్లతో గోదావరిలోని కుర్రులోకి బయలు దేరిన సహాయక బృందాలు
►రాత్రి 09.51 గంటలు : 9మంది కౌలురైతులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా నదీతారానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment