janga raghava Reddy
-
టికెట్ రాకపోవడంతో కంటతడి పెట్టుకున్న జంగా
-
వరంగల్ పశ్చిమ నుంచే పోటీ చేస్తా : జంగా
హన్మకొండ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆరునూరైనా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంనుంచే పోటీ చేస్తానని డీసీసీబీ మాజీ చైర్మన్, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి తెలిపారు. కాజీపేట 63వ డివిజన్ విష్ణుపురి మహంకాళి అమ్మ దేవాలయాన్ని మంగళవారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ విజయశ్రీ రజాలీల ఆధ్వర్యంలో ప్రారంభమైన హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో డివిజన్లోని అన్ని కాలనీల్లో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని తెలిపారు. అందరూ ఐక్యంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, నాయకులు తొట్ల రాజు యాదవ్, గుర్రం కోటేశ్వర్, బోయిని కుమార్ యాదవ్, మద్దెల శోభారాణి, సందెల విజయ్ కుమార్, జగదీశ్వర్‌రెడ్డి, బైరి లింగామూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నా జిల్లాలో పాదయాత్ర చేయడానికి రాఘవరెడ్డి ఎవరు?
హన్మకొండ చౌరస్తా: జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మండిపడ్డారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తానంటూ మంగళవారం కాజీపేటలో రాఘవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాయిని తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పక్క జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ నా జిల్లాలో పాదయాత్ర చేయడానికి రాఘవరెడ్డి ఎవరు? కాంగ్రెస్ శ్రేణులను గ్రూపులుగా తయారుచేసి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇతర జిల్లాలో పార్టీ కార్యక్రమాలు చేపట్టద్దని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది’ అని తెలిపారు. అయినప్పటికీ క్రమశిక్షణను ఉల్లంఘించి జనగామ జిల్లాను వదిలేసి హనుమకొండ జిల్లాలో పర్యటించడం సరైంది కాదన్నారు. ప్రతిపక్ష పార్టీకి లాభం చేకూరేలా వ్యవహరిస్తున్న జంగా రాఘవరెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలంటూ ఆధారాలతో ఏఐసీసీ, టీపీసీసీ నేతలకు, టీపీసీసీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. -
జంగా, పొన్నాల వర్గీయుల బాహాబాహీ
సాక్షి, జనగామ: జనగామ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కొంతకాలంగా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని పీసీసీ పిలుపు మేరకు కేంద్ర వ్యవసాయ బిల్లును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం ‘కిసాన్ బచావో–మజ్దూర్ బచావో దివస్’కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెంబర్తి కమాన్ వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు ఇరువర్గాలు పోటీ పడ్డాయి. మరోవైపు పోటాపోటీగా నినాదాలు చేయడంతో మాటామాటా పెరిగి రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. శ్రవణ్‌కుమార్ సాక్షిగా ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. గల్లాలు పట్టుకుని ఒకరినొకరు నెట్టివేసుకుంటూ బూతులు తిట్టుకున్నారు. ఒక దశలో కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ హఠాత్ పరిణామాన్ని దాసోజుతో పాటు అక్కడున్న వారు చూసి నిశ్చేష్టులయ్యారు. దాసోజు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. పొన్నాల వర్గీయులపై జంగా రాఘవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో గొడవ సద్దుమణిగింది. చదవండి: అరవై ఏళ్లుగా గోస పడ్డాం... -
రేవంత్‌ది తప్పు.. ఉత్తమ్‌కే అధికారం
జనగామ: హుజూర్నగర్ ఉప ఎన్నికలో భాగంగా రేవంత్‌రెడ్డి తన అభ్యర్థిని ప్రకటించుకోవడమే కాకుండా పత్రికలకు ఎక్కడం పద్ధతి కాదని జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే, రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు ఒకసారి ఎంపీగా పోటీ చేసి, పీసీసీ అధ్యక్షు డిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్టేట్‌వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి వేలెత్తి చూపించడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా పనిచేసిన ఆయనకు సొంత నియోజకవర్గంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేసుకునే విధంగా ఉండాలే తప్ప... బహిరంగంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. కాగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పడం లేదన్నారు. విద్య, వైద్య, మిషన్‌భగీరథ, రైతుబంధు ఇలా అనేక హామీలను బుట్టదాఖలు చేస్తూ.. ప్రజలను అయోమయానికి గురి చేసే కార్యక్రమాలను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష రుణమాఫి ఎక్కడ పోయిందన్నారు. ప్రజలు విషజ్వరాలతో అవస్థలు పడుతుంటే సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హామీల అమలుకు కార్యరూపం దాల్చడం లేదన్నారు. రైతుబంధు పథకాన్ని 5 ఎకరాలోపు ఉన్న రైతులకు ఇస్తామని ఓ మంత్రి అంటుంటే.. మరో మంత్రి అదేమీ లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వందలాదిమంది ప్రాణత్యాగం చేసి..తెలంగాణ సాధించుకుంటే.. కల్వకుంట్ల కుటుంబం రాజ్యమేలుతోందన్నారు. సమావేశంలో డీసీసీ వైస్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ మునిసిపల్ చైర్మన్ వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, డాక్టర్ లక్ష్మినారాయణ నాయక్, రఘునాథపల్లి ఎంపీపీ మేకల వలరక్ష్మి, సర్పంచ్‌లు మాసపేట రవీందర్‌రెడ్డి, రమేష్, మాజీ జెడ్పీటీసీ నల్ల అండాలుశ్రీరామ్, నాయకులు ఎల్లన్న ఉన్నారు. -
టీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది
-
లాభాల బాటలో డీసీసీబీ
రుణాల మంజూరు, రికవరీలో మొదటి స్థానం దివంగత సీఎం వైఎస్ చలువతోనే సహకార బ్యాంకులకు జీవం డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి వరంగల్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) వాణిజ్య బ్యాంకులకు ధీటుగా వ్యాపారం చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. డీసీసీబీ కార్యాలయ ఆవరణలో ఆదివారం బ్యాంకు మహాజన సభ(జనరల్ బాడీ) సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015–16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ద్వారా రూ.435 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లక్ష్యానికి మించి గత ఆర్థిక సంవత్సరంలో రైతులు, ఇతర వర్గాలకు రూ.501 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. రుణాల రికవరీలోనూ 98.8 శాతం వృద్ధి సాధించామన్నారు. రూ.235 కోట్ల డిపాజిట్లు సేకరించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వరంగల్ డీసీసీబీ నిలిచిందన్నారు. సుమారు రూ.2 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయపు పన్నుగా చె ల్లించామన్నారు. సహకార రంగంలోని బ్యాం కులు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీతోనే బతికి బట్ట కట్టాయన్నారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో సహకార రంగంలోని బ్యాంకులు జీవం పోసుకున్నాయన్నారు. అనంతరం నాబార్డ్ డీడీఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడంతో పాటు అదే విధంగా చెల్లింపులు ఉంటే రుణాల టార్గెట్ పెంచే అవకాశాలు ఉన్నాయన్నారు. జీఎం సురేందర్ సేవలతోనే బ్యాంకు అభివృద్ధి డీసీసీబీలో 1986లో సాధారణ ఉద్యోగిగా చేరిన వి.సురేందర్ నేడు జీఎం స్థాయి వరకు చేసిన సేవల వల్లే బ్యాంకు అభివృద్ధి బాటలో పయనించిందని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. జీఎం సురేందర్ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. రాఘవరెడ్డి మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగిన జీఎం సురేందర్ బ్యాంకును లాభాల బాట పట్టించారన్నారు. అనంతరం సురేందర్ దంపతులను జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. బ్యాంక్ వైస్ చైర్మన్ రాపోలు పుల్లయ్య, డైరెక్టర్లు బిల్లా సుధీర్‌రెడ్డి, పోతరాజు శ్రీనివాసు, ఎ.జగన్మోçßæన్‌రావు, కేడల జనార్ధన్, డీసీఓ చక్రధర్, సీఈఓ యాదగిరి, జీఎం సురేందర్, డీజీఎం శ్రీనివాస్, పీఏసీఎస్‌ల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు. -
ముందే.. ముదిరింది
