
సాక్షి, రంగారెడ్డి: షాద్ నగర్ పట్టణ పరిధిలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న రాయికల్ టోల్ ప్లాజా వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ ప్లాజా సిబ్బందికి, జడ్చర్ల పరిధిలోని నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ ప్రనిల్ చందర్‌కు మధ్య వాగ్వివాదం జరగడంతో ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు.
సర్పంచ్ ప్రనిల్ చందర్ టోల్ ప్లాజా వద్ద వెళ్తుండగా అతని ఫాస్ట్ ట్యాగ్‌లో డబ్బులు అయిపోయాయి. అతను రీఛార్జ్ చేసుకునే క్రమంలో కొంత ఆలస్యం అయింది. వెనుక వాహనాల వారు హారన్స్ కొడుతుండడంతో వాహనాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో టోల్ ప్లాజా సిబ్బందికి ఇతనికి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు దూషించుకోవడంతో గొడవ ప్రారంభమైంది.
చదవండి: హైదరాబాద్‌లో మహిళ హంగామా.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో గొడవ
అయితే సర్పంచ్ ప్రనిల్ చందర్ సర్పంచుల సంఘంలో నాయకుడిగా ఉన్నారు. సర్పంచ్ ప్రనిల్ చందర్‌పై దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, స్నేహితులు రాయికల్ టోల్ ప్లాజా వద్దకు వచ్చి టోల్ ప్లాజా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రనిల్ చందర్ తరపున అనుచరులు హంగామా సృష్టించి, టోల్‌గేట్ క్యాబిన్లను అద్దాలను ధ్వంసం చేశారు. పరస్పర దాడులతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున అనుచరులు తరలిరావడంతో ప్రనిల్ తో పాటు పలువురికి గాయాలు కూడా అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment