సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు
వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ
జైళ్లలో ఖైదీలపైనా ప్రత్యేక నిఘా
ములాఖత్‌లు రద్దు
ఏపీలో 14,141 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ సన్నద్ధమవుతున్నది. ప్రధానంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్ (ఈసీ) మార్గదర్శకాలను పాటిస్తూ కార్యాచరణను ఖరారు చేసింది. ప్రస్తుతం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే 14,141 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు పోలీస్ శాఖ గుర్తించింది.
ప్రస్తుతం.. 46,165 పోలింగ్ కేంద్రాలు.. మరో 887 కేంద్రాలకు ప్రతిపాదనలు..
2024 సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే 46,165 పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. అదనంగా మరో 887 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రతిపాదనలను పంపారు. దీనిపై ఈసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే 14,141 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించారు.
ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రానికి చెందిన 1,14,950మంది సివిల్ పోలీసులు, 52 కంపెనీల రాష్ట్ర సాయుధ బలగాలతోపాటు అదనంగా 491 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను నియోగించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో భద్రతా విధుల్లో నియోగించాలని నిర్ణయించారు. ఇక 14,141 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్‌ను నిశితంగా పర్యవేక్షిస్తారు.
ఇక ఒక మైక్రో అబ్జర్వర్‌ను ఆ పోలింగ్ కేంద్రాల్లో ఒక మైక్రో అబ్జర్వర్‌ను కూడా నియమించాలని ఈసీ నిర్ణయించింది. ఆ పోలింగ్ కేంద్రాల పరిధిలో రాష్ట్ర పోలీసు, కేంద్ర సాయుధ బలగాలు క్రమం తప్పకుండా తరచూ కవాతు నిర్వహిస్తాయి. ఆ పరిధిలో పెండింగ్ నాన్‌బెయిలబుల్ వారంట్లను త్వరితగతిన జారీ చేయాలని ఇప్పటికే ఆదేశించింది.
గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన, ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్నవారి కదలికలపై నిఘాను పటిష్టపరిచారు. జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఎప్పటికప్పుడు బందోబస్తు, నిఘా చర్యలను పర్యవేక్షిస్తూ ఎన్నికల ప్రధాన అధికారికి నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు.
జైళ్లలోనూ నిఘా పటిష్టం..
జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లోని జైళ్లను తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది. జైళ్ల మాన్యువల్ సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఇక గతంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం జైళ్లలో ఉన్న ఖైదీలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇప్పటికే అటువంటి ఖైదీలకు ములాఖత్‌లు రద్దు చేశారు. ఎన్నికలు ముగిసేవరకు ఖైదీలను ఒక జైలు నుంచి మరో జైలుకు తరలించకూడదని నిర్ణయించారు. న్యాయస్థానం ఆదేశాలు ఉంటే తప్పా ఖైదీలను ఇతర జైళ్లకు తరలించ వద్దని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment