ఆయుధాలు అప్పగించని నేతలు
నిబంధనలు ఖాతరు చేయని లెసైన్స్‌దారులు
పట్టించుకోని పోలీసు అధికారులు
ఎన్నికల్లో శాంతిభద్రతలకు
విఘాతం కలిగే ప్రమాదం
సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయుధాలు పొందిన చాలా మంది రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల సమయంలో వాటిని పోలీసు శాఖకు అప్పగించాలనే విషయాన్ని మరిచిపోతున్నారు. 2014 ఫిబ్రవరి ఆఖరు వరకు జిల్లాలో 313 ఆయుధ లెసైన్స్‌లు ఉన్నాయి. వీటిలో 74 బ్యాంకులకు ఇచ్చినవి కాగా.. 239 ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినవి ఉన్నాయి. ఆయుధ లెసైన్స్‌లు ఎక్కువగా రాజకీయ పార్టీల నేతలకే ఇచ్చారు. వీరిలోనూ అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నారు. ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చిన లెసైన్స్‌లతో ఆయుధాలను పొందినవారు ఎన్నికల నియమావళి అమల్లోకి రాగానే పోలీసు శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటికి 168 ఆయుధాలను మాత్రమే లెసైన్స్‌దారులు పోలీసు శాఖకు అప్పగించినట్లు తెలిసింది. కచ్చితంగా ఎంతమంది అప్పగించలేదనే సమాచారాన్ని ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తున్న అధికారులు వెల్లడించడం లేదు. బుధవారం ఈ అంశంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగినా గణాంకాలను ప్రకటించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన వెంటనే ఆయుధాలను అప్పగించాల్సిన నేతలు, ఇతర బడా వ్యక్తులు... పోలింగ్ దగ్గరపడుతున్నా అప్పగించకపోవడం పోలీసు, జిల్లా యంత్రాంగం నిర్లిప్తతకు నిదర్శనంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్యంగా ఇటీవలి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ ఆయుధాలను వెంటబెట్టుకుని తిరుగుతున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన వెంటనే ఆయుధాలను పోలీస్ స్టేషన్‌లో అప్పగించి.. పోలింగ్ ప్రక్రియ ముగిసి నియమావళి గడువు తీరిన తర్వాత మళ్లీ ఆయుధాలను తీసుకోవాలి. ఆయుధాలు ఉన్న రాజకీయ పార్టీల నేతలు మాత్రం ఈ నిబంధనలు పట్టించుకోవడం లేదు. ఆయుధాలను తెచ్చుకోవడంలో రాజకీయ బలం ఉపయోగించే వారు వాటిని అప్పగించే విషయంలోనూ ఇదే అస్త్రాన్ని వాడుకుంటున్నారు. జిల్లాలోని రెండుమూడు పోలీస్ స్టేషన్లతో తప్పితే తుపాకీరాయుళ్లు ఎక్కడా పూర్తి స్థాయిలో ఆయుధాలను అప్పగించ లేదు.
మనోళ్లకు మోజెక్కువ...
కొత్తగా వస్తున్న సినిమాల ప్రభావమో ఏమోగానీ జిల్లాలోని రాజకీయ పార్టీల నేతలకు, బడా వ్యాపారులకు ఆయుధాలపై వ్యామోహం ఒకింత ఎక్కువగానే ఉంది. చోటమోటా నేత అధికారికంగా సొంత ఆయుధం ఉండడం అనేది జిల్లాలో సహజమైపోయింది. నాయకులను చూసి పలువురు కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు ఆయుధంపై మోజు కలిగినట్లుంది. వ్యక్తిగతంగా తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఫిర్యాదు చేయడం.. ప్రభుత్వ పెద్దల సిఫారసుతో దరఖాస్తు చేసుకోవడం.. ఆయుధం రావడం, అందరికీ కనిపించేలా పెట్టుకోవడం రివాజుగా మారింది. మావోయిస్టు ఉద్యమం తగ్గుముఖం పట్టిందని చెబుతున్న ప్రభుత్వ యంత్రాంగమే... ఆత్మరక్షణ కోసం ఆయుధ లెసైన్స్‌లు ఇస్తూ పోతుండడంపై విమర్శలు వస్తున్నాయి.
తుపాకీ రాయుళ్లు
Published Thu, Mar 20 2014 3:09 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement