సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ అభ్యర్థిత్వాల ఖరారు చివరి దశకు చేరుకున్నా ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి ఎంపిక విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేయనున్న ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను ఖరారు చేసేందుకు అధిష్టానం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఏకాభిప్రాయానికి వచ్చిన తెలంగాణలోని ఎనిమిది ఎంపీ స్థానాలు, 60 ఎమ్మెల్యే స్థానాలను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. గోండు సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ ఈ టిక్కెట్‌ను ఆశిస్తున్న వారిలో లంబాడా సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఎక్కువ ఉన్నారు. దీంతో ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ఎంపీ స్థానాలు గిరిజనులకు రిజర్వు అయ్యాయి. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ కేంద్ర మంత్రి బల్‌రాంనాయక్ పేరు దాదాపు ఖరారైంది. ఆయన లంబాడా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. టిక్కెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గోండు వర్గానికి కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
ఈ మేరకు ఆ సామాజిక వర్గానికి చెందిన ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బరిలో ఉంటారని జిల్లాలోని పార్టీ శ్రేణులు భావించాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదిత జాబితాలో కూడా ఎంపీ స్థానానికి సక్కు పేరును ప్రస్తావించారు. ఏఐసీసీ సభ్యులుగా కూడా సక్కు పేరును సిఫార్సు చేశారు. కానీ తాను ఎంపీగా పోటీ చేయనని సక్కు ప్రకటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగానే బరిలోకి దిగుతానని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల, ఉత్తం కుమార్‌రెడ్డిలతోపాటు ఏఐసీసీ కార్యదర్శి కుంతియా దృష్టికి తీసుకెళ్లారు.
టీఆర్‌ఎస్ కూడా..
టీఆర్‌ఎస్ కూడా ఎంపీ స్థానానికి గోండు సామాజిక వర్గానికి చెందిన గోడం నగేష్‌ను బరిలోకి దించాలనే నిర్ణయానికి వచ్చింది. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఆయనకు టిక్కెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంది. తాను ఎంపీగా పోటీ చేయాలా? బోథ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలా? అని నగేష్ తేల్చుకోలేకపోతున్నారు. మొదట్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం కాంగ్రెస్ టిక్కెట్ కోసం సోయం బాపూరావు కూడా తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. మహారాష్ట్రకు చెందిన యువజన కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాజీవ్‌షా ద్వారా పార్టీ అధిష్టానం పెద్దలను కలిశారు. కానీ ఆశించిన మేరకు ఫలితం కనిపించకపోవడంతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, ఇటీవల టీడీపీ గూటికి చేరిన విషయం విధితమే. ఎంపీ రాథోడ్ రమేష్ ఏదైనా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన పక్షంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఈ గోండు సామాజిక వర్గానికి చెందిన సోయం బాపురావును నిలపాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.
అనిశ్చితి
Published Fri, Mar 28 2014 3:32 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement