leaders of political parties
-
48 గంటలు
సాక్షి, సిటీబ్యూరో: టిక్...టిక్...టిక్... మరో 48 గంటలు. ఇదీ గ్రేటర్ ఎన్నికలకు మిగిలిన సమయం. 150 డివిజన్లలో వెయ్యికి పైగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటరు మహాశయుడి తీర్పు కోసం ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. సగటు ఓటరును తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారం శనివారం నాటికి కీలక దశకు చేరుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు... తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఆదివారం ఒక్కరోజే మిగిలి ఉంది. దీంతో అభ్యర్ధులు ఇంటింటి ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. మొత్తంగా బస్తీలను, కాలనీలను తమకు అనుకూలంగా మలచుకొని గంపగుత్తగా ఓట్లను కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా మహిళా సంఘాలపైదృష్టి సారించాయి. మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకుంటే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు సభలు, సమావేశాలు, రోడ్ షోలలో నిమగ్నమైన నాయకులు ప్రస్తుతం పూర్తిగా మహిళా సంఘాలను, బస్తీ, కాలనీ సంఘాలను, అపార్ట్మెంట్ అసోసియేషన్లను కలవడంలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి వరకూ మంతనాలు సాగిస్తున్నారు. ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. నిన్నటి వరకు పాటలు, నినాదాలు, కరపత్రాలు, మైకులతో హోరెత్తిన ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఫలానా పార్టీ వాళ్లు వచ్చి వెళ్లారని తెలియగానే ప్రత్యర్ధి పార్టీ నాయకులు అదే బస్తీకి పరుగులు తీస్తున్నారు. దీంతో రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా బస్తీల్లో వాహనాలు పరుగులు తీస్తున్నాయి. మరోవైపు ఒక్కొక్క ఓటరును కలవడం కంటే సంఘాలను కలిసి తమవైపు తిప్పుకోవడం పైనే నాయకులు ప్రధానంగా దృష్టి సారించారు. పోటా పోటీ... నిన్న మొన్నటి వరకు పార్టీలు.. అభ్యర్థులు తమను తాము అభివృద్ధికి పర్యాయపదంగా నిర్వచించుకున్నారు. ఒక్కో డివిజన్లో పోటీకి దిగిన ముగ్గురు, నలుగురు అభ్యర్ధులు ఆ డివిజన్లోని ప్రతి పనిని తామే చేశామంటూ బీరాలు పలికారు. ఒకవైపు అభివృద్ధి చేశామని చెబుతూనే మరోవైపు తమను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని పోటాపోటీగా హామీల వర్షం గుప్పించారు. ఎన్నికల గడువు సమీపించడంతో బస్తీలు, కాలనీ నాయకుల చేతుల్లోనే తమ భవితవ్యం ఉందంటూ బేరసారాలు మొదలెట్టారు. శనివారం నుంచి ఈ దిశగా ప్రచారం మలుపు తిరిగింది. డబ్బు, మద్యం పంపిణీ మొదలైంది. గెలుపు ఎవరిదో.... మహానగర ఓటర్లు గత వారం, పది రోజులుగా అన్ని రాజకీయ పార్టీల మాటలు విన్నారు. నేతల హామీలు తెలుసుకున్నారు. అభ్యర్ధుల ఆకర్షణలు,తాయిలాలు తెలిశాయి. గుంభనంగా కనిపిస్తున్న సగటు ఓటర్లు తమవిలువైన ఓటు అస్త్రాన్ని సంధించే సమయం ఆసన్నమైంది. వారి ఆశీస్సులు ఎవరిని లభిస్తాయనే ఉత్కంఠ మొదలైంది. -
చంద్రబాబు తప్పించుకోలేరు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు సాక్ష్యాధారాలతో సహా పక్కాగా దొరికారు, తప్పించుకోలేరు.. ఇప్పుడు చట్టం సక్రమంగా పనిచేస్తే ప్రజాస్వామ్య విలువ మరింత పెరుగుతుందని పలు రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ‘పౌరస్పందన వేదిక’ కొలనుకొండ శివాజీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఓటుకు కోట్లు’ చర్చావేదిక కార్యక్రమానికి హాజరై వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. బీజేపీ, టీడీపీ నాయకులు మినహా ఇతర రాజకీయ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ... చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ జరిగిందంటున్నారు కానీ, తాను ఫోన్ చేయలేదని చెప్పడం లేదన్నారు. ఆయన తక్షణం రాజీనామా చేసి నిర్దోషిత్వం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు సాక్ష్యాలతో దొరికినప్పటికీ ఎలాగైనా తప్పించుకుంటాననే ధీమాతో ఉన్నారన్నారు. కేంద్రం కాళ్లుపట్టుకొని, కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా బాబు తప్పుచేశారని అనడం లేదని, సర్దుకుపోవాలని సీఎంలకు చెబుతున్నారన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన ఓటుకుకోట్లు కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదాలో ఉన్న పరకాల ప్రభాకర్ ఖండించడాన్ని తప్పుపట్టారు. ఇది ఆత్మరక్షణ చర్యని అర్థమైందన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ మాట్లాడుతూ...చంద్రబాబు కేసు నీతికి-అవినీతికి సంబంధించినదని, ఇందులో మరే ఆలోచనా అవసరం లేదన్నారు. సీపీఎం కార్యవర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ తన తీరు మార్చుకుని బాబుపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్చా కార్యక్రమంలో ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు పోతిన వెంకటరామారావు, లోక్‌సత్తా రాష్ట్ర నాయకుడు సి.వి.ఎస్.వర్మ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలు సంఘాల మహిళా నేతలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్ళో?
- పదవులు చేపట్టే దెప్పుడో? - ఆత్రంగా ఎదురుచూస్తున్న విజేతలు - పీఠం ఎవరికి దక్కుతుందోనన్న సందిగ్ధం - సమీకరణాల్లో రాజకీయ పార్టీల నేతలు - అసెంబ్లీ తర్వాతే మున్సిపల్, పరిషత్తు పీఠాలు సాక్షి, గుంటూరు: మునిసిపల్, పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపూ జరిగిపోయింది. విజేతలెవరో తెలిసిపోయింది. కానీ కుర్చీ దక్కేదెవరికన్న సందేహం ఇంకా వెన్నాడుతోంది. గెలిచామన్న సంతోషం కంటే పదవుల్లో అధిష్టించేదెపుడనే ఆత్రం అందరిలోనూ కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరిగినా ఓట్ల లెక్కింపులోనూ జాప్యం జరగడం... తీరా ఫలితాలు వెల్లడైనా పదవులు చేపట్టేందుకు ఏవో అడ్డంకులు. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తరువాతనే ఈ పీఠాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో ఆ రోజుకోసం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ తేదీ ప్రకటించడం, అసెంబ్లీ ఎప్పుడు జరుగుతుందో ఇంకా వెల్లడి కాకపోవడంతో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ లోగా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కూడా లేకపోలేదు. క్యాంపుల్లో అభ్యర్థులు అధ్యక్ష స్థానాల్లో ఎవరిని కూచోబెట్టాలనే దానిపై రాజకీయ పార్టీల నేతలు సమీకరణ ల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు క్యాంపుల పేరుతో జిల్లాలోని కొన్ని మండలాల్లో గెలుపొందిన వారు జిల్లా కేంద్రంలోగల ప్రైవేటు గెస్ట్‌హౌస్‌ల్లో బస చేస్తున్నారు. మరికొందరు జిల్లాల సరిహద్దులు దాటి సేద తీరుతున్నారు. అయితే ఎన్నాళ్ళు క్యాంపులు నిర్వహించాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆటవిడుపు కోసం క్యాంపులు ఏర్పాటు చేసిన వారు ఆర్థిక భారం తట్టుకోలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలకు తొమ్మిదేళ్ళ అనంతరం ఎన్నికలు నిర్వహించారు. ఫలితాలు వెల్లడైనా పీఠాలు అధిష్టించడంలో జాప్యంపై నిరుత్సాహంలో ఉన్నారు.మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు వేసే వీలుంది. పాలకవర్గం ఎన్నుకోవడంలో వీరికి ఓటు హక్కు కల్పించడంతో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ముందుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది. అంతవరకూ ఎలా వీరిని కట్టడిచేయాలన్నదే వారి ఆందోళన. జాప్యంపై టీడీపీలోనే ఆందోళన జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో టీడీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఒక్క తాడేపల్లి వైఎస్సార్సీపీ పరమైంది. గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠంపై కొన్ని చోట్ల టీడీపీలోనే అంతర్గత వివాదాలు నడిచాయి. ఈ పంచాయతీలు పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్ళాయి. మంగళగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరనే విషయంలో సమస్య తలెత్తింది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన గంజి చిరంజీవికే ఇవ్వాలని బాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ సీపీఐ, సీపీఎం చెరో మూడు వార్డులు గెలుచుకోవడం, వైఎస్సార్ సీపీకి మద్దతిచ్చే అంశంలో చర్చలు జరగడంతో టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకునే విషయంలో ఓటు ఉండటంతో ఎంపీగా గెలుపొందిన గల్లా జయదేవ్‌ను ఓటు మంగళగిరిలో వినియోగించుకోవాలని టీడీపీ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే చిరంజీవికి ముగ్గురు పిల్లలున్నారని, నామినేషన్ సమయంలో మేనేజ్ చేసి పోటీ చేసి గెలుపొందారని సొంత వర్గం వారే చెబుతున్నారు. చిరంజీవి పదవికి అనర్హుడని, కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు స్థానికులు కొందరు ఉద్యుక్తులవుతున్నారు. అయితే ముందు జాగ్రత్తగా చిరంజీవి కేవియేట్ దాఖలు చేయడం గమనార్హం. పరిషత్తుల విషయానికొస్తే జిల్లాలో సగానికి పైగా మండలాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు క్యాంపులు నడుపుతున్నాయి. హంగ్ ఏర్పడిన మండలాల్లోనూ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఏది ఏమైనా పీఠాలు ఎక్కేదెప్పుడోనని ‘స్థానిక’ నేతలకు ఎన్నాళ్ళు ఎదురు చూపులుంటాయో.. వేచి చూడాల్సిందే. -
తుపాకీ రాయుళ్లు
ఆయుధాలు అప్పగించని నేతలు నిబంధనలు ఖాతరు చేయని లెసైన్స్‌దారులు పట్టించుకోని పోలీసు అధికారులు ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయుధాలు పొందిన చాలా మంది రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల సమయంలో వాటిని పోలీసు శాఖకు అప్పగించాలనే విషయాన్ని మరిచిపోతున్నారు. 2014 ఫిబ్రవరి ఆఖరు వరకు జిల్లాలో 313 ఆయుధ లెసైన్స్‌లు ఉన్నాయి. వీటిలో 74 బ్యాంకులకు ఇచ్చినవి కాగా.. 239 ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినవి ఉన్నాయి. ఆయుధ లెసైన్స్‌లు ఎక్కువగా రాజకీయ పార్టీల నేతలకే ఇచ్చారు. వీరిలోనూ అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నారు. ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చిన లెసైన్స్‌లతో ఆయుధాలను పొందినవారు ఎన్నికల నియమావళి అమల్లోకి రాగానే పోలీసు శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటికి 168 ఆయుధాలను మాత్రమే లెసైన్స్‌దారులు పోలీసు శాఖకు అప్పగించినట్లు తెలిసింది. కచ్చితంగా ఎంతమంది అప్పగించలేదనే సమాచారాన్ని ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తున్న అధికారులు వెల్లడించడం లేదు. బుధవారం ఈ అంశంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగినా గణాంకాలను ప్రకటించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన వెంటనే ఆయుధాలను అప్పగించాల్సిన నేతలు, ఇతర బడా వ్యక్తులు... పోలింగ్ దగ్గరపడుతున్నా అప్పగించకపోవడం పోలీసు, జిల్లా యంత్రాంగం నిర్లిప్తతకు నిదర్శనంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్యంగా ఇటీవలి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ ఆయుధాలను వెంటబెట్టుకుని తిరుగుతున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన వెంటనే ఆయుధాలను పోలీస్ స్టేషన్లో అప్పగించి.. పోలింగ్ ప్రక్రియ ముగిసి నియమావళి గడువు తీరిన తర్వాత మళ్లీ ఆయుధాలను తీసుకోవాలి. ఆయుధాలు ఉన్న రాజకీయ పార్టీల నేతలు మాత్రం ఈ నిబంధనలు పట్టించుకోవడం లేదు. ఆయుధాలను తెచ్చుకోవడంలో రాజకీయ బలం ఉపయోగించే వారు వాటిని అప్పగించే విషయంలోనూ ఇదే అస్త్రాన్ని వాడుకుంటున్నారు. జిల్లాలోని రెండుమూడు పోలీస్ స్టేషన్లతో తప్పితే తుపాకీరాయుళ్లు ఎక్కడా పూర్తి స్థాయిలో ఆయుధాలను అప్పగించ లేదు. మనోళ్లకు మోజెక్కువ... కొత్తగా వస్తున్న సినిమాల ప్రభావమో ఏమోగానీ జిల్లాలోని రాజకీయ పార్టీల నేతలకు, బడా వ్యాపారులకు ఆయుధాలపై వ్యామోహం ఒకింత ఎక్కువగానే ఉంది. చోటమోటా నేత అధికారికంగా సొంత ఆయుధం ఉండడం అనేది జిల్లాలో సహజమైపోయింది. నాయకులను చూసి పలువురు కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు ఆయుధంపై మోజు కలిగినట్లుంది. వ్యక్తిగతంగా తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఫిర్యాదు చేయడం.. ప్రభుత్వ పెద్దల సిఫారసుతో దరఖాస్తు చేసుకోవడం.. ఆయుధం రావడం, అందరికీ కనిపించేలా పెట్టుకోవడం రివాజుగా మారింది. మావోయిస్టు ఉద్యమం తగ్గుముఖం పట్టిందని చెబుతున్న ప్రభుత్వ యంత్రాంగమే... ఆత్మరక్షణ కోసం ఆయుధ లెసైన్స్‌లు ఇస్తూ పోతుండడంపై విమర్శలు వస్తున్నాయి.