baldia campaign
-
బల్దియా: ఆనాడే తొలి ఓటు..
సాక్షి, హైదరాబాద్: అది 1948 సెప్టెంబర్ 17.. అప్పటి వరకు రాచరిక పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో 1952 జనవరిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. వాటితో పాటే నాటి హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఎన్నికలు జరిగాయి. దీంతో హైదరాబాదీలు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించారు. 1956లో ఎంసీహెచ్ ఏర్పడినా.. అప్పుడు ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక అధికారితోనే బల్దియా పాలన సాగింది. హైదరాబాద్ సంస్థానంలో విలీనం అనంతరం హైదరాబాద్ బల్దియాకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి..? నిజాం పాలనలో జరిగిన ఎన్నికలు ఎలా జరిగేవి.. తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 1934 మున్సిపల్ కార్పొరేషన్ కోసం మొదటి ఎన్నికల జరిగాయి. కానీ ఇందులో అందరికీ ఓటు వేసే అధికారం ఉండేది కాదు. కేవలం కొంత మందికి మాత్రమే ఓటు వినియోగించే హక్కు నిజాం ప్రభుత్వం కల్పించింది. హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో మొదటిసారి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగాయి. ఇందులో మొదటిసారి నగర ప్రజలు ఓటు వినియోగించారు. 1951 నవంబర్ 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 15న నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అప్పట్లో హైదరాబాద్ నగరంలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. అందులో ఇద్దరు అభ్యర్థుల నియోజకవర్గాలు రెండు ఉండేవి. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ రోజుల్లో హైదరాబాద్ కేవలం ఒక్క నియోజకవర్గంగా ఉండేది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు 1951 అక్టోబర్ 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు జరిగాయి. రోజుకో నియోజకవర్గంలో పోలింగ్ రాచరిక వ్యవస్థ అంతరించిన తర్వాత దేశంలో మొదటిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం, సిబ్బంది లేమి వల్ల నాడు రోజుకో నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించి నియోకవర్గాల్లో జనవరి 2 నుంచి 24వ తేదీ వరకు పోలింగ్ జరిగింది. మొత్తం స్థానాల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 15న ఫలితాలను ప్రకటించారు. నిజాం హయాంలో కూడా బల్దియా ప్రతినిధుల కోసం ఎన్నికలు జరిగేవని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఆ రోజుల్లో ప్రజలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం దక్కేదికాదు. ప్రభుత్వం తరఫున కేవలం కొంతమంది ప్రతినిధులు ఓటు వినియోగించే వారు. ప్రజాసామ్య పద్ధతిలో బల్దియా ఎన్నికలు జరిగాయి. మొదట్లో హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ 60 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మొదటి పాలక మండలి 1960 ఆగస్టు 3వ తేదీన కొలువుదీరింది. బల్దియా ఎన్నికలు మొదటిసారి 1956లో ఎంసీహెచ్ ఏర్పడింది. అప్పటి నుంచి 1960 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 1960లో మొదటిసారి బల్దియాకు ఎన్నికలు జరిగాయి. రెండవసారి 1964లో.. మూడోసారి 1968లో ఎన్నికలు జరిగాయి. 1968 నుంచి 1986 వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. తిరిగి 2002లో బల్దియాకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2007లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటికీ ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా మారింది. గ్రేటర్ ఏర్పా టు అనంతరం రెండేళ్లకు 2009లో ఎన్నికలు జరిగాయి. 2009 నుంచి 2014 వరకు పాలకమండలి కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏడాదిన్నర తర్వాత మళ్లీ 2016 ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికలు జరిగాయి. 2016 ఫిబ్రవరి 11న ప్రస్తుత పాలకమండలి కొలువుదీరింది. వీరి పదవీ కాలం ఫిబ్రవరి 10, 2021 వరకు ఉంది. బల్దియాలో ప్రస్తుతం 8వ సారి జరుగుతున్న ఎన్నికలు. -
‘సోషల్’ కూత.. టీఆర్ఎస్ జోరు
సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకుపైగా సమయం ఉంది. జరగాల్సిన బీసీ ఓటర్ల సర్వే..వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యేందుకు కూడా ఎంతో సమయం పట్టే చాన్స్ ఉంది. సాధారణంగా ఏ ఎన్నికలకైనా ఎన్నికల నోటిఫికేషన్‌కు అటూ ఇటూగా ఆయా పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తాయి. కానీ, బల్దియా ఎన్నికలకు మాత్రం సోషల్ మీడియాలో ఈపాటికే ప్రచారం మొదలైంది. ప్రత్యేకంగా అది ఎన్నికల కోసమని చెప్పకపోయినా ఇటీవల పలువురు టీఆర్ఎస్కు చెందిన నేతలు ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన పనుల గురించి పోస్ట్ చేస్తున్నారు. వాటిల్లో ముఖ్యంగా బయోడైవర్సిటీ పరిసరాల్లో, ఎల్బీనగర్ చుట్టుపక్కల పూర్తయిన ఫ్లై ఓవర్లతో కూడిన వీడియో క్లిప్‌లు ఉంచుతున్నారు. ఒకే స్క్రీన్‌లో నాలుగైదు ఫ్లై ఓవర్లను జోడిస్తున్నారు. వీటితోపాటు కొల్లూరు, రాంపల్లి తదితర ప్రాంతాల్లో భారీసంఖ్యలోని డబుల్‌ఇళ్లనూ ఉంచుతున్నారు. ఇక దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జి ఎన్నో రోజులుగా ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఎందుకంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి రాబోయే బల్దియా ఎన్నికలకు లబ్ధిచేకూర్చేందుకేనని, అది ఎన్నికల ప్రచారమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని ఇలా ప్రజల ముందుంచడం ద్వారా ముందస్తుగానే దూసుకుపోయేందుకు టీఆర్ఎస్ శ్రేణులతోపాటు పార్టీ అభిమానులూ ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కార్పొరేటర్లు తాము చేస్తున్న పనులు, క్షేత్రస్థాయి పర్యటనల ఫొటోలు, వీడియోక్లిప్స్‌తో ప్రత్యేక వాట్సప్ గ్రూప్‌లు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెళ్లలోనూ తమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు తదితరమైనవి ఉంచుతున్నారు. మరోవైపు తమ సీటు తమకే తిరిగి దక్కేందుకుగాను మునిసిపల్ మంత్రి కేటీఆర్‌ను కలిసి తాము చేసిన పనులు, చేయనున్న పనుల గురించి వివరిస్తున్నారు. పనుల్లో దూకుడు.. తమ పరిధిలోని మౌలిక సదుపాయాలు,అభివృద్ధికి సంబంధించిన పనుల్ని సత్వరం పూర్తిచేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉన్నతస్థాయిలోని టీఆర్ఎస్ నేతలు సైతం పబ్లిక్‌టాయ్‌లెట్లు,పార్కుల వంటి పనులు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో, వీలైనంత సత్వరం పూర్తిచేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఇప్పటికే రూ.50 వేల కోట్ల అభివృద్ధి పనులు: మేయర్ దేశంలోని నివాసయోగ్య, ఉపాధి, తదితర అంశాలపై 34 నగరాల్లో హాలిడిఫై.కామ్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా నిలవడంపై మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో వివిధ రంగాల్లో రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, రాబోయే ఐదేళ్లలో మరో రూ.40 వేల కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలోని నీటికొరత, విద్యుత్ సమస్యలు ఇప్పుడు లేవని, హైదరాబాద్ నగరం పెట్టుబడులు పుంజుకోవడానికి, నివాసయోగ్యతకు అనువైన నగరమని పేర్కొన్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి రాష్ట్రంలో నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల తరహాలోనే రాబోయే బల్దియా ఎన్నికలను కూడా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పి.సాయిబాబా ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల అధికారిని కలిసిన వారిలో నల్లెల కిశోర్, ముప్పిడి మధుకర్, పి.బాలరాజ్‌గౌడ్ తదితరులున్నారు. ఓటీఎస్ వినియోగించుకోండి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆస్తిపన్ను బకాయిలున్నవారికి బకాయిల వడ్డీలపై 90 శాతం రాయితీనిస్తూ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం ఈస్కీమ్ గడువునుఅక్టోబర్ 31 వరకు పొడిగించినందున స్కీమ్ ప్రయోజనం పొందాల్సిందిగా సూచించారు. జీహెచ్ఎంసీలో ఇలాంటి బకాయిలున్నవారు మొత్తం 5.41 లక్షల భవనాల యజమానులుండగా, ఇప్పటి వరకు 78వేల మంది మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి దాదాపు రూ. 174 కోట్లు వసూలయ్యాయి. -
...కాదేదీ ప్రచారానికనర్హం!
