రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న అంబటి రాంబాబు. చిత్రంలో ఉండవల్లి అరుణ్‌కుమార్, కె.రామకృష్ణ, దేవినేని నెహ్రూ తదితరులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు సాక్ష్యాధారాలతో సహా పక్కాగా దొరికారు, తప్పించుకోలేరు.. ఇప్పుడు చట్టం సక్రమంగా పనిచేస్తే ప్రజాస్వామ్య విలువ మరింత పెరుగుతుందని పలు రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ‘పౌరస్పందన వేదిక’ కొలనుకొండ శివాజీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఓటుకు కోట్లు’ చర్చావేదిక కార్యక్రమానికి హాజరై వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. బీజేపీ, టీడీపీ నాయకులు మినహా ఇతర రాజకీయ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ... చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ జరిగిందంటున్నారు కానీ, తాను ఫోన్ చేయలేదని చెప్పడం లేదన్నారు. ఆయన తక్షణం రాజీనామా చేసి నిర్దోషిత్వం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు సాక్ష్యాలతో దొరికినప్పటికీ ఎలాగైనా తప్పించుకుంటాననే ధీమాతో ఉన్నారన్నారు. కేంద్రం కాళ్లుపట్టుకొని, కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోందని చెప్పారు.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా బాబు తప్పుచేశారని అనడం లేదని, సర్దుకుపోవాలని సీఎంలకు చెబుతున్నారన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన ఓటుకుకోట్లు కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదాలో ఉన్న పరకాల ప్రభాకర్ ఖండించడాన్ని తప్పుపట్టారు. ఇది ఆత్మరక్షణ చర్యని అర్థమైందన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ మాట్లాడుతూ...చంద్రబాబు కేసు నీతికి-అవినీతికి సంబంధించినదని, ఇందులో మరే ఆలోచనా అవసరం లేదన్నారు.
సీపీఎం కార్యవర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ తన తీరు మార్చుకుని బాబుపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్చా కార్యక్రమంలో ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు పోతిన వెంకటరామారావు, లోక్‌సత్తా రాష్ట్ర నాయకుడు సి.వి.ఎస్.వర్మ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలు సంఘాల మహిళా నేతలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.