సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బల్దియా పోరులో ప్రధాన పార్టీలకు ఎదురీత తప్పడం లేదు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. స్వతంత్రులను, ప్రధానేతర పార్టీల సహాయం తీసుకుంటే తప్ప చైర్మన్ పీఠాలు కైవసం చేసుకునే పరిస్థితి లేదు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించామంటున్న టీఆర్‌ఎస్‌కు అభ్యర్థుల ఎంపికలోనే తప్పటడుగు వేయగా, పట్టణ ప్రజల సమస్యలను గాలికొదిలేయడం కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిబంధకంగా మారుతోంది.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించామని చెప్పుకుంటున్న బీజేపీకి గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఫలితాలు కాస్త మెరు గ్గా ఉంటాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. భైంసా, నిర్మల్ మున్సిపాలిటీల్లోని కొన్ని వార్డులో ఎంఐఎం తన పట్టును నిలుపుకునే అవకాశాలున్నాయి. మున్సిపల్ పోరులో ప్రచార ఘట్టానికి శుక్రవారంతో తెరపడింది.
ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే..
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపికే వివాదాస్పదమైంది. డబ్బులిచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. పలు వార్డుల్లో రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకలానే సాగుతోంది. తీవ్ర వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంపకాల్లో తలెత్తిన వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. కానీ పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆ పార్టీ గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శ ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతిబంధకంగా మారనుంది. గత పాలక మండలితో పోల్చితే బీజేపీకి వచ్చే సీట్ల సంఖ్య కాస్త మెరుగుపడే అవకాశాలున్నాయి.
నిర్మల్ : నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ప్రశ్నార్థకమే. ఇక్కడ కాంగ్రెస్‌లో చాలా కాలంగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వర్గీయులు బీఎస్పీ నుంచి బరిలోకి దిగుతుండటంతో ఆ పార్టీ ఓట్లు చీలిపోతాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌కు నిర్మల్‌లో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో ఇప్పుడు ప్రజల్లోకి వెళుతున్నా ఫలితం ఏమేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక్కడ ఎంఐఎం కొంత ప్రభావాన్ని చూపనుంది. మొత్తం మీద చైర్మన్ పీఠం విషయంలో ఏ పార్టీలో స్పష్టమైన ధీమా లేకుండా పోయింది.
భైంసా : భైంసా మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు సగం వార్డుల్లో అసలు అభ్యర్థులే లేరు. దీనిని బట్టి ఆ మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ కేవలం 12 వార్డుల్లో, టీఆర్‌ఎస్ 15 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను పెట్టగలిగింది. ఇక్కడ ఎంఐఎం, బీజేపీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఏ ఒక్క పార్టీ మద్దతు లేనిదే ఇక్కడి చైర్మన్ పీఠం దక్కించుకోవడం ఆయా పార్టీలకు వీలుకుదరని పరిస్థితి.
కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ బల్దియాలో కాంగ్రెస్ 28 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దించినప్పటికీ, 26 వార్డుల్లో కోనేరు కోనప్ప వర్గం అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా కాంగ్రెస్ పట్టణాభివృద్ధి ఏమాత్రం పట్టించుకోలేదు. చాలా ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడి, ఓవర్ బ్రిడ్జి వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమవడం ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ఇబ్బందిగా మారనుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపికలో డబ్బుకే ప్రాధాన్యత దక్కిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి వర్గీయులు ఎవరికి వారే బరిలోకి దిగారు. దీని ప్రభావం ఆ పార్టీ అభ్యర్థుల గెలుపై ప్రభావం చూపనుంది.
బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున పోటీ చేసే ముఖ్య నాయకుడే లేకుండా పోయారు. ఇక్కడి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి వినోద్ టిక్కెట్ల ప్రారంభంలో వచ్చి వెళ్లారంటే, ప్రచారం ముగిసినా ఇ టువైపు తొంగి చూడలేదు. టీఆర్‌ఎస్‌తో అవగాహనతో పనిచేస్తున్న సీపీఐ నేత గుండా మల్లేశ్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌లోని గ్రూపు విభేదాలు అభ్యర్థుల గెలుపునకు ప్రతిబంధకంగా మారుతోంది. ఒక వర్గం అభ్యర్థులను ఓడించేందుకు ఆ పార్టీ శ్రేణులే కొన్ని వార్డుల్లో పనిచేస్తుండటం గమనార్హం.
మంచిర్యాల : మంచిర్యాలలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యే గట్టి పోటీ నెలకొన్నప్పటికీ, ఆ రెండు పార్టీల ముఖ్య నాయకులతో ఆయా పార్టీ శ్రేణులకు మధ్య ఉన్న అంతరం అభ్యర్థుల గెలుపుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. టీఆర్‌ఎస్‌లో కొత్తగా చేరిన దివాకర్‌రావు కాంగ్రెస్ నుంచి వచ్చిన తన అనుచరులనే అభ్యర్థులుగా నిలపడంతో, ఆ పార్టీలో ఉన్న పాత నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అరవిందరెడ్డి ఎంపిక చేసిన అభ్యర్థులకు, ప్రేంసాగర్ వర్గీయుల సహకారం కొరవడంతో అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపుతోంది.
ఎదురీత
Published Sat, Mar 29 2014 3:18 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement