jagadishwar
-
కమిషనర్‌తో బల్దియాకు ఆర్థిక భారం
రాయికల్: అసలే కొత్తగా ఏర్పడిన బల్దియా.. పైగా పన్నుల వసూలు చాలా తక్కువ. అలాంటి రాయికల్ మున్సిపాలిటీకి కమిషనర్‌గా రూ.1.49 లక్షల వేతనం ఉన్న గ్రేడ్–1 స్థాయికి చెందిన జగదీశ్వర్‌గౌడ్‌ను నియమించారు. వచ్చిన పన్నులతో పారిశుధ్య సిబ్బంది, కార్మికులకే వేతనాలు చెల్లించలేని పరిస్థితి. ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న తాము కమిషనర్‌కు ప్రతినెలా జనరల్‌ఫండ్ నుంచి అంత వేతనం చెల్లించలేమని, బల్దియాకు గ్రేడ్–1 స్థాయి కమిషనర్ కాకుండా.. ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని ఆగస్టు 31న నిర్వహించిన సమావేశంలో పాలకవర్గం తీర్మానం చేసి సీడీఎం (హైదరాబాద్)కు పంపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రభుత్వం గత ఫిబ్రవరి 21న జగదీశ్వర్‌గౌడ్‌ను బల్దియాకు కమిషనర్‌గా నియమించింది. ఆయనకు 8 నెలలుగా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచే జీతాలు చెల్లిస్తున్నారు. కనీసం ఆయన వేతనానికి సరిపడా కూడా పన్నులు వసూలు కాకపోవడంతో రాయికల్ పట్టణాభివృద్ధికి కేటాయించిన రూ.104.91 కోట్ల నిధుల నుంచే ప్రతినెలా రూ.1.49లక్షల వేతనం చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రేడ్–1 కమిషనర్ అయిన జగదీశ్వర్‌గౌడ్‌ను అదేస్థాయిలో ఉన్న మున్సిపాలిటీకి పంపించాలని, రాయికల్‌కు మాత్రం ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని కోరుతూ సీడీఎంకు తీర్మానం పంపినట్లు మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు తెలిపారు. చిన్న మున్సిపాలిటీ అయిన రాయికల్‌కు ఇన్చార్జి కమిషనర్.. లేదా ఎంపీడీవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తే కొంతైనా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని ప్రజలు, పాలకవర్గ సభ్యులు అంటున్నారు. -
బాలల కథా రచయిత జగదీశ్వర్ ఆత్మహత్య
చిట్యాల/రామన్నపేట: నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ బాలల కథా రచయిత, కార్టూనిస్ట్, ప్రభుత్వ తెలుగు భాషోపాధ్యాయుడు పెండెం జగదీశ్వర్ (45) మంగళ వారం బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా చిట్యాల శివా రులోని శ్రీ బాలనర్సింహస్వామి ఆలయం సమీపంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల తోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, జగదీశ్వర్ రచించిన పలు బాలల కథలు ‘సాక్షి’ దినపత్రిక ఆదివారం అనుబంధం ఫన్డే బుక్‌లో ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన ‘చెట్టు కోసం’ అనే కథ మొదటగా సాక్షిలోనే ప్రచురితమైంది. ఆ కథను మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది. -
తెలంగాణలో ఉబర్ క్యాబ్స్ పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: వెబ్ ఆధారిత సేవలను అందజేసే ఉబర్ క్యాబ్స్పై రవాణాశాఖ నిషేధం విధించింది. తెలంగాణ రాష్ట్రమంతటా ఈ నిషేధం కొనసాగుతుందని రవాణా కమిషనర్ జగదీశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహన యజమానులు, డ్రైవర్లు ఉబర్ సంస్థతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడానికి వీల్లేదన్నారు. ఢిల్లీలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ముంబై, ఢిల్లీల్లో ఉబర్ క్యాబ్‌లను నిషేధించారు. ప్రయాణికులు సైతం ఆ సంస్థకు చెందిన వాహనాలను బుక్ చేసుకోవద్దని, వాటిలో వెళ్లవద్దని కమిషనర్ సూచించారు. అక్రమంగా తిరిగే క్యాబ్‌లపై తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. -
పాఠశాలలకు 5 రోజులు సంక్రాంతి సెలవులు
బతుకమ్మ, దసరా, బక్రీద్ పండుగలకు కలిపి15 రోజులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా, బక్రీద్ పండుగలకు 15 రోజులు, సంక్రాంతి పండుగకు 5 రోజులు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఈనెల 23 నుంచి వచ్చేనెల 5వ తేదీవరకు బతుకమ్మ, దసరా, బక్రీద్ సెలవులుండగా, ఇపుడు రెండురోజులు పెంచి, 7వ తేదీ వరకు సెలవులుగా పాటించాలన్నారు. అలాగే, వచ్చే ఏడాది జనవరి 10వ తేదీనుంచి 18వ తేదీవరకు ఉన్న సంక్రాంతి సెలవుల్ని మూడురోజులు తగ్గించి 15వ తేదీ వరకే పాటించాలని ఆర్సీ నంబరు జేడీఎస్/ప్లానింగ్/2014 ద్వారా ఉత్తర్వులు జారీ చే సినట్లు ఎస్టీయూటీఎస్, టీపీపీటీఏ సంఘాలు వెల్లడించాయి. ఈ సెలవు దినాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే పాఠశాల విద్యా క్యాలెండర్‌లోనూ ఇందుకనుగుణంగా మార్పులు చేయాలని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
మూఢనమ్మకాలను విశ్వసించొద్దు
మంచాల: మూఢ నమ్మకాలను విశ్వసించొద్దని మంచాల సీఐ జగదీశ్వర్ ప్రజలకు సూచించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని చాంద్‌ఖాన్‌గూడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని ఓ మహిళ ఇటీవల చనిపోయి దెయ్యమై గ్రామస్తులపై దాడి చేస్తోందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఇంటి ఎదుట కాముని బూడిద, చెప్పులు ఉంచుతున్న విషయం విధితమే. సోమవారం మంచాల సీఐ జగదీశ్వర్ సిబ్బందితో కలిసి చాంద్ఖాన్గూడను సందర్శించారు. ఇంటింటికి తిరిగి గ్రామస్తు లకు అవగాహన కల్పించారు. దెయ్యాలు, భూతాలు లేవని చెప్పారు. మూఢ విశ్వాసాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా సీఐ జగదీశ్వర్ గ్రామ యువకులతో మాట్లాడారు. నేటి కంప్యూటర్ యుగంలో కూడా దెయ్యాలు ఉన్నాయని విశ్వసించడం మూర్ఖత్వమే అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురవకుండా పుకార్లను నమ్మొద్దని సీఐ చెప్పారు. చదువుకున్న యువత నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దెయ్యాలు ఉన్నాయని విశ్వసించి భూత వైద్యులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ పేర్కొన్నారు. త్వరలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో మంచాల ఎస్సై రవికుమార్, సిబ్బంది ఉన్నారు.