ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : రెండో విడత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు పోలీసు శాఖ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలపై నిఘా పటిష్టం చేసినట్లు గురువారం పోలీసు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ గజరావు భూపాల్ వెల్లడించారు. రెండో విడతగా ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్ డివిజన్‌లలో జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. పోలింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,131 పోలింగ్ కేంద్రాల్లో 94 అతి సమస్యాత్మక కేంద్రాలుగా, 194 కేంద్రాలు సమస్యాత్మకంగా, 34 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఎన్నికల్లో అలజడి సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
శుక్రవారం జరిగే ఎన్నికల కోసం ముగ్గురు అదనపు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 140 మంది ఎస్సైలు, 200 మంది ఏఎస్సైలు, 2,800 కానిస్టేబుళ్లు, 600 మంది సాయుధ దళాలు, 80 మంది మహిళా పోలీసులు, 600 మంది హోంగార్డులను ఏర్పాటు చేశారు. వీరితోపాటు 120 మంది ఎక్సైజ్, 100 మంది ఫారెస్టు, 40 మంది ఆర్టీ సిబ్బందిని నియమించారు. మొత్తం 4,800 మంది బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
‘పరిషత్’ ఎన్నికలపై పోలీసు నిఘా
Published Fri, Apr 11 2014 3:17 AM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM
Advertisement