
హన్మకొండ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆరునూరైనా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంనుంచే పోటీ చేస్తానని డీసీసీబీ మాజీ చైర్మన్, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి తెలిపారు. కాజీపేట 63వ డివిజన్ విష్ణుపురి మహంకాళి అమ్మ దేవాలయాన్ని మంగళవారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ విజయశ్రీ రజాలీల ఆధ్వర్యంలో ప్రారంభమైన హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో డివిజన్‌లోని అన్ని కాలనీల్లో పాదయాత్ర నిర్వహించారు.
ఇంటింటికి వెళి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని తెలిపారు. అందరూ ఐక్యంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, నాయకులు తొట్ల రాజు యాదవ్, గుర్రం కోటేశ్వర్, బోయిని కుమార్ యాదవ్, మద్దెల శోభారాణి, సందెల విజయ్ కుమార్, జగదీశ్వర్‌రెడ్డి, బైరి లింగామూర్తి తదితరులు పాల్గొన్నారు.