వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
వరంగల్ : వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపే సభను వచ్చే నెల వరంగల్‌లో నిర్వహించాలనే అజెండాతో హైదరాబాద్‌లోని మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో మంగళవారం జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరిగింది.
వచ్చే నెల తొమ్మిదో తేదీన వరంగల్ జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో సభ నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగానే జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, డీసీసీబీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీలో ఇంకా ఎంత మంది నేతలకు అన్యాయం చేస్తారని బలరామ్ నాయక్‌ను రాఘవరెడ్డి ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
అయితే కొందరు నేతలు రాఘవరెడ్డికి సర్దిచెప్పి బయటకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ఇక బలరామ్ నాయక్ని విమర్శించిన రాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రులు పొన్నాల, సారయ్య ఈ సమావేశంలో అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు మాధవరెడ్డికి వారు సూచించినట్టు తెలుస్తోంది. తన ఎన్నిక వివాదాస్పదమైనప్పుడు బలరామ్ నాయక్ అండగా నిలవలేదనే అసంతృప్తి రాఘవరెడ్డిలో ఉందని జిల్లా కాంగ్రస్ నేతలు చెబుతున్నారు.