
మావోయిస్టులతో చర్చలు జరపాలి
ఖిలా వరంగల్: కేంద్రం కాల్పులు విరమించి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం వరంగల్ శివనగర్‌లోని సీపీఐ తమ్మెర భవనంలో పార్టీ ఉమ్మడి జిల్లా సమితి సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేయడం సరికాదన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ వర్గాలకు, కార్పొరేట్ శక్తులకు మేలు జరిగిందే తప్ప పేదలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విపక్షాలపై ఈడీ, సీబీఐ, ఈసీలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, ఇటీవలే వంట గ్యాస్ ధరల ను పెంచి పేద ప్రజలపై భారం మోపారని అన్నా రు. మోదీ సర్కారు దుష్పరిపాలనకు వ్యతిరేకంగా కలిసి వచ్చే లౌకిక శక్తులతో పారాడాలని, ఈనెల 21న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్‌రావు, జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, బి.విజయసారధి, మేకల రవి, నేదునూరి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు