Vijayawada press club
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా విశాల ఉద్యమం నిర్మించాలని సదస్సు పిలుపునిచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో విస్తృతంగా సంతకాలు సేకరించి బడ్జెట్ సమావేశాల నాటికి పార్లమెంటుకు కోటి సంతకాలు పంపాలని సదస్సు తీర్మానించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఉక్కు పరిశ్రమ పరిరక్షణే ధ్యేయంగా కోటి సంతకాల సేకరణ, జిల్లా వ్యాప్త సదస్సులు, భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించాలని సదస్సులో తీర్మానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కె.ఎం. శ్రీనివాస్, ఆదినారాయణ మాట్లాడారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి, సీపీఎం పశ్చిమ కృష్ణా కార్యదర్శి డి.వి.కృష్ణ, కె.పోలారి (ఇఫ్టూ), నరహరశెట్టి నరసింహారావు, పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ జి.ఓబులేసు, సీఐటీయూ నాయకులు పి.అజయ్‌కుమార్, ఎం.వి.సుధాకర్, ఎ.వెంకటేశ్వరరావు, టి.తాతయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమర జవాన్ల కోసం 'స్టాండ్ ఫర్ ద నేషన్'
సాక్షి, విజయవాడ: ఆసరా సంస్థ ఆధ్వర్యంలో 'స్టాండ్ ఫర్ ద నేషన్' బ్రోచర్ ఆవిష్కరణ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగింది. విజయవాడ వినియోగదారుల (కన్జ్యూమర్) ఫోరమ్ జడ్జి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పుల్వామా దాడిలో అమరులైన 40 మంది సైనికులకోసం ఆసరా సంస్థ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. రాబోయే ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3 గంటల15 నిమిషాలకు అమరులైన జవాన్ల కోసం నివాళిగా స్టాండ్ ఫర్ ద నేషన్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టనుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఆసరా ద్వారా ఢిల్లీ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వినియోగదారులకు అందించిన సేవలు మరువలేనివని మాధవరావు ప్రశంసించారు. చట్టం గురించి తెలియని వారి కోసం.. ఆసరా సంస్థ సభ్యులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. -
‘అలా చేస్తే నవరత్నాలకు ఆర్ధిక భారం తగ్గుతుంది’
సాక్షి, విజయవాడ : చిత్తూరులోని కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులను స్వాగతిస్తున్నామని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏపీ మూఢనమ్మకాల నిర్మూలనా చట్ట సాధన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిబాబ, కర్నూలు బాల సాయిబాబ ఆశ్రమాలపై కూడా ఇలాంటి దాడులు చేయించాలని సీఎంను కోరుతున్నామన్నారు. ఇటువంటి దాడుల వల్ల జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలకు ఆర్ధికంగా భారం తగ్గుతుందని సూచించారు. ఆధునిక కాలంలో కూడా ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతున్నారని, ప్రకాశం, విశాఖ, తెలంగాణలలో జరిగిన ఉదంతాలే ఇందుకు నిదర్శమన్నారు. సమాజంలోని దొంగబాబాలను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో 51a ఆర్టికల్‌లో అశాస్త్రీయ విధానాలను ప్రశ్నించాలని స్పష్టంగా ఉందంటూ.. ఏపీలో మూఢనమ్మకాల నిర్మూలనా చట్టం తీసుకురావాలని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించినవారిని అరెస్ట్ చేయాలి
సాక్షి, విజయవాడ: తాడికొండ ఎమ్మెల్యే,దళిత నాయకురాలు ఉండవల్లి శ్రీదేవిని వినాయక చవితి వేడుకల సందర్భంగా ఘోరంగా అవమానించిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం దళిత సంఘాల నేతలు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళ్ళం భాగ్యరావు మాట్లాడుతూ.. ఏపీ రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేపై అగ్రవర్ణ కుల అహంకారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇది కుల వివక్షకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. 