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ తలపెట్టిన తెలంగాణ విజయోత్సవ సభకు అచ్చొచ్చినట్టు లేదు. సభ ఏర్పాట్లను చర్చించేందుకు హైదరాబాద్‌లో మంత్రి పొన్నాల నివాసంలో మంగళవారం జరిగిన సమావేశం రచ్చరచ్చగా ముగిసింది. కేంద్ర మంత్రి బలరాం నాయక్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య ఘర్షణతో అట్టుడికింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, చీఫ్ విప్ గండ్ర, ఎంపీ రాజయ్య, ఎమ్మెల్యేలు కవిత, శ్రీధర్, డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతోపాటు జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి తరలివెళ్లారు. సభ ఎక్కడ... ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో చివరి వరకు నేతలు మల్లగుల్లాలు పడ్డారు. ఎట్టకేలకు వచ్చే నెల తొమ్మిదో తేదీన వరంగల్‌లో విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించారు. హన్మకొండలోని జేఎన్ఎస్ మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. జన సమీకరణలో భాగంగా నవంబర్ రెండో తేదీన డీసీసీ భవన్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయూలని నిర్ణరుుంచారు. ఇంత కసరత్తు జరిగిన సమావేశం... చివరన రసాభాసగా ముగిసింది. తిరిగి వెళ్లిపోయే సమయంలో డీసీసీబీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కేంద్ర మంత్రి బలరాం నాయక్‌తో గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఒకరికొకరు దుర్భాషలాడుకోవడం... చొక్కాలు పట్టుకునే వరకూ వెళ్లడంతో అక్కడున్న వారు కంగుతిన్నారు. అనూహ్యంగా భగ్గుమన్న ఈ వివాదం పార్టీ ముఖ్యుల మధ్య చర్చనీయాంశంగా మారింది. అసలు సభ విషయం పక్కనబెట్టి ఈ వివాదమే నేతలందరి నోటా ప్రధాన అంశంగా మారింది. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేసినప్పటికీ... ఈ వివాదం ఇప్పటికిప్పుడు చల్లారేలా లేదనే వాదనలు వినిపిస్తున్నారుు. అరుుతే సమావేశంలో అలాంటి గొడవేమీ జరగలేదని... అనవసరంగా రాద్ధాంతం చేశారని డీసీసీబీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ‘సాక్షి’తో అన్నారు. ‘ఆప్కాబ్ సమావేశానికి హాజరవాల్సి ఉండడంతో నేను ముందుగా అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. మంత్రికి చెప్పి వెళ్లిపోదామనే ఉద్దేశంతో గదిలోకి వెళ్లాను. మా మధ్య గొడవేమీ జరగలేదు...’ అని చెప్పారు. ‘విజయోత్సవ సభ నిర్వహణ విషయంలోనే రభస జరిగింది. ముందుగా సభను నా అధర్వ్యంలో మహబూబాబాద్‌లో నిర్వహించాల న్నారు. తర్వాత వరంగల్‌లో అన్నారు. మహబూబాబాద్‌లో ఓకే అన్నాక... అక్కర్లేదు అని మాట మార్చా రు. రోజుకో తీరుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం.. స్పష్టత ఉండాలి... అని సమావేశంలో నేను నేతలను నిలదీశాను. సమావేశం నుంచి బయటకు వెళ్లేటప్పుడు అదే విషయంలో ఏకవచనంలో సంబోధిస్తూ.. రాఘవరెడ్డి ఏదో కామెంట్ చేశాడట. అది తెలిసి... నేను సీరియస్ అయ్యాను. ఇద్దరం ఎదురెదురుగా మాటలేమీ అనుకోలేదు. ఘర్షణేమీ జరగలేదు’ అని గద్వాలలో ఉన్న నాయక్ ఫోన్లో చెప్పారు. అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, చీఫ్ విప్ గండ్ర, ఎంపీ రాజయ్య, ఎమ్మెల్యేలు కవిత, శ్రీధర్, డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు దుగ్యాల శ్రీనివాసరావు, పొడెం వీరయ్య, ఆరోగ్యం, సీనియర్ నేతలు నాయిని రాజేందర్‌రెడ్డి, వరద రాజేశ్వరరావు, సమ్మారావు, రాధారపు ప్రతాప్, కె.దయాసాగర్, ఎర్రబెల్లి స్వర్ణ, పొన్నాల వైశాలి, డాక్టర్ హరిరమాదేవి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరందరి సమక్షంలో జరిగిన ఈ వివాదం.. జిల్లా పార్టీలో రగులుతున్న అంతర్గత విభేదాలను బయటపెట్టింది. స్వయానా కేంద్ర మంత్రికి సంబంధించిన గొడవ కావడంతో పార్టీ అధిష్టానం ఈ ఘటనపై ఎలా స్పందిస్తుంది... క్రమశిక్షణ చర్యలేమైనా తీసుకుంటుందా... ఇద్దరు మంత్రులు సయోధ్య కుదిర్చి వివాదాన్ని చల్లారుస్తారా... అనే సందేహాలు అందరినోటా వెల్లువెత్తుతున్నారుు. మరోవైపు విజయోత్సవ సభకు ఈ సంఘటన ఆటంకంగా నిలుస్తుందా... నవంబరు 9న సభ జరుగుతుందా.. లేదా.. అనే మీమాంస పార్టీ నేతలను సైతం అయోమయానికి గురి చేస్తోంది. -
వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
వరంగల్ : వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపే సభను వచ్చే నెల వరంగల్‌లో నిర్వహించాలనే అజెండాతో హైదరాబాద్‌లోని మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో మంగళవారం జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరిగింది. వచ్చే నెల తొమ్మిదో తేదీన వరంగల్ జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో సభ నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగానే జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, డీసీసీబీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీలో ఇంకా ఎంత మంది నేతలకు అన్యాయం చేస్తారని బలరామ్ నాయక్‌ను రాఘవరెడ్డి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే కొందరు నేతలు రాఘవరెడ్డికి సర్దిచెప్పి బయటకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ఇక బలరామ్ నాయక్‌ని విమర్శించిన రాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రులు పొన్నాల, సారయ్య ఈ సమావేశంలో అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు మాధవరెడ్డికి వారు సూచించినట్టు తెలుస్తోంది. తన ఎన్నిక వివాదాస్పదమైనప్పుడు బలరామ్ నాయక్ అండగా నిలవలేదనే అసంతృప్తి రాఘవరెడ్డిలో ఉందని జిల్లా కాంగ్రస్ నేతలు చెబుతున్నారు. -
పంట రుణాల పరిమితి పెంపు
= వరికి ఎకరాకు రూ.18 వేలు = మిర్చికి రూ.50 వేలు, పత్తికి రూ.25 వేలు, అరటికి రూ.84 వేలు = వచ్చే ఖరీఫ్ నుంచి అమలు = జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ సమావేశంలో నిర్ణయం ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంట రుణాలను పెంచుతూ జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. బుధవారం హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయంలో చైర్మ న్ జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన టెక్నిక ల్ కమిటీ సమావేశంలో వ్యయం, ఉత్పత్తి, మార్కెట్ ధరలు, ఎరువుల ధరలు, కలుపు నివారణ ఖర్చులు, క్రిమి సంహారక మందుల ధరలు, యాంత్రీకరణ, ఇతర పెట్టుబడుల ఆధారంగా ఒక ఎకరాకు ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించారు. దానిని వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి అమలు చేస్తారు. కమిటీ సభ్యులకు వారం రోజుల ముందుగా అంచనా నివేదిక అందజేయాలని, ములుగు, డోర్నకల్ నియోజకవర్గం నుంచి రైతు ప్రతినిధులను కమిటీలోకి తీసుకోవాలని, పంట రుణాల వివరాలను అన్ని బ్యాంక్ శాఖలు, పీఏసీఎస్ నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని తీర్మానించా రు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కేఎన్‌వీఎస్.దత్త, నాబార్డు ఏజీఎం ఉదయ్ బాస్కర్, డీసీఓ బి.సంజీవరెడ్డి, వ్యవసాయ శాఖ సంయు క్త సాంచాలకుడు జి.రామారావు, ఉద్యాన శాఖ ఏడీ అక్బర్, రైతు శిక్షణ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఉమ్మారెడ్డి, శాస్త్రవేత్త వి.రాజేంద్రప్రసా ద్, డీసీసీబీ సీఈఓ సురేందర్, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. రుణాల వినియోగంపై అవగాహన కల్పించాలి : రాఘవరెడ్డి రైతులకు పంట రుణాల వినియోగం, చెల్లింపులపై వ్యవసాయ అధికారులు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాలని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సూచించారు. మండలాల్లో పని చేసే వ్యవసాయ అధికారులు దీనిపై దృష్టి పెట్టేలా జాయింట్ డైరక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. సదస్సుల నిర్వహణకు తాము సహకరిస్తామని, అవసరమైతే పీఏసీఎస్‌ల ద్వారా నిర్వహించేందకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వ్యవసాయ అధికారుల పనితీరు బాగోలేదు.. ఎరువుల అంచనాలు తయారు చేయమంటే శాతాల్లో చూపిస్తున్నారు.. నిర్ధిష్టం గా ఎంత అవసరమో చెప్పడం లేదన్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఒక మండలా న్ని, జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ఒక మం డలాన్ని సర్వే చేసి అంచనాలు తయారు చేయాలని సూచించినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రిజర్వుబ్యాంక్ నిర్ణయించిన రుణాల మీద 25 శాతం ఎక్కువ ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదన్నారు. రుణాలు పెంచితేనే ప్రైవేట్ అప్పు చేయరు రైతులకు సరిపడా రుణాలు లభించనపుడే ఇతరుల వద్ద అధిక వడ్డీలకు తీసుకొని అప్పుల పాలవుతున్నారు. రుణ పరిమితి పెంచి రైతుల అవసరం మేరకు రుణాలు ఇవ్వడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి. - ఉదయ్‌భాస్కర్, నాబార్డు ఏజీఎం పంటను బట్టి పరిమితి పంటను బట్టి రుణ పరిమితిని నిర్ణయిస్తాం. అన్ని కోణాల్లో అలోచించి రుణాలు పెంచుతాం. న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకున్నప్పుడే రైతులు తమకు ఎంత అవసరమో అంత రుణం పొంది లబ్ధిపొందుతారు. -కేఎన్‌వీఎస్.దత్తు, లీడ్ బ్యాంక్ మేనేజర్