సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో రెండు విడతలుగా జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భద్రతపై దృష్టి సారించా రు. శుక్రవారం ఐదు గంటలకు ప్రచారం ముగియనుండ టం, ఆదివారం ఎన్నికలు జరగనుండటంతో పోలీసు లు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు.
పల్లెల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో సమర్థవంతంగా ఎదుర్కొవడానికి వ్యూహం రచిస్తున్నారు. జిల్లాలో 52 జెడ్పీటీసీ స్థానాలకు 269 మంది, 636 ఎంపీటీసీ స్థానాలకు 2,654 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొదటి విడతగా ఆరో తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్‌లలోని 21 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 116 మంది, 263 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,308 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గజరావు భూపాల్ 4,600 మంది పోలీసు బందోబస్తుతో ఎన్నికలు జరిపించేందుకు ప్రణాళిక రూపొందించారు.
పకడ్బందీ చర్యలు
నేరచరిత్ర గల నాయకులను ఎన్నికలకు ముందు సొంత ప్రాంతాలకు పంపిస్తున్నారు. అనుమానం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను, ప్రధాన అనుచరులను పోలింగ్ రోజున గృహ నిర్బంధం చేయనున్నారు. చిన్న గొడవలకు పాల్పడిన తీవ్రంగా పరిగణలోకి తీసుకొని కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4 వేల మందిని బైండోవర్ చేయగా, రూ.1.67 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచే మద్యం దుకాణాలు మూయించి పోలీసులు మోహరించనున్నారు.
అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రాణహిత నదిలో పడవల ద్వారా పోలీసులు తిరుగుతున్నారు. ఎన్నికలకు మరో 48 గంటలు మాత్రమే సమయం ఉండడంతో పోలీసులు సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అతి సమస్యాత్మక కేంద్రాల్లోని గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు పోలీసులకు సమాచారం లేకుండా వెళ్లకూడదని సూచించారు.
భారీ బందోబస్తు
ఈనెల 6న ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్‌లలో నిర్వహించనున్న స్థానిక ఎన్నికల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు డివిజన్‌లకు కలిపి 4,600 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో అదనపు ఎస్పీలు ముగ్గురు, డీఎస్పీలు ఎనిమిది, సీఐలు 45, ఎస్సైలు 135, ఏఎస్సైలు 260, హెడ్‌కానిస్టేబుళ్లు 390, కానిస్టేబుళ్లు 2,600, మహిళా కానిస్టేబుళ్లు 60, హోంగార్డులు 800, గ్రేహౌండ్స్ బలగాలు 200 మంది, మోబైల్ పోలీసు పార్టీలను నియమించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్‌లలో 163 అతిసమస్యాత్మక కేంద్రాలు, 289 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 44 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నేటితో ప్రచారానికి తెర
Published Fri, Apr 4 2014 12:40 AM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM
Advertisement
Advertisement