66 శాతం పోలింగ్ | 66% vote polling completed in district | Sakshi
Sakshi News home page

66 శాతం పోలింగ్

Published Mon, Mar 31 2014 12:58 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

66% vote polling completed in district

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బల్దియా పోరులో ప్రధాన ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ జరిగింది. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. ముఖ్యంగా మహిళలు, యువత తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండాకాలం కావడంతో అధిక సంఖ్యలో ఓటర్లు ఉదయాన్నే ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో అన్ని పోలింగ్  కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిశాయి. వృద్ధులు, రోగులు, వికలాంగులు కూడా ఓటు వేసేందుకు వచ్చారు. ఆరు మున్సిపాలిటీల్లో సగటున 66.41 శాతం పోలింగ్ నమోదైంది.

 పోలింగ్ ప్రశాంతం
 ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్  మున్సిపాలిటీల  పరిధిలో 187 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 1,095 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 325 కేంద్రాల ద్వారా పోలింగ్ నిర్వహించారు. అంగన్‌వాడీ సిబ్బంది ఓటర్లకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారు. ఓటర్లను మినహా కేంద్రాల్లో 200 మీటర్ల దూరం వరకు ఎవ్వరిని అనుమతించలేదు. ఆదిలాబాద్ మున్సిపల్ వార్డుల్లో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ అహ్మద్‌బాబు, ఎన్నికల పరిశీలకులు సుకుమార్ పరిశీలించారు. పోలింగ్ తీరును పర్యవేక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ఎస్పీ గజరావు భూపాల్, అదనపు ఎస్పీ జోయల్ డేవిస్ పట్టణంలోని పిట్టలవాడ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రత్యేక పరిశీలకులుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు సుకుమార్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల తీరును పరిశీలించారు. పలుచోట్ల చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. భైంసాతోపాటు మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

 ఈవీఎంల మొరాయింపు
 మంచిర్యాలలోని 22, 28 వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 19వ వార్డు బూత్‌లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదిలాబాద్ బొక్కలగూడ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆరు మున్సిపాలిటీల పరిధిలో 315 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించారు. పలుచోట్ల సాంకేతిక లోపాలు తలెత్తాయి. నిర్మల్ మున్సిపాలిటీలో రెండు పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కనెక్టు కాలేదు.

ఆదిలాబాద్ పట్టణంలోని మరో పోలింగ్ కేంద్రంలోనూ మొరాయించింది. వీటిని సరిచేసే సరికే చాలా మట్టుకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం పోలింగ్ మందకొడిగా సాగగా, ఎండ తీవ్రతకు ఓటర్లు బయటకు రాలేదు. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి ఓటర్ల రాక ఎక్కువైంది.   ఐదు గంటల లోపు కేంద్రాలకు చేరుకున్న వారందరికి అధికారులు స్లిప్‌లను పంపిణీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. అత్యధికంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో73.91 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ మున్సిపాలిటిలో 59.42 శాతం ఓట్లు పోలయ్యాయి.

 చెదురుమదురు ఘటనలు
 మున్సిపల్ ఎన్నికల్లో  చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మంచిర్యాల మున్సిపాలిటీలోని 19వ వార్డులో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని శిశుమందిర్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకోవడంతో నాయకులు తోపులాడుకున్నారు. నిర్మల్‌లోని సోమవార్‌పేట్‌లో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అనుచరులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

 ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ మాధవరెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓ అభ్యర్థికి చెందిన సమీపబంధువు ఎన్నికల విధుల్లో ఉండటంతో ప్రత్యర్థి అభ్యర్థులు అభ్యంతరం తెలపడంతో ఆ ఉద్యోగిని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. భైంసాలో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెట్టిన కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నీడ లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. మండే ఎండలో గంటల తరబడి నిలబడి ఓటేశారు. కేంద్రాల వద్ద కనీసం టెంటు కూడా వేయకపోవడం పట్ల ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు కేంద్రాల్లో తాగునీటి వసతి సరిగ్గా లేకపోవడంతో దాహంతో ఇబ్బంది పడ్డారు.

 ఏర్పాట్లలో లోపం..
 ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని అధికార యంత్రాంగం ప్రకటించినా ఆచరణలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సాక్షాత్తు కలెక్టర్ అహ్మద్ బాబు క్యాంపు కార్యాలయానికి ఎదురుగా ఉన్న 19వ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కేంద్రం పరిధిలో సుమారు 70 మంది ఓటర్ల పేర్లు గల్లంతవడంతో వారు ఆందోళనకు దిగారు. అంగన్‌వాడీ సిబ్బంది ఓటరు స్లిప్‌లు ఇచ్చినా, వాటిని తీసుకుని ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల్లోకి వెళితే సిబ్బంది ఓటు లేదని తిప్పిపంపడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్ అహ్మద్‌బాబు అక్కడికి చేరుకున్నారు. 33వ వార్డు ఇంద్రానగర్‌లోనూ చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. నిర్మల్‌లోని 21వ వార్డుల్లో అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు అధికారులు గుర్తింపు కార్డులను శనివారమే జారీ చేయాల్సి ఉండగా, పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి కూడా వాటిని జారీ చేయలేదు. ఇలా ఆదిలాబాద్ మున్సిపల్‌లోని రెండో నంబర్ పోలింగ్ వద్ద ఇద్దరు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
 ఎన్నికల ఘట్టం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీ ఎంలలో నిక్షిప్తమై ఉంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షె డ్యూల్ ప్రకారం బుధవారం (ఏప్రిల్ 2న) ఓట్ల లెక్కింపు జరగాలి. కానీ ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో షెడ్యూల్ ప్రకారం లెక్కింపు జరుగుతుందో.. లేదోనని అభ్యర్థుల్లో ఉ త్కంఠ నెలకొంది. ఈ అంశంపై న్యాయస్థానం ఏప్రిల్ 1న తీ ర్పు ఇవ్వనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement