...కాదేదీ ప్రచారానికనర్హం!
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ... బడి, గుడి.. పార్కు, పాలకేంద్రం.. బారు, బస్టాండ్.. కాదేదీ ప్రచారానికనర్హం అంటున్నారు మన ‘మహా’నాయకులు... ఓటే ముఖ్యంగా.. గెలుపే లక్ష్యంగా ‘మీరు ఏడికెళ్తే ఆడికొస్తా ఓటరూ..’ అంటూ.. వేదిక ఏదైనా.. ఎక్కడైనా.. ప్రచార హోరుతో దూసుకుపోతున్నారు గ్రేట్..ర్ నేతలు.
సాక్షి,సిటీబ్యూరో: బల్దియా ప్రచారంలో నయా ట్రెండ్ జోరందుకుంది. వేదిక ఏదైనా సరే ప్రచార పదనిసలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నాయకగణం. పాఠశాలలు, కళాశాలలు. దేవాలయాలు, పార్కులు, పాలకేంద్రాలు, టీకొట్టు, ఇడ్లీ బండి, కూరగాయల మార్కెట్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు.
ఒకప్పటిలా గడగడపకూ వెళ్లి సంప్రదాయ పద్ధతిలో ప్రచారం చేస్తే లాభం లేదని.. ఇప్పుడు ప్రతి అడ్డానూ ప్రచారానికి వేదికగా వినియోగించుకుంటున్నారు నేతలు. దీనికి ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేదు. జెండాలు, అజెండాలు, హామీలతో పనిలేదు. ఎవరైనా.. ఎక్కడైనా.. ప్రచార ట్రెండ్ మాత్రం ఇదే. అభ్యర్థుల ఉత్సాహానికి చిన్నారులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న పాఠశాలలు సైతం ప్రచార హోరులో తడిసి ముద్దవుతున్నాయి. ఓటర్లతోపాటు వారి పిల్లలనూ ప్రభావితం చేసేందుకు చిన్నారుల చేతుల్లో కరపత్రాలు పెడుతూ.. మీ తల్లిదండ్రులను ఓటు మాకే వేయాలని చెప్పమంటున్నారు.
అంతటా అభ్యర్థులే...
మార్నింగ్ వాక్‌కు వె ళ్లే ఉద్యోగులు, వృద్ధులు, మహిళల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు ఉదయం 5 గంటల నుంచే పార్కుల వద్ద తిష్ట వేస్తున్నారు అభ్యర్థులు. ఇక ‘స్వామి కార్యం.. స్వకార్యం’ అన్నట్లు కాలనీలు, బస్తీల్లో ఉన్న దేవాలయాలు కూడా పార్టీల ప్రచారంతో సందడిగా మారుతున్నాయి. గుడికి వచ్చిపోయే వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇక్కడా మకాం వేస్తున్నారు. దైవ సాక్షిగా మీ ఓటు మాకే అంటూ భక్తులతో చేతిలో చేయి వేయించుకుంటున్నారు.
ఇక టీకొట్టు, టిఫిన్ బండి, కిరాణా దుకాణాల వద్దకు వచ్చిపోయే వారి చేతిలో కరపత్రం పెట్టి.. వంగి, వంగి దండాలు పెడుతున్నారు. గడ్డాలు, చేతులు పట్టుకొని బతిమిలాడుతున్నారు. ‘మీరు ఏడికెళ్తే ఆడికొస్తాం.. మీ ఓటు మాత్రం మాకే సుమా’ అంటూ సెలవిస్తున్న అభ్యర్థులను చూసి ఓటర్లు విస్తుపోతున్నారు. బార్లకు వచ్చే మందుబాబులకు మందు, విందులతో పసందు చేస్తూ వారి ఓట్లనూ ఒడిసి పట్టేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. బార్లలో ‘మీ ఓటు ఎవరికి..?’ అన్నదే టేబుల్ అజెండాగా మారుతోంది ఇప్పుడు.
ఇక దీనికి ఇంటింటీ ప్రచారం అదనం. ఇన్ని రకాలుగా ప్రచారం చేసినా ఓటర్లు తమ వైపు ఉంటారో లేదో తెలియక అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ చూసినా ‘మీ ఓటు ఎవరికి..?’ అన్నదే హాట్ టాపిక్‌గా మారింది. ‘ఎవరికి ఓటేస్తే మాకేంటీ లాభమం’టూ జనం బేరీజు వేసుకుంటున్నారు. గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు జెండా, అజెండా మార్చేసుకొని ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలవడంతో.. గతంలో వారు చేసిన అభివృద్ధి, స్పందించిన తీరుపై ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ఫీట్లు చేస్తున్న అభ్యర్థులు వారి అంతరంగం తెలియక తికమకపడుతున్నారు.