40 శాతం దళితులు ఉన్న రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేకే రక్షణ కరువైందని.. ఇక అక్కడ ఉండే దళిత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెట్పీటీసీ నేతలకు రక్షణ ఎక్కడుంది అని ఎద్దేవా చేశారు. ఒక మహిళా ఎమ్మెల్యే, దళిత నాయకులు, డాక్టరైన ఆమెను గౌరవించకుండా కులం పేరుతో దూషించడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యపై సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకోవాలని అన్నారు. దళితులపై ఎటువంటి వివక్ష చూపని ఎట్రాసిటీ ప్రో గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఈ సందర్బంగా భాగ్యరావు కోరారు. గతంలో టీడీపీ నాయకులు, సొంత పార్టీకి చెందిన దళిత నాయకుడిని అవమానించారని గుర్తు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. కులవివక్ష వ్యతిరేక ప్రచార సంఘం అధ్యక్షులు పరిశపోగు రాజేష్ మాట్లాడుతూ.. దళిత మహిళ, శాసన సభ్యురాలైన శ్రీదేవిపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. కులం పేరుతో దూషించి, ఉన్మాదం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే అన్ని దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మైనార్టీ నాయకులు ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణేది? అని ఆవేదన వ్యక్తం చేశారు. కుల అహంకారంతో పెట్రేగిపోతున్న వారి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. -
చంద్రబాబు తప్పించుకోలేరు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు సాక్ష్యాధారాలతో సహా పక్కాగా దొరికారు, తప్పించుకోలేరు.. ఇప్పుడు చట్టం సక్రమంగా పనిచేస్తే ప్రజాస్వామ్య విలువ మరింత పెరుగుతుందని పలు రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ‘పౌరస్పందన వేదిక’ కొలనుకొండ శివాజీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఓటుకు కోట్లు’ చర్చావేదిక కార్యక్రమానికి హాజరై వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. బీజేపీ, టీడీపీ నాయకులు మినహా ఇతర రాజకీయ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ... చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ జరిగిందంటున్నారు కానీ, తాను ఫోన్ చేయలేదని చెప్పడం లేదన్నారు. ఆయన తక్షణం రాజీనామా చేసి నిర్దోషిత్వం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు సాక్ష్యాలతో దొరికినప్పటికీ ఎలాగైనా తప్పించుకుంటాననే ధీమాతో ఉన్నారన్నారు. కేంద్రం కాళ్లుపట్టుకొని, కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా బాబు తప్పుచేశారని అనడం లేదని, సర్దుకుపోవాలని సీఎంలకు చెబుతున్నారన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన ఓటుకుకోట్లు కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదాలో ఉన్న పరకాల ప్రభాకర్ ఖండించడాన్ని తప్పుపట్టారు. ఇది ఆత్మరక్షణ చర్యని అర్థమైందన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ మాట్లాడుతూ...చంద్రబాబు కేసు నీతికి-అవినీతికి సంబంధించినదని, ఇందులో మరే ఆలోచనా అవసరం లేదన్నారు. సీపీఎం కార్యవర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ తన తీరు మార్చుకుని బాబుపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్చా కార్యక్రమంలో ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు పోతిన వెంకటరామారావు, లోక్‌సత్తా రాష్ట్ర నాయకుడు సి.వి.ఎస్.వర్మ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలు సంఘాల మహిళా నేతలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బాబు జమానాలో దళితులకు దగా
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దళితులను దగా చేస్తోందని, ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ‘ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు’ అనే అంశంపై శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో చర్చా వేదికను నిర్వహించారు. ఈ వేదికకు అధ్యక్షత వహించిన నాగార్జున..మాట్లాడుతూ సీఎంగా బాబు 7 నెలల పాలనాకాలంలో దళితులను నిర్లక్ష్యం చేశారన్నారు. దివంగత వైఎస్ హయాంలో ఎస్సీ, ఎస్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఉద్యమించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంటారన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేకంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని చర్చా వేదికలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజు డిమాండ్ చేశారు. 50 ఏళ్లయినా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కావడం లేదని తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఏపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశరావు ఆవేదన వ్యక్తం చేశారు.