48 గంటలు
సాక్షి, సిటీబ్యూరో: టిక్...టిక్...టిక్... మరో 48 గంటలు. ఇదీ గ్రేటర్ ఎన్నికలకు మిగిలిన సమయం. 150 డివిజన్‌లలో వెయ్యికి పైగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటరు మహాశయుడి తీర్పు కోసం ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. సగటు ఓటరును తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారం శనివారం నాటికి కీలక దశకు చేరుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు... తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఆదివారం ఒక్కరోజే మిగిలి ఉంది. దీంతో అభ్యర్ధులు ఇంటింటి ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు.
మొత్తంగా బస్తీలను, కాలనీలను తమకు అనుకూలంగా మలచుకొని గంపగుత్తగా ఓట్లను కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా మహిళా సంఘాలపైదృష్టి సారించాయి. మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకుంటే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు సభలు, సమావేశాలు, రోడ్ షోలలో నిమగ్నమైన నాయకులు ప్రస్తుతం పూర్తిగా మహిళా సంఘాలను, బస్తీ, కాలనీ సంఘాలను, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లను కలవడంలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి వరకూ మంతనాలు సాగిస్తున్నారు.
ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. నిన్నటి వరకు పాటలు, నినాదాలు, కరపత్రాలు, మైకులతో హోరెత్తిన ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఫలానా పార్టీ వాళ్లు వచ్చి వెళ్లారని తెలియగానే ప్రత్యర్ధి పార్టీ నాయకులు అదే బస్తీకి పరుగులు తీస్తున్నారు. దీంతో రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా బస్తీల్లో వాహనాలు పరుగులు తీస్తున్నాయి. మరోవైపు ఒక్కొక్క ఓటరును కలవడం కంటే సంఘాలను కలిసి తమవైపు తిప్పుకోవడం పైనే నాయకులు ప్రధానంగా దృష్టి సారించారు.
పోటా పోటీ...
నిన్న మొన్నటి వరకు పార్టీలు.. అభ్యర్థులు తమను తాము అభివృద్ధికి పర్యాయపదంగా నిర్వచించుకున్నారు. ఒక్కో డివిజన్‌లో పోటీకి దిగిన ముగ్గురు, నలుగురు అభ్యర్ధులు ఆ డివిజన్‌లోని ప్రతి పనిని తామే చేశామంటూ బీరాలు పలికారు. ఒకవైపు అభివృద్ధి చేశామని చెబుతూనే మరోవైపు తమను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని పోటాపోటీగా హామీల వర్షం గుప్పించారు. ఎన్నికల గడువు సమీపించడంతో బస్తీలు, కాలనీ నాయకుల చేతుల్లోనే తమ భవితవ్యం ఉందంటూ బేరసారాలు మొదలెట్టారు. శనివారం నుంచి ఈ దిశగా ప్రచారం మలుపు తిరిగింది. డబ్బు, మద్యం పంపిణీ మొదలైంది.
గెలుపు ఎవరిదో....
మహానగర ఓటర్లు గత వారం, పది రోజులుగా అన్ని రాజకీయ పార్టీల మాటలు విన్నారు. నేతల హామీలు తెలుసుకున్నారు. అభ్యర్ధుల ఆకర్షణలు,తాయిలాలు తెలిశాయి. గుంభనంగా కనిపిస్తున్న సగటు ఓటర్లు తమవిలువైన ఓటు అస్త్రాన్ని సంధించే సమయం ఆసన్నమైంది. వారి ఆశీస్సులు ఎవరిని లభిస్తాయనే ఉత్కంఠ మొదలైంది.