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ... బడి, గుడి.. పార్కు, పాలకేంద్రం.. బారు, బస్టాండ్.. కాదేదీ ప్రచారానికనర్హం అంటున్నారు మన ‘మహా’నాయకులు... ఓటే ముఖ్యంగా.. గెలుపే లక్ష్యంగా ‘మీరు ఏడికెళ్తే ఆడికొస్తా ఓటరూ..’ అంటూ.. వేదిక ఏదైనా.. ఎక్కడైనా.. ప్రచార హోరుతో దూసుకుపోతున్నారు గ్రేట్..ర్ నేతలు. సాక్షి,సిటీబ్యూరో: బల్దియా ప్రచారంలో నయా ట్రెండ్ జోరందుకుంది. వేదిక ఏదైనా సరే ప్రచార పదనిసలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నాయకగణం. పాఠశాలలు, కళాశాలలు. దేవాలయాలు, పార్కులు, పాలకేంద్రాలు, టీకొట్టు, ఇడ్లీ బండి, కూరగాయల మార్కెట్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకప్పటిలా గడగడపకూ వెళ్లి సంప్రదాయ పద్ధతిలో ప్రచారం చేస్తే లాభం లేదని.. ఇప్పుడు ప్రతి అడ్డానూ ప్రచారానికి వేదికగా వినియోగించుకుంటున్నారు నేతలు. దీనికి ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేదు. జెండాలు, అజెండాలు, హామీలతో పనిలేదు. ఎవరైనా.. ఎక్కడైనా.. ప్రచార ట్రెండ్ మాత్రం ఇదే. అభ్యర్థుల ఉత్సాహానికి చిన్నారులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న పాఠశాలలు సైతం ప్రచార హోరులో తడిసి ముద్దవుతున్నాయి. ఓటర్లతోపాటు వారి పిల్లలనూ ప్రభావితం చేసేందుకు చిన్నారుల చేతుల్లో కరపత్రాలు పెడుతూ.. మీ తల్లిదండ్రులను ఓటు మాకే వేయాలని చెప్పమంటున్నారు. అంతటా అభ్యర్థులే... మార్నింగ్ వాక్కు వె ళ్లే ఉద్యోగులు, వృద్ధులు, మహిళల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు ఉదయం 5 గంటల నుంచే పార్కుల వద్ద తిష్ట వేస్తున్నారు అభ్యర్థులు. ఇక ‘స్వామి కార్యం.. స్వకార్యం’ అన్నట్లు కాలనీలు, బస్తీల్లో ఉన్న దేవాలయాలు కూడా పార్టీల ప్రచారంతో సందడిగా మారుతున్నాయి. గుడికి వచ్చిపోయే వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇక్కడా మకాం వేస్తున్నారు. దైవ సాక్షిగా మీ ఓటు మాకే అంటూ భక్తులతో చేతిలో చేయి వేయించుకుంటున్నారు. ఇక టీకొట్టు, టిఫిన్ బండి, కిరాణా దుకాణాల వద్దకు వచ్చిపోయే వారి చేతిలో కరపత్రం పెట్టి.. వంగి, వంగి దండాలు పెడుతున్నారు. గడ్డాలు, చేతులు పట్టుకొని బతిమిలాడుతున్నారు. ‘మీరు ఏడికెళ్తే ఆడికొస్తాం.. మీ ఓటు మాత్రం మాకే సుమా’ అంటూ సెలవిస్తున్న అభ్యర్థులను చూసి ఓటర్లు విస్తుపోతున్నారు. బార్లకు వచ్చే మందుబాబులకు మందు, విందులతో పసందు చేస్తూ వారి ఓట్లనూ ఒడిసి పట్టేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. బార్లలో ‘మీ ఓటు ఎవరికి..?’ అన్నదే టేబుల్ అజెండాగా మారుతోంది ఇప్పుడు. ఇక దీనికి ఇంటింటీ ప్రచారం అదనం. ఇన్ని రకాలుగా ప్రచారం చేసినా ఓటర్లు తమ వైపు ఉంటారో లేదో తెలియక అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ చూసినా ‘మీ ఓటు ఎవరికి..?’ అన్నదే హాట్ టాపిక్‌గా మారింది. ‘ఎవరికి ఓటేస్తే మాకేంటీ లాభమం’టూ జనం బేరీజు వేసుకుంటున్నారు. గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు జెండా, అజెండా మార్చేసుకొని ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలవడంతో.. గతంలో వారు చేసిన అభివృద్ధి, స్పందించిన తీరుపై ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ఫీట్లు చేస్తున్న అభ్యర్థులు వారి అంతరంగం తెలియక తికమకపడుతున్నారు. -
ఎదురీత
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బల్దియా పోరులో ప్రధాన పార్టీలకు ఎదురీత తప్పడం లేదు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. స్వతంత్రులను, ప్రధానేతర పార్టీల సహాయం తీసుకుంటే తప్ప చైర్మన్ పీఠాలు కైవసం చేసుకునే పరిస్థితి లేదు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించామంటున్న టీఆర్ఎస్కు అభ్యర్థుల ఎంపికలోనే తప్పటడుగు వేయగా, పట్టణ ప్రజల సమస్యలను గాలికొదిలేయడం కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిబంధకంగా మారుతోంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించామని చెప్పుకుంటున్న బీజేపీకి గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఫలితాలు కాస్త మెరు గ్గా ఉంటాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. భైంసా, నిర్మల్ మున్సిపాలిటీల్లోని కొన్ని వార్డులో ఎంఐఎం తన పట్టును నిలుపుకునే అవకాశాలున్నాయి. మున్సిపల్ పోరులో ప్రచార ఘట్టానికి శుక్రవారంతో తెరపడింది. ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే.. ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికే వివాదాస్పదమైంది. డబ్బులిచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. పలు వార్డుల్లో రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకలానే సాగుతోంది. తీవ్ర వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంపకాల్లో తలెత్తిన వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. కానీ పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆ పార్టీ గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శ ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతిబంధకంగా మారనుంది. గత పాలక మండలితో పోల్చితే బీజేపీకి వచ్చే సీట్ల సంఖ్య కాస్త మెరుగుపడే అవకాశాలున్నాయి. నిర్మల్ : నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ప్రశ్నార్థకమే. ఇక్కడ కాంగ్రెస్‌లో చాలా కాలంగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వర్గీయులు బీఎస్పీ నుంచి బరిలోకి దిగుతుండటంతో ఆ పార్టీ ఓట్లు చీలిపోతాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్కు నిర్మల్‌లో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో ఇప్పుడు ప్రజల్లోకి వెళుతున్నా ఫలితం ఏమేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక్కడ ఎంఐఎం కొంత ప్రభావాన్ని చూపనుంది. మొత్తం మీద చైర్మన్ పీఠం విషయంలో ఏ పార్టీలో స్పష్టమైన ధీమా లేకుండా పోయింది. భైంసా : భైంసా మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్లకు సగం వార్డుల్లో అసలు అభ్యర్థులే లేరు. దీనిని బట్టి ఆ మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ కేవలం 12 వార్డుల్లో, టీఆర్ఎస్ 15 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను పెట్టగలిగింది. ఇక్కడ ఎంఐఎం, బీజేపీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఏ ఒక్క పార్టీ మద్దతు లేనిదే ఇక్కడి చైర్మన్ పీఠం దక్కించుకోవడం ఆయా పార్టీలకు వీలుకుదరని పరిస్థితి. కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ బల్దియాలో కాంగ్రెస్ 28 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దించినప్పటికీ, 26 వార్డుల్లో కోనేరు కోనప్ప వర్గం అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా కాంగ్రెస్ పట్టణాభివృద్ధి ఏమాత్రం పట్టించుకోలేదు. చాలా ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడి, ఓవర్ బ్రిడ్జి వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమవడం ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ఇబ్బందిగా మారనుంది. టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో డబ్బుకే ప్రాధాన్యత దక్కిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి వర్గీయులు ఎవరికి వారే బరిలోకి దిగారు. దీని ప్రభావం ఆ పార్టీ అభ్యర్థుల గెలుపై ప్రభావం చూపనుంది. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున పోటీ చేసే ముఖ్య నాయకుడే లేకుండా పోయారు. ఇక్కడి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి వినోద్ టిక్కెట్ల ప్రారంభంలో వచ్చి వెళ్లారంటే, ప్రచారం ముగిసినా ఇ టువైపు తొంగి చూడలేదు. టీఆర్ఎస్తో అవగాహనతో పనిచేస్తున్న సీపీఐ నేత గుండా మల్లేశ్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌లోని గ్రూపు విభేదాలు అభ్యర్థుల గెలుపునకు ప్రతిబంధకంగా మారుతోంది. ఒక వర్గం అభ్యర్థులను ఓడించేందుకు ఆ పార్టీ శ్రేణులే కొన్ని వార్డుల్లో పనిచేస్తుండటం గమనార్హం. మంచిర్యాల : మంచిర్యాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యే గట్టి పోటీ నెలకొన్నప్పటికీ, ఆ రెండు పార్టీల ముఖ్య నాయకులతో ఆయా పార్టీ శ్రేణులకు మధ్య ఉన్న అంతరం అభ్యర్థుల గెలుపుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. టీఆర్ఎస్లో కొత్తగా చేరిన దివాకర్‌రావు కాంగ్రెస్ నుంచి వచ్చిన తన అనుచరులనే అభ్యర్థులుగా నిలపడంతో, ఆ పార్టీలో ఉన్న పాత నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అరవిందరెడ్డి ఎంపిక చేసిన అభ్యర్థులకు, ప్రేంసాగర్ వర్గీయుల సహకారం కొరవడంతో అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపుతోంది.