Balram Naik
-
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఈసీ అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. చట్టసభల ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్.. నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో ఆయనపై అనర్హతా వేటు పడింది. దీంతో ఆయన మూడేళ్లపాటు పార్లమెంట్ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్లు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది. -
‘పెద్దల’ బరిలో మనోళ్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పెద్దల సభకు జరగనున్న పోరులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు బరిలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల తరఫున ఇద్దరు నేతలు పోటీ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి బండా ప్రకాష్, ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పోటీలో నిలిచారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా టీఆర్ఎస్ అభ్యర్థి బండా ప్రకాష్ తన గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్యే ఓటింగ్‌ను బట్టి సాంకేతిక అంశాలు లేవనెత్తి అధికార పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టే వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. శాసనసభ్యుల కోటాలో తెలంగాణ నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల ఐదో తేదీన నోటిఫికేషన్ జారీ కాగా.. 23న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు స్థానాలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయని అంతా భావించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ పోటీకి రావడంతో ఎన్నిక అనివార్యంగా మారింది. టీఆర్ఎస్ నుంచి బండా ప్రకాష్ వరంగల్ జిల్లా నుంచి రాజ్యసభ ఆశావహులు ఎక్కువ మంది ఉన్నా.. అనూహ్యంగా విద్యాధికుడు, సామాజికవేత్తగా గుర్తింపు పొంది రాజకీయాల్లో రాణిస్తున్న డాక్టర్ బండా ప్రకాష్ పేరును రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆయన చిన్నప్పటి నుంచే చదువుతోపాటు రాజకీయాల్లో ఆసక్తి చూపారు. 1981 నుంచి 1986 వరకు వరంగల్ మునిసిపాలిటీ కౌన్సిలర్, వైస్ చైర్మన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ మెంబర్‌గా వివిధ పదవుల్లో కొనసాగారు. ఆ తర్వాత రాజకీయంగా చెప్పుకోతగ్గ పదవులు చేపట్టలేదు. సామాజిక కార్యక్రమాల్లో క్రీయాశీలంగా వ్యవహరించారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అ«ధ్యక్షుడి ఉన్నారు. తాజాగా రాజ్యసభకు వెళ్లేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ప్రస్తుతం శాసన సభలో టీఆర్ఎస్కు ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా ఈ గెలుపు లాంఛనప్రాయం. ‘బల’ ప్రయోగం రాజ్యసభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తొలుత అంటీముట్టనట్లుగా వ్యవహరించింది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆ పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. అధికార పార్టీ అభ్యర్థులను ఇరుకున పెట్టేందుకు రాజ్యసభ బరిలో ఉండాలనే నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నికల బరిలో జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ చేత నామినేషన్ దాఖలు చేయించింది. ఆ తర్వాత అసెంబ్లీలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిప్పు, ఉప్పు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ పేర్కొంటున్న ఎమ్మెల్యే సంఖ్యలో ఉన్న ‘ఫిరాయింపుల’ను చర్చకు తెచ్చి మైలేజ్ పొందే వ్యూహంలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
ఎస్టీ రిజర్వేషన్ల సంగతేంది: బలరాంనాయక్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తా మని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మాట్లాడు తూ రిజర్వేషన్లవిషయాన్ని రెండున్నరేళ్లుగా కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనుల కు న్యాయం చేయాలని కోరారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న సీఎం కేసీఆర్ చేతిలోనే రిజర్వేషన్లు ఉన్నయా అని మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని ఒకవైపు బీజేపీ చెబుతుంటే... కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారన్నారు. -
'ఎస్ఐని చంపి ఉరి తీశారు'
దేవరకొండ(నల్లగొండ జిల్లా): యలాల ఎస్సై రమేశ్ అంత్యక్రియల్లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రమేశ్ కుటుంబ సభ్యులు, బంధవులు పట్టుబట్టారు. రమేశ్ అనుమానాస్పద మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అంత్యక్రియలకు హాజరైన జిల్లా ఎస్పీని అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రమేశ్ ను చంపి ఉరి తీశారని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక అన్యాయంగా ఉందని అన్నారు. సీఎం సీరియస్ గా తీసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. రమేశ్ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించకుంటే తెలంగాణ గిరిజనులతో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. కాగా, రమేశ్ కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని అతడి మిత్రులు తెలిపారు. రమేశ్ మృతి వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యలాల ఎస్సైగా పనిచేస్తున్న రమేశ్ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. -
'కేసీఆర్ వైఫల్యం వల్లే తెలంగాణ ఆదాయం తగ్గింది'
హైదరాబాద్:ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం టి.రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఖండించారు. సోనియా గాంధీ గురించి రాజయ్య తెలిసీ తెలియక అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బలరాం నాయక్.. తెలంగాణలో ఆత్మహత్యలు జరగకూడదనే సోనియా పార్టీకి జరిగే నష్టాన్ని కూడా లెక్కచేయకుండా రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు సోనియానే కారణమన్న రాజయ్య వ్యాఖ్యల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చితే తెలంగాణకు రావాల్సిన ఆదాయం తగ్గిందన్నారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమేనన్నారు. ఆచరణ సాధ్యం కాని పలు హామీలను ఇవ్వడం వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని బలరాం నాయక్ తెలిపారు. -
ఊరు కొకటా.. ఇంటికొకటా...
రెండు బెడ్రూముల ఇళ్ల హామీపై బలరాం నాయక్ నెల్లికుదురు : ‘రెండు బెడ్రూముల ఇళ్లు నిర్మించి ఇచ్చేది ఊరుకొకటా...ఇంటి కొకటా’ అని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా నెల్లికుదురులో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం దానిపైనే చేశారని గుర్తు చేశారు. రూ.70 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశారన్నారు. -
సిట్టింగ్ ఎంపీలకు ఎదురుగాలి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సార్వత్రిక ఎన్నికల పోరులో జిల్లాలోని సిట్టింగ్ లోక్‌సభ అభ్య ర్థులకు ఎదురుగాలి వీస్తోంది. ఐదేళ్ల పనితీరు కొలమానంగా ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు 2009లో అనూహ్యంగా సిరిసిల్ల రాజయ్య, పోరిక బలరాంనాయక్ ఎంపీలుగా గెలిచారు. రెండోసారి వీరే బరిలో ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఆశించిన మేర పనులు చేయకపోవడంతో ఆ ఇద్దరిలో గుబులు నెలకొంది. లంబాడ వర్గంలో ఓట్ల చీలిక మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో లంబాడ, కోయ వర్గాల ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారు. ఈ వర్గాల ఓటర్లు ఎవరికి మద్దతు ప్రకటిస్తే... విజయం వారిదే అన్నట్లుగా పరిస్థితి ఉంది. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్ సెగ్మెం ట్లు వరంగల్ జిల్లాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో మహాకూట మి, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. మహాకూటమి నుంచి కోయ సామాజికవర్గానికి చెందిన కుంజా శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుంచి లంబాడ సామాజిక వర్గానికి చెందిన బల రాంనాయక్ బరిలో ఉన్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో లంబాడ సామాజికవర్గం బలరాంనాయక్‌కు మద్దతుగా నిలిచింది. లంబాడ ఓటర్లు ఎక్కువగా ఉండే మహబూబాబాద్‌లో 30,593, డోర్నకల్‌లో 23,277, నర్సం పేటలో 5,633 ఓట్ల మెజార్టీని ఆయన సాధించారు. సొంత నియోజకవర్గం ములుగులోనే బలరాంకు తక్కువగా 4,323 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడ మెజార్టీలుగా ఉన్న కోయ సామాజికవర్గ ఓటర్లు కుంజా వెంటనడిచారు. ఇప్పుడు వీరంతా వైఎస్సార్సీపీ అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ తరఫున ప్రొఫెసర్ సీతారాంనాయక్, టీడీపీ నుంచి మోహన్‌లాల్ బరిలో నిల్చున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ చేస్తుండడంతో ఓట్లు చీలే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బలరాంనాయక్‌కు ప్రతికూలంగా మారనుంది. అంతేకాదు.. కాంగ్రెస్‌లోని తిరుబాట్లు నాయక్‌కు ఇబ్బందులు తెచ్చాయి. ఇన్నాళ్లు బలరాం నాయక్‌కు తోడుగా ఉన్న దొంతి మాధవరెడ్డి టికెట్ రాకపోవడంతో నర్సంపేటలో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉన్నా రు. దొంతికి నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం లో ఉండగా సొంత వర్గం ఉండగా.. వారంతా ప్రస్తుతం కాం గ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో బలరాంనాయక్‌కు ఇక్కడ ఐదువేలకు పైగా మెజార్టీ వచ్చింది. దొంతి ఎఫెక్ట్‌తో ఈసారి బలరాంనాయక్‌కు ఈసారి సందేహంగా మారింది. ఇన్ని ఇబ్బందులున్నా బలరాంనాయక్ ప్రచారం లో అంతంతగానే వ్యవహరించారు. రాజయ్యకు ఇంటాబయట సమస్యలు వరంగల్ లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు పని తీరు కొలమానం ఇబ్బందిగా మారింది. గత హామీలు నెరవేర్చకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఐదేళ్లు ఎంపీ గా ఉన్న రాజయ్య జిల్లాకు చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్టు కూ డా తీసుకురాలేదు. రైల్వే వ్యాగన్ వర్క్‌షాపు అతీగతి లేకపో గా.. తెలంగాణలో రెండో విమానాశ్రయంగా పేరున్న మా మునూరు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకల ప్రక్రియ అడుగు ముందుకుసాగలేదు. పనితీరుతో పాటు కాంగ్రెస్ అ సెంబ్లీ అభ్యర్థులతోనూ ఆయనకు విభేదాలు ఉండడం ప్రతి కూలంగా కనిపిస్తోంది. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ఎమ్మెల్యే అభ్యర్థులు రాజయ్యపై అసంతృప్తిగా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా ‘సహకారం’ అందించడం లేదని వాపోతున్న వీరు.. ప్రచారంలోనూ ఉపయోగం ఉండడం లేదంటున్నారు. ఎన్నికల తరుణంలో రాజయ్య కుటుం బవ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. -
మహబూబాబాద్ బలరాంకే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి పోటీచేసే అభ్యర్థులను ఏఐసీసీ అధికార ప్రతినిధి దణదీప్సుర్జేవాలా ప్రకటించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అనుమతి మేరకు శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ జాబితాను విలేకరులకు వెల్లడించారు. ఈ జాబితా ప్రకారం మహబూబాబాద్ పార్లమెంటు స్థానం సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి బలరాం నాయక్‌కే కేటాయించారు. సీపీఐతో పొత్తు కారణంగా ఖమ్మం పార్లమెంటు స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక, సీపీఐకిచ్చే కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలు మినహా మిగిలిన ఏడు స్థానాలకు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించిన పార్టీ అధిష్టానం, ఆ తర్వాత ఎమ్మెల్యేల జాబితాను మీడియాకు ఇచ్చేందుకు నిరాకరించింది. అధిష్టానం ఆదేశాల మేరకే ఎమ్మెల్యేల జాబితా ప్రకటనను నిలిపివేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులను ప్రకటించవద్దని అధిష్టానం చెప్పడంతో నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే, రణదీప్ తొలుత మాట్లాడుతున్న సమయంలోనే మధిర నుంచి భట్టి విక్రమార్క పోటీచేస్తారని చెప్పారు. కాంగ్రెస్మేనిఫెస్టో కమిటీ ఉపాధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ హోదాలో పార్లమెంటు అభ్యర్థుల తర్వాత భట్టి పేరును ప్రకటిం చారు. మరోవైపు అభ్యర్థుల ప్రకటన నిలిపివేసిన తర్వాత ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పువ్వాడ అజయ్‌ను ఖరారు చేసినట్టు మీడియాలో విసృత ప్రచారం జరిగింది. కానీ, అధికారికంగా పార్టీ మాత్రం ప్రకటించలేదు. ఆదివారం స్థానిక సంస్థల ఓటింగ్ అనంతరం జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. సీపీఐకే ఖమ్మం ఖిల్లా పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే తెలంగాణలోని ఖమ్మం మినహా 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీప్రకటించింది. అంటే ఆ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో సీపీఐకి ఇచ్చినట్టే. ఇక, జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుండే మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పాతకాపు బలరాంనాయక్కే అవకాశం కల్పించారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న ఆయనకు మరోసారి పోటీకి వీలుకల్పించారు. -
అనిశ్చితి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ అభ్యర్థిత్వాల ఖరారు చివరి దశకు చేరుకున్నా ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి ఎంపిక విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేయనున్న ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను ఖరారు చేసేందుకు అధిష్టానం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఏకాభిప్రాయానికి వచ్చిన తెలంగాణలోని ఎనిమిది ఎంపీ స్థానాలు, 60 ఎమ్మెల్యే స్థానాలను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. గోండు సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ టిక్కెట్‌ను ఆశిస్తున్న వారిలో లంబాడా సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఎక్కువ ఉన్నారు. దీంతో ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ఎంపీ స్థానాలు గిరిజనులకు రిజర్వు అయ్యాయి. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ కేంద్ర మంత్రి బల్‌రాంనాయక్ పేరు దాదాపు ఖరారైంది. ఆయన లంబాడా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. టిక్కెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గోండు వర్గానికి కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు ఆ సామాజిక వర్గానికి చెందిన ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బరిలో ఉంటారని జిల్లాలోని పార్టీ శ్రేణులు భావించాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదిత జాబితాలో కూడా ఎంపీ స్థానానికి సక్కు పేరును ప్రస్తావించారు. ఏఐసీసీ సభ్యులుగా కూడా సక్కు పేరును సిఫార్సు చేశారు. కానీ తాను ఎంపీగా పోటీ చేయనని సక్కు ప్రకటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగానే బరిలోకి దిగుతానని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల, ఉత్తం కుమార్‌రెడ్డిలతోపాటు ఏఐసీసీ కార్యదర్శి కుంతియా దృష్టికి తీసుకెళ్లారు. టీఆర్ఎస్ కూడా.. టీఆర్ఎస్ కూడా ఎంపీ స్థానానికి గోండు సామాజిక వర్గానికి చెందిన గోడం నగేష్‌ను బరిలోకి దించాలనే నిర్ణయానికి వచ్చింది. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఆయనకు టిక్కెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంది. తాను ఎంపీగా పోటీ చేయాలా? బోథ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలా? అని నగేష్ తేల్చుకోలేకపోతున్నారు. మొదట్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం కాంగ్రెస్ టిక్కెట్ కోసం సోయం బాపూరావు కూడా తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. మహారాష్ట్రకు చెందిన యువజన కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాజీవ్‌షా ద్వారా పార్టీ అధిష్టానం పెద్దలను కలిశారు. కానీ ఆశించిన మేరకు ఫలితం కనిపించకపోవడంతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, ఇటీవల టీడీపీ గూటికి చేరిన విషయం విధితమే. ఎంపీ రాథోడ్ రమేష్ ఏదైనా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన పక్షంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఈ గోండు సామాజిక వర్గానికి చెందిన సోయం బాపురావును నిలపాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. -
మానుకోటకు మరో ఆర్యూబీ
నెల రోజుల్లో నిర్మాణం పూర్తి ములుగులో స్కూల్, మెడికల్ కళాశాల ఏర్పాటు కేంద్ర మంత్రి బలరాంనాయక్ మహబూబాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రాంతంలో మరో ఏడు రైల్వే అండర్ బ్రిడ్జిలు (ఆర్యూబీ) నిర్మించనున్నామని.. ఇందులో ఒకటి మానుకోటకు మంజూరైనట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి బలరాం నాయక్ తెలిపారు. మహబూబాబాద్ మధ్యగేటు ప్రాంతంలో జరుగుతున్న ఆర్యూబీ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ నూతనంగా చేపట్టనున్న ఆర్యూబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.3.60 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే... టెండర్లు పూర్తిచేసి ఆర్యూబీ పనులు ప్రారంభిస్తామన్నారు. దీని కోసం ఏ-క్యాబిన్ రోడ్డులో అధికారులు గతంలోనే స్థలాన్ని కూడా పరిశీలించారని గుర్తు చేశారు. నెలరోజుల్లోపు నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఇక మధ్యగేటు ప్రాంతంలో జరుగుతున్న ఆర్యూబీ నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కాంట్రాక్టర్ల వైఫల్యమేనన్నారు. దీనికి సంబంధించి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడానని, నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. కంతనపల్లి ప్రాజెక్ట్ పూర్తయితే మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మానుకోట, నర్సంపేట, ములుగు, డోర్నకల్ నియోజకవర్గాలకు సాగు, తాగునీటి సమస్య తీరుతుందన్నారు. లక్కమారికాపులోని 107 ఉప కులాలను ఓబీసీలో చేర్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ములుగులో ఏకలవ్య స్కూల్, మేడారం ప్రాంతంలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరైందని వివరించారు. ములుగులో ప్రైవేట్ మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం చెన్నైలోని సింగేరి సంస్థతో మాట్లాడామని, ఆ సంస్థ స్థలాన్ని కూడా పరిశీలించిందని చెప్పారు. త్వరలోనే వారి ఆధ్వర్యంలో వంద పడకల ఆస్పత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటు జరగనుందన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ముందకు పోతున్నామని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 22 నుంచి మానుకోటలో గోదావరి, నెక్కొండలో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లు ఆగుతాయని, ప్రయాణికుల సౌకార్యర్థం రైల్వే అధికారులతో మాట్లాడి హాల్టింగ్‌కు కృషి చేశానన్నారు. మంత్రి వెంట పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ మాదవపెద్ది శశివర్ధన్‌రెడ్డి, నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, పజ్జూరి ఇంద్రారెడ్డి, రావుల రవిచందర్‌రెడ్డి, ముల్లంగి ప్రతాప్ ఉన్నారు. -
పార్లమెంట్లో కేంద్రమంత్రి బలరాంనాయక్‌కు అస్వస్థత
ఆందోళనకు గురైన జిల్లా ప్రజలు లగడపాటి తీరుపై ప్రజల ఆగ్రహం మహబూబాబాద్, న్యూస్‌లైన్ : కేంద్ర హోంశాఖ మంత్రి షిండే గురువారం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుండగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టి బిలు ్లను వ్యతిరేకిస్తూ పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్లో గం దరగోళ పరిస్థితి నెలకొంది. ఈ గ్యాస్ మూలంగా మానుకోట పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి బలరాం నాయక్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మానుకోట పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యూరు. లగడపాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాల ని వారు డిమాండ్ చే శారు. మంత్రి త్వరగా కోలుకోవాలని ప్రజలు ప్రార్థించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు త్వరగా ఆమోదం పొందాలని ఆకాంక్షిస్తున్నారు. -
వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
వరంగల్ : వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపే సభను వచ్చే నెల వరంగల్‌లో నిర్వహించాలనే అజెండాతో హైదరాబాద్‌లోని మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో మంగళవారం జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరిగింది. వచ్చే నెల తొమ్మిదో తేదీన వరంగల్ జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో సభ నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగానే జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, డీసీసీబీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీలో ఇంకా ఎంత మంది నేతలకు అన్యాయం చేస్తారని బలరామ్ నాయక్‌ను రాఘవరెడ్డి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే కొందరు నేతలు రాఘవరెడ్డికి సర్దిచెప్పి బయటకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ఇక బలరామ్ నాయక్‌ని విమర్శించిన రాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రులు పొన్నాల, సారయ్య ఈ సమావేశంలో అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు మాధవరెడ్డికి వారు సూచించినట్టు తెలుస్తోంది. తన ఎన్నిక వివాదాస్పదమైనప్పుడు బలరామ్ నాయక్ అండగా నిలవలేదనే అసంతృప్తి రాఘవరెడ్డిలో ఉందని జిల్లా కాంగ్రస్ నేతలు చెబుతున్నారు. -
పోలీసులను ద్వేషించే వారే అధికం
=మంత్రి సారయ్య సహృదయుడు, వినయశీలి =ప్రస్తుతం పుస్తకాలు రాస్తున్నా.. =రిటైర్డ డీజీపీ అరవిందరావు =ఆయన సలహాలతోనే తప్పులు దిద్దుకున్నా : మంత్రి సారయ్య ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : పోలీసులను ప్రేమించే వారి కంటే ద్వేషించే వారే అధికంగా ఉంటారని రిటైర్డ డీజీపీ అరవిందరావు అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో అరవిందరావు ఆత్మీయ అభినందన సభ జరిగింది. బుధవారం జరిగిన ఈ సభలో తొలుత తనను ఇష్టపడే వారు ఇంతమంది ఉండడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్‌లో ఎస్పీగా పనిచేయడం తన సర్వీసులో ఎంతో ఉపయోగపడిందని గుర్తు చేసుకున్నారు. కాగా, పోలీసు వృత్తిలో ఉన్న వారు కొన్ని సం దర్భాల్లో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, ఫలి తంగా ఎందరికో ద్వేషభావం పెరుగుతుందని తెలిపా రు. అయితే, తాను ఇక్కడ ఎస్పీగా పనిచేసినప్పుడే సారయ్యకు ఏం సలహాలు చెప్పానో గుర్తు లేదు కానీ తనను గురువుగా భావించి అభినందన సభ ఏర్పాటుచేయడం ఆయనలోని సహృదయతను సూచిస్తోందని పేర్కొన్నా రు. అలాగే, తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నానని చెప్పడం సారయ్యలోని మార్పు, ఎదుగుదలకు నిదర్శమని అరవిందరావు కొనియాడారు. అధికారిగా ఎన్నో సలహాలు ఇచ్చారు... చిన్న స్థాయి నుంచి వచ్చిన తాను మంత్రిగా ఎదగడం లో పోలీసు అధికారిగా అరవిందరావు ఇచ్చిన సల హాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని బస్వరాజు సారయ్య అన్నారు. ఉమ్మారెడ్డి, సురేందర్‌రెడ్డి రాజకీయ గురువులైతే.. అరవిందరావు అధికారిగా తన ఎదుగుదలకు తోడ్పడ్డారన్నారు. తనను కుమారుడిలా భావించే అరవిందరావు ఎస్పీగా పనిచేసిన సమయంలో సామాన్య ప్రజలు వచ్చినా వారి సమస్యలను సావధానంగా వినేవారని తెలిపారు. తాను మంత్రిగా కాకుండా మాములు సారయ్య మాదిరిగా అభినందన సభ ఏర్పాటుచేశానని వివరించారు. కేంద్ర సామజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ జిల్లాలో పని చేసిన అధికారికి ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి మంచి సంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ పోలీసులను ప్రజలకు చేరువ చేయడంలో అరవిందరావు చేసిన కృషి మరువలేనిదన్నారు. జిల్లా కలెక్టర్ జి.కిషన్ మాట్లాడు తూ ప్రజా సంబంధాల పెరుగుదలకు అరవిందరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. సభలో జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు, నిట్ డెరైక్టర్ శ్రీనివాస్, రూరల్, అర్బన్ ఎస్పీలు పాలరాజు, వెంకటేశ్వర్రావు, డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారా వు, మందాడి సత్యనారాయణరెడ్డి, దుగ్యాల శ్రీనివాస్‌రావు, కుడా మాజీ చైర్మన్ చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఎంబాడి రవీందర్, బస్వరాజు శ్రీమాన్, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, హరిరమాదేవి, పలువురు నాయకులు, డాకర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పోరాటాల ఫలితమే తెలంగాణ
దుగ్గొండి, న్యూస్‌లైన్ : తెలంగాణలో జరిగిన సుదీర్ఘ పోరాటాలను గుర్తించే యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ రాష్ర్ట ఏర్పాటు ప్రకటన చేసిందని కేంద్ర సామాజిక న్యాయసాధికారతశాఖ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. మండలంలోని తిమ్మంపేట లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ‘ఇంటింటికి కాంగ్రెస్ జెండా- సోనియా అండ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ పతాకాలను ఆవిష్కరించగా, కార్యకర్తల ఇళ్లకు మంత్రి బలరాంనాయక్ స్వయంగా పార్టీ జెండాలు కట్టి ఉత్తేజపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు కృత్రిమ ఉద్యమాలు చేసి రాష్ర్ట ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ఏర్పాటు ఆగదని పేర్కొన్నారు. సోనియాగాంధీ ఆహారభద్రత, ఎస్సీ, ఎస్టీసబ్ ప్లాన్ లాం టి బిల్లులతో నిరుపేదల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. నర్సంపేట, ములు గు, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలకు ఏడాదిలో తాగు, సాగునీటికి ఢోకా ఉండదన్నారు. నర్సంపేట మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.105 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. సభలో డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, సర్పంచ్ నరహరి రమాదేవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాయిడి రవీందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, రడం శ్రీనివాస్, బాబు, పానకాల్రెడ్డి, రాజు, రామానంద్ పాల్గొన్నారు. పంచాయతీ భవనం ప్రారంభం.. మండలంలోని బొబ్బరోనిపల్లిలో ఉపాధిహామీ పథకంలో భాగంగా రూ.10లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని కేంద్ర మంత్రి బలరాంనాయక్ స్థానిక సర్పంచ్ శంకేషి శోభాకమలాకర్తో కలిసి ప్రారంభించారు.